Saturday, June 10, 2017

యాదికొచ్చిన సద్ది

యాదికొచ్చిన సద్ది
_________________కృష్ణ మణి  

మాలేస పొద్దయ్యిందని ఉరుకులాట
ఇస్కూల్ పోనీకే
జరమొచ్చి అమ్మపొయ్యి ఎలగక ముందే
ఘనఘనామని బడిగంటలు మొగతయి

గొర్లకాడి మల్లన్న కట్టెకు సద్దోలె
పుస్తకాల తగ్గి సంచి నా సంకకు
ఇల్లుదాటి ఇంత నడిశి
సత్తిగాని ఇంటికాడ ఆగాలె

సోకుల నవాబుసాబు ఇంకా తానం జేస్తుంటడు   
ఆల నాయిన నన్ను జూసి
ఏం ఓయ్     
మీ అల్లునికింత తెలివిజెప్పరాదోయ్
టయానికి లెవ్వడు
మన్నుదిన్న పామోలె మసులుతడు
ఒరలంగ ఒరలంగ
ఇగో ఈడిదాకొచ్చిండు మీ సరింగా

బువ్వగలిపి అక్క
సత్తిగాని నోట్లగుక్కుతుంటే
సద్దన్నం మిగలక
కడుపులెలుకలురుకుతుంటుండే  

ఇద్దరం గలిశి
లచ్చింగాని దెగ్గరికి పోవాలె
ఆడు ఊరవతల సాకలి దుక్నం నడుపుతడు

ఇగరాడు అగరాడు
టయం అయితుంది
సాలింక పోదామని తొవ్వ మర్లితే
ఒస్తడు కష్టవోతు
డొక్కు సైకిల్ మీద ఎనుగంబారోలె మూటలేసుకొని  
ఆనమ్మ తిట్టుడుగానితిట్లు తిడుతుంటే
మమ్ములజూశి నవ్వసాగుతడు వాడు  
ఆ నవ్వుల ఆకలిమోకం ఎలుగుతుంటది  

సాలయ్యింది నడువుబే ఇస్కూల్ రావాని తిడితే
గుండీలు లేని అంగికి కాంటలు వెట్టుకొని మాసరింగ నడిశెవాడు
సదువులమ్మ ఇంటికి

తొవ్వపొంటి శెట్లమీది పచ్చులు పలకరించే పానమైన మనషులను
ఒరాలమీద పరుగులు
ముసురంటిన వరిశేల్ల అందాలు
కప్పలకై పాము పరుగుల అచ్చులు
గమ్మత్తైన పురుగులు
శేన్లళ్ళ అమ్మలక్కల పాటలు
మరువజాలని గుర్తులవి

ఆ ఆటపాటల నడకలు
ఇగజేరెను ఇస్కూలు

కొనకు
ఆ నడకాగలేదు
మా సదువాగలేదు
శెట్టాగలేవు
పిట్టాగలేదు  
శేనాగలేదు
ఊరి చెరువాగలేదు
ఊర్ల ఇండ్లాగాలేవు

పట్నం
ఊరిని మింగి
పానం లేని
సిమెంటు రోడ్లనిగన్నది

కృష్ణ మణి