Thursday, May 21, 2015

అనుభవం


_____________________కృష్ణ మణి

మనిషిని ముందుకు తీసుకుపోతుంది
జీవితాన్నే మార్చేస్తుంది
అనుభవం నడకను నేర్పుతుంది
అదే కాలాన్ని మారుస్తుంది !

భయాన్ని పుట్టించి గమ్యాన్ని తెలుపుతుంది
అనుభవం ఒక బాట
ఒక రాయి ఇంకో రాయిని హత్తుకొని ముద్దాడగ
జనించిన ఉష్ణమేగా మొన్నటి మన నడకకు మూలం !

పసివాడు పారాడి పోరాడి నిలబడే శక్తి అనుభావమేగా
అదేగా పక్షిపిల్లకు తినడం నేర్పింది
మనిషి కి ఎగరడం నేర్పింది  !

అనుభవం మంచిదే
అనుభవం చెడ్డది కూడా
నిన్ను కొన్నిటికి బానిసను చేస్తుంది
భయం వదిలి భయపెట్టించే కృరున్ని చేస్తుంది !

ఆలోచనలు ఎన్ని చేసిన
అనుభవిస్తే కాని మనిషి వృద్ది కాడు
అనుభవం దారి చూపించి దరికి చేరుస్తుంది
నిలబడే శక్తినిస్తుంది !

నిశిది నడకన దివిటిగా వెలుగుతుంది !
అనుభవం శాంతినిస్తుంది
ప్రతి జీవికి ఆకలితీర్చే అక్షయపాత్ర
ఎదిగే తీగకు ఆధారమౌతుంది
నింగికి నిచ్చేనలనేస్తుంది !

ఒక అనుభవం జీవితాన్ని మార్చేస్తుంది !


కృష్ణ మణి I 27-04-2015 

పదండి పోదాం

ఏమిరా !
కుక్కల్లార నక్కల్లార
పదండి పోదాం పదండి పోదాం
పోదాం పోదాం పై పైకి !

అడ్డుగ వచ్చిన లేడుల్ని
అల్లరి చేసే నేమలుల్ని
చెట్టున కూచ్చున్న పిట్టల్ని
నీటిన మునిగిన కప్పల్ని

తొక్కుతూ
రక్కుతూ
అవసరం అయితే
నరుకుతూ పాదుల్ని
తోడుతూ గుంతల్ని
పదండి పోదాం పదండి పోదాం
పోదాం పోదాం పై పైకి !

పైత్యం ఎక్కిన దున్నల్లరా
బుసలు కొట్టే నాగుల్లారా
చెరబడుదామా
నగ్నంగా పడి బొర్లుదామా
నలిపేద్దామా
శ్రామిక బడుగు చీమల్ని !
దోచుకు తిందామా
అడ్డులేని ఆకాశాన్ని
కంచె లేని అడివంతటిని
పదండి పోదాం పదండి పోదాం
పోదాం పోదాం పై పైకి !


రాజ్యం చేసే సింహం పులులు
లోకం చాటుగా మనకే అండ
ఏమయినా
తోడుగా ఉంటామని
ఫత్వా ఇచ్చిన వైనం వింటివా
ఇంకెందుకు ఆలస్యం
పదండి పోదాం పదండి పోదాం
పోదాం పోదాం పై పైకి !
దొంగ నోట్లా కొడుకుల్లారా ....
పదండి పోదాం పదండి పోదాం
పోదాం పోదాం పై పైకి !

పోయేదేముంది


___________________కృష్ణ మణి

కలం పట్టు 
గళం ఎత్తు
కదం కలుపు
పోయేదేముంది
జనం కదిలి గద్దెలదురును !  

ఎదురుతిరుగు
నిలబడి గర్జించు
నిలదీసి అడుగు
పోయేదేముంది
ఎదుటివాడి అహంకారం తప్ప !

