Thursday, June 19, 2014

ఏమాయే


********
ఒరాల మీద అరిపాదాలు ఎక్కడవాయే
నడుములోంచి నాట్లేసే నాలికల మీది పాటలకేమాయే
నెత్తిమీది ఎండదాపు చెట్లకొమ్మల కింద సద్దిమూటలకేమాయే
అలసిన తనవున అల్లరి మాటల పరాషకాలెక్కడవాయే

బురదనీళ్లల కలుపులేరు మట్టిచేతులకేమాయే
మొక్కల సందున నాట్యమాడే కల్వారలకేమాయే
నాగలి అంచున ఇత్తులజల్లె నడకలకేమాయే
శేనుచేతికొచ్చె సానవెట్టే కొడవళ్ళ సప్పుడుకేమాయే

మూటగట్టి మెదగోట్టే చేతులకేమాయే
బంతిగట్టే కాడేడ్ల మూగనవ్వులకేమాయే
బరువులంటే ఎరుగని చెమట కండలకేమాయే
కాయకష్టం ఇష్టమయిన నష్టమవని కన్నులకేమాయే


ఆకలిమానిన పల్లెబతుకులు ఆగమాయే
కూలిలేక కూడులేక కూలిన కూతలాయే
మారినలోకంల మారని అతుకుల బొంతలాయే
అన్నిటికి అన్నివుండే అన్నాయానికి ఆకలాయే !


కృష్ణ మణి I 04-05-2014    

ఎదురుచూపు


___________________కృష్ణ మణి

నన్ను కాల్చి నన్ను కొట్టి నన్ను ఒంచి
ఒక ఆకారాన్ని ఇచ్చి
నన్ను మనిషికి మిత్రున్ని చేసిన చేతులకు వందనాలు !

బతుకు నడకలో మనిషికి తోడునై
నేలకు గాట్లు పెట్టె నాగలి మొననై 
కలుపులేరే కల్వారనై
పంట కోసే కొడవలినై
యంత్రమై
నాగరికతలో భాగమై
మనిషి ద్వారా ఎంతో ఎదిగాను కాని ,

మనిషి అనాగరిక లక్షణాలను మాత్రం వదలలేదు
అందుకే మల్లి కణకణ మణి నిప్పుల కొలిమిలో దాగి కూర్చున్న  
కమ్మరి మనసున కసిని చూస్తున్న
లోకం తీరులో చీకటి బేతాలలను చూస్తున్న !

బీదల బిక్కుల బాదల కేకలు వింటున్నా
కన్నవారినే కడతేర్చే కసాయి పాపాత్ముల చూస్తున్న
బేలపై అడివి మృగాల ఆకలి చూస్తున్న
తెల్ల బట్టల్లో మెరిసే నల్లని మనసుల్ని చూస్తున్న
ఆన్యాయాన్ని ఆటగా చూసే వెకిలి నవ్వుల నోళ్లను చూస్తున్నా !

నీచుల తలలు నారికే గండ్ర గొడ్డలిగా మారాలని చూస్తున్న
చేతినేత్తి నన్ను పట్టే మనిషి కోసం ఎదురు చూస్తున్నా !

కృష్ణ మణి  I 06-05-2014


తెలియని లోకం


______________________________________ కృష్ణ మణి

గగన శిఖరాన్ని ఎక్కాలని
కాని ఏ దారిలో ఎంత దూరం పోవాలో తెలియదు
తామరాకుపై నీటి బిందువునై తిరగాలని
కాని గాలివాటానికి ఆకు ఒంగుతుందేమోనని భయం
భూగోళం మధ్యలో జరుగు విలయాన్ని చూడాలని
కాని ఎలా వేళ్ళాలో తెలియదు
పువ్వులో పడుకోవాలని
కాని తేనెటీగ వస్తుందేమోనని భయం
కొబ్బరిలో నీటినై ఒదగాలని
కాని గమ్యం చేరే దారి తెలియదు
తెప్పలపై తేలియాడాలని
కాని నన్ను మోస్తాయో లేవోనని భయం
ఎదుటివారి మనసును చూడాలని
కాని ఏ గాజు వాడలో తెలియదు

తెలియని లోకంలో పయణం
అడుగడుగునా భయం !

