Monday, February 5, 2018

పరమార్ధం

పరమార్ధం
______________ కృష్ణ మణి

అప్పటి చాయిల నానేసిన జొన్నరొట్టె
పరమాన్నం కన్నా కమ్మగా ఉండేది
కడుపు నింపడానికి అప్పుడు అమ్మ వేసేది
ఇప్పుడు కడుపు నింపుకోవడటనికి
చౌరస్తాలో అమ్మలు చేస్తున్నారు
ఏదైనా
ఆకలిని చంపడానికేనని అర్థమయింది

వడ్ల యాదగిరి
కొలిమిలో ఇనుమును కాల్చి
నాలిక బయటపెట్టి కొట్టే సుత్తె దెబ్బలకు
ఎర్రటి ఇనుప రవ్వలు చిచ్చుబుడ్డిలా ఎగసిపడేవి

ఆ కష్టజీవి శ్రమను అయస్కాంతం పెట్టి
కాగితంలో జమచేసి
సరదాగా ఆడే ఆటలో
ఆ ఇనుప రజను
అయస్కాంతానికి ఆకర్షించబడి చేసే విన్యాసాలు
ఆయుధాలను చేత పట్టిన సైనికుల మాదిరిగా తోచేది

ఆ చిలిపి ఆటనే
మనిషిగా
మంచిని ఆకర్షించమని నేర్పింది

మోట బావిలో ఈదులాట
ఎంత హాయిగా ఉండేదో....!
శ్వాసను బిగపట్టి కొట్టే డైవులు
అందరిని ఆశ్చర్య పరిచేవి

నీటిలోకి ఈటెలా దూసుకుపోయాక
కళ్ళు తెరిచి చూస్తే నీటి అడుగున
ఎటునుండి ఏమి వచ్చునోనని ధడ
గాబరాగా వడివడిగా పైకి వచ్చి
దమ్ము తీసి
తోటివారిని చూసి
శాంతపడి
నేను ఒంటరిని కానని ధైర్యం
ఎంత ప్రశాంతతనిచ్చేదో కదా !

కాని
ఇప్పటి
మన జీవిత ప్రయాణం
స్వార్ద బుద్ధితో భయానక ఒంటరి పరుగని
ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది

కృష్ణ మణి