Sunday, March 29, 2015

మన్మధ బాణం


___________________కృష్ణ మణి

నిన్నటి విజయానికి కారణం తను  
మరి రేపటి రోజుకు కారణం ఎవరని వెతికితే
నేను కనపడను మనసున పూలు పూయించి
ఎదుట నిలబడిన మనిషికి ప్రేమ పుట్టిస్తానంటాడు !

కనే వుంటావు కరిగిన ప్రేమల గూర్చి
వినే ఉంటావు మతం పేరున మారణహోమాల గూర్చి
కన్నవారిని కడతేర్చిన విషయం
ఉన్నవూరిని మింగిన విషయం
పసిమానాలను తుంచిన విషయం
ఎడారిగా మారిన అడవుల విషయం
ఆకలి మానిన అస్తికల దృశ్యం !

ఇంకా ఉన్నాయి
నీవేరుగని కలికాలపు దౌర్భాగ్యాలు
చూద్దువుగాని రా
నీ బలమేదో చూపు
కనికరం లేని హృదయాన పుట్టించు !

కనులపండుగ గావించు
పోయేదాకా నిలబడు
కలబడి నిలుపుకో సార్ధకనామం
పోయేముందు అందించు ఆరని ప్రేమ కాగడను
వచ్చే మరో ఏడుకి !

కృష్ణ మణి




గులాబీ అడుగున దుర్గంధం


_________________________కృష్ణ మణి

తోడుతున్నాను
ఏమిటో తెలియదు కాని ఎందుకో మనసు రగులుతుంది
ఆవేశం రగిలి  వెతికాను
చిరిగిన చీరతో అవమానం అంచున కన్ను మూసిన అతివ శవం
భరింప వశం కానటువంటి దుర్గంధం నన్ను ఎక్కిరించింది !

పరుగుపెట్టి
మరో చోట తోడి చూస్తే
ముక్కలైన చిన్నారి
పక్కన పసుపు కుంకుమలతో నిమ్మకాయలు
జీవితాన్ని పొందుటకు జీవితాన్ని ముగించే వికృత క్రీడలో పైశాచిక ఆరాటం
మానవత్వానికి
మాతృత్వానికి దూరమైనా దౌర్భాగ్యపు దురాశ !

అసహనంగా
ఇంకో చోట ప్రయత్నించాను ఎందుకో తెలియక
మాంసం వీడిన బొక్కలతో
చీకిన బట్టల్లో
తుప్పుబట్టిన కత్తి నవ్వినట్లనిపించింది
ఒకరిని వొంచ తానోరిగినట్లు
వోళ్లు చూసుకొని విర్రవీగి చివర
అడ్రస్సు లేని అడుగున కుల్లవలసిన దుస్తితి !

ఇక లాభం లేదని
నేను వెతకాల్సింది వదిలి
తోడిన చోటే
నాటాల్సిన మొక్కలెన్నో ఉన్నవని
సమాధి పక్కన గులాబీలు పూయించాలని తపన పెరిగింది
మనషి ఎదిగే కొద్ది అహంకారాన్ని
తోడుకొని తొందరపడి జారుతున్నాడు !


కృష్ణ మణి 

తోపుడుబండి

తోపుడుబండి
__________________కృష్ణ మణి

భూమ్మీదికి
ఆకాశన చుక్కల్ని దించడానికి గాలం
ఒక్కో చుక్కను పట్టి
నాలుగు చక్రాల రథంలో కూర్చోబెట్టి
అక్షరాల ఆకలి గల వారి మనసును తడుపుతున్నాడు
సారధి సాదిక్ భాయ్

దండయాత్ర చేస్తున్నాడు
చీకటిని తరిమే కవిత దివిటీలను చేతబూని
ఆరిన కాగడాలను వెలిగిస్తూ
పోగేస్తున్నాడు సారథులను
గెలిపే లక్షంగా !

లోకం గర్వంగా చూస్తుంది తనకేసి
కాని తనేంటో తెలియని లోకాన్ని కూడా ఆప్యాయంగా చూస్తున్నాడు
నలిగిన గులాబిని అరచేతిలో ఉంచి ముద్దాడినట్లు !

