Tuesday, May 13, 2014

పటేలా !



మొగులుమీదినుండి దిగొచ్చిన
సందమామలెక్కున్నవు పటేలా ఈ తెల్ల బట్టలల్ల
ఏడ లేడు నీయసొంటి దొర
నడుస్తే పెద్దేనుగులు పండికోక్కోలె ఉరుకుతయి సందులెంట
బాంచెన్ దొర నీ కాళ్ళు మొక్కుత !

మాలెస పొద్దుకు ముందే
మీ ఇంట్ల తల దించెటోళ్ళం పటేల
మాతోలు పీకి చెప్పులు కుట్టిస్తం దొర
షేరు గుంజాలకు గులాంలము పటేల
పేరుకు మల్లయ్యను మీకాడ మాదిగి మల్లిగాన్ని దొర !

కడుపుకి కష్టం దప్ప ఇంకేమిలే మాదొర
మీ సుఖాలను జూసుడే మా సుఖం పటేలా !
దేవునివి పటేలా
నీ బండి సప్పుడికి చెప్పులిడిషి
పెయ్యోన్చుతం పటేలా !

నీకిమ్పైతే మా ఇంట్లోళ్ళు పక్క పాన్పులే దొర
కన్నేర్రజేస్తే కాటికే పోతం పటేలా
ఒగనికష్టం ఇంకోగరం సేప్పుకుబతుకుతున్నం దొర
పగాని ముచ్చటలేని పసిపోరాలం పటేలా !

అని పల్వరించే మా తాత నిద్రమత్తుల
మరువని మచ్చలు యాదికొచ్చి కుములుతున్నడు
ఆ రోజుల్ల నేనుంటే తేజాబ్ కత్తినైతుంటి !
కృష్ణ మణి I

   

పిచ్చివాణ్ణి


**********

నేనేంటో నాకేతెలియని గమనం
గమ్యం తలియని కాలచక్రంలో బందీని
నా చుట్టూ అంతుపట్టని వింత లోకం !

అందరు నా వాళ్ళే
నేనెవరికీ కాను
కలల్లో కన్నీళ్ళే కార్చే పిచ్చివాడిని
ఆప్తుడెవరో తెలియని అనాదని
శత్రువెవరో కనలేని అజ్ఞానిని !

అందరిముందు అడవిలో అజ్ఞాతవాసిని
కరుణలేని కసాయి ఎడారిలో దాహం తీరని నడకను
పరుని కష్టం నాదైతే మరి నా కష్టం ఎవరిదీ ?
నడకసాగని బరువుతో తీరం అందని అభాగ్యున్ని !

నే పెరిగిన కాడ అందరికి అయిన వాణ్ని
నే తరిగిన కాడ ఎవరికీ కానలేని వాణ్ని !


కృష్ణ మణి I 21-04-2014   

ఇంకోటి లేదు


***********
ఒక చెట్టులో దాగి చూసా
పక్కవాడి కడుపు నింపడంలో ఉన్న సుఖం ఇంకోటి లేదు !
కోతిలో చేరి  చూసా
కొమ్మలంచులో ఊగే సుఖం ఇంకోటి లేదు !
ఒక పాములో దిగి చూసా
ఒళ్ళు చుట్టుకొని మత్తున పండే సుఖం ఇంకోటి లేదు !
ఒక పక్షిలో ఎగిరి చూసా
లోకాన్ని చిన్నగా చూసి మురిసే సుఖం ఇంకోటి లేదు !
సాగరంలో మునిగి చూసా
సాధ్యమైనంత ఎక్కువగా ఒదగడంలో ఉన్న సుఖం ఇంకోటి లేదు !
ఒక పందిలో ప్రవేశించి చూసాను
బురదలో ఉన్న సుఖం ఇంకోటి లేదు !

చివర ......మనషిలో తొంగి చూసా
పక్కవాడిని తొక్కడంలో ఉన్న సుఖం ఇంకోటి లేదు !


కృష్ణ మణి  I 19-04-2014  

కోరిక


*****
పుంటికూరలో రొయ్యలను కలిపి తినాలని ఉంది
జొన్న రొట్టేలో పులసచేపను నంజుకోవాలని ఉంది
పోలెల్లో పూర్ణం బదులు బందరు లడ్డు పూతరేకులను పెట్టాలని వుంది
అంబలితో సంకటిని కలిపి మేక మాసంతో లోట్టలేయ్యాలని ఉంది !

