Friday, December 30, 2016

నా ధోరణి

నా ధోరణి
_______________కృష్ణ మణి

ఏమయ్యింది
నాలో ఇంతలా కొత్త ప్రవాహం
అలుగు దాటి వరదై
ఆలోచనా పొంగు పారుతున్నది

ఆ ధోరణి
పచ్చటి పంటలకు
చల్లటి సమాజానికి
వెచ్చటి ప్రణయానికి
ఎర్రటి అడవిబాటకి
కమ్మటి తెలుగుకి అండగా ఉంటూ

హాయిగా సాగుతూ 
తుళ్ళుతూ లేస్తూ
గట్టిగా పొడుస్తూ
మెత్తగా తాకుతూ
చిక్కగా కారుతూ
కొంటెగా నవ్వుతూ

ఆవేశానికి ఆదిగా
ఆవేదనకు ఓదార్పుగా
రాజ్యానికి మెండుగా
ఆప్యాయతకు ఆలంబనగా ఉండాలని కోరుతూ
సదా మీ ఆప్తుడు
కృష్ణ మణి 



అర్ధమయ్యింది

అర్ధమయ్యింది
____________________కృష్ణ మణి

ఊరవతల ఊరవిచ్చుకల ఉరుకులాటను జూసి
పిట్టల అల్లరనుకున్నాను
అది పామెంట వడుతున్న అమ్మ తనపు ఆవేశమని  
మెల్లంగ అర్ధమయ్యింది

అంబా అని  ఆవు అరుస్తుంటే
పల్లెకే అందమని మురిశిన
అది దొడ్డిల గట్టేశిన లేగకోసమని
మెల్లంగ అర్ధమయ్యింది

నాటేస్తున్న అమ్మల పాటను ఇని
కొండలు నిద్రబోతున్నయనుకున్న 
అది ఆకలి గొంతుల అరుపులని  
మెల్లంగ అర్ధమయ్యింది

శేన్లళ్ళ గొర్లమందల నిద్రలు జూసి
దుక్కిల ఒళ్ళు అందమయ్యిందనుకున్న
అది పట్నం కడుపులో తేలే మూగ నాల్కెలని
మెల్లంగ అర్ధమయ్యింది

ఊరు మెల్లంగ రంగుమారుతుంటే
షోకుల పరుగులని నవ్వుకున్న
అది ఆరిన బతుకు పోరాటాల కొత్త శిత్రమని
మెల్లంగ అర్ధమయ్యింది

ఏమర్దమయినా మెల్లంగ
ఆకిరికి అర్ధమయ్యింది ఎందంటే
ఆకలి తిప్పల ఆరాట పోరాటాలే ఎక్కడ జూసిన

కృష్ణ మణి



Thursday, December 22, 2016

గొర్రెల మంద

గొర్రెల మంద
______________కృష్ణ మణి

నేనే పరాన్నజీవిని
పరాన్నబక్కు అని కూడా అంటారు

ఏదైతే ఏందిరాబై
మంది మీద బతుకుడే గదా

మనమందరమూ సోదరా
అవును బై  
పక్కొల్లది గుంజుకు తింటేగని నిద్రబట్టదు
అయితేంది ?

అట్లా కాదుగని
ఒక్కసారి ఆలోచించు
సృష్టిలో జీవులన్నీ పరాన్నజీవులు కాకుంటే ఏం జరిగేదో

ఏమయితుండేబై  
సముద్రంలో చేపలు నిండి
నీళ్లన్నీ పైకొచ్చి జమీనుని ముంచి
ఈ భూగోళం ఒక వింత ఆకృతితో పంది మసలినట్లు ఉండేది

మనిషి ఎంతకాలమని నీటిమీద బతుకుతడు
ఎన్నడో ఖతంయ్యేటోడు
లేకుంటే ఇప్పటికి గుడ్డబట్ట కానక
కోతికి తాతయ్యేటోడు

నిజమే బై అట్లానన్నా కాకపాయే
ఇని కావురం సల్లగుండా
గుండెలల్ల ఈ అగ్గిగోళాలు బగ్గుమని పొగలు జిమ్ముడు ఉండేవా ?

రంగుల గుద్దులాటలుండేవా ?
నా కులమనీ  
నా భాష అనీ  
నా సంస్కృతి అనీ  
జబ్బలు సరసుడు ఉండేదా ?

ఈ ఓర్వజాలని గుణాలు
పెద్దకూర పంచాదులు ఉండేవా ?
ఆడమగ తేడాలు
కట్నం సావులు
కనికరం లేని కసాయిల షికారులు ఉండేవా ?

మతం గొప్పలు
పీఠం తిప్పలు
తేరని అప్పులు
ఈ దగ్గులు తుమ్ములు
దావఖాన జబ్బులు ఉండేవా ?

మతమంటే అనిపిస్తుంది
కనీసం మనిషికి మతం పిచ్చన్న లేకున్నా
అసలు మతమనేది లేకున్నా చరిత్ర ఎట్లుండేదో ?

జీవులు పరాన్నబక్కులైనా ఏమిగాలేదు కాని
మనిషికి అహంకారమనే విషాన్ని చిమ్మకున్నా బాగుండేది  
  
చలో బై సాబ్
యాదిజేసి మనసుకాలవెట్టినవు
చాయి తాపియ్యి నడువు


కృష్ణ మణి   

Saturday, December 17, 2016

ఆశ

ఆశ
____________కృష్ణ మణి

ఆ సాయంకాలం కొండ గాలి ఈల వేసింది  
ప్రకృతి పరవశించి చిందులేసింది

సకలజీవం జోలలూగింది
మౌనంగానే ఎండుటాకులు నవ్వుతున్నాయి  
గెంతులేసే పసికూనలు గాలిని కౌగిలించుకున్నాయి  
మోడువారిన చెట్టుపుట్టకు వానకబురు చలువచేసింది  

ఊటబీటల ఎదురుచూపులకు
రేపటి సూరీడు మబ్బుపడతాడని సంబురం

ఈ ఈలపాట
నిజంగా ఆశల పల్లకిని మోసుకొచ్చింది
ఆశలోని ఆనందం
ఆశతీరితే అనుభందం

ఆ పాట
రేపటి ఉత్సవానికి శంఖారావం
నేటి పస్తులకు చరమగీతం
నవచైతన్యానికి సమరగీతం  

కృష్ణ మణి