కవిత్వం మలినాన్ని కడుగుతుందని
రథం నిండా ప్రేమ వొంపే ఆయుధాలను
మనిషిని ఓదార్చే పరిమళాలను నింపు కుంటూ
సంధించే కొద్ది పెరుగుతున్న అక్షర భాండాగారాన్ని
విజయానికి తోలిమెట్లుగా మలుచుకుంటున్న సహృదయ వీరుడు ఈ గజినీ !
అతని ధైర్యానికి ఒక సలాం
దార్శనికతకు ఒక సలాం
యుద్దానికి ఒక సలాం
‘’తోపుడు బండి’’ రథానికి ఒక సలాం

కృష్ణ మణి

ఆకలి భోగం


_______________కృష్ణ మణి

గుడిసెగాలుతుంటే సుట్టకు నిప్పడిగాడంట ఎనికటికి
ఏమి చిత్రమో గదా ఈ నక్కజిత్తు నాగులకు
ఊరు చెరువెండి జనమంతా అయ్యో రామచంద్ర అంటే
ఏటినబడే చచ్చు చేపలు మాకిమ్మని అడుగుతే ఎట్లరా దొరబాబులు !

రాజు దర్పానికి లేనిగతిన భూమిని చెరబడితే
రాజు దాసులం రాజ్యం హక్కని
మడుగున అడుగును కూడా అదిమేస్తే ఎట్లరా బాబులు !

ఆనాడు విడిపడే వేళ త్యాగానికి మారుపెరులమంటిరే
ఈనాడు పక్కొని నవ్వుజూసి ఆగని ఏడుపున ఆరాటమెందులకు
జన్మభుమికోసం ఆరుమాసాలు శ్రమదానం చెయ్యలేరా బుద్ధిజీవులు !

కష్టాల కడలిని ఈదే రాజుకూడా డాంబికాలకు పరిగెత్తి
కరువున కాపాడుమని వినతి జేస్తూ
కనికరంలేని కసాయులకు తోడిపెడితే ఎట్లా !

భుజం దించి వీరులు అలిగిన మొహాన చెట్టునేక్కితే
యుద్ధం ఆదిలోనే అంతమయ్యి
రాజ్యం పెద్దభోజల ఆకలౌతదేమో మరి !     


కృష్ణ మణి I 10-02-2015  

దూప జీవులు


__________________కృష్ణ మణి

ఆకాశంల తెల్లటి తెప్పలు
సుట్టపు సూపుగా వస్తున్నయి
నల్లటి గొడుగున తడిసే క్షణం కోసం
గొంతెండిన ఎదురుసూపుల స్వాతి పిట్టె !

బతుకున గడ్డుకాలం
అందరికి కొంతకాలం
కాని మడుగు సూట్టూ ముసిరే
దూప జీవులకు ఎల్లకాలం !

ఏడుపు కన్ను
కారని నీరు
ఎడారిగా మారిన  
రక్తపు వాగు !

పరుగుబెట్టిన ఆవిరి ఊట
అందం చెదిరిన అడవి బాట
కరువు కేకలే జీవపు నోట
సావు ఆకలే ఎండిన చోట !

కప్పల పెండ్లి ఊరువాడ
తెప్పల కోసం దిక్కుల మొక్కు
దుక్కులు తడవక
డొక్కదేలిన రైతన్న పొలికేక పెట్టె !

ఎలినోడి కడుపుకాల
ఊరిని ఆరబెట్టి
అడవిని నలిపి
ఏం గట్టుకపోతవురా
కడకు కాపటి నడక !

కృష్ణ మణి  



Tuesday, March 17, 2015

స్వార్ధపు కుండ


___________________కృష్ణ మణి

నిలుచున్నాను
నడి జన సముద్రమున ఏకాకినై
గుర్తు పడతారనుకొని అదో పిచ్చి చూపుతో  !

అటు నుండి ఇటుగా
ఇటు నుండి అటుగా
వస్తున్నారు పోతున్నారు !

నన్నెవరు  పలకరించే స్తితిలో లేరు 
అందరు స్వార్ధపు కుండను నెత్తిన పెట్టుకొని
ఉరుకుల పరుగుల హొయలు  
నేనేమన్న తక్కువ వాడినా అందులో ఒకడినేగా !

