Saturday, July 30, 2016

ప్రవాహం

 ప్రవాహం
_______________కృష్ణ మణి
1
దుర్నార్గాన్ని ఎంతని ఎదిరించినా
ఒక చెడ్డ పని మరో చెడ్డ మనికి దారులు వేస్తుంది
ఏటిగట్టు మీద నడకలా

2
కోసిన ధాన్యం కంటికి మురిపమే ఆ పూటకి
నాగలి మోసిన సంచులన్నీ ఇల్లు చేరకముందే
నిర్జీవంగా వ్రేళ్ళాడుతున్న కొడవళ్ళు

3
నిత్యం హోలీ ఆడుతున్న గ్రీజు మొహాలు
నవ్వు అంటే ఆగని మోటారు చక్రమే !

4
అందరు చేసేది వ్యాపారమే
తల్లి చేతిలో పెరిగి
ఆ తల్లి చావును వెతుకుట ధౌర్భాగ్యమే !

5
మతాలని మోస్తూ
హితాలని మరచి
భూతాలను పెంచుతూ
దేవుడు మావాడని బుద్ధిజీవుల అల్లరి !
ఆ నీటిలో చేపకు
కొండ మీద కోతికి  
మరి  ! ఆ చెట్టుపైన పక్షికి దేవుడేవరు ?

కృష్ణ మణి



  


Friday, July 15, 2016

కమ్మకత్తి

కమ్మకత్తి
______________కృష్ణ మణి

బీరాన
కమ్మకత్తి తీస్కరమ్మని మా తాత జెప్పిండు
మ్యాకలకు మ్యాత కొట్టనీకే

అంటే యాదికొచ్చింది
మొన్న నా సోపతోడు జంగడు
బాయిమీద కొమ్మగొట్టబోయి
కాళ్ళిరిగి ఎల్లంకల పట్టిండు ఇంట్ల

అప్పడిసంది మా అయ్యా
బుగులువెడ్తుండు ఆటంకాల పోవొద్దని  
తాతనేమో
పెయ్యి గట్టిగయితదని ఆంటడు
అయినా
మ్యాకల కడుపులెండుతయని పానం గొట్టుకుంటది
పొద్దుమీకంగ దొడ్లగొట్టిన మ్యాకల కపుపులకన్నా
పాలకేడిశే పిల్లల మోకాల మీద మెరుగులు సూడాలె

అమ్బటల్ల
క్యాన్ల ఇంత బువ్వగట్టుకొని ఊరగుట్టకు పోతుంటే
అవుసల చారి కొడుకు బిడ్డే బ్యాగుల మోసుకుంటా
ఈపులు నొయ్యంగ ఇస్కుల్ బోతరు
ఎం సదువుతరో ఏమో
నెత్తికరాబు జేస్కొని సదివితే
ఏమొస్తది గుడ్డద్దాలు తప్పిస్తే

నేనే నయం
ఏట్ల శ్యాపలు ఒరాలకింద ఎండ్రికాయాలు
చెట్ల కాయలు పండ్లు తిని రాయోలె అయితా
మా తాత జెప్పిండు

మాటలల్లవడి మర్షిపోయినా
అగొ మా తాత కూత వెడుతుండు
ఉంటా

కృష్ణ మణి  

Tuesday, July 12, 2016

వొర్లుతున్న పిట్టే

వొర్లుతున్న  పిట్టే
_______________________ కృష్ణ మణి

అద్దుమ్మరాతిరి
కట్టకింది తాటిముంజల కొయ్యా
 పటేల్ శేనుకాడ దొంగలమే   
ఎర్రటెండకు తోడబుట్టినొల్లకు
ఆ ముంజనీళ్ళను తాపే మనసున్న దొరలమే !

కొబ్బరిమట్ట మీద సవారి ఎక్కితే
గుర్రాలై గుంజే దోస్తులం
అలుగుమీదెగిరే
పర్కపిల్లలబట్టే యాటగాళ్ళం

ఈతపల్లకోసం
ఈదులళ్ళ తిరిగే పెద్దీగలం
బరఫ్ పుల్లను నాక్కుంట ఊరిలిచ్చే అమాయకులం 
మొటబాయిల పల్టీలు కొట్టే చేప పిల్లలం

మల్లెతోట్ల పూలేరే లేతమొగ్గలం   
పిల్లలకు పాలుదాపే తల్లిమ్యాకలం
చెరువు నీళ్ళను శేనుమలిపే పలుగుపారలం 
అమ్మయ్యకు ఎదిగొచ్చిన లేత రెట్టలం

అవును తాత చేతి కట్టెలం
నాయనమ్మ ఆకులో పోకలం
ఆకలెరుగని అలుపెరగని ఆటల పాటలం
అల్లరిమాటల మూటల గురుగులం

