Saturday, October 22, 2016

ఆకలి పిల్లి

ఆకలి పిల్లి
_________________ క్రృష్ణ మణి

శత్రువునే
నీ నిండు ఛాందాసానికి
రేయి పగలును వేరుగా చూసి
చీకట్లో చిందేసే నీ అరాచకానికి

శత్రువునే
పది కూడా నిండని
పసిమొగ్గలను చిదిమేసే నీ మొండి కత్తికి
కోరికను నిమురుతూ వాంచగా చూసే నీ కళ్ళకు

శత్రువునే
మనసును వదిలి
శరీరానికి ముసుగేసి
దుఃఖాన్ని సుఖమనే ఎక్కిరింపుకు

శత్రువునే
తలాక్ అని
నీ ఆధిపత్యాన్ని
గర్వంగా చాటుకునే అహంకారానికి

శత్రువునే
ఏలేటోడికి ఎందరైనా అనే
నీ వంకర నొసలుకు
నీ పిల్లలను నువ్వే మింగే పిల్లి ఆకలికి

శత్రువునే
మొగనితో పాటే కాలుమని తోసే
నీ బలిసిన చేతులకు
అచారం పేరుతో ఆకలికి మాడ్చి చంపే
నీ కసాయి గుండెకు

ఏమి చెస్తావురా పిచ్చి మనిషి
నలుగురు పిచ్చొళ్ళను పోగేసి కరవడం తప్ప

నీ అహం దిగే వరకు
అగ్గి రాజెస్తెనే ఉంటా
కట్టె కాలేవరకు
అది నీదో లేక నాదో

క్రృష్ణ మణి

దారి

దారి
_______________కృష్ణ మణి
మౌనం ప్రశాంతతకు నిదర్శనం
అని తెలుసు కాని
మెల్లిగా అర్ధమౌతుంది

ఆవేశాన్ని దిగమింగి సాగుతున్న ఆలోచనని
ఎగసే అలకు సూచనని
మరుగుతున్న నెత్తురు సెగని
జరిగే పోరుకు సిద్దమని

మౌనం పెకిలితే
ఉద్భవించే శబ్దాన్ని
కలియబడే ఉగ్రరూపాన్ని
తట్టుకొనే ధైర్యం ఎక్కడిది ?

నిట్టూర్పుల వలలోంచి జారి
సంద్రంలో దూకిన ఉద్వేగాన్ని ఆపే శక్తి ఎక్కడిది

మిత్రమా
చూడు నిదానంగా నీలోకి
ఎక్కడో ఆరిన కసిని
ఒక్కసారి కుదిపిచూడు
ఏమంటుందో

ఇంకెంతకాలం ఇలా అని
తడబడుతున్న నీ అడుగులను నిలదీస్తున్నది

అలా కాదు ఇలా అని
దారి కనిపించేలా
నీలో దిశా నిర్దేశం జరుగుతుంది

విన్నావా
కనిపించిందా
మరి పదా ఆ దారిలో
నీకు నువ్వే గురువై
గురివైపు పరుగుపెట్టు
నలుగురు నడిచే దారికి
నువ్వే దారివై
కృష్ణ మణి

కడుపుగాసం

కడుపుగాసం
_________________కృష్ణ మణి

ఏమున్నది బయ్యా
కడుపుకాలి ఒకడుంటే
పెయ్యిబరువెక్కి
నోరు గులాగులాంటోడు ఇంకొకడు

ఇత్నం కొనవోతే
తక్వ ధర ఎక్వ లాభమని
గుంజి గుంజి చేత్లవెడతరు
ఏమ్మున్నది బయ్యా

నాగలి సాగక తిప్పలైతే
ట్రాక్టర్ సౌండుకు
గుడ్లు తెలేశినై ఎడ్లు
ఏమ్మున్నది బయ్యా

తడందక ఎండిపోతే ఒకపారి
నీళ్లేక్కువై మురుగవట్టే ఒకపారి    
ఏమ్మున్నది బయ్యా

శేనుకు మందుగోడుతుంటే
కారాపి నక్షలు సూస్కుంటా
నొసల్తోని ఎక్కిరిస్తరు
ఏమ్మున్నది బయ్యా

చేశేదేమి లేక
నాగలి తాళ్ళు
చెట్టుకు యాలాడవట్టే
ఏమ్మున్నది బయ్యా

ఇంకేమిలేదు బయ్యా
ఉన్నదమ్ముకొని
ఊరవతల జీతముండాలే
పొరల మంచి చెడ్డ మరిశి
కడుపుగాసం బతుకులాయే

ఏమున్నది బయ్యా
ఇంకేమున్నది


కృష్ణ మణి   

Friday, October 7, 2016

చిట్టి మనసు

చిట్టి మనసు
_________________ క్రిష్ణ మణి

ఇటుక ఇటుక మధ్యలో
మనసుని పెట్టి కట్టాను గూడును
ఇంటి కప్పును గడ్డితో కప్పుతూ
చలికి పెట్టుకున్న గుల్వణ్ ను సరి చేసుకుంటూ
నా ఇల్లును నామొహంలా చూసుకొని మురిసిపోయాను

కొండకోనల్లో
పేలుళ్ళకు బెదరలేదు
సంకలోంచి బుల్లెట్ వెళ్ళినా వణకలేదు

ఆర్డర్ వచ్చి
రొడ్డునేసింది నన్ను
బట్టలూ దుప్పట్లు
ఎన్ని మూటగట్టినా
నా గుండెలో బరవు ఎవరు మోస్తారు

మూలదాటి తిరిగిచూస్తే అగుపించింది
కన్నీరులో నా గూడు మునుగుతుంది

సైనికుల బూట్ల చప్పుళ్లకే తల్లడిల్లింది
మరి తూటాల వర్షంలో తడిస్తే ఏమవుతుందో

ఇప్పుడు ఏది నా ఊరు
ఏది నా గొడుగు

ఈ మంట చల్లరే సరికి
నా కట్టె బూడిదౌతుందేమో

కనీసం
నా పిల్లలైనా చూస్తారో లేదో
ఆ చిట్టి మబసుని

క్రిష్ణ మణి

వికారం

వికారం
_______________కృష్ణ మణి

మనసు నీడన ఒక వెలుగు
పసిపాపలా కునుకుపాట్లు  
ఎవరో దాడి చేస్తారని
వణికి వణికి ఊగుతుంది

మనిషి బయటికి ఎంత గంభీరంగా ఉన్నా
లోలోన భయానికి పైన మేకపోతే !

చుట్టుపక్కల ఎందరు కాపలా ఉన్నా
అర్దరాత్రి తలుపు తట్టే గుండేనొప్పికి
శ్వాస నింపడం అవుతుందా వారికి

ఎదురుగ వస్తున్నా మనిషి
సూటిగా నీకై చూస్తే
తడబాటు

నీలో మంచి ఉందో
లేక బురద ఉందో
ఒక్కసారి చూసుకో
ఆ అద్దంలో చూసుకొని చెప్పు నిజాయతిగా
  
ఎందుకు నీలో నీవే ఏడవడం
నలుగురిలో ఒకనిగా ఉండక
ఉన్నదంతా కాటికి తోడోస్తాయని భ్రమ కదూ !

ఉండు అలాగే ఉండు
చివరిదాకా అహంకారాన్ని మోస్తూ ఉండు
అది ఎప్పటికీ
నీ అందానికి వికారమే
తెలుసుకొనే సరికి
ఎందరిని వదులుకుంటావో
ఎందరు దూరమవుతారో

కృష్ణ మణి