Tuesday, January 27, 2015

పిచ్చోడి చేతిలో కత్తి


_______________________కృష్ణ మణి

పచ్చటి వనంలో వెచ్చని గువ్వలు ముద్దుగ ఒదిగి
నిండైన చెట్టుకు అలంకారమై అలరిస్తుండగా
అలసిన మనసులు చేరువై తేలికై
ఈ క్షణం మరో క్షణం ఇలా కలకాలం నిలవాలని పరితపిస్తున్నాయి !

డేగలు నెమళ్ళు డ్రాగన్లు పాములు పులులు  
అడవిన ఆడుతూ ప్రక్రుతి పండుగ చెయ్యగా
నిర్జీవాలు సైతం గాలిని ఆసరా చేసుకొని పాట పాడుతూ
మనమంతా ఒక తల్లి పిల్లలమని గుర్తు చేస్తున్నవి !

సముద్రాన చేపలు రొయ్యలు పీతలు ఆక్టోపస్లు
తమ ఆనందాన్ని అలల ద్వారా కేరింతలు కొడుతున్నాయి
ఎడారిన ముళ్ళపొదలు ఓడలు ఇసుక రాళ్ళు
మూగ సైగలతో మురిసిపోతున్నాయి !

మంచు దుప్పటి అంటిన లోకం
స్వచ్చమైన మనసుని వెతకనక్కరలేదని
కుప్పలుగా చేరి కివీలు గానం చెయ్యగా
సీళ్లు దుప్పిలు ఎలుగుబంట్లు నాట్యమాడి నవ్విస్తున్నాయి !

ప్రకృతిలో సమస్తం మనషిని ఎంతని ఆనందపరచని
అహంకారమే అలంకరణ చేసుకొని అందరికి పెద్దన్ననని
పాయసం లాగి విషాన్ని చల్లుతూ లోకాన్ని ఉద్దరిస్తానని
రాజ్యం మత్తులో కత్తులు తీసి తనను తానె పోడుచుకొంటున్నాడు .... పిచ్చివాడు !


కృష్ణ మణి I 24-01-2015       

నేనెవరిని


_________________కృష్ణ మణి

నిలువుగా పెరిగే పైరుకు అడ్డంగా వీచే గాలిని
పల్లానికి పారే నీటికి ఎత్తుకు ఒరిగే నేలను !

నింగిని తాకే నీటిని
కొండను పిండే బలాన్ని
పొంగే బావికి ఊటను  !

నిత్యం కాసే చిగురుటాకును
ఎండిన తోటలో ముల్లపోదను
పొదిగే గుడ్డుకు గూడును  !

పారే నీటికి దారిని
సంద్రం తొలికె అలను
నీటికొండలో వెలుగుని !

అలసిన కంటికి నిద్రను
ఆకలి తనువుకు తిండిని
అలిగే మనసుకు తోడును !

మరువని దెబ్బకు కసిని
మురిసే పువ్వుకు బంధువుని
మాయని గాయానికి మందును !

నేనెవరిని
నేనెవరిని .....!

కృష్ణ మని I 26-01-2015



Thursday, January 22, 2015

గాయిదోన్ని


_________________కృష్ణ మణి

దొర నీ కాల్మొక్కుతా బాంచన్  
బుడ్డోన్ని సదువుకొన పంపిస్త దొర
తెలివిగల్లోడు నీ పేరు జెప్పుకుంటడు ....!

అన్న జీతగాని వీపుల 
చర్లకోల దెబ్బల రక్తం మరకలే మిగిలే .....
సదువుకొన వోను పన్ను కట్టాలే....!

గాయిది కష్టం జేసే జీతగాడు ఎట్ల గడతడు 
గాయిదోని కొడుకు ఒకనాటికి మల్ల గాయిదోడే 
కాదన్నోడు ఆ దొర గాని గడీల మగ్గాలే ......!

బాటన కాలు కదలి తాత రుమాలు జారే      
గడిశిన కాలం యాదికొచ్చి కన్నుగారే
గడీల పోగరుకు పాకురంటి నేలకొరిగే
పొదలు మోలిశి పాముల గుడిసెలయ్యే !

