Tuesday, August 16, 2016

సీదులు

సీదులు

సీదులల్ల పురుగుబూషి
నడిమిట్ల కుబుసమాట
ఒక్క పయ్య ఎడ్లబండి
వగరొగరు చిత్తల పూత
నవ్వుతున్న ల్యాత కూత

బురదతొవ్వ మడుగు మడుగు
గుండుకింద ఊటనీరు
అలుగుదాటె పర్క పిల్ల
బెకబెకలెగురులాట
ఆనపాములురుకులాట
రొకలిబండ్ల బుగులు బుగులు

ఏడవాయె కాలమంత?
ఎక్కి ఎక్కి ఏడుపులాయే
ఏడ దాగె కండ్లూసు

కనికరం లేని మనిషి కావరం
కొట్టుకపోతవురా ....గలీజు గాలిల

క్రిష్ణ మణి

చింత గింజ

చింత గింజ
________________కృష్ణ మణి

ముదురు ఎరుపూ నలుపు
చక్కనైనా మెరుపు
కుప్పలుగా రాసులు
పెంటకుప్పపై పానుపు

చినుకుని ముద్దాడగనే ప్రాణం నింపుకొని
కంపించిన గుండె
కౌగిలించుకుని ఉప్పొంగిన తనువు

పొట్ట విచ్చుకొని తొంగిచూస్తున్న పాలవేరు
తల్లి ని హత్తుకొని
ఆధారం చేసుకొని
చిగురుటాకులతో లోకానికి దండంబెడుతూ
తనను తాను పరిచయం చేసుకొనే పాదు మురిపమిప్పుడు అనిర్వచనీయం

సకల జీవులకు అక్షయపాత్ర అయ్యే మహా వృక్షమై
ఆశీర్వదించే మనసు
ఆకలికడుపుతో ఆశలు అల్లుతూ

కృష్ణ మణి