Monday, January 29, 2018

ఆకలి రక్తం

ఆకలి రక్తం
_______________కృష్ణ మణి

మిత్రులారా
పదండి ముందుకు
కాని ఒక్కసారిగా వెళ్ళి కుప్పకూలకండి
కొందరు కొందరుగా వెళ్ళండి

మన యుద్ధం కడుపునింపుటకు మాత్రమే కాని
కడుపు శోకానికి కాదు
మన జీవనాధారం వాళ్ళు
కావునా
కాసింత సున్నితంగా పొడవండి

ప్రత్యర్ధికి తెలిసినన్ని విద్యలు మనకు తెలియవు
చాలా తెలివైన వారు
వారి శరీరాలను తూట్లు పొడిచి
ఎంత రక్తాన్ని తాగినా
వారి తెలివిలో కొంతనైనా పొందలేకపోతున్నందుకు
చింతించాల్సిన విషయం

కాలకేయుని సైన్యలా
మన వికృతరూపం
వారిని భయపెడుతుందనుకుంటే
మనలను ఎదుర్కునే క్రమంలో
అడ్డుతెరలను కట్టి కులుకుతూ
మనలను పిచ్చి వాళ్ళను చేస్తున్నారు
అవమానంతో కూడిన అసహనం మనది

వారి ఆయుధ సంపత్తి
మాములుగా లేదు సుమా !
రసాయనిక ఆయుధాలను కొన్ని
జెట్ వేగంతో ప్రయోగిస్తారు కొందరు
మరికొందరు
విద్యుత్ ఘాత ఆయుధాలను సమకూర్చుకొని
ఎదురుదాడి చేస్తూ
మనవారిని భస్మం చేస్తున్నారు

మిత్రులారా
ఆకలి పస్తులతో
మన జీవణ పోరాటంలో
మనకున్న మేధస్సు
తెలివికే తెలివితేటలు నేర్పే మనషుల మెదడుతో సరితూగదు

పదండి వారికి దూరంగా
అక్కడెక్కడో
భారీ జంతు సమూహాల రక్తం వాసన ఊరిస్తుంది

కృష్ణ మణి

Tuesday, January 23, 2018

మనసును జయించాడు

మనసును జయించాడు
________________________కృష్ణ మణి

తన అమాయకత్వం
ఎప్పుడు నవ్వుతూ
ఎదుటివారి మనసును స్పర్శిస్తుంది
తన అభిప్రాయం
ఎల్లప్పుడూ ప్రశ్నిస్తుంది
తన ఆవేశం
అగ్నిపర్వత విస్ఫోటనం

తను మాట్లాడితే
అహంకారానికి వణుకుపుడుతుంది
తనోక మనిషి రూపంలో ఉన్న
పారదర్శక ప్రపంచం

సూర్యుడు ఉదయిస్తాడని భ్రమించే మనకు
అస్తమించని స్నేహం

అతను అతనే
అతనెవరికి విరోధి కాడు
నిరంకుశానికి తప్ప

అతడే నర ఈశుడు
మనందరి ఆప్తుడు

కృష్ణ మణి

Monday, January 22, 2018

మనిషితనం

మనిషితనం
_____________కృష్ణ మణి

మతం గొప్పని
లోకానికి మన మతం దిక్కని చెప్పే ఓ పెద్దలారా
చెప్పున్ని
ఒక్క మాటడుగుతా
చెప్పున్రి

చెప్పు బాపణయ్య
మన మతమెంత గొప్పదో
గుడిల పూజలు నువ్వు జేస్తెనే పలుకుతడంటగదా
స్పర్శ లేని రాయి దేవుడు
మా కన్నప్ప బీరప్పలకు పిలవరాదు గదా నీలెక్క
మమ్ముల జూసి ఇషీషి అంటవు గానీ
మా పోషమ్మ కాడ పైసలొస్తయంటే
పిర్రలుగొడతవు కదా సామీ

అందరమొక్కటే అయితే
మా పోరడు నీఇంటి అల్లుడెందుకుగాడో చెప్పు సామీ

చెప్పు పటేలా
మా రెడ్డి సాబు.... ఓ రాజవర్మ
ఓ నాయుడప్పా చెప్పు
ఇప్పటికీ
ఊర్ల నీ పెత్తనమేనా ?

చెప్పు
కుమ్మరి కమ్మరి మంగలి చాకలి
డక్కలి బ్యాగరి మాల మాదిగలందరూ
నీ బాంచనలేనా ?

చెప్పు
మీ పిల్లతరానికి గూడా ఇషం నింపి
కులం గుంపులు కట్టిపిస్తున్నవుగా బాంచన్

మీ తాతకు
మీ అయ్యకు
నీకు‌ పనిబాటలొల్లమేగా
మీ ఉపాది ఓటర్లమే్గా ?

మా సౌకబాసం వడ్డీలకేనా 
అసలు కోసం
రేపు నీ కొడుకుకు గూడా ఊడిగం చెయ్యాలెనా ?

