Thursday, November 26, 2015

చెక్కబొమ్మ

చెక్కబొమ్మ
__________________కృష్ణ మణి

ఆమె అలా వెల్లకిల పడుకుంది నరాలను బిగపట్టి
తనతో జరుగుతున్నదేదో తనకు తెలియనట్టు
మాంసపు ముద్దపై జరుగుతున్న ఇష్టపూర్వక బలత్కారాన్ని
గోడపైన చూసుకుంటున్నది ఆయాసంగా

వాడు పిసికేస్తున్నాడు రబ్బరు బంతులన్నట్టు
వాడు కొరికేస్తున్నాడు
గాట్లు పడి చుక్కకు చుక్క తోడై రక్తం వరదవుతుంది
తానిప్పుడు ప్రాణమున్న చెక్కబోమ్మే

కను సుడిగుండంలో
తన్నుకొస్తున్న కెరటాలను అదుపు చేసుకుంటున్నది
రంపపు కోతను అలవాటుగా అనుభవిస్తుంది
కూతురి కాలేజ్ ఫీజు గుర్తొస్తూ ....

వాడు జుట్టు పట్టి లాగుతున్నాడు
తనేదో ఆటవస్తువైనట్టు
డబ్బు జల్లుతున్నానని ఆహంకారమనుకుంటా
వాడి కళ్ళలో అసహనాన్ని విషంతో సమంగా తాగుతుంది

స్ఖలించి
పక్కమరలి గుర్రుపెట్టాడు వాడు
ఋతుచక్రపు రక్త దేహాన్ని ఈడ్చుకుంటూ లేచింది
ఆ .. అవమానాల బతుకు చక్రం

సదురుకున్న గుడ్డలను మోకాళ్ళ వరకు ఎత్తి
మునివేళ్ళపై నడిచింది
వణుకుతూ బాత్రూం గడియపెట్టి కూలింది
ఏకాంతమే ప్రశాంతమైనట్టు
ఎవరు చూడకుండానే కుములుతుంది అలవాటైనట్టు

గుర్రుసాబు నిద్ర లేచి
బొర్ర నిమురుతూ తలుపు నెడితే తెలిసింది
ఆ ప్రాణం అక్కడే కొన ఊపిరితో కొట్టుకొని విడిచిందని
గమ్యం చేరని పరుగులో నేలరాలిని కుసుమాలలో ఒకటని

కృష్ణ మణి

Wednesday, November 18, 2015

అక్షరం – ఆయుధం

అక్షరం – ఆయుధం
_________________కృష్ణ మణి

కుబుసాన్ని ఇడువుమంటే
ప్రసవ వేదనే అవుతుంది అహానికి
అక్కడ పుట్టేది ప్రేమ కాదు
మళ్ళీ అహమే !

అహం చావని గుణాలు మసలుతాయి
గొడ్ల చావడిలో దోమలా
అక్షరం ఎత్తిన బడుగులు
రాజ్యం ఎరిగి
కవాతులు చేస్తూ కస్సుమంటుంటే
బుస్సుమని తాచులు  
మెల్లగా మాటేసి కాటేస్తున్నాయి !

ఇప్పుడు
చర్యకు ప్రతి చర్య భౌతికమే
మానసికం కాదు
ఎదిగిన తలలు
ఒదిగిన తలలకు అక్షరాలను ఆయుధంగా ఇవ్వాలి
కత్తులు కక్షలు కాదు మిత్రమా...!   

అప్పుడు ఆహాలన్నీ దిగి ఆలింగనం చెయ్యక తప్పదు 


కృష్ణ మణి 

జోంబీస్ అటాక్

జోంబీస్ అటాక్
__________________కృష్ణ మణి

జుగుప్సాకర డస్ట్ బిన్ లా  
చెట్టుమీది బోజలా
కొందరి మందమతుల ఆలోచనలు  
వారికి సోకిన జబ్బే ‘’జోంబీస్ అటాక్’’  

వారి మాట విని
జోంబీస్ గ్రూప్లో శామిల్  అవ్వాలి
లేదంటే రోశంలేని చవటనీ 
ఆ వర్గం వాడివనీ 
పిచ్చంటూ
పరువు తీస్తారు !

