Tuesday, August 26, 2014

చివరి మాట


________________కృష్ణ మణి
చివరి మాటలో నేను
చివరి పాటలో ఆ తుమ్మెద
కాలం మునిగి
కాలం చెదిరి
కాలం కాటకమై నిశిలో మునిగిన నవ్వులు !
ఇదిగో నేనను పలకరింపులు లేని కల
ఎక్కడికక్కడ సమాధి అయిన జ్ఞాపకాలు
ఏమో గతాల ముద్దులు తిరిగోస్తాయని మౌనం దాల్చిన మైకం !
మనసెందుకో ఐస్ బర్గులా గడ్డకట్టుకుంది
ఏమి తెలియని అడుగుల శబ్దం తనవున దడ పుట్టిస్తుంది
గగనం పగిలి చుక్కల వర్షం వస్తుందని బెదురు !
కాని కాలం
నాది కాదు ఇప్పుడు
ఎప్పుడో చేసాను సంతకం ఏదీ నాది కాదని
అందుకేనేమో కళ్ళు కుట్టుకున్నాయి అహంకారమనే దారంతో !
స్పర్శలేని జీవులు కోలాహలం
అంతా నటన అని చెప్పనవసరం లేని చూపు
కొత్త మనసుల వెతుకులాట నిత్యం
దొరకని ప్రేమల విఫల గానం ప్రతి మదిలో మోగుతూనే ఉంటుంది !
కృష్ణ మణి I 26-08-2014

Wednesday, August 20, 2014

ఆరాటం

ఆరాటం
*********

చెదరని నవ్వుల చెరువు గట్టు
నీ అడుగులని గుర్తు చేసి మూలుగుతుంది
నీ చూపు తగలక అడవి అద్దం నిదుర పోయింది  
నీ స్పర్శ కోసం ఆ గడ్డి మొదలు ఎదురుచూస్తుంది !

నీ ఒడిలో ఆడ
అలసిన డొక్కల లేడి మందల గెంతులు
ఎటు చూడు అల్లల్లాడుతున్నదప్పిక గొంతులు
నీ మెరుపు మెరవక
ఏటి ఒడ్డున పక్షి గుంపుల ఆకలి తిప్పలు   
రాత్రి పగలు తేడా తెలియక
కన్ను ఆర్పని ఎండిన చేపలు
నీ వయ్యారలను చూపిస్తూ
ఆ వాగులు గీసిన బొమ్మలెన్నో !

అగ్గిగుండంలో మోడువారిన మొద్దుల మూగనాదాలు  !
అందం చెదిరి కొండల కోనల గుంతకనుల దిక్కులు !
అధరం పగిలి కారని నెత్తుటి మాడిన దుక్కులు !

కృష్ణ మణి I 13-03-2014





జాగ్రత్త

జాగ్రత్త
____________________కృష్ణ మణి

నిను మొదటిసారి అమ్మ ఒడిలో చూసిన క్షణం
నేపొందిన ఆనందం చెప్పలేనురా
బుడి బుడి నడకల మెత్తటి పాదాలు నా యదపై ఆడగా
దూది పింజలతో కలిసి నా మనసు విహరించిందిరా !

నా వేలు పట్టుకొని నడుస్తుంటే
నలుగురు నను హీర్షగా చూడగా నా కొడుకని గర్వంగా నడిచాను
నువు హోంవర్క్ చేస్తుంటే నా చిన్నతనంలో
పలకపై అక్షరాలు దిద్దిన రోజులు గుర్తుకొచ్చేవి !

బ్యాట్ పట్టుకొని పరిగెడుతుంటే గిల్లి దాoడు
క్యారం బోర్డ్ ఆడుతుంటే అష్టాచెమ్మ ఇంకా చాలానే .....
నీ తుంటరి తప్పులు నా జ్ఞాపకాలను నెమరేసివి
తల్లి లేని కొడుకని గారభమనుకుంటా
అందుకే పెద్దవాడివయ్యాక నీ జీవితం నీకే వదిలేశా  !