మేం దొరలం
పావులం
పాపమెరుగని పక్షులం
ఆ దేవుని రూపాలం

కప్పలం డొప్పలం 
తిప్పలమోసే ఎద్దులం బుద్దులం
అమ్మ చేతి ముద్దలం
నాయిన చూపుకు వాన కురుసే తెప్పలం 
పండుగపూట ఊరినొకటి చేసే రంగులం
గొర్లకాడ టుర్రు టుర్రు అరుపులం

కాలమయిన సొట ఆరుద్రలం
గడచిన దినాలు యాదికొచ్చి
కండ్లనీళ్ళు తోడుకొచ్చి
ఇప్పటికీ మేం పసి పిట్టలం
నవ్వుల గంటలం

కృష్ణ మణి 



Thursday, July 7, 2016

నిశబ్దపు ఆలోచన

నిశబ్దపు ఆలోచన
_______________కృష్ణ మణి

నిశబ్దాన్ని వింటున్నాను
ఏదైనా శబ్దం చేస్తుందేమోనని
ఈ నిశబ్దం ఇంత స్తబ్దతగా ఉంటుందని ఊహించనేలేదు !

దృశ్యాలు ఎన్నో కళ్ళముందు దాడి చేస్తున్నాయి వినమని
నవ్వుతున్నారు
ఏడుస్తున్నారు
నడుస్తున్నారు
మోస్తున్నారు

అల్లరి పిల్లల పరుగులు
మేకల మందల నడకలు
పిట్టల గుంపుల ఎగురులు
అన్నీ కనిపిస్తున్నా
నాకేమి వినపడట్లేవు
నిశబ్దాన్ని కోరుకున్న పాపమనుకుంటా ఈ నరకం !

ఆ వాన చినుకుల రాలుతున్నాయి
వాగులు పొర్లుతున్నాయి
అందరు ఆనందిస్తూ పండుగలు చేస్తున్నారు  
నేనూ అరుస్తూ చిందులేస్తున్నాను కాని
నేనేమంటున్నానో నాకే వినపడట్లేదు భావం తెలిసినా
అది విస్పష్టంగా విన్నప్పుడే కదా అనుభూతి కలిగేది !

మన మనసు ప్రశాంతత లేనంత వరకు
చుట్టుపక్కల ప్రశాంతతని కోరుకోవడం అంటే
మనల్ని మనం శిక్ష విదించుకొని చెవులు మూసుకోవడమే
అందుకు ప్రతిగా నేననుభావిస్తున్న బాద

జీవితాన్ని దుర్బరంగా చూస్తూ
దుర్బరమైన జీవితమని
లోకమంతా ఇంతేనని తలచటమే దుర్బరం

ఇంకా ఇలా కూడా అనుకోలేదు నయం
ఈ లోకాన్ని చూడలేనని అమాయకంగా  !

కృష్ణ మణి


నిశబ్దపు ఆలోచన

నిశబ్దపు ఆలోచన
_______________కృష్ణ మణి

నిశబ్దాన్ని వింటున్నాను
ఏదైనా శబ్దం చేస్తుందేమోనని
ఈ నిశబ్దం ఇంత స్తబ్దతగా ఉంటుందని ఊహించనేలేదు !

దృశ్యాలు ఎన్నో కళ్ళముందు దాడి చేస్తున్నాయి వినమని
నవ్వుతున్నారు
ఏడుస్తున్నారు
నడుస్తున్నారు
మోస్తున్నారు

అల్లరి పిల్లల పరుగులు
మేకల మందల నడకలు
పిట్టల గుంపుల ఎగురులు
అన్నీ కనిపిస్తున్నా
నాకేమి వినపడట్లేవు
నిశబ్దాన్ని కోరుకున్న పాపమనుకుంటా ఈ నరకం !

ఆ వాన చినుకుల రాలుతున్నాయి
వాగులు పొర్లుతున్నాయి
అందరు ఆనందిస్తూ పండుగలు చేస్తున్నారు  
నేనూ అరుస్తూ చిందులేస్తున్నాను కాని
నేనేమంటున్నానో నాకే వినపడట్లేదు భావం తెలిసినా
అది విస్పష్టంగా విన్నప్పుడే కదా అనుభూతి కలిగేది !

మన మనసు ప్రశాంతత లేనంత వరకు
చుట్టుపక్కల ప్రశాంతతని కోరుకోవడం అంటే
మనల్ని మనం శిక్ష విదించుకొని చెవులు మూసుకోవడమే
అందుకు ప్రతిగా నేననుభావిస్తున్న బాద

జీవితాన్ని దుర్బరంగా చూస్తూ
దుర్బరమైన జీవితమని
లోకమంతా ఇంతేనని తలచటమే దుర్బరం

ఇంకా ఇలా కూడా అనుకోలేదు నయం
ఈ లోకాన్ని చూడలేనని మూర్ఖంగా .... హాహా హా !