ఇంతకీ
నేను చేసిందేమిటి ఈ లోకానికి
అందుకు ప్రతిఫలం ఏమని అడుగను
ఒక్క మనిషినైన పూర్తిగా నమ్మానా
కనీసం ప్రేమించానా !

ఆకలికి
అమ్మ తన రక్తాన్ని తెల్లటి అమృతంగా మార్చి
పస్తులుంటూ నా కడుపు నింపి ప్రేమను పంచింది
పక్షి తన పిల్లల నోటికి ఆహారం పెట్టినట్లు !

తండ్రి
కష్టాన్ని నా చదువులకు వడ్డించి 
మాసిన బట్టల్లో మహారాజులా
బాద్యతల వర్షంలో తడుస్తూ  
ప్రయోజకుడిని అయ్యాక గొడుగు పడతానని ఆశ పడ్డాడు !

కనీసం కన్న వాళ్ళనైన
చివరి రోజుల్లో ప్రేమగా చూసుంటే
నేడు నేను అందరి వాడిని అయ్యేవాడినేమో !

కృష్ణ మణి  





  

గుడ్డి చూపు


__________________కృష్ణ మణి

నడుస్తున్నదెటో అర్ధం కాని గుడ్డి చూపు  
ఏ దిక్కున ఏముందో తెలియదు
కాని ఆగని గమనంలో గతుకులను దాటుతు మెతుకుల వేట !

ఆలోచనలకి రూపం దక్కక ఆరు బయట రాలే ఆకులతో ముచ్చట
చిత్రంగా ఉన్న చింతలో చింత పండు గుర్తుకు వచ్చి
విత్తుల బరువు ఎక్కిరించింది !

బజారులో కూరగాయల రేట్లు నవ్వుతున్నాయి  
వీడు కొనే మొహమా అని !

ఎండిన చెట్టుకింద సంసారం సాగక
మొహం మాడ్చిన ఇల్లాలు
తిని పడేసిన ఐస్క్రీం ఖాళి డబ్బాల పలకరింపుతో
బిక్కుమంటున్న పిల్లల చూపులు !

మనిషి ఆకలిని మోస్తూ
బతుకు చక్రం కింద నలుగుతున్నాడు
రైలు పట్టాలపై అనచబడ్డ రూపాయి బిళ్ళలా !

బయటి ప్రపంచపు పోకడలను అందిపుచ్చు కోక
లోపలి ప్రపంచమే మేలని చెప్పుకొనే
అసహనపు చాందస దోరణిలో సామాన్యుడి వింత దర్పం
బాహర్ శేర్వాని అందర్ పరిశాని అన్నట్లు !

కృష్ణ మణి 

Saturday, March 14, 2015

అచ్చంగా తెలుగు


____________________కృష్ణ మణి

తెలుగు పలుకుల కోలాటం
అచ్చమైన తెలుగుంటి మమకారం
చెట్టునీడన పసినవ్వుల మణిహారం
ఇదేగా మా ఇంటి ముందు మామిడి పూత సింగారం !

కన్నులముందు చిలకమ్మల రెపరెపల దృశ్యం
చెవులకింపైన కోయిలమ్మల నాదస్వర గానం
రంగుబట్టల్లో ఒదిగిన గంగిరెద్దుల నాట్యం
ఇదేగా సంప్రదాయాల హరిదాసు రామకీర్తనం !

నోరూరించే తీరొక్క వంటల అభివాదం
పంచకట్టులో ఉట్టిపడే మాఇంటి గౌరవం
చీరకట్టులో గర్వపడే  భారతీయ సౌభాగ్యం
ఇదేగా కవికోవిద సమూహాల వందనం !

కోడికూతతో పల్లెలేచి పాడి పరుగుల ఆరోగ్యం
కట్ట దాటి వరదై పారే నిత్య యవ్వన నురగల రాగం
కడుపు నిండి కడుపు నింపే అక్షయ ధాన్యాగారం
ఇదేగా పైరుపచ్చల నడుమ కొబ్బరాకుల ప్రకృతి చిత్రం !

ఇదే ఇదే మా ఇల్లు
ఇదే కదా పూదోట
నిత్యమై సత్యమై సుందరమై వర్దిల్లు !

