Wednesday, January 8, 2014

నాకు ఇంకా యాదికే !


ఎండమాయి
చెరువు కట్ట
చింత చెట్టు
ఊరిమీది ముచ్చట్లు
నక్రాలువడి గొప్పలు
కడుపువట్ట నవ్వులు
నాకు ఇంకా యాదికే !

నడూర్ల సందడి
కోమటొల్ల యాకిలి
పొక్కిలి జేసి ఆటలు
లచ్చమ్మ ఒర్లుడు
ఈడంటే ఈడంటూ
ఒకనిమీద ఒకడు
నాకు ఇంకా యాదికే !

చిత్తల్కాయలదెమ్పి
ఎండిన కంపలదెచ్చి
కాలవెట్టి  పొగలతోని నోట్లవెట్టి
మిగిల్నయన్ని పంచుకువొంగ
చేల్లెన్లు మురుశిన్రు
మాయన్న దెచ్చె ఇన్నిగనమని
నాకు ఇంకా యాదికే !


అగ్గికురిసే యాల
అందరం కప్పలమే
ఈరంబాయి మోట మీద
దొరకవట్టుడు ఆటలో
ఈడ మునిగి ఆడ
ఆడ మునిగి ఈడ
నాకు ఇంకా యాదికే !

కిరాయి సైకిలున్నోడు
దమ్మువట్టినంక యియ్యాలె
అప్పట్దాక  మొక్కులే
యాష్టకొచ్చిన్దాక  తొక్కాలె
నాకు ఇంకా యాదికే !

బూషి మొఖాన దువ్వని జుట్టు
శీమిడి మీసాల నవ్వువోని తనం  
చెడ్డి గుంజి మొలతాడు ఎక్కించి
మోకాళ్ళ పుండు కార్తున్న సీము
గుండీల్వోయి కాంటలే గతి
చేత్లవడితి ఇన్ని పుస్తకాలు
తెగిన చెపుల్నిసరిజేస్కొని
ఒరాల మీద నడుసుల్లు
నాకు ఇంకా యాదికే !
 
                                  Krishna Mani

No comments:

Post a Comment