నచ్చిన అమ్మాయిని కోడలిగా చూపించావు  ఆశీర్వదించాను
నీ కళ్ళ ముందు ఇక నేను లేను కాని
నా మనవరాలులో మీ అమ్మను చూసానురా జాగ్రత్త  !


కృష్ణ మణి I 26-06-2014

దిక్కుల మొక్కులు

దిక్కుల మొక్కులు
___________________కృష్ణ మణి

ఏం పరిశాన్ల కుసున్నవ్ పాపన్న
మొగులు మీద ఆగమయిన నల్ల తెప్పల కోసమా
నీటి సుక్క కోసం నీల్లెని బాయిల నిలవడ్డట్లుంది కదే !

అరిగోస వేట్టవట్టే ఈ త్యాప వాన దేవుడు
ఏడ సూడు కన్లళ్ళ ఎడారి తోవ్వలె కన్పిస్తున్నై
ఏడ సూడు దుక్కిల నోర్లు తెరిసిన పర్రెలు
ఎండల వెట్టిన ఒట్టి శాపలోలె !

మోల్కవట్టని పత్తిత్తులు ఎండిపోయిన ఒరి నారు
మడిమలల్ల పర్రెలిడిశిన  ఒరంమీది పాదాలు
బొక్కలకంటిన డొక్కలు దూపదీరని కోపాలు
బురద దేలిన బొందలల్ల బతుకుతిప్పల శాపాలు !

కప్పల పెండ్లిళ్ళు
ఇంగలాల గుండాలు
చెయ్యి జాపిన నమాజులు  
కండ్లు మూసిన గంగ కోసం నోర్లు తెరిశిన దిక్కులు
పచ్చ చద్దరు దాపు కోసం కోటి దుక్కుల మొక్కులు !  

ఇంకేప్పుడే పాపన్న ?
   
కృష్ణ మణి I 05-07-2014

  


పేదవాడా !

పేదవాడా !
_________________________కృష్ణ మణి
పేదవాడా !
నా మనసును దొంగలించిన పిరికివాడ
నీ చూపు సోకినప్పుడే అగుపించెను నీ అభిమతం 
కొసరి కొసరి మాటల మర్మం ఎరుగనా పిచ్చివాడ !

ప్రేమ జల్లులో తడిసింది హృదయం
వినిపించావు విరహవేదన
అగుపించావు చిగురించిన పువ్వులా
మదిలో ఎదో మంత్రం నిన్ను నాలో కలుపుతుంది
మాయమర్మం తెలిసిన మాంత్రికుడా
విహంగనయన వీక్షకుడా !
 
నీ రాకకై ఎదురు చూపులు 
యవ్వనం దాల్చిన క్షణము నుండి
ప్రేమపల్లకిలో కొంటె చూపును
దోపిడీ నేర్చిన దొరవు
బంటువై
నా స్వేదామృతం అద్దుకొన వచ్చిన దీరుడా
అగ్గిలో మగ్గదలచిన యోధుడా !

అందుకో జారిన మనసును
పొందుగ దాచుకో కడవరకు
నీ గుడిలో దేవతను
నిరంతరం నీ శ్వాసను
నీ కలల రాణిని
నీ తోడు వీడిన మీదటే నా శ్వాస ఆగు
ఇదేరా నీ చెలి బాస !  

కృష్ణ మణి I 13-06-2014


పిలుపు

పిలుపు
____________________________కృష్ణ మణి

కొత్త పరిమళంతో ఉత్తేజంగా ఉంది మనసు
ఏమో ఒక కొత్త పరిచయం
కొత్త ప్రపంచానికి తీసుకేల్తుందేమో !

కరి మబ్బుల నీడలో తడిసిన వయసును ఆరబెట్టుక కూర్చున్నా
తుంటరి సూర్యుడు తొంగి చూస్తాడని
రెక్కలు విప్పుకొని నిలబడ్డాను
గాలి తరంగాలపై ఊయల ఊగుతూ !