ఇప్పుడు అంతటా ఇలాంటి గుంపులెన్నో .....!

కొందరు
తప్పని స్తితిలో నలుగురిలో మెలగాలని  
విషాన్ని నింపుకుంటారు కల్మషం లేని మనసులో
టైరులో గాలిని నింపినట్టు

మెదడు మసకబారి
ఒకరి మనసుని ఒకరు కరిచేస్తూ సాగుతారు  
అర్ధంకాని ఆవేశంతో  
అంతమెక్కడో తెలియని ముళ్ళ దారిలో

భరించలేని ఒత్తిడిలో బద్దలవుతారు ఒకచోట
తామేంటో
నిజమేంటో తెలిసి
సిగ్గుపడి  చిన్నబోతారు !    

ఆ బద్దలయ్యే క్షణం కోసం నిరీక్షించాలి 
మానవత్వం నిండిన మనషులుగా
అప్పటిదాకా మన చుట్టూ ఈ ‘’ జోంబీస్ అటాక్ ‘’ తప్పదు మరి !


కృష్ణ మణి     

నానో తళుకులు

తళుకులు

1

చెరువు
మెరుపు
కరువు
మలుపు

2

పొగరు
తగదు
జగడం
జేజేలు

3

నరకం
నగరం
శునకం
షికారు

4

దేహం
స్మశానం
కైలాసం
మానసం

కృష్ణ మణి  

Sunday, November 15, 2015

పిశాచ వల

పిశాచ వల
_________________కృష్ణ మణి

మనిషి మనిషిగా గుర్తించని మూర్ఖుల మధ్య
కులమని
మతమని ఏడిచి చచ్చే
పిచ్చి మతుల మధ్య నిలబడి  
ఏం సాదిద్దామని ఈ ఆరాటం
 
మనిషిని చంపటమే ధ్యేయమని
మనిషికి భయాన్ని రుచి చూపించి
లొంగదీసుకొని ఒక వర్గం చాందసాన్ని లోకానికి రుద్దడమంటే
నీది ఎంతటి కటువైన మనసు !

రాయి అయినా కరుగుతుందేమో అగ్ని పర్వతం బద్దలైనప్పుడు !
కాని , నీ మనసెందుకు ఇంతలా ముదిరింది  
ఎవరు చెప్పారో చెప్పు
ఎతికి అడుగుతా లోకం చుట్టి
ఎక్కడ రాసుందో చెప్పు కనీసం
మత గ్రంధాలను తిరిగేస్తా
నీ దాష్టికానికి మూలమేదో తేలుతుంది

తలను కోసే నిన్ను మనిషివని నేననుకోను
మత్తులో జోగే చలనం లేని మెదడుతో నీవు
ఎంతటి దుర్మార్గానికైన వెనకాడవని తెలుస్తుంది

నువ్వు మారుమని నేనడగను
అడుగమంటే మాత్రం చావమంటాను
అవును ముమ్మాటికి చావమంటాను
మానవత్వం బతుకుతుందని మెరిసిపోతాను
ఈ భూమికి భారం తగ్గుతుందని మురిసిపోతాను


కృష్ణ మణి  

చివరి కొడుకు

చివరి కొడుకు
_______________కృష్ణ మణి

వీడు
ఏ ధర్మాన్ని ఆచరించాలో చెప్పు
ఏ బట్టకట్టాలో
ఎలాంటి తిండి తినాలో  
అదీ ... ఎలా తినాలో చెప్పు

సమాజంలో ఇప్పుడు వీడు
ఒక ఆనాదలా కంటతడి పెడుతున్నాడు  
వాడు రాలుతున్నాడు
కరెంటు తీగలపై ఒంటరి పిట్టలా !
  