అన్నదమ్ములతో కలసి కడలి  తీరానా
ఇసుక తిన్నలపై బొమ్మరిల్లు చేసుకొని ఆడాలని ఉంది
శ్రీకాకుళం అడవిలో జీడి గింజలను ఏరుకోవాలని ఉంది
అరకు కొండల్లో చలి కాచుకోవాలని ఉంది !

రాజమండ్రిలో వేదం చదవాలని ఉంది
కోనసీమ కొబ్బరి నీళ్ళను తాగుతూ
పచ్చని కాంతులను మనసున బందించాలని ఉంది
బెజవాడ అంచున కృష్ణమ్మ నడకలను చూడాలని ఉంది 
కొల్లేటి సరస్సులో వలస పక్షులతో మాటకలపాలని ఉంది !

అహోబిలం అడవిలో ఒంటరినై
వన్యమృగాలతో ఆడుకోవాలని ఉంది
శ్రీహరికోటలో PSLV కి తోడుగా వెళ్ళి
భూగోళాన్ని చేతుల్లో పట్టి ముద్దాడాలని ఉంది
తిరుపతి ఎంకన్న కొండను కాలినడకన వెళ్ళి 
ప్రకృతి అందాలను కాంచాలని ఉంది

కృష్ణ మణి I 18-04-2014   






సుక్క బొట్టు


***********

మొగులు మీద మన్నువడ
ఒక బొట్టునన్న ఇడువదాయే !

పగిలిన నెర్రలమీద పొక్కిలి పెంకలాయే
ఎదురుసూపుల కండ్లళ్ళ నెత్తురు జీరలాయే
చెట్లకొమ్మల ఆకలికి ఆకుల అరుపులాయే
పసి నవ్వులు మానిన లోకం ముసలిదాయే
మొగులు మీద మన్నువడ
ఒక బొట్టునన్న ఇడువదాయే !

అడవి జాతర మాని బొందలల్ల నీటిపోరులాయే
వలసజీవులకు దిక్కుతోయక పీనుగుల పీకుడాయే
సుక్క నీళ్ళకు గద్ద సూపుకు ఎండమావుల నవ్వులాయే  
బలిసిన దున్నల డొక్కల బొక్కలు బయటికాయే
మొగులు మీద మన్నువడ
ఒక బొట్టునన్న ఇడువదాయే !

అడవిరాజుల బలముడిగి జింకపిల్లల చెలిమిలాయే
నల్లతాసుకు తోవ్వదక్కక కన్నపిల్లలె ఆకలాయే
అడుగుజరగని మొసలి కాళ్ళకు గట్టిబురద అడ్డమాయే
ఎండగొడుగున గడ్డి ఏర్లకు దూపదీరక తిప్పలాయే
మొగులు మీద మన్నువడ
ఒక బొట్టునన్న ఇడువదాయే !
  

కృష్ణ మణి I 15-04-2014 

పిశాచి



‘’నేనొక ప్రేమ పిశాచిని
నేనొక మానవకాకిని
నా హృదయం మండింది
నేనిడివా ఎవ్వరిని ........నేనొక ప్రేమ పిశాచిని ‘’

అని గొంతెత్తి అరవాలని ఉంది
మా నాన్న ఎక్కడ వింటాడోనని చెయ్యడ్డం పెట్టుకొని
కసితీరా అరిచా బాత్రూం మూసి ఇంకో చోటులేక
మిడిల్ క్లాస్ కుటుంబం కదామరి
నాన్న టైలర్ అమ్మ కుక్కర్
తమ్ముడు ఇంటర్ చెల్లి పది
మరి నేను డిగ్రీ డిస్కంటిన్యూ
బైక్ మెకానిక్ లో మెగాస్టార్ ని !

ఇంటర్ పిల్ల కైనటిక్ హోండా
చెలిమి కోసం తంటాలు పడి బైకు ముందు కటింగులు
కష్టానికి మెచ్చి ఇచ్చింది మనసు
కాదు కాదు లాకున్న ఎంటపడి
సినిమాలు షికార్లు అంతా మామూలే !

పెళ్లి చేసుకుందామని అడిగా యాదగిరి గుట్టపై
ఎలా పోషిస్తావు సినిమాలకే అప్పు చేసేవాడివి అని
ఫారన్ మొగుడికి ఆశపడి అడ్రసు అమెరిక అయ్యింది
ఇంకేముంది మిత్రులే శత్రువులై అప్పుల గొడవలు
ఇంటిదాకా వ్యవహారం
అమ్మనాన్నల అసహ్యపు మాటలు
తమ్ముడు చెల్లి వెకిలి చూపులు !