వాగులు వంకలు తడిసి ఎదో వింత అలికిడి
నన్ను గిళిగింతకు గురి చేస్తుంది
వాడిన తనువు పులకరిస్తున్నదని
ఆ చిగురుటాకులు చెబుతున్నాయి !

ఆకలి తీరినా మనసు నిండక తోడుకోరకై అంతా పరుగులు
సొగసులద్దుకొని కొత్త రూపుతో సంబరాలు చెయ్యమని పిలుపు !


కృష్ణ మణి 

నువ్వు నేను

నువ్వు నేను
__________________కృష్ణ మణి

నేనేమనుకుంటానో నీకు తెలియదు కాని
నేనేమంటానో నీకు తెలుసు
ఏమో నీ కళ్ళు నా కళ్ళని వేటాడుతాయేమో !

ఏమో కలవని దారులు కలుస్తాయని నీ ఊహ
కలిసే చేతులు కదలని మనసుల్ని మోస్తాయేమో  !
గగనమైన పలుకుకు నీ వెతులాట నవ్వు తెప్పిస్తుంది
ఒకే చోట ఉంటాము ఒకే చోట కాలం గడుస్తుంది మనది 
ప్రవాహంలో కొట్టుక పోతున్న విడి పడిన ఆకులం !

నా తలపు అంచున ఆరాటం కనులపై తెలుపని వైనం
నా మనసు రాయి అని నీ మనసు చెప్పినది నిజం కాదు
రాయిలా కనిపించిన వెన్నలాంటి మెత్తదనం నాది 
గజి బిజి పాకులాటలో గమ్యం కానని గమనం !

అర్ధం కానీ అమాయకపు మనసుకు అహంకారపు అలంకరణ   
కొన్ని క్షణాలు గడిపిన జ్ఞాపకాలను నెమరు వేస్తుంటాము విడి పడిన క్షణం నుండి !


కృష్ణ మణి I 14-07-2014 

మాసిన పువ్వు


మాసిన పువ్వు
__________________కృష్ణ మణి

ఆకలి కన్నులు ఇద్దరివి కాని భావన మాత్రం వేరులే
మలచిన చేతులు ఇద్దరివి కాని ఒకరి పట్టులో ఇంకొకరు !

చెదిరిన జుట్టు ఇద్దరిది కాని వాడిన పూలు ఒక్కరివే
రగిలిన మనసులు ఇద్దరివి కాని తరగని కసి ఒక్కరిదే !

గుండెల పరుగు ఇద్దరిది కాని ఆగని పరుగు ఒక్కరిదే
అలసిన రక్తం ఒకరిది కాని మసిలే రక్తం ఇంకొకరిది !

మదమెక్కిన కర్కష  నవ్వుల రక్కసి చూపులు
బతుకు భారంతో మాసిబారుతున్న పువ్వులు  !


కృష్ణ మణి I 24-06-2014
 

     

వరద

వరద
_______________కృష్ణ మణి 

రాలని జారని వరదై పొంగని
వాగుల వంకలు బురదై జారని
కొట్టుక పోనీ చిన్నవి పెద్దవి వంకర బుద్దులు
కూరుక పోనీ మెత్తటి బురదలో బలిసిన అడుగులు  !

చెరిగి పోనీ పారే నురగతో కమిలిన మచ్చలు
చెరగని నవ్వుల చెదిరిన బతుకులు
తడవని విత్తులు మొలవని మొలకలు
చిగురిన ఆకుల తొలకరి కాంతులు !

పచ్చని కాంతుల వెచ్చని పుడమిలో
మెరిసే కన్నులు పున్నమి జాతర
పొడచిన శాంతిలో నడిచే లోకం
ఈ సుందర దృశ్యం స్వప్నం కాదని రుజువు కావలె !





౯౪౯౧౦౩౯౦౩ 

కొత్త కాంతి

కొత్త కాంతి
_____________________కృష్ణ మణి

పిడుగుల శబ్దానికి  పిట్టలెగిరే
గాలి హోరులో చీమలదిరే
చినుకు తగిలి లేడికన్నుకు వణుకు పుట్టే
పులుల పన్నుకేమో తిండి దొరకక బిక్కుమనే !