మైల కాలం మారక అడుగున మురిగుంటే
ఇయ్యాల నేను గిట గాయిదోని మనువన్ని
ఇంకా దొర కాలు ఒత్తే దూదిపింజనే
మెడమీద నెత్తి లేని ఇంకో గాయిదొన్నే !

కృష్ణ మణి I 28-01-2015



వెలుగు చాటు చీకటి

వెలుగు చాటు చీకటి
____________________కృష్ణ మణి

LED బుగ్గల కాంతిలో లాంతరు వెలుగు
చీకటి నడకన దీపం కరువు
గుడ్డి మనసులకు మెరుపుల అలికిడి !

హహాకారాలకు చెవిటి చూపులు
ఆటవిడుపుల రాజ్యపు కోటలు
అంతుచిక్కని కసాయిల వేటలు
అర్ధంకాని ఆకలి దీనులు !

చంద్రుని తెలుపులో తడసిన లోకం   
కాని ... చంద్రుని మచ్చలో దాగిన దొంగలు
కొత్త రకం మైకంలో కాలం పరుగు
రంగు నోట్ల కట్టల మూటలు బీదల వీపున మాయం
దొంగలే దొరలై లోకాన్ని చెరబట్టే శని తాండవం ఖాయం !

ఏది మెరుపో ఏది మెరుగో
తెలియని చిత్రపు మాయ
కాలం పరుగున చివర పాలే మిగులునో లేక నీరే మిగులునో .....!

కృష్ణ మణి I 20-01-2015





మనసు మెరిసిన వేళ


____________________కృష్ణ మణి

గోడకు ఉరేసుకోన్న జ్ఞాపకాలు
దుమ్ముతో నిండి ఇప్పటి స్తితిని ఎక్కిరిస్తుంటే
చిట్టి అలను తన్నే పెద్ద అల బరువుతో ఒడ్డును అద్దుకొన్నట్లు
నవ్వుకొంది మనసు !

జ్ఞాపకం చేసుకున్న ఒడ్డు మీద పరకలను  
చెప్పు తెగిన బడి అడుగులు
చెప్పలేని ఆకలికి దాహంతో సర్దుకొని
దోస్తుల ముందు బడాయి మాటల బీరాలు !

వొరం బురదై అడుగు పడవలా జారితే
వేసుకొన్న తెల్ల చొక్కా భూమిని ముద్దాడగ  
అమ్మ గుర్తొచ్చి కళ్ళలో వాగు జారిన క్షణం !

ఇసుక తిన్నలు నింపుకొన్న పక్క విధి వాకిలి  
వెన్నల చలువలో ముగియని ముచ్చట్లు
తినే సమయాన అమ్మ పిలుపులు నాన్న అరుపులు !

ఎంతకీ వోడువని నాయనమ్మ సుద్దులు  
నడూర్ల ముసలి యువకుల సరసపు విసుర్లు
తెలుపు అంటిన మెరిసే కన్నుల  పచ్చని మనసుల నవ్వుల తోటలు !

దులిపే కొద్ది మదిలో మెదిలే జ్ఞాపకాల పువ్వులు
మెరుపుల్లాంటి స్మృతులు నింగి నుండి నీటి చుక్కలవలె
పారెను కన్నుల లోతులో ఉద్వేగపు సెలయేరులు !

కృష్ణ మణి I 22-01-2015  

   
      



Sunday, January 18, 2015

డిశ్చార్జ్

డిశ్చార్జ్ 
______________కృష్ణ మణి 

మనసు బ్యాటరి డిష్చార్జ్ అయిపొయి మూలుగుతుంది 
ఎవరైనా చార్జ్ చెయ్యవచ్చు నిండైన మనసుతో  
నిత్యం శోకమై జీవితం జాలిపాటలా వినవస్తుంది చిరాక్ సాంగ్   !

పసిపాప నవ్వు కూడా మనసున శాంతిని పూయించట్లేదు ఎందుకో 
భారమైన ఆరాటాన బయటి ప్రపంచం చిన్నచూపుకు సిగ్గేస్తుంది 
ఎదో వెకిలితనం వెంటాడుతున్నట్లు !

రోడ్డుపై ఎగిరే లేయ్స్ ఖాళితనం ఎక్కిరిస్తుంటే 
ఆకలి మొహం చాటేస్తుంది  
బాందవ్యాలు పక్క మరలి చూస్తున్నాయి అక్కరకోస్తాడా అని !

