Wednesday, December 23, 2015

యాదికొచ్చిన ముచ్చట్లు

యాదికొచ్చిన ముచ్చట్లు
___________________కృష్ణ మణి

అంబాడ పొద్దుల్లో
ఆకలి దాటిన ఆలోచనలు

లోకాన్ని అవగతం చేసుకొనే పరుగులో 
ఆటలాడ మామ తెచ్చిన 
కొమరెల్లి నాలుగుపయ్యల ఎద్దుబండి   
ఇప్పటికి యాదికే !

బండి పయ్యలు బిరబిరా కదలంగ
నా మోకాలు చిప్పలు నలుపుదేలె కదా
నడువరాంగ 
నా ముందు బుడ్డ సైకీలు
ఉరికి ఉరికి 
ఊరవతల మర్రి చెట్టుదాక నూకితి 
అన్న తొక్కంగ

ఉస్కూళ్ ఎనక వడ్లోళ్ళు
పిడకలేశి పట్టాలను కాల్చి
పట్టకారల్తోని మీదికి లేపితే ఉండేది తమాషా
ఎర్రని పట్టామీద సల్లని నీళ్ళు
ముంత పొక్కలకేంచి జారి సుర్రు సుర్రు అంటుంటే

సన్న బుగమ్మను వట్టి
మింట్రి బుగమ్మ నోటికి ఇస్తే
తోకల్ కొరికే ఆట మంచిగనిపిస్తుండే
సన్న బుగమ్మ యాదికొచ్చి 
పాణం కలకలగావట్టే ఇప్పుడు

సీమిడి ముక్కుతోని కిలాసులకు పొతే
మల్లయ్య సారు తిడుతుంటే నవ్వొచ్చేది
కాని సారుకు కోపమోచ్చేది
అర్ధం గాకపోయిన 
అర్దమయ్యినట్లు తలకాయూపుడు
ఇప్పటికి మనాదే

ఇంతుండి
మోటబాయిల ఉల్టా డైఫులు గొడుతుంటే
రానోడు కుల్లుతుండే
పెద్దోళ్ళు మెచ్చుతుండే
అసల్ రానోడు గుల్గుతుండే
హాహా ... హాహా ...

ఏమో !
ఏమి యాదికొచ్చినా
మల్లోస్తయా ... 
గండిపేట కాలువలకెంచి 
పైపులేసుకొని తానాలు జేసే దినాలు  
శివుని శిగల మీద గంగ జారినట్లు
మా తల్కాయల మీద  పైపునీళ్ళు జారెగదా
ఇప్పుడు లోకం పాడై
కాల్వెండి పాకూర్ వాసన లేశే !

ఇంక మస్తుగున్నయ్ ముచ్చట్లు
మల్ల యాదొస్తే చెప్త ...  ఉంటా 

కృష్ణ మణి  
   


Friday, December 11, 2015

ఎదురుచూపులు

ఎదురుచూపులు  
___________________కృష్ణ మణి

గుండె సముద్రంలో
అలల ఉద్రితికి తెగుతున్న
గుండెకోత ఎట్లుందో అడగాలని
మెదడులో తెగిపడుతున్న కరెంటు తీగలు
ఏ జీవం మీద పడి నలుపుతాయో చూడాలని
రోషం మరిగి
నదులుగా ప్రవహిస్తున్న లావా
ఎన్ని ప్రాణాలను బలిగొంటుందోనని ఎదురుచూపు
 
ఆరాటం
రోషం నిండిన ప్రశ్న కోసం
రంగులు లేని జండా కోసం
ఎదురుపడని ప్రేమ కోసం

పోరాటం
మారని మృగాల ఓటమి కోసం
మారిన మనసుల చెలిమి కోసం
మాసిన బతుకుల తెలుపు కోసం

అంతవరకు
ఆగవు అరుపులు  
ఆగవు పరుగులు  
ఆగవు చేతులు
ఆగవు చూపులు
ఆగవు ఆగవు ఆగవు ఆగవు.......

కృష్ణ మణి  




Saturday, December 5, 2015

ఆకలి చక్రం

ఆకలి చక్రం  
___________________కృష్ణ మణి

కాల చక్రం
ఆకలి చక్రాలను ఓడిస్తూనే ఉంది
అనాదిగా

బస్సు చక్రాలు కదిలాయి
మెహిదీపట్నం నుండి ఎల్ బి నగర్ వెళ్లేందుకు  
లక్డికాపూల్ మీదుగా

వాడు
ఎక్కాడు ఆకలితో
బ్యాగ్ ఓపెన్ చేసి పాంప్లేట్స్ పంచాడు
పక్కనున్న వారికి

మా వద్ద ఓపెన్ ప్లాట్స్ గజం రెండు వేలు
మొక్కలు ఫ్రీ
మైయింటనెస్ ఫ్రీ

పక్కనున్న అంకుల్   
చాల బాగుందని
ఎదురుగ కూర్చున్న ఆంటికేసి చూస్తూ
ఇంట్రెస్ట్ చూయించాడు !

మనోడికి సంతోషం కళ్ళలో మెరసింది
మేము ఈ ఫెసిలిటీ ఇస్తాము అదిస్తామని
టైమిస్తే విజిటింగ్ ట్రిప్ ఫ్రీ అని 
మర్యాదగా గొప్పలుపోయాడు
సార్ సార్ అంటూ

ఓహో అలాగా అని
కనుబొమ్మలెగరేస్తూ
ఆంటికేసి చూసాడు ఏమంటావని   
తనేదో సొంత పెళ్లామయినట్టు !

అంకుల్ ఓవర్ ఆక్షన్ భరించలేక 
అంటి అసహ్యించుకొని 
కోఠిలో దిగేసింది

అసహనంతో అంకుల్ వీడికేసి చూస్తూ
మీ ఏరియాలో ఏముందయ్యా
గుట్టలు రాళ్ళు రప్పలు
మడుగులు తప్ప అనన్నాడు


అప్పటిదాకా ఆహా అని
ఇప్పుడు ఇహీ అనడంతో
ఆకలి కడుపు
లోలోన అరిచింది

హెడ్ ఫోన్స్ తగిలించుకొని
ఏరా…. ఎక్కువయ్యిందన్నాడు కసిగా
ఏమిటి నన్నేనా ...అంటూ ఉలిక్కిపడ్డాడు అంకుల్
మిమ్మల్ని కాదు సర్ - ఫోన్లో జూనియర్ సేల్స్ మాన్  
తమ్ముడు చెక్కు తీసుకో ..
రేపే రిజిస్ట్రేషన్ పెట్టుకోమను
అంటూ లేచాడు అవమానంగా    

ఇంతే ఈ లోకం
అంతే ఈ కాలం
కడుపును సుత్తెతో
కొడుతూనే ఉంటాయి 
ఆకలి చచ్చేదాక

కృష్ణ మణి