కృష్ణ మణి I 10-05-2014







మానవ కాకి


_______________________________కృష్ణ మణి
మానవ వికృత విలయాన్ని చూసి
లయకారకుడే లబలబమన్నాడు
సిగ్గులేని మానవకాకి శృంగారానికి వరస ఏదైతేనేమన్నాడు
వయసేదైతేనేమన్నాడు
పసి ఆకులను చిదిమేసిన చచ్చువెదవ !

కనికరంలేని కసాయికేది దొరికిన వదలడు
పాపం కళ్ళులేని కత్తికేమి తెలుస్తుంది కోసేది పీకని
శవాల దిబ్బల ధర్మాసుపత్రి
డబ్బులు రాలందే చచ్చిన మనోడు బయటకు రాడు
దాపులేని బతుకుకు రోడ్డే దిక్కైతే
లారీ టైరు కింద ఇస్త్రీ !

ఆకలికడుపున ఆపద్బందువని కొట్టిన జేజేలు
ఓటువేసేటప్పుడు గుర్తుకొచ్చేది వెయ్యినోటు సారసీస
మనోడు ఏమిచేయ్యకపోయినా సరే పక్కకులంవాడు రావొద్దు
గద్దెనెక్కిన గలీజోడు దిగేదాకా పందికొక్కు
మానవత్వం మరచిన మనిషి మరుభూమిలో పురుగు !

కుళ్ళిన లోకంలో కురువని విషం ఎక్కడా ?


బతుకు గంప


____________________________కృష్ణ మణి  
గడ్డిపోసలమీద నీటి చుక్కలోలె
బతుకుగంపనెత్తిన చమట చుక్కలు  
సదువుసంధ్యల్లేవు కాలరెగరెయ్య
కన్నకష్టమే నడుపు నెత్తుటి యంత్రాలను !

పోదుగల్ల లేవంగ
బొగ్గునోటికివెట్టి నాలికపాసును గుంజి
గంజిమెతుకుల తోడ సద్దిసంకకుబెట్టి
తోవ్వనడువును సూడు పంటకాలువలెంట !

కాడికి ఎడ్లను గట్టి నాగలిని జతకుబెట్టి
సూరుడెలిగిపొంగ ఒంటి పాటలకూత
నీల్లుతాగిన ఆకు  పానమైనా సూపు
అలసిన పెయ్యికి చెట్టు నీడ దాపు !

పెడ్లాం మురిసేను
నిండిన బిడ్డల పొట్టలు
ప్రేమఒలికినకాడ చెమట నవ్వే
గడప నిండినగాని కడుపు ఎండిన మాటే  
కష్టమమ్ముడుగాక రొట్టేమీది కారమే !

కృష్ణ మణి  I 13-05-2014  


   

కష్టకాలం


_______________________________కృష్ణ మణి

‘’ పక్కోడి కళ్ళలో కష్టాల్ని చూసాను
అవి నాకేసి నవ్వుతున్నాయి
నాకున్న వాటితో పోల్చితే ఇంకా పెద్దవని అహం
వాడిని ఓదార్చి ఓదార్పు పొందాను ’’ !
                                       
చిరిగిన బట్టల్లో నలిగిన మనసులు
పురుగుల మందులతో పార్టి చేసుకొనే మొనగాళ్ళు
పుస్తకాల చెలికాడి పిచ్చి ముదిరిన మాటలు
పెంటకుప్పలపై పసికూనల కూతలు !

చిల్లర దక్కని బిచ్చగాడి బిక్క చూపులు
సిగ్నల్ పడ్డా అమ్ముడుపోని జాతర
పట్ట పగలైనా ఖాళి కాని ఇడ్లి గిన్నెలు
స్కూల్ గేటు పక్కన ఎండిన సంత్రాలు !

ఎత్తైన భవనంపై అలసిన ఇసుక సంచులు
ఫారిన్ బూట్లకు కుట్లు వెయ్యలేని సూది   
తిరగని చక్రం కదలని కుండలు
బొగ్గుల కొలిమిలో నిండిన దుమ్ము !

కష్టానికే కడుపోస్తే పుట్టేది ఏంది ?


కృష్ణ మణి I 15-05-2014    

ఉడుకు


note : ఓ మిత్రుడి సంభాషణతో మనస్తాపానికి గురి అయి రాసిన చిన్న కవిత , అన్యదా భావించవద్దు 

ఉడుకు
______________కృష్ణ మణి

దక్కనులో దుక్కులు
అయ్యా మీరు ఎత్తులో ఉన్నారు
మీ పైన పారేనీరు కిందకు దిగుతుంది
మీరు పదెకరాలు పారిస్తే 
కింద మూడొందల ఎకరాలు పారించోచ్చు
ధాన్య ఉత్పత్తి కావాలి
మీ చావులు అక్కరలేదు కేంద్రానికి
అని పలికిన మిత్రుడి అహంకారం

మా చావులు మీకక్కరలేదా ?
ధాన్య లాభం కేంద్రానికా ?
లేక మీ కోటలకా ?