నవ్వు నవ్వించు
చూడు చూపించు 
మనసు తెరిచి ఆహ్వానించు
పోయేదేముంది
అవతల మొహమాటాలు తప్ప !

అందుకో హస్తం
అందించు సాయం
ముందుకెళ్ళి పొందు
పోయేదేముంది
కన్నేగరేసిన సమస్తం దిగును నిన్నత్తుకోన !

కరుగు
మరుగు
మరిగించు
పోయేదేముంది
అలసిన కొండలు కరుగును సులువుగా !

కృష్ణ మణి I 30-04-2015


బిస్కెట్


______________________కృష్ణ మణి

మా అమ్మను చంపారంట
బందువుల ఇంట్లో ఉన్న నన్ను కూడా పట్టుకున్నారు
అడవిలో కొన్ని రోజులు నుండి తిప్పుతున్నారు
ఒక చోటు నుండి ఇంకో చోటికి !

పాపం వంట వండలేని పరిస్తితి అనుకుంటా
ఆకలన్నప్పుడల్లా
వాళ్ళు తినే బిస్కెట్లను ఇస్తున్నారు
చాల మంచి వాల్లనపిస్తుంది !

వేడికి తట్టుకోలేక పోతున్నాను
షార్ట్ విప్పి భుజంపై వేసుకొని కూర్చున్నాను
చమటకు తగిలే కొబ్బరి చెట్ల గాలి ఎంత చల్లగా ఉందో ....
కాని చేతుల్లో పెద్ద పెద్ద గన్నులను చూస్తే భయమేస్తుంది
నేనాడుకునే విడియో గేముల్లగా
నిజమైనవి భళే ఉన్నాయి !

నాన్నను పట్టుకొని కాల్చారంట
మా నాన్న కొన్ని లక్షల మందికి ఆరాధ్యం
ఆయన కను సైగ కోసం ఎదురుచూసే వాళ్ళు
ఇప్పుడంతా ఎక్కడేల్లారో !

నాకొక అక్క
మా నాన్నలాగ చాల ధైర్యస్తురాలు
ఉద్యమంలో చాల కష్టపడింది
అందుకు బహుమాణంగా
అక్కను వివస్త్రను చేసి అవమానించి / బలత్కరించి చంపారు !

అసలు ఇలా ఎందుకు జరుగుతుంది
బాష రంగు ఒకేలా ఉన్నాయిగా
ఓహో మేము తమిళులమనా .....
నా దేశంలో నాకు స్వతంత్రం ఉండకూడదా ...?

ఇప్పుడనిపిస్తుంది
నేను నాన్నలాగ పెద్దయ్యాక
రాజ్యంపై పోరాటం చేస్తాను
నా తండ్రి ఆశయాల కోసం యుద్ధం చేస్తాను !

ఇక్కడి పెద్దాయనకు ఎదో సందేశం వచ్చిందనుకుంటా
అసహనంగా ఉన్నాడు
దాహం వేస్తుంది కొన్ని నీల్లివ్వండి
‘’ఇంకో క్షణంలో పోయేవాడివి ఎందుకురా దండగా’’
అయ్యో అదేంటి ఇందాకే తినడానికి
బిస్కెట్లిచ్చి అప్పుడే తిడుతున్నారెందుకు ?

రెండు తుపాకులు నాపై గురి పెట్టారు
టపా ... టపా ... అంటూ అయిదు అగ్ని గోళాలు
గన్నులోంచి మెరిశాయి
అవి నా యదలో దిగాయని తెలిసేలోపే .........


కృష్ణ మణి   

ఆహ్వానం


_______________కృష్ణ మణి

చలికి వణుకుతూ కుంపటిని ఎతికినట్లు
చలిని వెతుకుతూ మండే కన్నుల ఆరాటం !

రోడ్డెక్కిన సల్ల కడవ
పూదీనాకులను పులుముకొని
ఎర్రని చీరను సింగారించుకొని
దాహపు చూపులను సైగ చేస్తుంది !