కృష్ణ మణి


Monday, July 4, 2016

మౌనం

మౌనం
_______________కృష్ణ మణి

మౌనం ప్రేమగా ఉంది
ఆవుదూడను తల్లి నిమిరినట్లు

మౌనం నిశబ్దంగా సాగుతుంది
కొండపైన మంచు కురుస్తున్నట్లు

మౌనం భారంగా ఉంది
తలపై భూమిని మోస్తున్నట్లు

మౌనం ప్రశాంతంగా ఉంది
ఎత్తున కూర్చోని అడవిని చూస్తున్నట్లు

మౌనం భయంకరంగా ఉంది
అమావాస్య పొద్దు నక్కలరుస్తున్నట్లు 

మౌనం నివురులా ఉంది
లోపల అగ్నిపర్వతం మసలుతున్నట్లు

మౌనం ఆకలిలా ఉంది
ఎన్నేళ్ళుగానో ఎదురుచూసిన ఏకాంతాన్ని పొందినట్లు

మౌనం ఒకటే అయినా
దాని భావాలు అనేకం
ఊహకు అందని లేక్కలా

కృష్ణ మణి  


సిద్ద రాములు

సిద్ద రాములు
______________________కృష్ణ మణి

రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు
ఊరెనక నాలుగెకరాల బటాకి శేను  
ఉన్న రెండెకరాలను కలుపుకుంటూ  
ఎండవానకు
రేయిపగలుకు
చుక్కనీటికి కాపుగాసినా
బోరుబావికి మోటరేసినా
చెమట గింజలు అడవిపాలే
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు

కాడికెడ్లు ఆలుమగలు
ఉన్న రక్తం భూమిపాలు
పంట పొట్టలు పురుగుపాలు
చేతికొస్తే నీటిపాలు
అగ్గివానల మన్నువడెనో
ఏ నరునికన్నును గద్దమింగెనో
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు

అప్పులోడు ఇంటికొస్తే
ఆలిపుస్తేలు అల్కగాయే
కండ్లనీరు బరువులాయే
పస్తు కడుపుతో బతకులాయే
గాలిమోటారు ఎక్కుతానని
ఎండమావుల సోకు నచ్చి
అందరినొదిలి ఆగమయితివ
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు

గంపెడాశతో మోటారు దిగి
నాలుగు రోజులు నవ్వినవో లేవో
అయిదో రోజుకే అలసితివ
అరబ్బు దొరగాని కండ్లల్ల నలిగితివ
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు

కన్ను తెరిస్తే కష్టమే
రేపటి పొద్దు అప్పుడే వొద్దని
వొళ్ళు మరిచి నిద్రపోతూ
ఆలుబిడ్డలు యాదిరాంగా
గుండె చెరువై మెత్త తడిశే
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు

కష్టమైనా నష్టమైనా
సొంత ఊరే ఇష్టమాయే
అవ్వబువ్వ గంజిగటక
చెట్టుకల్లు సారసీస
అక్కబావ అన్నవొదినె
అమ్మఅయ్య అత్తామామ
వాయివరుసల పలకరింపుతో 
పొద్దూగడిశే పానంనిండా
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు
  
కండకరిగి మెదడునలిగి
గిర్రుమంటూ కిందబడితివ
దావకానల కండ్లు తెరిస్తే
సోయిలేని జీవమైతివ
కోమలదిగి చింతజేస్తివ
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు

పెండ్లమేడిశే
పిల్లా ఏడిశే
అమ్మ ఏడిశే
అందరేడిశే
సూపుకేమో దూరమయితివి
ఎనిమి నెలల కాలమాయే
దుబాయి దవకాన సల్లగుండా
పసిబిడ్దోలె సాకవట్టే
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు

నీవొల్లకు దగ్గరైతే
పెయ్యికదిలి నవ్వుతావని
పెద్దమనుషుల అండతోని
పువ్వువోలె లేపిరి
హైదరాబాదుల దించి
గాంధీల పానుపేస్తే  
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు

నీ ఆలిబిడ్డల కండ్లవాగుల
సూడలేని బతుకునీది
నిన్నుసూడ అరుసకపోను
పెద్దపెద్దోల్లు అడుగుబెట్టి
పెద్దమాటలు చెప్పిపోయే
దవకాన పెద్దసారులు
లెక్కబెట్టిరి ఎంత గుంజ
వొట్టిబర్రెకు పాలేక్కడ
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు

బతికిలాభం లేదాని
సర్కారుకెందుకు ఇంత నొప్పని
కొనపానం చిదిమి నవ్విర
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు

నీవసొంటి కొడుకులెందరో
ఎడారి రోడ్డులో ములుగవడితిరి
లేపనీకే ఎవరూ లేరు
ఉన్న సర్కారు నిద్రలోనే
ఒక్క మనిషిని సూడమంటే
ఫండులేదని అలాటులేదని
సచ్చెటొల్ల తిరిగుఖర్చులు
ఎవడు బెడతడు ఏమి వస్తదని
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు

ఓటురాజ్యం
స్వర్దరాజ్యం
నీ ఉసురుతగిలి
కుప్పకూలును
ఓటురాజ్యం
స్వర్దరాజ్యం
నీ ఉసురుతగిలి
కుప్పకూలును
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు

కృష్ణ మణి