Friday, February 10, 2017

పండుతాటికల్లు

పండుతాటికల్లు
_______________కృష్ణ మణి

గుల్ఫారం దంచి
లొట్లు నిమ్పిండు గౌండ్ల రాజన్న
అట్ల నింపిండో లేడో
గప్పుడే దిగిన్రు
ఎల్లిగాడు మల్లిగాడు

పెడ్లాం పిల్లలను
గాలిదేవునికి గిరివిబెట్టిండు ఎల్లిగాడు
పెండ్లికానక
దుకాన్లనే ముంతతోని సంసారం జేస్తుండు మల్లిగాడు

మాటలు జూస్తే
మూటలు నిండుతయి
బతికిశెడ్డ దొరలమని
గాలిల కోటలు కడ్తరు సొక్కమైనోళ్ళు
శింపిరి గడ్డం మాశిన బట్టల కశీరు దూలాలు

ఎల్లిగాని నొసలుకు
సూరెండ గుచ్చితే అర్దమయ్యింది
అద్దుమరాతిరి ఇల్లు జేరింది
బరిగడుపున తిందామంటే
పెండ్లాం సదువుడికీ ఎక్కడలేని రోషం
పిల్లలు జూస్తుండంగ
తల్లి ఈపు అట్టలు దేలినయి

ముద్దు జెద్దామంటే
గూట్లపిట్టలోలె బెదురుతరు పొరలు
ఎవడు జెప్పిన తిప్పలురా ఎల్లిగా
ఏం బతుకురా నీది
బతికినా సచ్చినా
లెక్కలకు రాని పురుగువి
అని నాయినమ్మ కలకలానవట్టే

మన్సు మర్లి
సంసారం చింత జెయ్యవట్టే బుద్ధిమంతుడు
అంతల్నే వొచ్చిండు మాయల మల్లిగాడు
ఓ ఎల్లన్నో ... ఏం సుఖమే నీదో
రాతిరి ఒదినే పండనియ్యలేదా ఏందని పరాచకం

ఎల్లిగాని పెడ్లాం పన్లు పటపటాని కొర్కవట్టింది
జెంగిలి బాడ్కావ్ అనుకుంటా
పెండ్లి జేస్కొని కాలవడరాదురా మల్లిగా
అని ముసలమ్మ సాపెన

మా అన్నని జూస్తలేమే పెద్ద నాయనమ్మ
ఏగుతుంది సాలదా
ఇంక నాకెందుకే అని
ఎల్లిగాని చెవిల జొర్రీగ గుయ్యిమనట్లు
ఓ ఎల్లన్న
ఎల్లే జల్ది
పండుతాటికల్లు తెచ్చిండు జంగన్న
అని మెల్లంగ గెల్కిండు

ఇంకేంది నాల్కె జివ్వుమని
ఇంట్ల నిలవదనియ్యద్
దీని బర్రె మొకం ముండది ఇదొకటి నా పానానికని
అంగేసుకుంటా సరసరా ఆకిలి దాటి
ఉయ్యాల ఊగినట్లు ఉర్కవట్టే
సిగ్గు శరం లేనొడు ఏంజెప్పాలె

కృష్ణ మణి
9866767875 / 7013851501

యహ్ మేరా ఉస్మానియా

యహ్ మేరా ఉస్మానియా
_____________________కృష్ణ మణి

నిత్యం పురిటినొప్పుల బాదలే 
మా ఉస్మానియా క్యాంపస్ కు  

మరో జన్మనెత్తాము
మావంటి ఎందరినో కని
ప్రపంచానికి బహూకరించింది ఆ వెచ్చని గర్భం   

ఆ తల్లి ఒడిలో మేము మానసిక చైతన్యం పొంది
రక్తం మరిగిస్తూ అడుగులో అడుగేస్తూ సాగే పోరులో 
సమాజాన్ని కదిలించే విప్లవ కాగడాలమై వెలిగాము

ఆవేశానికి రెక్కలు తొడిగి
ప్రతిధ్వనిస్తున్న నినాదాలను కవచాలుగా చేసుకొని
ఎత్తిన పిడికిళ్లతో చేసిన కవాతులకు బీతిల్లిన రాజ్యాహంకారం
కుటిల నీతితో జులిపించిన కత్తికి
బలి అయిన మిత్రులు ఊపిరినొదులుతూ చూసారు
ఎగిసిపడే ఉప్పెనను ఎదుర్కోలేక
వెనుదిరిగిన కాకిబూట్ల చప్పుళ్ళను
రేపటి రోజున పొందే విజయబావుట రెపరెపలను

సాదిస్తాము ఆశలు నెరవేర
మీ ఆయుష్శునందుకొని    

ఆనాటి స్వాతంత్ర ఉద్యమం మొదలుకొని
ఇడ్లి సాంబారు గో బ్యాక్
తోలి దశ తెలంగాణ ఉధ్యమం
మలి దశ తెలంగాణ ఉద్యమాల వంటి ఎన్నో ఘట్టాలుకు
సాక్షిభూతం మా ఉస్మానియా
ఎన్నో ప్రాణత్యాగాలకు
హత్యలకు సాక్షం మా ఉస్మానియా
ఎన్నో కన్నీళ్ళకు
మరెన్నో ఆనందాలకు ఆడ్డా మా ఉస్మానియా


చదువుల తల్లికి శతవసంతాల ఉత్సవం
అంటే మా పండుగ
పసిపిల్లలమై ఆడాలని పాడాలని మా ఉబలాటం
యహ్ మేరా ఉస్మానియా
ప్యారా ప్యారా ఉస్మానియా