ఎటు చూడు అగ్నిగుండాల సెగల పరుగు
చెట్టుదాపును ఎక్కిరిస్తుంది  
పడుతూ లేస్తున్న ఆ చిట్టి దూడ
ఏమి అవుతుందో అర్ధం కాక నాలుకను బయటికేసింది !

ఆ టీ కాఫీల మిషను
పక్కన ఇసుక్రీం షాప్ పై అలకబూనింది  
కొబ్బరి కొట్టు కాలరేగుస్తూ 
ఎప్పటికీ రారాజునంటుంది !

తుస్సి గ్రేట్ హో....  లస్సి
ఫాలుదాలో సబ్జా గింజలు
పళ్ళ సందుల్లో జారిపోతూ నవ్వుతున్నాయి !

మజ్జిగ చెరుకుపాలు
ఆగమని ఆజ్ఞాపిస్తున్నాయి
గుక్కదిగితే చాలు
ఒక్కసారిగా ప్రాణం లేచోచ్చినట్లనిపిస్తుంది !

ఇంకెన్నాల్లో ఈ ప్రచండభానుడి కోపం !  


కృష్ణ మణి 

Wednesday, May 6, 2015

ఆధారం


_______________కృష్ణ మణి

ఆమె పాదాలు అటుగా వెళుతున్నాయి
నా ప్రాణాలు ఇటుగా పోతున్నాయి
ఆ మెత్తటి పాదాలు నాకు దూరంగా జరిగే కొద్ది
హృదయంపై కొండ వొరిగినట్లు తెలియని బరువు !

ఈ బరువు తాత్కాలికమైన
ఎందుకో భరించలేక పోతున్నాను
మబ్బుల్ని మోస్తున్న చిట్టి చినుకులా !

ఆమె నాలో సగం
సాగుతున్న పడవకు ఒక తెడ్డులా
కడలి నడకన దిశను మార్చే చుక్కానిలా !

తల్లిదండ్రులు రూపం ఇచ్చారు
వారిలో ఒకనిగా చోటిచ్చారు
ఆమెను తోడిచ్చారు
ఆమె నా రూపానికి ప్రతిరూపానిచ్చింది !

మోడువారుతున్న మోద్దుకు
లతలా అల్లుకొని పునఃజీవితాన్నిచ్చి
ఇంట్లో గల గలమనే గజ్జెల సవ్వడికి ఆధారమై
పిల్లలు నేనే తనకు ఆధారం అంటుంది అమాయకంగా
మా అందరికి అడిగిందే తడువుగా ప్రేమను పంచుతూ !


కృష్ణ మణి  

ప్రేమ వలపు


__________________కృష్ణ మణి

నీకు నాకు మధ్య ఎదో ఉందని
నాకు నీకు మధ్య కొంత నిర్మానుషంగా గాలి వీస్తున్నదని 
ఆ గాలే మన మనసుల భావాలను ఇటు అటు మోస్తూ
మౌనంగా మన మధ్య దూరాలను చేరుపుతున్నదని తెలుసు !

కొండపైన నీవున్నావు
నది అంచున నేనున్నాను
నీ చూపు నాపై వాలాలని కనురెప్ప వాల్చకుండ
నీకై ప్రేమ గానం చేస్తూ
చిగురుటాకుపై చినుకులా మెరుస్తున్నాను !

విరహమో ఏమో తెలియదు
నిశిరాత్రి నిద్రమాని
నీ తోడుకై వేడెక్కిన తనువుతో
బరువెక్కిన మనసుతో
నీతోడుకై వేదన పడుతున్నాను !

నిశ్చల నిర్మల సెలయేరులో
అద్దంలో చంద్రబింబంలా
నా మోము చూసి నాపై నాకు అహం కలిగి
నీకై తల ఎత్తి సిగ్గుతో తల దించి కూర్చున్నాను !
  