మనషుల మధ్య మమతల కోసం వాడు
గుండె మండి గుడి గంట కొడుతున్నాడు
దర్గా మెట్లెక్కి ‘’యా అల్లా’’ అంటున్నాడు
చర్చికెళ్ళి రోదిస్తున్నాడు ‘’జీసస్’’ అని

వాడిప్పుడు పరాయివాడు
ఎవడూ మావాడనరు వాన్ని

వాని కళ్ళలోకి చూస్తే
మన మనసు పెద్దగా దర్శనమిస్తుంది
వాణి మాటల్లో ప్రేమ ఒలుకుతుంది   

వాడు
పరిగెడుతున్నాడు
ఒలంపిక్ కాగడలా చేతిలో దివిటిని చేతబూని
మనం మనుషలమని
మనలోని అందకారాన్ని తరిమేద్దామని

మానవత్వానికి చివరి కొడుకు వాడు
వాడు చస్తే లోకం చచ్చినట్లే
అప్పుడు
మనిషిని బూతద్దం పట్టి వెతకాలి    
అప్పుడు
మనిషిని బూతద్దం పట్టి వెతకాలి    


కృష్ణ మణి   
  

తరాల వర్షం

తరాల వర్షం  
_______________కృష్ణ మణి

నీ చనుమోనలతో ఆటలాడినప్పుడు తెలియలేదు
బక్కచిక్కిన ప్రాణం నా ఆకలి తీర్చుటకు ఎంత బాధను వోర్చావోనని

ఆకలి చాలక
నీవు అస్తికలా మారుతున్నావనీ   
నేనెరుగను
ఏది ఏమైనా
ఆ క్షణం నా కడుపు నిండాల్సిందే

పాలపల్లు
కసితీరా కొరికితే
నీ కల్లోల సముద్రపు ఆగాధంలోంచి తొనకిన తొలుకులు నాకగుపడలేవనుకుంటా
కొత్తగా ఉప్పుఇనుముల రుచి ఒకటి వెచ్చగ నా నాలుకను తాకింది  
అది ఎర్రటి నీ చను రక్తమని తెలియదప్పుడు
భరించిన నీవెంత గోప్పనో అప్పుడర్దం కాలేదమ్మా .....
ఇప్పుడు
భరిస్తున్న నా దేహాన్ని చూస్తే అర్ధమవుతుంది


కృష్ణ మణి 

Wednesday, November 11, 2015

కాలం పరుగు

కాలం పరుగు
_________________కృష్ణ మణి

ఈ నిమిషం మరో నిమిషం
కాలం నడుస్తుంది
అది ఆగదు ఎప్పటికి
నీ గమనమే తడబడుతూ అలసిపోతూ తూలిపోతూ సాగిపోతుంది  

చుట్టూ ఉన్న సమస్తాన్ని ఆక్రమించడమే విధి అనుకునే ముర్ఖుడవు
సహజంగా నీవొక ఆహంకారివి
తెలివిని గెలిచినా తెలివరినని భ్రమపాటు  
ఒక జీవి మరోజీవికి బతుకుపోరులో ఆకలవుతుంది
అలకవుతుంది
పరుగవుతుంది
పానుపవుతుంది
నవ్వవుతుంది
ఎడుపవుతుంది
నీడవుతుంది
గోడవుతుంది
గొప్పవుతుంది
చివర ఏమవుతుంది నీకు మాత్రం లోకువవుతుంది
కాని ఎన్నటికి నీవు మాత్రం కాలం వెనుక పరుగువే

కరిచిన గడ్డిని గూడుగడుతుంది పిచ్చుక
వేటాడిన జీవిని పిల్లలకు ఆహారంగా ఇస్తుంది పులి
ఇంతకు మించి చేస్తున్నదేదో చెప్పు నిజాయితిగా !

కృష్ణ మణి

    

Tuesday, November 10, 2015

చీకటి వెలుగు

చీకటి వెలుగు
_______________కృష్ణ మణి

చీకటంటే సుఖం
చీకట్లో బతికే ఏ జీవైనా వెలుగును చూస్తె భయం
ఎక్కడ తమ అసలు రూపం బయటపడుతుందోనని గుబులు కాబోలు
వెలుగుకు చీకటికి ఎప్పటికీ వైరమేమో !
రెండూ పరస్పరం విరుద్ధం
రెండూ లేకపోతే లోకం శూన్యమే
నిజంగా మనం గుడ్డివాల్లమే
మనం అంధకారంలో మసలే మోసగాల్లమే
వెలుగును పంచె కత్తులను వొంచే దొరబాబులమే.... దొరసానులమే ...!
వెలుగు ప్రగతికి ప్రతీక
చీకటిని మోసే దొంగల రాజ్యపు బానిసలమే మనమంతా ....!