ఆకులన్నీ పచ్చకాంతితో నవ్వులాడే
ఆకు చాటు రామచిలుకలు ఆటలాడే
మబ్బు చాటు భానుడేమో మసకబారే
పురుగుపుట్టా లేచి నిలబడి పరుగుపెట్టే !

వాగు వంక బురద నీటితో స్నానమాడే
ఇల్లుపెరిగి చేప పిల్లల కొత్త కాంతుల అలికిడి 
చల్లని గాలిలో పక్షుల ఆరాట కోలాటాలు
గోదాముల నింపి అలసిన చీమల విరామాలు !

మిడుతల మిట మిట
కప్పల బెక బెక
పాముల బుస బుస
ప్రకృతి కొత్త రూపుఒడిలో
కిల కిల నవ్వుతో మెరిసే జీవనాదం !

కృష్ణ మణి  





సాగరం

సాగరం
______________________కృష్ణ మణి

ఆకాశపు అంచున ఆరేసిన కొంగుపై
మెరిసే కాన్తులెన్నో చూసివద్దామా నేస్తం
చెదిరిన మనసున చీకటి కుంపటిలో
మిణుగురులని వదిలి వద్దామా !

కమిలిన చోట తెల్లని కణాలను ఇచ్చి
మత్తున నిద్రపుచ్చి వద్దామా నేస్తం
గతాల గుద్దులాటలో గతించిన ప్రేమ గుర్తులను
గుర్తు చేసి గుదిబండలను జరిపి వద్దామా !

ఎంతకాలం ఇలా గీతలనడుమ గోతుల తీసి గోడల కట్టడం ?

నడువు లోకాన్ని కలుపుతూ కొత్త దారిలో
నేలపై గీతలను నీటిపై రాతలుగా మార్చుదాం
దింపుదాము అందరిని చేపలుగా తలచి

హద్దులేని ప్రేమసాగరంలో తారతమ్యాలు చెరిపి !     

ఎటో

ఎటో
_____________________కృష్ణ మణి 

పరిగెత్తే పసి వాగుల గమ్యమెటో
రెప్పమాటునా కారే నీటి ఊటలెన్నో
రోడ్డుపై పవళించే మొగ్గవాడే బతుకులెటో
మాసిన గుడ్డలతో పోరాడే చెదిరిన జుట్టెటో
కుప్పలపై కుళ్ళిన కాయల చూపులెటో !

అటో ఇటో ఎటో తెలియని పిల్లగాలుల పయనమెటో
కనికరం లేని కసాయి చూపుల కత్తుల అంచున తెగుతున్న బాల్యలెన్నో !

గత్యంతరం లేని కావడి నడక 
ఇష్టమయిన పాయసం కానీ పాచిన తిండే కరువు
నడిచే దారుల్లో నవ్వే పువ్వుల చూసి మురిసే ఆకలి కేకలు 
దొంగలుగా మారుస్తున్న దొరల అహంకారం
దొంగలుగా రాజ్యదోపిడి చేసి పసి కాంతులను మసి చేసే గుడ్డి సూదులు

గగనానికి నిచ్చేనలేసే గుండెల్లో రగులుతున్న మంటలు
మేమేక్కడికెల్లాలని ప్రశ్నిస్తున్న కరుగే ఐస్ బర్గులు  




ఆకాశం – అమ్మ

ఆకాశం – అమ్మ
_____________________కృష్ణ మణి
నిలబడ్డాను నింగికి తల ఎత్తి
చేతులు చాచి హత్తుకున్నాను
అందినంత ఆకాశాన్ని అమ్మలాగ తలచి !

అవును ఆ నింగే నాకు గుర్తు  
చిన్నప్పుడు తినకుండా మారం చేస్తే  
చెయ్యెత్తి చందమామ రావే అని పిలిచేది అమ్మ !