యవ్వనానికి అర్హతలు ఉండాలా
స్నేహానికి హద్దులు ఉండాలా
అర్ధం కాని అవమానంతో రగులుతున్న మనసుకి ప్రశాంతత ఎక్కడ
ఆదరించే ఆత్మలు అంతమైతే మనషిగా నిలువలేని నేను పిశాచినే
అవును నేను పిశాచినే
నేను పిశాచినే
హ హా  హ హా ...........


కృష్ణ మణి I 11-04-2014

నల్ల కుసుమాలు


**************

పొద్దిమీకింది
కష్టంలో మునిగి తేలిన మసి పువ్వులు
పక్కూరు అంగట్ల గుమ్మిగూడిన్రు
భుజమ్మీద సంటిది
సంకనెక్కిన సంటోడు !

బ్యారమాడుకుంటా బస్తనింపిన ఆలుమోగలు
పోరగాల్ల చేత్తుల్ల శనగ పొట్లాలు
అలిగిన పెండ్లానికి సీస కల్లు తెల్ల మురుకు
దూపదించి తోవ్వవట్టే నల్ల కుసుమాలు !

పరాషకాల బెరుకు మాటల సింగారాలు
కయ్యమాడిన రామచిలుకల బతిమి రాగాలు
గుడిశె మూషి ఒళ్ళు మర్శి
మల్ల దినానికి తొంగి సూపులు !

కృష్ణ మణి I 04-04-2014



మనసు


**********

నా మనసు అలల తాకిడికి నడి కడలిలో దిగింది
అంతుపట్టని ఆలోచనల సుడిగుండంలో గమ్యం చేరని నిర్జీవిలా  
చేపల ఆకలికి ఆహారంగా కనిపిస్తుంది !

ఆకాశంలో గద్ద చూపులకు గురిగా మారాను
నిశి రాత్రి అడవి సింహాలకు లేడి పిల్లలా దిక్కు తోచక తిరిగితిని
పెద్ద పులి కామ చూపులకు బలినై నిలచితిని
గాలి హోరుకు తెగిన గాలి పటమై ఎగిరితిని
కొనజేరిన జీవితపు క్షణాలని గుండె కార్చిన నెత్తుటిలో మునిగితిని !

తల్లి చూపుకు దూరమైతి  
తండ్రి యదపై భారమైతి
దూది పింజకు నీరు తగిలి అడుగు బడితి !


కృష్ణ మణి I 02-04-2014 

ముప్పు - తప్పు


**************
భూమాతకు దయ కలిగి తన బిడ్డకు చోటునివ్వదా !
ఆకాశం కనికరించి నా తనువుకు దాపుగా ఉండదా !
నా గోసకు గంగ మనసు కరిగి చుక్క కన్నీరొంపదా !
ఆ గాలికి జాలి కలిగి పరిమళ మత్తులో నాకు జోల పాడదా !
ఈ అగ్గికి గుండె కదలి నా ఒంటికి కోన వరకు తోడై సాగదా !

చేసాను ముప్పు అది క్షమించరాని తప్పు
వీరుణ్ణి  శూరుణ్ణి  పరాక్రమున్ని అని
అంతా నా వశం గోరి
గతి తెల్వక మతి లేక
నా చుట్టు కంచే పరచి
లోకాన్నే ఒంచ దలచి
చేసాను ముర్ఖున్నై
గొప్పలకు దాసున్నై
గోతిని తోడి మురిసితి అహంతో
పోసుకుంటి మట్టిని నిండా పిచ్చితో !

తల మాత్రమె మిగిలింది చేతులు కాళ్ళు ఆడక
ఇప్పడు వచ్చింది మెదడులో మెరుపులా అసలు జ్ఞానం
ఏమని ఏడ్చుదు
ఏమని నవ్వుదు
ఏమని మొక్కుదు
ఏమని అడుగుదు
పంచభూతాల సృష్టిని నేను
తల్లి ఒడిలో బిడ్డను నేను

తలదించి నిల్చుంటి మోము చూపని సిగ్గుతో
కనికరించి చూచునని ఆశలేని ఆశతో !


కృష్ణ మణి I 28-03-2014

చెత్త బతుకు


***********
చేతిలో మొల గుచ్చిన కట్టే
సంకకు సంచి తెగిన చెప్పులు 
సుడ సక్కని పకీరులం
మాలెసపోద్దుకు మునుపే
లోకానికి బరువైన సొత్తుకై  
ఉరుకులాట ఎక్కువ
బతుకులను నింపడానికి !