కృష్ణ మణి

  

Tuesday, November 3, 2015

కవిగాన్ని

కవిగాన్ని
______________కృష్ణ మణి

నాలో ధారగా ఎదో  రాలుతుంది
అది అవేశామా
ఆనందమా
ఆవేదనా తెలియదు
వాగులో కొట్టుకుంటున్న ఆకులా ఉంది నా స్తితి !

మబ్బులు తొలిగి తొంగి చూస్తున్న సూర్యున్ని వెచ్చటి వేడిని హత్తుకొని
మసక లోకం మురుస్తున్న వేల
నాలో ఎదో కొత్తదనం ఆవహించింది !

విత్తు పగిలి చిగురిస్తున్న చిట్టి ఆకులా
మనసులో కొత్త పులకింత నాలో ఉత్సాహాన్ని పెంచుతుంది
చీకట్లో నక్షత్రం మెరిసినట్లు !

నాకోసమే ఎదో దాయబడినదని తెలిసి
ఎలా ఉంటుందోనని ఉబలాటంతో
కునుకు తియ్యక కాలంతో పోరాటం చేస్తున్నాను !

అడుగులు వడివడిగా పడుతూ
దాపరికం ఇంకెంతసేపని నర్మగర్భంగా అరవాలని ఉంది
అది ఎలా ఉన్నా నాకు గొప్ప అనుభూతే
ఈ ఉత్కంట ఎంత కాలం ఉంటె  అంత ఆనందమేమో నాకు !

ఇప్పుడు నేను ఊహల రెక్కలతో ఊరేగుతున్న భైరాగిని
నలుగురిలో ఎందుకు నవ్వుతున్నానో తెలియని పిచ్చివాన్ని
అవును నేను వెర్రివాన్ని
తెలియని విషయానికి తల్లడిల్లే పసివాన్ని
నిత్యం ఎదో సత్యం వెతుకుతూ తిరిగే యాత్రికున్ని
నేనో సాదకుడిని
సమయాపాలన తెలియని ఊహా చిత్రకారున్ని
నేనో కవిగాన్ని !  


కృష్ణ మణి   

Monday, November 2, 2015

గమ్యం

గమ్యం
_____________________కృష్ణ మణి

నాదే కులమని అడిగాడో మిత్రుడు 
నాదే కులమైతే నీకేంటి
ఏ మతమైతే ఎవరికేంటి
ఎవరెటు పొతే నాకేంటని అరిచాను !

మానవత్వం కుప్పకూలుతుందనే ఆలోచన వెంటాడుతుంది 
తోయబడ్డాను అగ్నిఖిలల సుడిగుండంలోకి    
ఏడవడమే మిగిలింది
ఎందుకేడవాలో అర్ధం కావట్లేదు ఈ కసాయిల వనంలో !

నీవు పలానా వాడివైతే కచ్చితంగా చాందసుడివని 
పలానా కులమైతే కుసంస్కారివనంటున్నారే

ఈ భూమి మీద పుట్టేటప్పుడు
మా అమ్మను అడగాలా
తనదే కులమని
మా నాన్నను అడగాలా
తనదే మతమని
నీ మూర్ఖత్వం అదే ప్రశ్నిస్తే 
చచ్చే ముందే రాసిపెడతాను
ఇదే కులంలో
ఇదే మతంలో
మళ్ళీ పుడతానని !

నా అభిప్రాయం నీకు భారమైతే 
ఏముంది
కలసినప్పుడు తల తిప్పుకుంటావు
లేదా అసహ్యించుకుంటావు
ఏమవుతుంది 
చివర నీది గోదారని మురిసిపోతావు
నాదీ అడ్డదారని నవ్వుకుంటావు !

ఏ దారి ఎటన్నా పోనీ
చివర ఒక గమ్యం ఉంటుంది
అది సముద్రమో లేక మురుక్కాలువో
చేరిన తర్వాత తెలుస్తుంది నీకు నాకు !
  

కృష్ణ మణి