కరెంటుతో నీటిని ఎత్తి ప్లోరైడ్ ను కడగొచ్చు
గతిలేని కాడ మీకు కరెంటు నీళ్లాని కుంటి నవ్వులా ?

ఇదే కదా దశాబ్దాలుగా మా వెతలు
ఇదే కదా చావలేని తనాన దుబాయి నడకలు
ఇదే కదా చచ్చి రగల్చిన బొగ్గుల కొలిమిలో పత్తి గింజలు !

మీరు మీరే
మీది మీదే
మాది మీదేనా ?

ఆగని కన్నుల దారల వాగులో ఆటలాడే తుంటరులు
మా ఉద్యమం సరైనదే అంటారు
మరి అంత ఉలుకెందుకు ?
ఉడుకెందుకు ?

పగిలింది మోసపు అద్దం
పోయింది గ్రహచారం 
అయినా చింత చచ్చిన పులుపు చావని వైనం !

మానవత్వం లేని మనసుల మంచి కోరే మిత్రులం
పొందిన విజయానికి మా చిరుమందహాసాలు
మీకు వికటాట్టహాసాలనిపిస్తే
అది మా తప్పు కాదు
అనగని మీ అహంకారానికి సూచకం

కృష్ణ మణి 18-05-2014

యోగం


______________కృష్ణ మణి

రోగి ఎవరు ?
భోగి ఎవరు ?
యోగి ఎవరు ?
చింతల పల్లకిలో తిరిగేవాడు రోగి
భౌతిక సుఖాలను వేటాడేవాడు  భోగి
ఇద్దరికీ అంటని
చిదానందంలో చిందులేసే వాడు యోగి !

నిర్గుణం నిరాకారం
నిర్మలం నిశ్చలత్వం
ఆత్మ సాక్షాత్కార ధ్యానం
నిత్య శోధన యాత్ర యోగం !

రోగి అయినా భోగి అయినా
యోగి చిద్విలాస వెలుగు ముందు చీకటి !


కృష్ణ మణి I 

స్కూల్ పిల్లలు


___________________ కృష్ణ మణి

లేలేత బొక్కల మీద ఏనుగుల మోత
సదువులేమోగాని స్కూల్ డ్రెస్సుల రోత
కనికరం లేని కాన్వెంటు స్కూల్ కోత
మెదడున A B C D ఎలుకల వేట !

హోంవర్క్ చెయ్యలేదని గుడ్లెర్రజేసిన సారులు 
బిక్కచూపుల లేత మొగ్గల కండ్లళ్ళ వాగులు
ఆటలంటే అలవని పసి తనపు తనువులు
ఆనాటి అల్లరి పిల్లల ముద్దుల బిడ్డల నవ్వులు  !

అంతుచిక్కని గజి బిజీ పజిల్ పరుగులు
బతుకు నేర్పు నేర్వ భుజాన బరువు మోసి
బుడి బుడి నడకల ఆడే ఆటలో పాడే పాటలు
అలసి అమ్మజేరి ఒడినాడు మెరిసే కన్నులు  !


కృష్ణ మణి I 22-05-2014

చిన్న మనసు


*************

అగసూడు అగసూడు అందమైన అంగడి
అమ్మకొంగు వట్టుకొని అడుగు మీద అడుగేస్తి
సంచివట్టి అమ్మ నింపె వారందాక కడుపులు !

దిక్కులు వట్టి నా మొకం మెరిసిపోతి మనసున
నెత్తిమీద టోంగ గొట్టి అమ్మగుంజె ముందుకు !

శనగ పల్లీలు తెల్లమురుకు పెద్ద పాపడ
కడుపుగోకి అడిగిన ఓపలేక పానము
చిల్లర సదిరి ఇప్పిచ్చే కారం బఠానీలు
దవడలు గుంజె ,కడుపు నిండె
అయినా మనసు నిండలేదు !