అందరమొక్కటే అయితే
మా పిల్ల మీ కోడలెందుకు గాదో చెప్పు దొర

మీమేది తినాలెనో మీరే చెప్తరా
మీమేది గట్టాలెనో మీరే గీస్తరా

చెప్పున్రి
ఒక్కటవుదమంటే అవ్వనీకే
ఏండ్లకేండ్లు ఎదురుసూస్తున్నం
ఇంకెంతకాలం సూడాలెనో చెప్పున్రి ?
ఎంతగనం భరించాలెనో చెప్పున్రి ?

కులం గోడలు కూలితేనే
మతం గోడలు గట్టిగుంటయి
మతం గోడలు కూలుతేనే
మనిషి బతుకు సక్కగుంటది

చెప్పున్రి
ఏమన్నా తప్పు జెప్పి
గుండెల తన్నిన్నా
చెప్పున్రి

కృష్ణ మణి

Tuesday, January 9, 2018

నవ్వలేని పువ్వులం

నవ్వలేని పువ్వులం
______*****______

నా కన్నులు వెతుకుతున్న ప్రేమ తనేనేమో !
ఆ కన్నుల చూపు ఈటళ్ళా మనసుకు గుచ్చుకొంటున్నాయి
అతను అలా అలవిరిసిన గాలి వలే
నాకు దగ్గరగా కదులుతూ ఉంటే
ఎదో మత్తు అవహించి సోలి పడ్డాను

తనకు కొండల్లాంటి భుజాలు లేవు
సింహం లాంటి నడక లేదు
పులి లాంటి కంఠం లేదు
గర్వపడే ఎత్తు లేదు
నాపై హిమాలయాలంతా ప్రేమ తప్పా

ఐశ్వర్య రాయ్లా
కన్నులతో ప్రేమ వర్షం కురుపిస్తున్నాడు
సున్నితమైన చేతి ముని వేళ్ళ స్పర్శ
చక్కిలి గిలి పెడుతుంది
ఆ పలకరింపు
ఎన్నో జన్మల బంధాలను ఒక్కసారిగా తట్టి లేపింది

ఈ జీవితం
తనదేనని... తనతోనేనని
నిర్దారణ అయ్యాక కూడా
ఒక సంశయం వెన్నాడుతుంది
సమాజాన్ని ఎదిరించి నిలువగలమానని

సాహసించలేని ఒక నిస్సాహాయ స్థితిలో
ఎంతకాలమని దాపరికిపు సాంగత్యం మాది
మనుషులుగా కలిసి బతకని జనాలు
మనసులలో కలిసే బతికే మాపై ఆంక్షల సంకెళ్ళా ?
తెంచుకునే తీరుతాం
బరితెగించి తిరుగుతాం

మేమూ
మీ కడుపుల పుట్టిన పిల్లలమే గాని
అందరిలా బతకలేని పువ్వులం

కృష్ణ మణి

పైలం కొడుకా

పైలం కొడుకా
_________________ కృష్ణ మణి

అవ్వ .. బువ్వ తిన్నావే ?
ఇంక లేదు కొడుకా
మా కొడుకు కోడలు మనమడు
నా మనమరాలింట్ల పుట్టిన్రోజు దావతంట
పగటిల్లనంగ పోయిండ్రు
తొమ్మిది గొట్టవట్టే ఇగరారు అగరారు

నువ్వోలేవానే మరి ?

నడువ శాతనైతాదొసు
ఉండజాలక పోయినా ఆడ
నా కోడల్ని యాష్టవెట్టినట్లైతది
ఈడుంటే ఇల్లు ఖయమైన అయితది

అట్లనా
ఆల్లొచ్చందాక కడుపు కాల్సుకుంటావే ముసల్దానా
మాఇంట్లదింత పంపిస్తా తిని నిదానంగావే
ఎప్పడిదాకుంటవిట్లా

వద్దుగాని సల్లంగుండు కొడుకా

కూరబువ్వకోసం ఎదురుసూస్తున్నావే
మూటగట్టిస్తదబానా నీ మనమరాలు

కాదు పిల్లగా
ఏం జెప్పాలే నీకు
కన్నపేగు ఊకుంటాదయ్యా
ఇల్లుజేరిందాక గుంజుతనే ఉంటది
కండ్లల్లవడితే యదార్తమైతది

నిజమవ్వ
మా పోరగాడు పొద్దు దిగంగనే ఇంటికొస్తుండే
ఇంకా రాకపాయే

కొలువెక్కిండా నీ పెద్ద పోరడు ?

ఆ ... ఆ పొద్దెనే
పోయిన యాడాది

ఎండ్ల జెయ్యవట్టే ...పిష్కంత పోరడు ?

పట్నంల ఆచుమెను కొలువంటా
జీతంబెరిగితే ఈ ఎండకాలం పిల్లనుదెస్త ఆనికి
అగో ఊర్లబస్సు వొచ్చినట్లుందే
మావోడు మీవొల్లందరొస్తున్నరు కలిశే
ఓ మల్లన్నో ... దావత్ మంచిగయ్యిందానే

మంచిగయ్యిందన్న
తింటివా ?

ఆ . అయ్యిందన్న వస్తా
వస్తనే అవ్వ
ఇంతదిని పండుకో

మంచిది కొడుకా శీకట్ల పైలం

కృష్ణ మణి