కుక్కల పందుల సహచర్యం
ఆకలిడోక్కల ఆరాటం  
పాషిన వంటలు  మురిగిన పళ్ళు
పారేశిన కుప్పల అధికారులం !

ఇనుము ప్లాస్టీకు కాగితాలు
ఇవే కదా ఆధారం
ఇదే మా జీవితం  
విసిరిన వస్తువు కంటికి ఇంపు   
మంచివి చెడ్డవి అన్నీ మావే
బరువును పెంచుతూ ఆశలు అల్లుతూ
రేపటి రోజుకు చెదరని చూపు !

తక్కువగాని చెత్త
నోయ్యని కాలు
పగలు దాటితే సాగని నడకలు
చేరని తీరం దించిన మూటలు
అమ్మిన కష్టం అందిన సొమ్ముతో
మొఖాన ఆరని వెలుగు మురిపెం !

లోకం మురికిలో మసలే ముల్లుజల్లలం
బతుకు అడవిలో నిత్య వేటగాల్లం !


కృష్ణ మణి I 26-03-2014  

అక్షర సమిధ


***********
అక్షర సమిధను
నే ఓటమి ఎరుగని ఆయుధాన్ని
ఆకాశానికి భూమి పైన మెరిసే చుక్కను
నిరంతరం జన ఘోషకు ప్రతిద్వనిని
జన జాతరలో ఉద్యమ పాటను !

పగిలిన గుండెల రూపుకు ప్రతిరూపాన్ని
కమ్మరి కొలిమిలో బొగ్గుల క్రింది గాలి తిత్తిని
రాజ్యహింసను అనుచుటకు లేచిన ఉగ్రకెరటాన్ని
జనుల కన్నీళ్ళ తుడువ మెత్తటి గుడ్డను
చీకటి నడకల తెల్లటి చొక్కాలపై సిరా మరకను !

బలసిన దున్నల ఎటకారపు ఓరకంట చూపుకు
వేటగాడి చేతిలో బాణాన్ని
శూలంల గుచ్చుకుంటా !

నున్ను ఆర్పే సాహాసం చేసే రాజకీయ కీచకుల్లారా
మీ ఊపిరితిత్తుల స్పంజులు పగులుతాయి జాగ్రత్తా !
మీ భోగం క్షణికం
నా వెలుగు
నిత్యం
సత్యం
అనంతం
నిరంతరం
మీ  అంతం తప్పదు !

నా వెలుగు తాకని చీకేటి ఎక్కడా ?
లోకం చూపును ఆపే బలమేక్కడ ?
నేనొక అక్షర సమిధను !


కృష్ణ మణి I 24-03-2014   

కష్టకాలం


పక్కోడి కళ్ళలో కష్టాల్ని చూసాను
అవి నాకేసి నవ్వుతున్నాయి
నాకున్న వాటితో పోల్చితే ఇంకా పెద్దవని అహం !
నా అంత దురదృష్టవంతుడులేడనే నేను
పక్కవాడిని ఓదార్చి
అదృష్టవంతున్నని మురిసిపోయాను !
                                       
చిరిగిన బట్టల్లో నలిగిన మనసులు
పురుగుల మందులతో పార్టి చేసుకొనే మొనగాళ్ళు
పుస్తకాల చెలికాడి పిచ్చి ముదిరిన మాటలు
పెంటకుప్పలపై పసికూనల కూతలు !

చిల్లర దక్కని బిచ్చగాడి బిక్క చూపులు
సిగ్నల్ పడ్డా అమ్ముడుపోని జాతర
పట్ట పగలైనా ఖాళి కాని ఇడ్లి గిన్నెలు
స్కూల్ గేటు పక్కన ఎండిన సంత్రాలు !

ఎత్తైన భవనంపై అలసిన ఇసుక సంచులు
ఫారిన్ బూట్లకు కుట్లు వెయ్యలేని సూది   
తిరగని చక్రం కదలని కుండలు
బొగ్గుల కొలిమిలో నిండిన దుమ్ము !

కష్టానికే కడుపోస్తే పుట్టేది ఏంది ?