పక్కపోరడు నాకవట్టె పాల ఐస్క్రీం
కారే చుక్కల వట్టి సప్పరిద్దమంటె
ఉరిమురిమి సూడవట్టె పిల్లిమొకపోడు !

నెత్తిమీద సంచెత్తి ఎడమచేతిల నన్నుపట్టి
నడసవట్టే మాయమ్మ
జాతర దాటి ఇంటికి తోవ్వవడితే నడవనంది పానము !
అంగట్ల నడవనంటె మల్ల వారం తోల్కరాదని
బిగవట్టిన చెమ్మ తుడిషి
అమ్మ చేతినదింపట్టి ప్రేమతోడ అడుగులు !

కాళ్ళు గుంజంగ ఇల్లు జేరితి
దూపకు చెంబెత్తి దించితి
సాప మీద కాళ్ళు సాపుకుంటే  
ఒళ్ళు మరిశిన నిద్దురాయే !

కృష్ణ మణి I 23-04-2014



బలిరాజు


__________________కృష్ణ మణి

హోటల్ ముందు చేతులెత్తిన ఎండిన మొహంతో పసి మొగ్గ
చిల్లర జల్లెడలో చిన్నబోయిన చిట్టికన్నులు
పసితనపు ఛాయలు మరచిన బతుకుజీవి
బతుకు కోసం బతుకుతూ
బతుక నేర్చిన అతుకుల చెడ్డి  !

గుడి మెట్లు నాయేనంటాడు
దర్గా మెట్లు నాయేనంటాడు
నలుగురు కలిసే చోటు ఏదైనా
కల్మషం లేని బిక్కచూపుతో !

ఆకలికేకల ఆరాటం
చిల్లర అలికిడితో చిద్విలాసం
నెత్తిన పేనుల పరుగులు
చేయ్యిచాచి బతిమాడు అడుగులు !

నిండిన రోజున మహారాజు
ఎండిన రోజున బలిరాజు
కులం మతం ఎరుగని కుసుమం
భాష వేశం తెలియని కనకం !

నాకెవరు లేరని చింతరాని చిరుప్రాయం
అందరూ నావారని కుక్కలతో సహవాసం
చిల్లర అందిన క్షణాన దిగులు మరచినవైనం
నడిరోడ్డుపై కళ్ళముందు కరుగుతున్న బాల్యం !


కృష్ణ మణి I  09-06-2014 

బంతిపూల వెలుగు

బంతిపూల వెలుగు
____________________కృష్ణ మణి

బతుకమ్మ ఆటల బంతిపూల జాతర
పసుపు కుంకుమలతో పోతురాజుల రంగేళి
జానపదుల కోలాటం అచ్చ తెలుగు విన్యాసం
పౌరుషాల పురిటిగడ్డ విప్లవాల పోరుగడ్డ !

నైజాము సర్కారుకు నిద్రమాన్పిన తుపాకులు
కర్కష రజాకార్ల కత్తులపై జారిపడిన వీర చరిత
ఖ్యాతిని అదిమిపట్టిన కుసంస్కారుల బాగోతం
మండే సూర్యున్ని అరచేతిన ఆపగలేని నిస్తేజం !

గలమెత్తిన కవిగాయక సబ్బండ జాతుల బాణాలు
త్యాగాలకు మచ్చుతునక తెలంగాణా పోరు బిడ్డ  
ఢిల్లీ ని వణికించి కరిగించి సాదించిన ఉద్యమం
నవతరానికి కొత్త పాఠం భోదించిన ఈ విజయం !

ఘనమైన ఈ గాధ లోకానికి దిక్సూచి
స్వరాష్ట్రంగా అవతరించి నిలుపుకుంది ఆ కీర్తి
ఉజ్వలమవు ఈ రాష్ట్రం నలు దిశల పేరు పొందు
సెలయేరుల పరుగులతో పచ్చగుండు ఈ ప్రాంతం !




