Sunday, August 30, 2015

లోకం తీరు

లోకం తీరు
___________కృష్ణ మణి 

గోళ్ళను కొరుకుతూ కాలం గడుస్తుంది
ఎక్కడ ఫుల్ స్టాప్ ఉందొ తెలియని జీవితం
దేనికో ఆలోచన శీతాకాలం తర్వాత ఎండాకాలం అన్నట్టు !

జరుగుతున్న కాలాన్ని జరగనిస్తూ
అంతా గమనిస్తూనే గమనంలో
ఎదురుచూసిన చినుకు రాలగానే
చిగురించిన ఆకు నవ్వింది
లోకం నావల్లే సొగసులద్దుకుందని !
  
కళ తప్పిన ఇల్లు
బుడ్డది పుట్టగానే నవ్వింది   
మురిపాల జోల పాట అమ్మనోట ఆనందంగా !

పాతగోతులను పూడుస్తూ
మున్సిపల్ కాంట్రాక్టర్ నవ్వుతూ హడావిడి
మరో ఏడుకి ముందే పర్మిషన్ కొరకు !

బస్సు మిస్సయిన
మిస్సు కోసం పోరాటం
దక్కదనే ఆరాటంలో మరో మిస్సుకు గాలం !

అప్పటికి ఇప్పటికి ఎదో మార్పు
దప్పదని తెలిసి కాలం పరుగు
తప్పనితిప్పల ఆశల బతుకు సాగు !

ఇదేనా లోకం తీరు !  


కృష్ణ మణి 

రక్ష

రక్ష
____________కృష్ణ మణి

నాకెందుకో రహీమ్కు పీటర్కు కట్టాలని ఉంది
ప్రేమలో ముంచిన ఒక రక్షణ రేకును !

శతాబ్దాలుగా ఈ మట్టి
కలుపుకొని పోతుంది
పరాయిలను బేదాలు తుడిచి !

ఈ మట్టిపై విరిసిన కొత్త రంగుపూలు
నయనానందకరంగా ప్రపంచాన్ని
కన్నుకుట్టుకొనేల చేస్తున్నాయి !

కనుపొరలలో ఎదో నలతొకటి ఉందేమో
మన రాజకీయ క్రీడలో ఒలంపిక్స్ ప్లేయర్స్ కి
తమ ఉనికి కోసం నిత్యం దొంగ చూపే
ఎక్కడ జారుతామోనని
పక్కవాన్ని తొక్కుతారు !

వరదకు అడ్డుగా ఎంతని కుప్పలు పోసినా
ఈ ప్రేమ ఉప్పెనై లేస్తుంది
అప్పుడు మనలో మనం
ఒకరినొకరం కొత్తగా చూసుకుంటాము తడసిన మనసుతో !
 
కలుసుందామని కలలు కని చూడు
ఈ మనషులు విరిసిన కలువ పూలే
సున్నితంగా ఒక నవ్వు నవ్వి చూడు
తిరిగి పొందుదువు ఎల్లలులేని మానవత్వాన్ని !

రోజాకు ముళ్ళు రక్షణ  ఐనట్టు
నీవు నాకు
నేను నీకు  
మనమంతా ఈ మట్టికి రక్ష !


కృష్ణ మణి 

చేరాలని తపన

చేరాలని తపన
____________కృష్ణ మణి

నన్ను నేనే మరచితి
నీ కోసం వేచి వేచి చూసి చూసి
కండ్లు లాగి ఎర్రబడ్డాయి !

అటు ఇటుగా చూసాను
ఒక పింక్ ని
ఒక ఎల్లో ని 
ఒక రెడ్ ని
ఒక బ్లూ ని
పట్టి పట్టి చూసాను
నీవేనేమోనని !

ఇక్కడ చాలామంది నాలానే
ఎవరి కోసమో ఎదురుచూపులు
వెతుకులాటలు
కొందరు గుంపులుగా
చిన్న పెద్ద తారమమ్యం లేదు
అందరూ కలుస్తున్నారు
కలియబడి అలా సాగుతున్నారు
చూస్తుంటే నవ్వొస్తుంది !

వాళ్ళంతా ఎటెల్తున్నారో తెలుస్తుంది
ముందే అడిగితె నొచ్చుకుంటారని ఫీలింగ్ !

నీకై ఎంతని ఉండను ఇక్కడ
ఎంత కోపమో నీపై
అలగాలని ఉంది కాని చేరాలని తపన !

నిమిషాలు నిశబ్దంగా యుగాలను తలపిస్తున్నాయి
ఓపిక నశించి
ఏదైనా తాగాలని దాహం
నీవొస్తే మిస్సవుతానని గుబులు !

నాకై నువ్వనీ
నీకై ఎక్కువసేపు ఆగలేను
లేకుంటే గమ్యం లేదని స్పష్టం !

మొత్తానికి వచ్చావు
ఊపిరితీసుకొని శాంతపడ్డాను
నీపై ఎక్కి కోర్చోని
కండక్టర్ కి చిల్లరిచ్చి టికెట్ కొనుకున్నాను ఓపిగ్గా...!