ఏమో ... కొన్ని రోజుల వనవాసమేమో.... 
బతుకునింగిలో ఆశల చుక్కలు మెరవాలంటే 
మన చుట్టు మేలు కోరువారుండకపోతారా 
నవ్వుల చినుకులయ్యో మమతల వసంతాలయ్యో !

ఆలోచనల సుడిగాలిలో కొట్టుకపోతే ఎట్లా  
కష్టాల సుడిగుండాల్లో కూడ ఈదుకోచ్చే ఒడుపుండాలి 
పైకి తేలే చైతన్యం రావాలి 
నువ్వే నీ చుట్టు లోకాని అక్కరకొచ్చే చుట్టానివి కావాలి !   

కృష్ణ మణి I 19-01-2015

Monday, January 12, 2015

గత్తరు చెమట


_____________________కృష్ణ మణి

చాక్లెట్ మామిడి అరటి ఇంకా అన్నం కూరలు
అన్నీ కవర్లల్ల ఇంకొన్ని కుల్ల పడున్నయ్
తిననీకే కాదు అవన్నీ తొక్కలే
ఎత్తి పారబొయ్య నడి తొవ్వల మూల మీద !

రోజుకింత కూలి ముక్కుకింత బట్ట
ఆడోల్లవి మొగొల్లవి చెప్పవశం కాని గలీజును కూడా ఎత్తాలె
కడుపు నింప చెత్త గంప !

రోగం నొప్పులు లోకం పట్టదు
ఏలేటోనికి అసల్ ఉండడు
చీము నెత్తురు అన్చుకొని కలియబడి బొర్లాడాలే !

కాంట్రాక్టరంటోడికి కనికరం లేదాయే
PF అని ESI అని మనిషిమీద వెయ్యి జమాని చెప్పి
పెయ్యినోచ్చి ఏర్గబెట్టి మందులకుబోతే
దొంగ కార్డు ఇదాని బయటికి నూకుతెగాని దెల్వదు అసల్ కత !

అద్దుమ రాతిరి పట్నం నిద్రబోయిన కాడ 
రోడ్లు మురువంగా కన్నబిడ్డలను కడిగినట్లు
భూతల్లి సేవనుకొని భూమికి భారమైన బతుకులు మావి !

మనుషుల మురికిని కడిగే గత్తరు చెమటలం
ఊరునిడిషి రోడ్డెక్కిన కునుకెరగని శేను కూలీలం !

కృష్ణ మణి I 02-01-2015


   

చలి సరసంగుంది


_________________కృష్ణ మణి

చలి భలేగుంది
రోమాలు నిక్కపొడుచుకొని వెచ్చని మంటను వెతుకుతున్నవి
సంక్రాంతి సూర్యున్ని త్వరగా రమ్మని
పొగమంచు అద్దుకున్న పుడమి వణుకుతూ
కడలి కెరటంలా పగలుకై ఆరాటపడుతుంది నిత్యం

చలి మరీ చల్లగుంది
మడుగున అడుగు పడక పరుగులు తీస్తుంది జీవం
గూట్లో పిల్లి వలె ఒళ్ళు ముడుచుకొని ఎండలో పండగ చేసుకుంటుంది
అదేదో లోకం స్తంభించిన భావం యదలో !

చలి బాగుంది
రేపటి వేడిని తట్టుకోలేరని నిన్నటి వర్షం భరించలేరని
నేటి చల్లదనం దక్కక దప్పిక తిప్పలు తప్పవని
ఓర్చుకొని దుప్పటి ముసురుకొని
తన శ్వాసనే తనకు వెచ్చని సెగ మంటై జోలపాడుతుంది మనసు !

చలి సరసంగుంది
తోడుకై పరుగులు పెడుతూ
విరహావేదనతో గడచిన గొడవల మనసులు చల్లబడి 
మెరిసిన కన్నులు మత్తును వోంపగా ఇదే సైగగా తలచి
ఒడిచేరి ప్రేమను పంచుకోను కార్యంలో సకల జీవం సుఖంగా ఉంది


కృష్ణ మణి I 11-01-2015   

నాకో పాట కావలి


_______________కృష్ణ మణి

నాకో పాట కావలి
ఆకాశంలోంచి ఒక చినుకు రాలడానికి
కరిగిన మనసున తొణికిన దుఃఖం కను జారడానికి
గడచిన కాలాన పూసిన పూల సువాసనను జుర్రడానికి !