బంతిపూల వెలుగు ____________________కృష్ణ మణి బతుకమ్మ ఆటల బంతిపూల జాతర పసుపు కుంకుమలతో పోతురాజుల రంగేళి జానపదుల కోలాటం అచ్చ తెలుగు విన్యాసం పౌరుషాల పురిటిగడ్డ విప్లవాల పోరుగడ్డ ! నైజాము సర్కారుకు నిద్రమాన్పిన తుపాకులు కర్కష రజాకార్ల కత్తులపై జారిపడిన వీర చరిత ఖ్యాతిని అదిమిపట్టిన కుసంస్కారుల బాగోతం మండే సూర్యున్ని అరచేతిన ఆపలేని నిస్తేజం ! గళమెత్తిన కవిగాయక సబ్బండ జాతుల బాణాలు త్యాగాలకు మచ్చుతునక తెలంగాణా పోరు బిడ్డ ఢిల్లీ ని వణికించి కరిగించి సాదించిన ఉద్యమం నవతరానికి కొత్త పాఠం భోదించిన ఈ విజయం ! ఘనమైన ఈ గాధ లోకానికి దిక్సూచి స్వరాష్ట్రంగా అవతరించి నిలుపుకుంది ఆ కీర్తి ఉజ్వలమావు ఈ రాష్ట్రం నలు దిశల పేరు పొందు సెలయేరుల పరుగులతో పచ్చగుండు ఈ ప్రాంతం !

దేవుడా


______________________కృష్ణ మణి
ఏమిరా దేవుడా
నరకాన్ని పెంచినవు
స్వర్గమెక్కడ దాషినవు ?
నువున్నావో లేవో తెల్వదు కాని
ఆడుండని ఈడున్నడని
రాతి బొమ్మలో అన్నడని
కాదు దర్గాలో చెద్దరు కిందని
కాదు  జీసస్ క్రాసులో అని !

ఇంతకీ నువ్వెకడరా తండ్రి ?
మనషుల ముంగల రావు
ఏది నిజమో చెప్పవు
పరెషాన్ చేస్తున్నవ్ పాగల్ గాళ్ళను !

ఎవరిని నమ్మాలే ?
ఏ తొవ్వల పోవాలె ?
అసలు ఎక్కడికి పోవాలె ?
ఆది అంతం లేనోడివంట
రంగు రూపం లేదంట !

పుట్టించినవు నడిపిస్తున్నవు సంపెస్తున్నవు
ఏం ఆటలా ?
నువ్వేమన్న పచ్చీసు అడుతున్నవా ?
లేక చెస్సు ఆటనా ?  

జంతులకు లేని బేదాలు మనషులకేందుకో ?
అవింక నయం ఆకలి పోరు తప్ప అంకారం లేదు
ఒకనికోకనికి పడకుండా జేస్తున్నవు
ఎవరిని గెలిపించనీకే ?
ఎవనిమీద కోపం ?

బయటికొచ్చి బాజాప్త జెప్పు ?  


కృష్ణ మణి I 11-06-2014 

14 ఆగస్ట్

(14 ఆగస్ట్ ఎలా జరుపుకుంటారు ? అని అడిగిన విలేఖరితో ఓ పాకిస్తాన్ మహిళ చేసిన ఉద్వేగ పూరిత ప్రసంగం .
తర్జుమా చేసి స్కెచ్ కవితగా మార్చే ప్రయత్నం చేశాను )

14 ఆగస్ట్
________________కృష్ణ మణి

విలేఖరి :14 ఆగస్ట్ ఎలా జరుపుకుంటారు ?

14 ఆగస్ట్ నాకు గుర్తు లేదు
ఎలా జరుపుకుంటాం ?
ఆ అవును జరుపుకునే వాళ్ళం ఒకప్పుడు 
ఇప్పుడు శవాలను మోస్తున్నాం
ఇప్పుడంతా ఈ ప్రాంతంలో ఇక్కడ కాకపొతే పక్క వీధిలో
అరుపులు కేకలు వింటున్నాం
తెలుస్తది రోడ్డుపై ఎవరో చనిపోయారని
వినవస్తది ఇక్కడ ఎవరో ఎవరినో చెంపెసినట్టు
కేవలం ఇదే జరుపుకుంటున్నాం ఇప్పుడు !

కేవలం ప్రభుత్వ వైఫల్యాల అగౌరవ సంబరాలు చేసుకుంటాం
ఇక్కడ ఆకలితో నగ్నంగా పడిఉన్నారు జనాలు !
వాళ్ళు ఆకాశంలో చక్కర్లు కొడుతుంటారు
అదే జరుపుకుంటాం ఇక్కడ , ఇంకా జరుపుకోవడానికి ఏముంది ?

ఎక్కడి స్వతంత్ర దినోత్సవం ?
అవును వాళ్ళు జరుపుకుంటారు
ఎవరి వారైతే తనువు చాలించారో ముందుగా
అన్ని దుఖాలనుంచి అన్ని కష్టాలనుంచి స్వతంత్రులైనందుకు
దేవునికి ప్రియమైనందుకు !