కృష్ణ మణి     

Thursday, August 27, 2015

విన్నాను

విన్నాను
______________కృష్ణ మణి

విన్నాను
లోకం పాటను
అగ్నిపర్వతాలు మీద కురుస్తున్నప్పుడు
ఆర్తనాదాల విలయగీతం !

విన్నాను
గర్భగుడిలో నిద్రిస్తూ
అమ్మ కూనిరాగాలను
ప్రసవ వేదనగీతాన్ని !

విన్నాను
నన్ను భుజంపై ఎత్తుకొన్న
అమ్మ ఆకలి ఆరాటాల పేగుల కేకలని
రేపటి రోజుకై ఊహల మలుపుల గుసగుసలను !

విన్నాను
అరిగిన అడివిలో
విలవిలలాడుతున్న పక్షుల బాధల కిలకిలలను
ఎనకబడుతున్న జంతువుల పాదాల అలికిడిని !
 
విన్నాను
ఎదిగే చోట అదిమే
నాగరిక అనాగరిక హూంకారాలని
తల వొంచిన గుండెలో రగులుతున్న శబ్దాన్ని !

విన్నాను
స్వేచ్చావాయువులు లేని
ఆడతనపు అవమానాల కంటనీరు ఆక్రోశాన్ని
బద్దలై పారుతున్న రక్తపువాగు ఉరుకులని !

విన్నాను
మతమనే మూడత్వంలో
మరుగుతున్న లోహాపు ఆయుధాల అల్లరిని
కునుకుపడని ఆవేశపు వికృత మనసు రణగొణ ద్వనులను !

విన్నాను
మార్గం దొరకని బడుగుల
గమ్యం తెలియని నడకల కిర్రు చెప్పుల అడుగులను
చేరేకొద్ది మారే జీవిత లక్ష్యాల విసుగులను !
 
ఇక ఎప్పుడు శాంతిగీతాన్ని వింటాను ?
ఇక ఎప్పుడు శాంతిగీతాన్ని వింటాను ?
ఇక ఎప్పుడు శాంతిగీతాన్ని వింటాను ?

కృష్ణ మణి

Tuesday, August 25, 2015

పచ్చి మృగం


_______________కృష్ణ మణి

మనిషి ఒక మృగం
మృగం కాక ఇంకేంటి
ముమ్మాటికి మృగమే !

ఒకరు చేపలను పంచారు తినడానికి
ఒకరు గొర్రెలను బలిమ్మన్నారు  
కొందరైతే  
ఏకంగా బానిసలను చేసుకొని బ్రహ్మాండంగా దర్శనమిస్తారు
ఎటుచూడు దర్జాగా !

ఒకటి మాత్రం స్పష్టం
ఏందంటే
జీవపరిణామ క్రమంలో మానవుడు
తెలివితో పాటు అహంకారాన్ని పెంచాడు
అందుకే సమస్త జీవకోటిని ఆధీనంలోకి తెచ్చుకొని
అరికాలి కింద నలుపుతున్నాడు !

ఒకటనిపిస్తుంది
అన్ని జీవులు ఒక్కటై
ఇక ఉద్యమం చెయ్యాలని తీర్మానించుకొని
హెచ్చరిక ఒకటి పంపితే

‘’అన్యాయం
అక్రమం
దొంగలని
మీలో మీరే ....
రాజ్యమని
ప్రజాస్వామ్యమని
హక్కని
నోరు తెంచుకొని రోడ్డుపై అరుస్తారే
మాకు హక్కుంది మీతో సమంగా
ఈ భూమిపై గర్వంగా
కాదంటారా ....
మరి మేము ఎదురుతిరిగి ఉద్యమిస్తే తప్పేంటి
మీకు నొప్పెంటి  
మీ లాగులోకి మేము దూరితే
ఏముతారో చెప్పము
దూరాక చూస్తారు ‘’ !

కావాలొక వాత
పైత్యం పారిపోఏదాక !


కృష్ణ మణి 

Sunday, August 16, 2015

సీటు మిక్షర్


________________కృష్ణ మణి

ఈయల్ల పంద్రాగస్టు కదా
గోవిందు గాడు నేను మల్లేశ్ గాడు
ముంగల కూసన్నం స్టేజి కాడ సక్లముక్లం బెట్టుకొని !

మా అమ్మకు జరం
మా అన్న చాయ్ పెట్టిండు
రూపాయి ఫైను బిస్కెట్ నానవేట్టుకొని తిన్న!

మల్లేష్ గాడు ఎం సోకులవడుతడో
కొత్త బట్టలేసుకొని ఏమన్న నీల్గుతడా వాడు
గోవిందుగాడైతె దినాం ఏం తినకుండనే వస్తడు స్కూల్కి 
పగటిల్ల్య ఆయమ్మ పెట్టె బువ్వ తింటనే పొద్దు గడుస్తది ఆనికి !

పెద్ద కిలాసోల్లు చేతులు వట్కొని
ఊర్ల తిరగనీకే పోయిండ్రు
ఈళ్ళు పోయినంకనే జండలెగురుతయి ఆడ !
 