కృష్ణ మణి    

తెలియని లోకం



గగన శిఖరాన్ని ఎక్కాలని
కాని ఏ దారిలో ఎంత దూరం పోవాలో తెలియదు
తామరాకుపై నీటి బిందువునై తిరగాలని
కాని గాలివాటానికి ఆకు ఒంగుతుందేమోనని భయం
భూగోళం మధ్యలో జరుగు విలయాన్ని చూడాలని
కాని ఎలా వేళ్ళాలో తెలియదు
పువ్వులో పడుకోవాలని
కాని తేనెటీగ వస్తుందేమోనని భయం
కొబ్బరిలో నీటినై ఒదగాలని
కాని గమ్యం చేరే దారి తెలియదు
తెప్పలపై తేలియాడాలని
కాని నన్ను మోస్తాయో లేవోనని భయం
ఎదుటివారి మనసును చూడాలని
కాని ఏ గాజు వాడలో తెలియదు

తెలియని లోకంలో పయణం
అడుగడుగునా భయం !

కృష్ణ మణి I 10-05-2014







ఆరాటం


*********

చెదరని నవ్వుల చెరువు గట్టు
నీ అడుగులని గుర్తు చేసి మూలుగుతుంది
నీ చూపు తగలక అడవి అద్దం నిదుర పోయింది  
నీ స్పర్శ కోసం ఆ గడ్డి మొదలు ఎదురుచూస్తుంది !

నీ ఒడిలో ఆడ
అలసిన డొక్కల లేడి మందల గెంతులు
ఎటు చూడు అల్లల్లాడుతున్నదప్పిక గొంతులు
నీ మెరుపు మెరవక
ఏటి ఒడ్డున పక్షి గుంపుల ఆకలి తిప్పలు   
రాత్రి పగలు తేడా తెలియక
కన్ను ఆర్పని ఎండిన చేపలు
నీ వయ్యారలను చూపిస్తూ
ఆ వాగులు గీసిన బొమ్మలెన్నో !

అగ్గిగుండంలో మోడువారిన మొద్దుల మూగనాదాలు  !
అందం చెదిరి కొండల కోనల గుంతకనుల దిక్కులు !
అధరం పగిలి కారని నెత్తుటి మాడిన దుక్కులు !

కృష్ణ మణి I 13-03-2014

బర్రె తోడు


********
కాలువవతల నేను నా బర్లు
వానలకు మొలిశింది లేత గడ్డి
తలకాయల్లేపని మూగమనసులు 
చిగురు కొయ్య చింత చెట్టు కొమ్మల్లో నేను !

కూరకు శల్లల మూటగట్టి
కడుపు నింపితి
తీపి పులుపుల సంగమం
ఒగరు నిండిన నోరు
అంతలనే యదకొచ్చిన బర్రె అరుపు
పరుగుబెట్టె దున్నపోతు కోసం !

అర్ధం కాని పెండకడోన్ని  
దమ్మువట్టి ఎంటవడితి పత్త దెల్వక పరిషానైతి
అయ్య యాదికొచ్చి కండ్లు కారవట్టే
దెంకబోయిన బర్రె తోడ ఇంటికి రాకపోతే ఈప్బలుగుతదని !

ఏమిజేతు ఎట్లజేతూ అని గుండుమీద ఎడువవాడితి
బాలి తాత నవ్వవట్టే నన్ను జూసి
ఏమిరా పిల్లగా నీ బర్రె జోరుమీదుందని
ఎక్కిల్లనాపి ఎడుందని అడిగితె జెప్పె
పక్కూరి మందల తోడుగడుతుందని !


కృష్ణ మణి I 25-04-2014    

వికృతి


******
ప్రకృతి మోడువారిన క్షణాన నా కంట కారేది నీరేనని మురిసిన మనసు
ఆ చుక్కలని పట్టి ఒక మొక్కకన్న నింపలేనా కడుపునని
రగిలిన గుండె
ఎండిన చర్మం
పగిలిన కాళ్ళు
ఆరిన చమట
రాలిన ఉప్పు !

ఇలా మానవులు హహాకారాలు చేసి
కార్చిన నీళ్ళను బిందెలో నింపి ప్రకృతి పాదాలను తడపినా
కరుణించని తల్లి
కసాయి సూరీడు !

ఎడారి నడకన ఎండమావుల పలకరింపులు
క్షణానికైనా మదిలో సంబురం !
బొగ్గుల కొలిమిలో బతుకు నడవక
బూడిదలో దాగిన ఆశ !

చేసిన పాపము చెడని పదార్దం
చినుకు జారక ముందే మదిని తెరచి దాచుము విత్తు
కొనజేరిన జీవనాడికి పచ్చని పందిరి అల్లుము మొద్దు !


కృష్ణ మణి I 27-04-2014