Wednesday, December 23, 2015

యాదికొచ్చిన ముచ్చట్లు

యాదికొచ్చిన ముచ్చట్లు
___________________కృష్ణ మణి

అంబాడ పొద్దుల్లో
ఆకలి దాటిన ఆలోచనలు

లోకాన్ని అవగతం చేసుకొనే పరుగులో 
ఆటలాడ మామ తెచ్చిన 
కొమరెల్లి నాలుగుపయ్యల ఎద్దుబండి   
ఇప్పటికి యాదికే !

బండి పయ్యలు బిరబిరా కదలంగ
నా మోకాలు చిప్పలు నలుపుదేలె కదా
నడువరాంగ 
నా ముందు బుడ్డ సైకీలు
ఉరికి ఉరికి 
ఊరవతల మర్రి చెట్టుదాక నూకితి 
అన్న తొక్కంగ

ఉస్కూళ్ ఎనక వడ్లోళ్ళు
పిడకలేశి పట్టాలను కాల్చి
పట్టకారల్తోని మీదికి లేపితే ఉండేది తమాషా
ఎర్రని పట్టామీద సల్లని నీళ్ళు
ముంత పొక్కలకేంచి జారి సుర్రు సుర్రు అంటుంటే

సన్న బుగమ్మను వట్టి
మింట్రి బుగమ్మ నోటికి ఇస్తే
తోకల్ కొరికే ఆట మంచిగనిపిస్తుండే
సన్న బుగమ్మ యాదికొచ్చి 
పాణం కలకలగావట్టే ఇప్పుడు

సీమిడి ముక్కుతోని కిలాసులకు పొతే
మల్లయ్య సారు తిడుతుంటే నవ్వొచ్చేది
కాని సారుకు కోపమోచ్చేది
అర్ధం గాకపోయిన 
అర్దమయ్యినట్లు తలకాయూపుడు
ఇప్పటికి మనాదే

ఇంతుండి
మోటబాయిల ఉల్టా డైఫులు గొడుతుంటే
రానోడు కుల్లుతుండే
పెద్దోళ్ళు మెచ్చుతుండే
అసల్ రానోడు గుల్గుతుండే
హాహా ... హాహా ...

ఏమో !
ఏమి యాదికొచ్చినా
మల్లోస్తయా ... 
గండిపేట కాలువలకెంచి 
పైపులేసుకొని తానాలు జేసే దినాలు  
శివుని శిగల మీద గంగ జారినట్లు
మా తల్కాయల మీద  పైపునీళ్ళు జారెగదా
ఇప్పుడు లోకం పాడై
కాల్వెండి పాకూర్ వాసన లేశే !

ఇంక మస్తుగున్నయ్ ముచ్చట్లు
మల్ల యాదొస్తే చెప్త ...  ఉంటా 

కృష్ణ మణి  
   


Friday, December 11, 2015

ఎదురుచూపులు

ఎదురుచూపులు  
___________________కృష్ణ మణి

గుండె సముద్రంలో
అలల ఉద్రితికి తెగుతున్న
గుండెకోత ఎట్లుందో అడగాలని
మెదడులో తెగిపడుతున్న కరెంటు తీగలు
ఏ జీవం మీద పడి నలుపుతాయో చూడాలని
రోషం మరిగి
నదులుగా ప్రవహిస్తున్న లావా
ఎన్ని ప్రాణాలను బలిగొంటుందోనని ఎదురుచూపు
 
ఆరాటం
రోషం నిండిన ప్రశ్న కోసం
రంగులు లేని జండా కోసం
ఎదురుపడని ప్రేమ కోసం

పోరాటం
మారని మృగాల ఓటమి కోసం
మారిన మనసుల చెలిమి కోసం
మాసిన బతుకుల తెలుపు కోసం

అంతవరకు
ఆగవు అరుపులు  
ఆగవు పరుగులు  
ఆగవు చేతులు
ఆగవు చూపులు
ఆగవు ఆగవు ఆగవు ఆగవు.......

