Wednesday, November 9, 2016

సీతాకోకచిలుక

సీతాకోకచిలుక
_________________కృష్ణ మణి

వెలుగు జిలుగుల జాతరలో
మరచిపోయాను నన్ను నేను

ఏమని చెప్పను
ఎలా చెప్పను
దూరంగా ఉండి
దీర్గంగా చూస్తున్న కళ్ళలో
ఒక సుడిగుండం నన్ను దగ్గరకు లాగింది

బయటకు చాల కష్టంగా ఉండి
లోపల ఇష్టంగా అలలు హోరును పెంచి
మెల్లి మెల్లిగా దగ్గరకు వెళ్లేలా చేసింది

ఎందుకో ఇలా ఆకర్షించబడ్దోనని ఆశ్చర్యపడి 
ఆ సుడిగుండంలో నా తాలూకు గుర్తులేమైనా ఉన్నాయేమోనని
కళ్ళను చూసాను
అప్పుడే ఒక గగుర్పాటు చిత్రం ఉలిక్కిపడేలా చేసింది
అది నేనే

ఈ ఉరుకుల పరుగుల సమాజం
ఇంతకాలం నన్ను నేను మరిచేలా చేసింది
నాకు నేను దూరంగా ఉండేలా చేసింది 

లోకానికి దూరంగా పరిగెత్తి నిలచి గమనించాను  
అప్పుడనిపించింది
గుండె శబ్దం మెల్లిగా చెప్పింది    
ఇక ఎంతకాలం కృత్రిమ లోకంలో
నిన్ను నీవు చంపుకొని బతకడం
సమాజపు వికృత విష పొరలను పక్కకు లాగి చూడని

నా కట్టుబాట్లు
నా వేషం
నా భాష
నా మతం
నా చుట్టూ ఒక వలయాన్ని కట్టి
నన్ను బందీని చేసి
స్వార్ధం నింపి
నాపై నేనే దండయాత్ర చేసి
నన్ను నేను చంపుకునేల చేస్తున్నాయి !

ఇప్పుడు నేను స్వతంత్రుడను
గూడులోంచి రెక్కలు విప్పిన సీతాకోకచిలుకను

కృష్ణ మణి



బంగారం

బంగారం
_____________కృష్ణ మణి

అమాయకపు చూపు
దీనంగా చూసింది నావైపు
నాన్న, అమ్మ తిట్టిందని

జారుతున్న జలపాతం  
తన చెక్కిళ్ళపై నుండి రాలుతుంటే
మనసు కొవ్వొత్తిలా కరిగి
చేతులు చాచి గట్టిగా అత్తుకొని
తన కంటివాగు ఆగే దాక
నా మనసు వాగును జతచేసాను తన కంటబడక

ధైర్యం నింపుకొన్న చిట్టి గుండె
నాన్న, నా తప్పేమీ లేదంటుంటే అమాయకంగా
పోనీలేమ్మా , అమ్మను కొడదాము సరేనా అంటే  
మోహంలో సంతోషం
పెదాల్లో ఎటకారం
వాళ్ళమ్మను చూస్తూ

అలిగిన తల్లిని ఓదార్చేది ఆ చిట్టి తల్లే మరి
అమ్మా , అమ్ము తింటా అనగానే
కన్నతల్లి ప్రాణం విలవిలలాడి
ఆ చిన్ని బొజ్జను నింపి తన గుండెను నిమ్పుకొంది

ఆద మరచి నిద్రలోకి జారుకున్న పసిప్రాణాన్ని చూస్తూ
మా బంగారం అంటూ మురిసిపోవడం మాములయ్యింది  మాకు

కృష్ణ మణి