బహుశా .... నాకే కాదు మొత్తానికి ఆకాశం అమ్మ అనుకుంటా 
చనుపాల వర్షం కురుపిస్తుంది !

పొగ మంచు జారి గడ్డి మైదానం మెరవగా
పసి పాపను ముద్దాడిందని ఆనందం
పూట పూటకు మారే నింగిలో రంగుల చూసి ఆటలాడుతుంది లోకం
వెలుగుతో పాటు పరుగులు పెడుతూ !

పొద్దు తిరిగి మసక చీకటి తొంగి చూపుతో
ఇల్లు చేరుమని సైగలు చెయ్యగా పరుగులు పెట్టే జీవకోటి
మనసున సుందర ముద్రలు అద్దెను !

నల్లటి పరదాపై మిణుకు మిణుకు మనే చుక్కల దోబూచులాట
కన్నుల పండగే కదా
తల్లి ముసి ముసి నవ్వుల అందమే కదా
అలసిన తనవును సేద తీరుమని చల్లని గాలితో జోల పాడును కదా !

పసి మనసులని మురిసిన ఆ కౌగిలిలో
కన్నా బిడ్డలే విషం చిమ్ముతుండే ఆ వేదన వర్ణనాతీతం
అందుకేనేమో అప్పుడప్పుడు ఆదిరిస్తూ ఉంటుంది
అతి తెలివి ముర్ఖులమైన మనలను ఎర్రని క్రోద చూపుతో !

తనలో రగిలే విశ్వ గోళాల విలయాలను అదుముకొని
బేదం లేని నిర్మల గుణం ఉన్న నింగే అమ్మకు ప్రతిరూపం
అవును నాకు ఇద్దరమ్మలు  కాదు మనకు !

కృష్ణ మణి I 15-07-2014





అతుకుల బొంతలు

అతుకుల బొంతలు
____________________కృష్ణ మణి

చిగురు తొడిగిన ఆకుల వింత పరిమళం
ఎదో మరచిన జ్ఞాపకాలను నిదురలేపుతుంది 
చిటపట నిప్పుల సెగలో వేగిన మక్కబుట్టలు
బాటసారికి ఆకలి మంటను పుట్టిస్తున్నాయి !

మురుగు పారి స్నానమాడిన డాంబరు నేల
నడకకు కొత్త ఊపు తెచ్చింది !
ప్లాస్టీకు కవరు తొడిగిన అద్దె గుడిసెలో బిక్క బతుకులు 
చుక్క రాలితే బాగుండని ఒక పక్క
చుక్క రాలితే సందులోంచి నింగి ఎక్కిరింతల నవ్వులు మరో పక్క !
ఈ రాత్రి గడవనని కునుకు పట్టని ఆకలి గుండెల తొక్కిసలాటల !

నడి బాజారున తడిసిన కూరల కుప్పలు
పొద్దు దిగినా  పొద్దు దిగని దిగులు దిక్కులు
పారే పాయలో తేలె కాగితపు నౌక
అడ్డుతగిలిన కర్రముక్కను ముద్దాడింది
వరద పెరిగి విడి పడిన క్షణకాలపు ప్రేమలు !

వలచిన నగరం మరచిన తరుణం
పొట్ట కూటి కోలాటాలకు వేదికై
చినుకుతో చింతలు తీర్చి
వరదతో నరక ద్వారాలను తెరిచింది !

కృష్ణ మణి  I 16-08-2014  





చినుకు

చినుకు

చినుకు రాలే ప్రకృతి పాట పాడే
పురి విప్పి చిందులేసే గగనమైన చుక్క కంట తడిపే
పడిలేచిన వాగుల గెంతులాడే పురుగు పుట్టా  
దూపదీరని మట్టి నేడు మరిమలాల మత్తు జల్లే !

పొట్ట పగిలి వేరు అంటి ఆకు జోడు తొంగి చూసే
ఎండిన ఈపు మీది బురద జారి కాంతులాడే
కన్ను కారిన జీవితాన కన్న కలలే నేల మొలిచే
కారు మబ్బుల జాతరలో లోకమంతా మురుసిపాయే !