కృష్ణ మణి  




Saturday, December 5, 2015

ఆకలి చక్రం

ఆకలి చక్రం  
___________________కృష్ణ మణి

కాల చక్రం
ఆకలి చక్రాలను ఓడిస్తూనే ఉంది
అనాదిగా

బస్సు చక్రాలు కదిలాయి
మెహిదీపట్నం నుండి ఎల్ బి నగర్ వెళ్లేందుకు  
లక్డికాపూల్ మీదుగా

వాడు
ఎక్కాడు ఆకలితో
బ్యాగ్ ఓపెన్ చేసి పాంప్లేట్స్ పంచాడు
పక్కనున్న వారికి

మా వద్ద ఓపెన్ ప్లాట్స్ గజం రెండు వేలు
మొక్కలు ఫ్రీ
మైయింటనెస్ ఫ్రీ

పక్కనున్న అంకుల్   
చాల బాగుందని
ఎదురుగ కూర్చున్న ఆంటికేసి చూస్తూ
ఇంట్రెస్ట్ చూయించాడు !

మనోడికి సంతోషం కళ్ళలో మెరసింది
మేము ఈ ఫెసిలిటీ ఇస్తాము అదిస్తామని
టైమిస్తే విజిటింగ్ ట్రిప్ ఫ్రీ అని 
మర్యాదగా గొప్పలుపోయాడు
సార్ సార్ అంటూ

ఓహో అలాగా అని
కనుబొమ్మలెగరేస్తూ
ఆంటికేసి చూసాడు ఏమంటావని   
తనేదో సొంత పెళ్లామయినట్టు !

అంకుల్ ఓవర్ ఆక్షన్ భరించలేక 
అంటి అసహ్యించుకొని 
కోఠిలో దిగేసింది

అసహనంతో అంకుల్ వీడికేసి చూస్తూ
మీ ఏరియాలో ఏముందయ్యా
గుట్టలు రాళ్ళు రప్పలు
మడుగులు తప్ప అనన్నాడు


అప్పటిదాకా ఆహా అని
ఇప్పుడు ఇహీ అనడంతో
ఆకలి కడుపు
లోలోన అరిచింది

హెడ్ ఫోన్స్ తగిలించుకొని
ఏరా…. ఎక్కువయ్యిందన్నాడు కసిగా
ఏమిటి నన్నేనా ...అంటూ ఉలిక్కిపడ్డాడు అంకుల్
మిమ్మల్ని కాదు సర్ - ఫోన్లో జూనియర్ సేల్స్ మాన్  
తమ్ముడు చెక్కు తీసుకో ..
రేపే రిజిస్ట్రేషన్ పెట్టుకోమను
అంటూ లేచాడు అవమానంగా    

ఇంతే ఈ లోకం
అంతే ఈ కాలం
కడుపును సుత్తెతో
కొడుతూనే ఉంటాయి 
ఆకలి చచ్చేదాక

కృష్ణ మణి

     

Thursday, November 26, 2015

చెక్కబొమ్మ

చెక్కబొమ్మ
__________________కృష్ణ మణి

ఆమె అలా వెల్లకిల పడుకుంది నరాలను బిగపట్టి
తనతో జరుగుతున్నదేదో తనకు తెలియనట్టు
మాంసపు ముద్దపై జరుగుతున్న ఇష్టపూర్వక బలత్కారాన్ని
గోడపైన చూసుకుంటున్నది ఆయాసంగా

వాడు పిసికేస్తున్నాడు రబ్బరు బంతులన్నట్టు
వాడు కొరికేస్తున్నాడు
గాట్లు పడి చుక్కకు చుక్క తోడై రక్తం వరదవుతుంది
తానిప్పుడు ప్రాణమున్న చెక్కబోమ్మే

కను సుడిగుండంలో
తన్నుకొస్తున్న కెరటాలను అదుపు చేసుకుంటున్నది
రంపపు కోతను అలవాటుగా అనుభవిస్తుంది
కూతురి కాలేజ్ ఫీజు గుర్తొస్తూ ....

