Sunday, July 26, 2015

స్పష్టం

స్పష్టం
______________కృష్ణ మణి

పడుతుంది కష్టంగా అడుగు
అయినా చుట్టూ నా అస్తిత్వ పునాదులే
నన్ను మేలుకొలుపుతున్నాయి అడగడుగున !

ఇప్పుడు
ముస్తాబైన కుండలు
గండ దీపాలు
ఎందుకో కొత్తగా అనిపిస్తున్నాయి
అదెదో నేను మల్లీ పుట్టినట్లు !

నవాబుల కోటలో
అమ్మవారి జాతర
మరచిన చిన్నతనాన్ని తిరిగి పొందాను
చీకటిని దాటి వెలుగునీడను చేరినట్లు !

వేప మండల ఊపుడు
పసుపు భండారి నొసల్లు
నిమ్మకాయల దండలు
ఊగిపోవాలనే ఉత్సాహం
ఆగని ఉద్వేగం
తీన్మార్ దరువు
లయబద్దంగా డోలు తాళం !

చర్లకోలల వీరంగం  
శూలాల మెరుపు
కాలి గజ్జెల గలగలలు
ఆశీర్వచన హస్తాలు
నన్ను నేను కొత్తగ చూసుకున్నట్లు
నా చుట్టేదో వైభవం జరుగుతున్నట్లు !

ఎంత బాగుందో
నేల దుమ్ము నింగికంటే ఊపు నాదనే నిజం స్పష్టమైంది
గుడ్డివానికి ఇప్పుడే చూపోచ్చి తల్లిని గుర్తుపట్టినట్లు !


కృష్ణ మణి   

Tuesday, July 21, 2015

పరుగు


_________________కృష్ణ మణి

ఎందుకో
మరెందుకో
ఈ పగలు రాత్రి కోసం పరుగు
ఆగని క్షణం ఆగని వెలుగు
ఆగని లోకం ఆగని  వేగం !

ఎందుకో
మరెందుకో
అలసిన పక్షులు కూడా
దాపు దాటి గూటికి సాగుతున్నవి గుంపులుగా
లేగా దూడ కొట్టంలో ఎదురుచూపు చనుపాలకై
నిండి నిండని ఆకలి కడుపు
ఆరని దప్పిక తీరని కోరిక !

ఎందుకో
మరెందుకో
తడిసిన నేలలో ఇంకని ప్రాణం
తొందరగా పొద్దెక్కించి
తడి ఆరనివ్వక విత్తుని బతికించే ఆరాటం !

ఎందుకో
మరెందుకో
ఎండిన డొక్కల కుదురుగ నెమరుకు నీడ పరుగు
మాడే మంటలు వెచ్చగ మారి తనువును పరుపు !

ఎందుకో
మరెందుకో
మనసు పంచె మగువ మొగుని రాకకై అలక పాన్పు
మనసు దోచే మొగడు మగువ స్పర్శకై మసక  పాట్లు !

ఎందుకో
మరెందుకో

కృష్ణ మణి 

Friday, July 17, 2015

సోదరి తెలివి


________________కృష్ణ మణి

అమ్మకు బొమ్మకు తేడా తెలియని
గుడ్డిచూపుల గడ్డిపరకల అలికిడి
పర పరమని గించుకుంటూ కారుకూతల కొరివి !

అహమా ఆడబతుకున శాపమా
నిజమా నీవుకూడా ఆదమమా !

చెట్టు మారిన చిలక
గొంతు మార్చునా
ఊరిమారిన గాడిద
అరుపు మార్చునా !

సిగ్గు సిగ్గు
మరిచితివా
నీవొక పంకజ పుష్ప రేకువే కదా !

సోదరి
సోదరి పరువు అంటే నీ పరువని మరిచి
చిలువలు పలువలు పలికిన తెలివి ఎందులకో !


కృష్ణ మణి    
( IAS  అధికారిని స్మిత సబర్వాల్ పై ఔట్లుక్ ఇండియా లో మాధవి తాట గారు రాసిన హేయమైన వ్యాసాన్ని ఖండిస్తూ రాసినది )

నిరంతరం


______________కృష్ణ మణి

నిర్మలం నిరంతరం
గగనం నిత్య నూతనం
హరితం సువిశాలం
పవిత్రం ప్రాణ త్యాగం
సాహసం కర్మభూమి ఋణం !

ఉప్పొంగే రక్త వాగు నరనరాన
గర్వించే గుండె గంట ప్రతి రోశపు జీవిలోన !

పదం పదం ప్రతి పదం
కదం కదం జనం మనం !

ఎండ కాంతిని గొడుగు పట్టి
అడుగు నీటిని తోడి పోయగ
నింగి బొట్టును అదిమి పట్టి
భూతల్లికి పురుడు పోయగ
అందివచ్చును అమ్మవొడిలో
ప్రేమవోమ్పిన  నేతి ముద్ద !

కన్నుమూసిన కలలను
కన్నుగారిన రగిలిన ఓర్పు
నెరవేర్చును అంతకు మిన్న !

సంకెళ్ళను తెంచిన
యాడాది పండుగన
అమ్మా ... నీ పిల్లలమని
ఆనందపు శ్వాస నిండగ
చేతులెత్తి మా తనువు 
తలను వంచి మొక్కుతుంది !

జై తెలంగాణ ..... జై జై తెలంగాణ
జై తెలంగాణ ..... జై జై తెలంగాణ


కృష్ణ మణి 

దరి


______________కృష్ణ మణి

కొండల చుట్టూ వాగుల
వంకర టింకర ప్రయాణం
గమ్యం తలియని తడి మట్టి !

కొంత మమత
కొంత మలినం
కొంత మధురం
అన్ని సంగమించి వడగట్టిన అమృతం !

తేలికైన మనస్సులా స్వచ్చమైన గగన దృశ్యం
అడుగు చేరిన మురుగు కూడా తొంగి చూసిన నీలం !

ప్రతి ఏడు
కడిగిన ముత్యంలా లోకం
కాని
నా/నీ గుండె లోతుల్లో ముల్లపొదల్లో
ఎన్నడు పట్టునో జల్లడ
ఒకరినొకరం దరి చేర !

కృష్ణ మణి