గొడ్డుగోదా ఒళ్ళు మరిచి  చింత దీరి హాయి పొందే 
కొండగుట్ట నీరు అంటి పచ్చ రంగు ఒంట బట్టే
చెట్టుచేమ నిండుకొని చిగురుటాకులు నవ్వులాడే
ఊరువాడ నాగలెత్తి సాలు గీషి విత్తు పెట్టె !

ప్రతి ఏడూ ఈ పొద్దులు జరుగునిక జాతరే
ప్రతి మదిలో పులకరింత ప్రకృతి పాదం మోపేనే !    
 

కృష్ణ మణి I 09-07-2014 

ప్రకృతి ఒడి

ప్రకృతి ఒడి
 _______________________________కృష్ణ మణి 
చేతులు చాచి కొండ అంచున నిలబడి
తెల్లని మేఘ చారాల నీలాకాశానికి చూసాను
ఆ నిర్మల దృశ్యం చిరునవ్వుతో నను పసిపాపలా హత్తుకొంది !

ఏటిగట్టున చేతికర్రతో పచ్చని తామరాకులను జరిపి చూసాను
చిట్టి పొట్టి చేపలు నను మిత్రునిగా తలచి దోబూచులాడాయి !

పచ్చని చెట్ల మధ్య గంధర్వ నాదం చేస్తున్న
ఆ కోయిల గొంతు నా ఏకాంతానికి తోడై మాట్లాడింది !

ఓ ఉడుత ఓ కుందేలు ఓ లేడి ఓ తుమ్మెద
నా కనుల ముందు నవ్వుల పువ్వులు పూయించాయి !

ఆ నీడన అలసట తీరుతుందని వెన్ను వాల్చాను
చల్లటి పిల్ల తెమ్మరలు పసిపాపగా చేసి జోల పాడాయి !

సకల జీవం ఇల్లు చేరే వేల అస్తమించే సూర్యుని ముందు
కొండాకోనల కునుకుపాటు నను నిద్రపుచ్చింది !

Krishna mani










నిశి అద్వైత సంగమం

నిశి అద్వైత సంగమం
__________________కృష్ణ మణి

ప్రేమ వర్షంలో తొలకరి మొహమాటం
కలవని కన్నుల దోర చూపుల కోలాటం
వణికిన తనవుల అదిరిన పెదవుల ఆరాటం !

దించిన తల హత్తుకుంటాడని ఉబలాటం
దరి చేరిన క్షణాన ఆగని గుండెల దరహాసం
వేడెక్కిన బరువెక్కిన యద అల్లరి చెలగాటం !

మెరిసే చెక్కిలి పొందిన ప్రేమకు ఉపమానం
నిశి అద్వైత సంగమం  ఇది శాశ్వత గమనం !

కృష్ణ మణి I 17-07-2014




జారుడు బండలు

జారుడు బండలు
___________________కృష్ణ మణి

గడిచిన గతాల మరుగు మాటలకు సమాది కట్టుమని మది చెప్పింది
ఎండిన అడుగున నీరు చేరి సాగుకు నాగలెత్తమని బంజరు నవ్వింది !

ఆ బూరుగుచెట్టు ఆకు తొడిగి
దశాబ్దాల గాట్లకు సాక్షినని ధైర్యంగా నిలబడింది
డంగు సున్నం కరిగి
కోటలు బీటలయ్యి అన్యాయానికి సెలవన్నది !

ఆగని పరుగున ఆరని మంటలు
చల్లబడి గమ్యం చేరి
ఆనందాన కన్ను గార్చినవి
కొలనుల కమలాలు విచ్చుకొని
చీకటి మాసిన వెలుగులో మురిసినవి !
 
కొత్త లోకం
కొత్త పోకడ
కొత్త తంతు
పాత లెక్కలను ముక్కలు చేసినవి 
అరిగిన రాళ్ళే నునుపు తేలి
రేపటి పిల్లల జారుడు బండలయినవి !

కృష్ణ మణి I 20-08-2014