కృష్ణ మణి I
                                       


కలల దాహం



_________________కృష్ణ మణి

ఆ వెలుతురు వెంట పరుగులిక ఆగవనుకుంటా
ఆ నీడ చాటుగా తొంగి చూపు ఆపవనుకుంటా
ఆ ఎండమావి దాహమిక తీరదనుకుంటా !

నిశ్చలమైన సరస్సున ఎవరో రాయిని విసిరి
ఊహల ప్రతిబింబాన్ని ద్వంసం చేసారు
ఊహకు ఊహను జత చేస్తూ అల్లిన మాలిక క్షణంలో మునక
భూగోళం బద్దలైన బాద నాలో వాగై పారెను !

కళ్ళు నిండి రెప్ప జారుతూ
రంగులన్నీ కలిసి నిండైన నిశిధి అద్దుకొని
ఇక ఏమి కలిసిన అంతేనని
ఎదుటివాడి ఎక్కిరింపు నవ్వొకటి భారానికే భారమై !

ఆశల పల్లకిని మోయడం సహజమే అయినా
కలల తెప్పలపై ఎగరడం కూడా సహజమేనేమో
ఆశలు కలలు ఒకటి కావని తెలిసే క్షణం ఎప్పుడో మరి !


కృష్ణ మణి I24-02-2015

రంగుల కల


________________కృష్ణ మణి

హోళీ హోళిరే రంగ హోళీ చమ్మకేలిరే అని
రంగుల వనంలో ఆటలాడే హృదయాల గానం హోళీ !

వర్ణ వర్గ వేషం మరచి
స్త్రీ పురుష భేదం తుడిచి  
నిలువెల్ల రంగులు పులుముకొని
ఇంద్రధనుస్సుని భువికి దింపిన వైనం మహాద్భుతం !

చిన్న మనసులు పెద్దవై
పెద్ద వయసులు చిన్నవై
గాయాలను మాన్పే మందు
భాంగ్ పొంగే పాల కడవల మత్తు చిత్రం
దూరాలను తగ్గింఛి మనసు దోచే ఉత్సవ కెరటం !

బురద గుంటలే నవ్వులై
సరసానికి వేదికై
బతుకు గమనంలో ఒక పూట
కాల చక్రంలో సైయ్యాట
వసంతాలపన చేయు ప్రకృతి విరహం ఈ క్షణం !

గోపాలుడి వేణుగానంలో గోపికల పరవశం
ఊరంతా ఊగిపోయే సమయం మధురం కదా
లోకమంతా గులాబి వనమే కదా
అలసిన మనసులు ఊగును కదా  
బరువు తేలికై బంధాలు గట్టిపడే ఆనందపు అలికిడే కదా !

కృష్ణ మణి


    


మనసు మెరిసిన వేళ


____________________కృష్ణ మణి

గోడకు ఉరేసుకోన్న జ్ఞాపకాలు
దుమ్ముతో నిండి ఇప్పటి స్తితిని ఎక్కిరిస్తుంటే
చిట్టి అలను తన్నే పెద్ద అల బరువుతో ఒడ్డును అద్దుకొన్నట్లు
నవ్వుకొంది మనసు !

జ్ఞాపకం చేసుకున్న ఒడ్డు మీద పరకలను  
చెప్పు తెగిన బడి అడుగులు
చెప్పలేని ఆకలికి దాహంతో సర్దుకొని
దోస్తుల ముందు బడాయి మాటల బీరాలు !

వొరం బురదై అడుగు పడవలా జారితే
వేసుకొన్న తెల్ల చొక్కా భూమిని ముద్దాడగ  
అమ్మ గుర్తొచ్చి కళ్ళలో వాగు జారిన క్షణం !

ఇసుక తిన్నలు నింపుకొన్న పక్క విధి వాకిలి 
వెన్నల చలువలో ముగియని ముచ్చట్లు
తినే సమయాన అమ్మ పిలుపులు నాన్న అరుపులు !

ఎంతకీ వోడువని నాయనమ్మ సుద్దులు 
నడూర్ల ముసలి యువకుల సరసపు విసుర్లు
తెలుపు అంటిన మెరిసే కన్నుల  పచ్చని మనసుల నవ్వుల తోటలు !

