Monday, March 27, 2017

చందమామ నవ్వు

చందమామ నవ్వు
_________________కృష్ణ మణి

గుర్తున్నది
నా కనుబావి పొంగినప్పుడు
నీ చెంపను అడ్డుగా పెట్టి
మనసుతో తుడిచావు

ఏమి చేస్తున్నానో తెలిసి
కష్టాన్ని ప్రేమిస్తూనే
ఆకలి కడుపును మంచినీళ్ళతో నింపుకున్నావు

సమయం దాటి
నరకంగా గడుస్తున్న రోజులను నిందిస్తూ
పరుష చూపులను దింపుకొని
సహనంగా చల్లని వెన్నలను కురిపిస్తున్నావు

నాలో ప్రళయాన్ని మౌనంగా భరిస్తూనే
అధైర్యాన్ని అధిగమిస్తూ
ధైర్యాన్ని నిమ్పుతున్నాను
దిగులుచెందకు ప్రాణామా

రేపటి వెలుగు నీడన మన సుఖాన్ని చూస్తున్నాను
చందమామ కూడా కలిపాడు నవ్వును
ఇసుక తిన్నలపై కూర్చున్న మనలను
సముద్రంపై నుండి చూస్తూ

కృష్ణ మణి

దీపం

దీపం
______________కృష్ణ మణి

నింగిలోంచి
భూమికి దగ్గరగా వచ్చినప్పుడు తెలిసింది
ఎంత అందంగా ఉందోనని !

అన్ని గ్రహాలు ఉన్నట్లు గుండ్రంగా ఉన్నా
ఆ అందాల ప్రక్రుతి హొయలు
మనసుని కట్టిపడేసింది

దగ్గరగా చూద్దామని కదిలితే
ఏవో రేకుడబ్బాలు చువ్వలు దాడి చేసాయి
భూమికి రక్షణగా
ఎదో శక్తి ఇలా చేస్తుందని అనుకున్నాను
తెల్లని మబ్బుల ఊయలలు
దోలాయమానం అంటే ఏంటో రుచి చూపించాయి

అ నీలి సంద్రం మధ్యలో పచ్చటి మైదానపు ప్రదేశాలు
అక్కడక్కడ గోదుమరంగు ఇసుక ప్రాంతాలు
కన్నుల పండుగనే చెప్పాలి

ఒక చక్కని పచ్చని ప్రాంతంలో దిగి
అక్కడి ప్రాణుల్ని గమనించాను
ఒక ప్రాణిపై మరో ప్రాణి ఆధారపడి బతుకుతున్నాయని
బతకడానికి ఎదుటి ప్రాణిని చంపుకు తింటున్నాయని
ఆకును పండును కాయను తినే సాత్విక జీవులు కొన్నైతే
రక్తమాంసాలకై కోరలు గోర్లతో కృరంగా ఉన్నా జీవులు

బయటికి కనిపించే రంగురంగుల పక్షులకు
ఎగిరిగంతులేసే అమాయక జంతువులకు
కిచ్ కిచ్మనే చిట్టిపొట్టి పురుగులకు
జీవన్మరణ పోరాటమే నిత్యం
ఆధిపత్య కృరత్వం వల్ల

ఆధిపత్యమంటే ఎవరిదని చూస్తే తెలిసింది
మనిషనే ప్రమాదకర విష జంతువుదని
తెలివి పెంచుకొని అడవిని అలికి
అందమైన కోటలను
పేక మేడలను కట్టి
ఆకాశానికి విషపుగోట్టాన్ని తగిలించి
తానూ చెడింది కాక
లోకాన్ని చెరుస్తున్నాడీ మూర్ఖుడు

వాడికి వాడే పోటి పడి
భూమికి గీతాలు గీసి
పంచుకొని యుద్ధాలు చేస్తున్నాడు
ప్రకృతిని చిదిమి దీపం పెట్టుకుంటున్నాడు
సకల జీవాలకూ పెడుతున్నాడు

కోపం తట్టుకోలేక శపించాను
ఒక్క క్షణంలో ఈ మనిషి వెయ్యి ముక్కలవ్వుగాక అని
వెంటనే పెద్ద శబ్దంతో ఒక విస్పోఠనం

ఉలిక్కిపడి లేచాను నిద్రలోంచి
నాపై నేనే సిగ్గుపడుతు

కృష్ణ మణి

ఎక్కడ నా తల్లి

ఎక్కడ నా తల్లి
_______________ కృష్ణ మణి

ఎదురొచ్చిన గుంతను ముద్దాడిన నొసలుకు
భూతల్లి దీవనల దుమ్ము

కనుపాప చూసింది
కొండలా నిలుచున్న మట్టి ముద్దలను
అ మట్టి ముద్దల నడుమ ఉదయించిన సూరిడల్లె
పరుగున వస్తున్న బిచ్చగత్తె

అయ్యో నాయనా ఎంత పనయ్యిందని భుజం తట్టి లేపి
ఒళ్లో దాచుకుంది తలను
అప్పుడు మా అమ్మే గుర్తొచ్చింది
తల కార్చిన రక్తం కన్నా
నా మనసు కార్చిన కన్నీరే ఎక్కువ

కళ్ళు తెలిచే సరికి ఏసీ గదిలో ఉన్నాను
ఆ తల్లి ఎక్కడని చూసాను
అయస్కాంతానికి నిలుచున ఇనుప రజనులా నా వాళ్ళు

వెళ్లి వెళ్లి ఆ గుడిసెల ముందే కూలావేందిరాని
ఏటకారపు పలకరింపులు
చెంపలు వాయించాలనే కసి
కాని
ఏం చెయ్యను
రెండు చేతులకు ఫ్రాక్చర్ పట్టీలు

ఆమెను చాలాసార్లు వెతికాను అక్కడ  
ఇప్పుడు ఆవిడ అందరిలో కనిపిస్తుంది
చిరునవ్వులతో దీవనలిస్తూ


కృష్ణ మణి