ఎనిమిది గొట్టంగ కూసున్నం
ఊర్ల పెద్దమనుషుల కోసం దిక్కులు సూడవట్టె మా హెడ్ మాస్టర్ సారు
వచ్చిన్రు తెల్లబట్టలల్ల మెడలెత్తి నడుసుకుంట పది గొట్టంగ
జండ ఎగిరింది
సప్పట్లు కొట్టినం మురిపెంగా
మా సార్ చేతిలకెంచి మైకును తీసుకున్నరు
ఇగ వొర్ల వట్టె నేనింత నువ్వింత అనుకుంటా !

ఈల్లేం మాట్లాడుతున్నరో అర్ధం అయితలేదు కాని
మా కాళ్ళు గుంజి తిమ్మిర్లు వడుతున్నై 
కండ్లు తిరుగుతున్నై  
దూపైతుంది ఇంక ఆకలైతుంది
మొగులైయ్యింది
అయినా ఇడుస్తలేరు మైకుని
కోతికి కొబ్బరి శిప్ప దొరికినట్లు చేస్తున్నరు !

మొత్తానికి పన్నెండు దాటింది
ఆకలైయ్యిందేమో పాపం చేతులూపి జైహింద్ అన్నరు
హమ్మయ్యని కిలాసులకు లైన్లు గట్టినం
సీటు మిక్షర్ పెట్టిండు సారు  !

ఇంటికొచ్చి
అమ్మకు నాయినకు ఇంత పెట్టి తిన్నం మురుసుకుంట !

కృష్ణ మణి



Friday, August 14, 2015

నగ్నంగా ఒక పక్షి

నగ్నంగా ఒక  పక్షి
_________________కృష్ణ మణి

నిజం చెప్పనా
నాకెందుకో పుట్టినప్పటిలా
నగ్నంగా దోర్లాలని ఉంది
నింగికెగిసే పక్షిలా మారాలని ఉంది !

ఎవరో బట్టకట్టారు
ఎవరో కట్టుబాట్లు నేర్పారు
సమాజం అన్నారు
సమాజం మరో సమాజంతో యుద్ధం అన్నారు !

దేవుడన్నారు
దయ్యమన్నారు
మతమన్నారు
ఒకరిని మొక్కుతే
మరొకరిని అసహ్యించుకోమన్నారు !

దేశమన్నారు
దోపిడన్నారు
ఒకరి పై ఒకరు ఎప్పుడూ కత్తులు దూయమన్నారు !

కష్టమన్నారు
నష్టమన్నారు
ఇష్టమయితే ఉండమన్నారు
లేకుంటే సన్నాసన్నారు !

బుర్ఖా అన్నారు
ముసుగన్నారు
తల వంచమన్నారు
లేకుంటే కులతన్నారు !

భాషన్నారు
వేషమన్నారు
అలా అయితేనే మనిషన్నారు
కాదంటే పిచ్చోడన్నారు !

అందుకే వీరికి దూరంగా
నగ్నంగా దోర్లాలని ఉంది
నింగికెగిసే పక్షిలా మారాలని ఉంది !

కృష్ణ మణి   


Thursday, August 13, 2015

కౌగిలి

కౌగిలి
____________కృష్ణ మణి

ఒకప్పుడు నిన్ను చేరుటకు
ఇంతలా కష్టపడలేదు
నీ కౌగిలి ఎంత మధురమో వివరించజాలను !

సాయంకాలం
కొండపైన ఎవరూ చూడకుండ
జీవం గూడుకు చేరే అల్లరిని ఆస్వాదిస్తూ
నీతో గడిపిన కాలం మరువలేను !

నీకై ఎదురుచూసే పని ఉండేది కాదు అప్పట్లో
నీవు నా వెంట పడినట్లనిపించేది తెలుసా
నిన్ను వదిలించుకోవాలని పరుగులు పెట్టేవాన్ని
ఇప్పుడు నా మీద అలకబూని అంతలా ఎడిపిస్తావెందుకు  ...కోపమా !

నిజమే
నీతోనే కదా నా ఊహలు ఊసులు చెప్పుకొనేది
నా బాదలూ....నవ్వులు
మూడో మనిషికి చెప్పలేని
గిలిగింతలూ..... కోపతాపాలు అన్ని నీతోనే
నీ ఒడిలోనే కదా !

నా ఆలోచనలకి సాక్షివి
నీ విలువ తెలిసి
నీకై ప్రతి క్షణం ప్రతి రోజు
కొంత సేపైనా నీ కౌగిలిలో సేద తీరాలని ఆరాటం
దొంగచాటుగానైన !

కాని నా చుట్టూ ఉన్న ప్రపంచం
నీ దరికి రానివ్వడం లేదు
అయినా బాత్రూంలో నీతో నేను కులికినప్పుడు
ఇంకెంత సేపని డోర్ మోది
మనల్ని సిగ్గుపడేలా చేస్తారు
గుర్తొచ్చి నవ్వొస్తుంది !

సరే ఉంటాను
ఎవరో మన కలయికని భంగపరుస్తున్నారు
మళ్ళీ నీకోసం ఎదురుచుస్తా .....
బై బై….‘’ ఏకాంతం ‘’ !

కృష్ణ మణి