నీవొస్తావని
భుజాలపై చెయ్యివేసి
నను లేపి నీ యదకు హత్తుకుంటావని
చిరస్మరణీయమైన ముద్దొకటి నా నుదుటిపై ఇస్తావని
క్షణాలను యుగాలుగా తలచి కాలాన్ని భారంగా మోస్తున్నాను !

కృష్ణ మణి  


ఊహల పల్లకి


__________________కృష్ణ మణి

మలినమయిన లోకంలో సుందర స్వప్నం కోసం
చేట్టుకోమ్మపై పిట్టనై సంధ్య వేల
కరువైన చల్లని గాలిని మదిలో తలచి కునికిపాట్లు పడ్డాను !

కొమ్మల ఊపుడికి ఉయ్యాల ఊగినట్లు హాయిగా
ఊహలపల్లకిలో సాగిపోయాను
కొన్ని దృశ్యాలు అలా నా ముందునుండి కదులుతున్నాయి !

అరుణోదయాన
పచ్చని ఆకుల అలికిడి
ఆ వెచ్చని గువ్వలు
కోయిలమ్మల రాగాలు
లేడి పిల్లల గెంతులు
గుంపులుగా చేపల పరుగులు
నింగినంటిన చెట్ల గర్వపాట్లు !

అంతలో ఒక దృశ్యం నన్ను అదిలించి కదిలించింది 
ఒక కాలుష్య కాగడ ఒలంపిక్ జ్యోతిలా మండుతుంది
అడుగున ఇంధనంలా ఒక్కో చిత్రం కాగడ కర్రలోకి జారుతున్నాయి !

గూడు చెదిరిన పక్షి
నరికిన మొద్దులపై మొలిచే చిగురుటాకుకై ఎదురుచూపులు  
ఒలికిన చమురులో కోన ఊపిరితో కొట్టుకుంటున్న పక్షుల ఆర్తనాదం
ఆకులు లేని చెట్టుపై పెద్దబోజల ఆకలి చూపులు !

ఇసుక వేడికి కడుపులెండిన ఒంటెల ఎండమావుల పరుగులు
వాహనాల శబ్దాలు రోడ్డుపై మసి మేఘాలు  
ఫ్యాక్టరీ గొట్టాలు పొగలు గక్కుతూ అడుగున విషజలాన్ని చిమ్ముతుంటే
దాహపు చూపుతో దిక్కులు పట్టిన జీవజాలం !

అంతటనే జలదరింపుతో బెదిరిన కన్ను
తోలికిన ఉప్పు సముద్రం
ఆ తోలుకులో ఇంకా కొన్ని చిత్రాలు అస్పష్టంగా కదలిపోగా 
మొత్తంగా ఆ దృశ్యం మాత్రం నన్ను దోషిగా నిలబెట్టింది !   


కృష్ణ మణి 

రాజ్యమా ! ఓ శూన్యమా !


___________________కృష్ణ మణి

ఏమిటి లోకం
ఏమిటి కాలం
కరివేపాకు కట్టలు
రుచిని గొలిపే చెత్తలు !

అడుగులో అడుగేసి నడిచిన ధైర్యానికి
వీరులని
శూరులని
త్యాగాలకు మారుపెరులని
పబ్బం గడిపి
అధికారం పొందినాక
పగలబడి నవ్వడమా రాజ్యమా ! ఓ శూన్యమా !

బతుకు పోరాటంలో శ్రామికుడు ఎప్పుడు సమిధే
కాపరి సైగలకు తలదించుకొని నడిచే గొర్రెలుగా ఉండాలని హుకూం
ఎదురుతిరుగితే
లోకంలోని కష్టాలకు కారకులయ్యారీ అమాయకులు !

దిగి రాని సోమున్ని పోనివ్వండి పెద్ద మోటారు పైన
కలిసొచ్చే కాలానికి నడిసోచ్చే కొడుకని మురిసింది చాలు
అందరు చంద్ర బింబాన్ని అద్దంలో చూసుకొని మురవండయ్యా !

కృష్ణ మణి