దులిపే కొద్ది మదిలో మెదిలే జ్ఞాపకాల పువ్వులు
మెరుపుల్లాంటి స్మృతులు నింగి నుండి నీటి చుక్కలవలె
పారెను కన్నుల లోతులో ఉద్వేగపు సెలయేరులు !

కృష్ణ మణి I 22-01-2015 

  
      



పిచ్చోడి చేతిలో కత్తి


_______________________కృష్ణ మణి

పచ్చటి వనంలో వెచ్చని గువ్వలు ముద్దుగ ఒదిగి
నిండైన చెట్టుకు అలంకారమై అలరిస్తుండగా
అలసిన మనసులు చేరువై తేలికై
ఈ క్షణం మరో క్షణం ఇలా కలకాలం నిలవాలని పరితపిస్తున్నాయి !

డేగలు నెమళ్ళు డ్రాగన్లు పాములు పులులు  
అడవిన ఆడుతూ ప్రక్రుతి పండుగ చెయ్యగా
నిర్జీవాలు సైతం గాలిని ఆసరా చేసుకొని పాట పాడుతూ
మనమంతా ఒక తల్లి పిల్లలమని గుర్తు చేస్తున్నవి !

సముద్రాన చేపలు రొయ్యలు పీతలు ఆక్టోపస్లు
తమ ఆనందాన్ని అలల ద్వారా కేరింతలు కొడుతున్నాయి
ఎడారిన ముళ్ళపొదలు ఓడలు ఇసుక రాళ్ళు
మూగ సైగలతో మురిసిపోతున్నాయి !

మంచు దుప్పటి అంటిన లోకం
స్వచ్చమైన మనసుని వెతకనక్కరలేదని
కుప్పలుగా చేరి కివీలు గానం చెయ్యగా
సీళ్లు దుప్పిలు ఎలుగుబంట్లు నాట్యమాడి నవ్విస్తున్నాయి !

ప్రకృతిలో సమస్తం మనషిని ఎంతని ఆనందపరచని
అహంకారమే అలంకరణ చేసుకొని అందరికి పెద్దన్ననని
పాయసం లాగి విషాన్ని చల్లుతూ లోకాన్ని ఉద్దరిస్తానని
రాజ్యం మత్తులో కత్తులు తీసి తనను తానె పోడుచుకొంటున్నాడు .... పిచ్చివాడు !


కృష్ణ మణి I 24-01-2015       

తమ్ముడా


_______________కృష్ణ మణి

ఏమిరా తమ్మి
ఇట్ల జెయ్యబడితివి
నీకు అన్నమెట్ల పోతుందిరా కడుపుకు !

కంటివి పిల్లల్ని పందుల్ని కన్నట్లు
మరి ఆలకు పూటకు తిండెట్ల సదువెట్ల
నువ్వేమో తెల్లారంగనే దిక్కులవడితివి
తెరవక ముందే కంపొండు కాడికి !

పెడ్లం చేస్తది కష్టం
నోటికి వెట్టె యాలకు దిగబడుతవు  సోయిదప్పి
కష్టాల కడలికి తిండెట్ల పోతది
నీ పిల్లల బతుకెట్లరా తమ్మి !

డొక్కలకంటిన తోలును జూసి కన్నొల్లు కలకలమనిరి
కన్నది కష్టాలపాలు జేయ్యనికెనా అని
చెప్తె ఇనవు చెడిపోయినోడ నీకు సావన్న రాదురా !

అయ్య జచ్చి అమ్మ కొడుకా ఆకలంటే
ఉన్న గుంటను అమ్ముకొని గుడిముంగల చిప్పవడితివి
నీకు సిగ్గు శరం పోయ్యలేడా ఆ దేవుడు !
  
అగసూడు తల్లిని గోకుతున్నారు
పక్కొని పిల్లల జూసి జాతర్ల బొమ్మలని
కన్నుగారవట్టేకదరా అమ్మ కడుపుకాలవట్టేకదరా !

చెట్లకింద కాపురమయితదిరా తమ్ముడా
లేశి లోకం సూడు
నీ పిల్లల డొక్కలు సూడు
ఇప్పుడన్న మారురా ఎంకసీరికి మారిన మిగలరు !


కృష్ణ మణి I 23-02-2015