వాడు జుట్టు పట్టి లాగుతున్నాడు
తనేదో ఆటవస్తువైనట్టు
డబ్బు జల్లుతున్నానని ఆహంకారమనుకుంటా
వాడి కళ్ళలో అసహనాన్ని విషంతో సమంగా తాగుతుంది

స్ఖలించి
పక్కమరలి గుర్రుపెట్టాడు వాడు
ఋతుచక్రపు రక్త దేహాన్ని ఈడ్చుకుంటూ లేచింది
ఆ .. అవమానాల బతుకు చక్రం

సదురుకున్న గుడ్డలను మోకాళ్ళ వరకు ఎత్తి
మునివేళ్ళపై నడిచింది
వణుకుతూ బాత్రూం గడియపెట్టి కూలింది
ఏకాంతమే ప్రశాంతమైనట్టు
ఎవరు చూడకుండానే కుములుతుంది అలవాటైనట్టు

గుర్రుసాబు నిద్ర లేచి
బొర్ర నిమురుతూ తలుపు నెడితే తెలిసింది
ఆ ప్రాణం అక్కడే కొన ఊపిరితో కొట్టుకొని విడిచిందని
గమ్యం చేరని పరుగులో నేలరాలిని కుసుమాలలో ఒకటని

కృష్ణ మణి

Wednesday, November 18, 2015

అక్షరం – ఆయుధం

అక్షరం – ఆయుధం
_________________కృష్ణ మణి

కుబుసాన్ని ఇడువుమంటే
ప్రసవ వేదనే అవుతుంది అహానికి
అక్కడ పుట్టేది ప్రేమ కాదు
మళ్ళీ అహమే !

అహం చావని గుణాలు మసలుతాయి
గొడ్ల చావడిలో దోమలా
అక్షరం ఎత్తిన బడుగులు
రాజ్యం ఎరిగి
కవాతులు చేస్తూ కస్సుమంటుంటే
బుస్సుమని తాచులు  
మెల్లగా మాటేసి కాటేస్తున్నాయి !

ఇప్పుడు
చర్యకు ప్రతి చర్య భౌతికమే
మానసికం కాదు
ఎదిగిన తలలు
ఒదిగిన తలలకు అక్షరాలను ఆయుధంగా ఇవ్వాలి
కత్తులు కక్షలు కాదు మిత్రమా...!   

అప్పుడు ఆహాలన్నీ దిగి ఆలింగనం చెయ్యక తప్పదు 


కృష్ణ మణి 

జోంబీస్ అటాక్

జోంబీస్ అటాక్
__________________కృష్ణ మణి

జుగుప్సాకర డస్ట్ బిన్ లా  
చెట్టుమీది బోజలా
కొందరి మందమతుల ఆలోచనలు  
వారికి సోకిన జబ్బే ‘’జోంబీస్ అటాక్’’  

వారి మాట విని
జోంబీస్ గ్రూప్లో శామిల్  అవ్వాలి
లేదంటే రోశంలేని చవటనీ 
ఆ వర్గం వాడివనీ 
పిచ్చంటూ
పరువు తీస్తారు !

ఇప్పుడు అంతటా ఇలాంటి గుంపులెన్నో .....!

కొందరు
తప్పని స్తితిలో నలుగురిలో మెలగాలని  
విషాన్ని నింపుకుంటారు కల్మషం లేని మనసులో
టైరులో గాలిని నింపినట్టు

మెదడు మసకబారి
ఒకరి మనసుని ఒకరు కరిచేస్తూ సాగుతారు  
అర్ధంకాని ఆవేశంతో  
అంతమెక్కడో తెలియని ముళ్ళ దారిలో

భరించలేని ఒత్తిడిలో బద్దలవుతారు ఒకచోట
తామేంటో
నిజమేంటో తెలిసి
సిగ్గుపడి  చిన్నబోతారు !    