నాకో మాట కావాలి
ఒంటరిగా ఒడ్డుపై నిల్చున్న మనషి సేద తీరడానికి
జనసంద్రంలో నీటిబోట్టునై బతుకు పడవను మోయడానికి
చరిత్రలో దాగిన నిజాన్ని బయట చెప్పడానికి !

నాకో బాట కావాలి
ముల్లపోదలను దాటి పూల కొలను చేరడానికి
ఉప్పునీళ్ళను విడిచి మంచినీళ్ళను పొందడానికి
నిత్యనరకాన్ని మార్చి స్వర్గ ద్వారం చెయ్యడానికి !      


కృష్ణ మణి I 09-01-2015 

ఏకత్వం


____________________కృష్ణ మణి
తల్లి కడుపున పుట్టిన కొడుకులు
ఆప్యాయతలు మరచి ఆస్తి కోసం
కొడుకుల నడుమ యుద్దమే జరిపితే అది ఏకత్వం ఎలా అవుతుంది ?

ఊర్లో కులాల మధ్య కుహనావాదులు
అస్తిత్వం అంటూ అంటురోగాలు వ్యాప్తి చెందించి
ఆ వాడలో మంటలనంటిస్తే అది ఏకత్వం ఎలా అవుతుంది ?

మనసులో గజ్జి కలిగి దురదతో 
ఇది నాది అది నీది అని అగ్ని ధారలు కురిపించి
మనషుల నడుమ బేదాలు రగిలిస్తే అది ఏకత్వం ఎలా అవుతుంది ?

దేశంలో మతాల ముచ్చుకేలిలో మూర్ఖులు
నాది గొప్ప నీది చిప్పా అని చాందస పాండిత్యం పొంగి పొరలి
తలలు వేరు చేసి బుల్లెట్ల వర్షం కురిపిస్తే అది ఏకత్వం ఎలా అవుతుంది ?

ఈ ప్రపంచంలో ఒకే రంగు మనషి లేడు ఒకే బాష లేదు
ఒకే సంస్కృతి లేదు ఒకే ఆచారం లేదు మరి అందరోకటే
కాని ఇవ్వన్నీ వేరు అంటే అది ఏకత్వం ఎలా అవుతుంది ?

మతానికొక దేవుడుంటే మానవత్వం లేదని అర్ధం
అవును అది నిజమే అందుకే
అప్పుడప్పుడు ఒక మూలాన నోబెల్ ఇచ్చి నిరూపిస్తారు !
   

కృష్ణ మణి  I 24-12-2014 

శాశ్వతమా....


________________కృష్ణ మణి
1
ఆ పువ్వు
రెక్కలు విప్పుకొని ఆహ్లాదంగా గాలి తెమ్మరలతో ఆటలాడుతూ
నలుగురి దృష్టిని దోచేస్తూ నవ్వులు పూయిస్తుంది
పున్నమి వెన్నలలో పుత్తడి కాంతిలా
ఇది శాశ్వతమా .... అంటే
క్షణమైనా ఇచ్చే సుఖం చాలు నా జన్మకు అంటోంది గర్వంగా !
2
ఆ వాగు
నిండుగా పొర్లుతూ ఒడ్డున గడ్డి పోసలను ఊపేస్తూ
సకల జీవాన్ని ధరి చేరుమని గల గల శబ్దంతో పిలుస్తుంది
అంతం లేని ఆకాశంలో మోగిన గజ్జల గలగలలా  
ఇది శాశ్వతమా .... అంటే
ఒక పూటైన కడుపు నింపితే చాలు ఈ సారికి అంటోంది గర్వంగా !
ఆ వేణు కర్ర , పురుగు తొలచి నిత్య గానమై పాటపాడుతూ
అలసిన ప్రకృతిని తన శబ్దంతో జోల పాడుతుంది
తేనెపట్టులో మత్తునిచ్చే తియ్యటి తేనెలా      
ఇది శాశ్వతమా ....అంటే
ఒక చోటైన నా పాటతో కోయిలకు పోటినిస్తానంటోంది గర్వంగా !


కృష్ణ మణి I 27-12-2014