Wednesday, December 27, 2017

బిత్తర చూపులు

బిత్తర చూపులు
__________________ కృష్ణ మణి

ఇంటర్వెలుకు స్కూల్ బంకొట్టి
మార్నింగ్ షోకి టికెట్లు దొరకక
ఆకలికి మాడుతూ
మ్యాట్నీ షో చూసే కన్నులకేం తెలుస్తది
ఆ సినిమా మాజా

దోస్త్ కోసం ఇరాని హోటల్లో
కప్పు కింద చాయి ఎండినంతసేపు
ఎదురుచూసే మనసుకు తెలుసు
టైం ఎంత విలువో

బస్టాపుల
పొయ్యే బస్సు పోగా
వచ్చే బస్సు రాగా
పని పాట లేని యదవని
విసుక్కనే ఆంటీలకు అమ్మాయిలకు తెలుసు
ఎప్పటి నుండి ఈగలు గొడుతున్నానో !
పాపం వారికేం తెలుసు
నేను ఇంకో యదవ కోసం
ఎదురుచూస్తున్నానని

పెండ్లికెల్దామని పదింటికి రమ్మనీ
షాపు నడుపుతూ రెండుదాక ఆపీ
మూడుకు మూడు లేదని
చౌరస్తల దింపీ
తినడానికి ఇంటికెళ్ళే వానికి
ఏందెలుస్తది ఆకలి బాధ
నా అసహనం
నా షార్దం
నా పిండాకూడు
వానికర్దమయ్యే భాషలోనే కదా తిట్టాలి

మనిషికి ఎదురుచూపులు ఎంత పరిక్ష పెట్టినా
ఫలితం శూన్యమని గ్రహించినప్పుడు
మనిషిపై మనిషికి నమ్మకాలు కరువై
ప్రేమాభిమానాలు కనుమరుగయ్యాయని
కలతచెందడం సహజమేగా

కృష్ణ మణి