ఆ బద్దలయ్యే క్షణం కోసం నిరీక్షించాలి 
మానవత్వం నిండిన మనషులుగా
అప్పటిదాకా మన చుట్టూ ఈ ‘’ జోంబీస్ అటాక్ ‘’ తప్పదు మరి !


కృష్ణ మణి     

నానో తళుకులు

తళుకులు

1

చెరువు
మెరుపు
కరువు
మలుపు

2

పొగరు
తగదు
జగడం
జేజేలు

3

నరకం
నగరం
శునకం
షికారు

4

దేహం
స్మశానం
కైలాసం
మానసం

కృష్ణ మణి  

Sunday, November 15, 2015

పిశాచ వల

పిశాచ వల
_________________కృష్ణ మణి

మనిషి మనిషిగా గుర్తించని మూర్ఖుల మధ్య
కులమని
మతమని ఏడిచి చచ్చే
పిచ్చి మతుల మధ్య నిలబడి  
ఏం సాదిద్దామని ఈ ఆరాటం
 
మనిషిని చంపటమే ధ్యేయమని
మనిషికి భయాన్ని రుచి చూపించి
లొంగదీసుకొని ఒక వర్గం చాందసాన్ని లోకానికి రుద్దడమంటే
నీది ఎంతటి కటువైన మనసు !

రాయి అయినా కరుగుతుందేమో అగ్ని పర్వతం బద్దలైనప్పుడు !
కాని , నీ మనసెందుకు ఇంతలా ముదిరింది  
ఎవరు చెప్పారో చెప్పు
ఎతికి అడుగుతా లోకం చుట్టి
ఎక్కడ రాసుందో చెప్పు కనీసం
మత గ్రంధాలను తిరిగేస్తా
నీ దాష్టికానికి మూలమేదో తేలుతుంది

తలను కోసే నిన్ను మనిషివని నేననుకోను
మత్తులో జోగే చలనం లేని మెదడుతో నీవు
ఎంతటి దుర్మార్గానికైన వెనకాడవని తెలుస్తుంది

నువ్వు మారుమని నేనడగను
అడుగమంటే మాత్రం చావమంటాను
అవును ముమ్మాటికి చావమంటాను
మానవత్వం బతుకుతుందని మెరిసిపోతాను
ఈ భూమికి భారం తగ్గుతుందని మురిసిపోతాను


కృష్ణ మణి  

చివరి కొడుకు

చివరి కొడుకు
_______________కృష్ణ మణి

వీడు
ఏ ధర్మాన్ని ఆచరించాలో చెప్పు
ఏ బట్టకట్టాలో
ఎలాంటి తిండి తినాలో  
అదీ ... ఎలా తినాలో చెప్పు

సమాజంలో ఇప్పుడు వీడు
ఒక ఆనాదలా కంటతడి పెడుతున్నాడు  
వాడు రాలుతున్నాడు
కరెంటు తీగలపై ఒంటరి పిట్టలా !
  
మనషుల మధ్య మమతల కోసం వాడు
గుండె మండి గుడి గంట కొడుతున్నాడు
దర్గా మెట్లెక్కి ‘’యా అల్లా’’ అంటున్నాడు
చర్చికెళ్ళి రోదిస్తున్నాడు ‘’జీసస్’’ అని

వాడిప్పుడు పరాయివాడు
ఎవడూ మావాడనరు వాన్ని

వాని కళ్ళలోకి చూస్తే
మన మనసు పెద్దగా దర్శనమిస్తుంది
వాణి మాటల్లో ప్రేమ ఒలుకుతుంది   

వాడు
పరిగెడుతున్నాడు
ఒలంపిక్ కాగడలా చేతిలో దివిటిని చేతబూని
మనం మనుషలమని
మనలోని అందకారాన్ని తరిమేద్దామని

మానవత్వానికి చివరి కొడుకు వాడు
వాడు చస్తే లోకం చచ్చినట్లే
అప్పుడు
మనిషిని బూతద్దం పట్టి వెతకాలి    
అప్పుడు
మనిషిని బూతద్దం పట్టి వెతకాలి    


కృష్ణ మణి