పాకిస్తాన్ ఇందుకోసం తయారు చెయ్యలేదు తమ్ముడూ
చెప్పండి వాళ్లకు ఎవరైతే హాయిగా తిరుగుతున్నారో
చాల గొప్పగా నగ్న హృదయాలతో  
వారికి ఏమి పట్టదు ఏం జరుగుతుందో ? ఏం చేస్తున్నారో ?
అందరు చావాలి  అందరు పోవాలి ఒకరోజు !

పాత్రికేయుడు :ఆ రోజు ఏదైనా దేవునికి దీపం వెలిగించడం లాగా .....

ఎలాంటి దీపం వెలిగించను ? ఎందుకు వెలిగించను ?
నా తోటి వారి ఇండ్లలో శవాలు లేస్తుంటే
అసలు ఏమని జరుపుకొను ?
చుట్టుపక్కల మంచిగా ఉండి , జనులెవరు ఆకలితో చావకుంటే
మన భోజనం మంచిగనిపిస్తుంది కదా .
వాళ్ళు చేసుకుంటారు ఎవరికైతే మనసు ఉండదో
మనసున్న వాళ్ళం మావల్ల కాదు !

పాత్రికేయుడు : స్వతంత్రం .......

మల్లి స్వతంత్రమంటారు
ఇక్కడ మనషులు వరదల్లో కొట్టుకుపోతున్నారు
ఇక్కడ జనం నడిరోడ్లో బాంబు పేలుల్లకి శవాలవుతున్నారు

విలేఖరి  :అలా కాదు మీరు ఒకసారి పాకిస్తాన్ జిందాబాద్ అనండి  

పాకిస్తాన్ జిందాబాద్గానే ఉంటుంది మనమున్న లేకున్న ఖాళి ప్రాంతంగా
ఈ ప్రజలు దిన దినగండంగా పోతునే ఉంటారు !

కృష్ణ మణి I 28-05-2014

  

నా ఏడుపు


____________________________కృష్ణ మణి
ఆకాశం అట్లనే ఉంది మొన్న జూసినట్లు
చుక్కలు మెరుస్తునే ఉన్నయి
తెప్పలు తిరుగుతునే ఉన్నయి
కాని పచ్చని పంట పొలాల నా ఊరు
ఇప్పుడు పట్నమై ఏడుస్తుంది !

నాగరికత నా చెట్లను మింగింది
నా నేలను మింగింది
నా గాలిని గలీజ్జేసింది
కంపనీల మన్నువడ నీళ్ళను మింగి ఇషమిడుస్తుంది
రుపాయిబెట్టి నీళ్ళు తాగితే పానమంత కలకల !

అడుగున గుంత కొట్టి ఆకాశానికి మెట్లుగట్టినట్లుంది
ఆకరికి పక్షుల జాగలనుగిట్ల కబ్జా చేసిన్రు
ఇప్పుడు నా ఊరిల అడుగు పెడ్తలేను
మీద పర్శిన సిమెంటు రోడ్డు మీదే
మిషీను ఉందని సంకలుగొడుతున్రు
కరెంటు కనుమరుగైతెగాని కండ్లు తెర్వరీ పిచ్చికాకులు !

బర్లను తోలుకుదిరిగిన రోజులకేమాఎనో
మ్యాకలు గొర్లు గోడ దుంకి ఏండ్లు గడుస్తున్నయి
సుద్దమంటే జూపార్క్ పోవలెనేమో
భూములకు రెక్కలొచ్చి జీవుల డొక్కలు దేలినయి
ఇప్పుడు కప్పలు కూడా కండ్లవడ్తలేవు
ఎడ్లబండి కనిపిస్తే వింతగ సూస్తున్రు మా పిల్లలు !

నీళ్ళు లేక బోర్ల పోక్కలెండేకాడికొచ్చింది లోకం
ఆప్పట్ల ఏడ సూడు బొందలల్ల అద్దం ఉంటుండే
వాగోస్తే పర్కపిల్లల ఏట ఉంటుండే
సలోస్తే చిత్తలకాయల కాల్చుడు ఉంటుండే
ఎండొస్తే తాటిముంజల ఆకలున్టుండే !

నడూర్ల కూసోని మంచి చెడ్డ మాట్లాడుతుండే
ఇప్పుడు ఎవడన్న కూసుంటే ఎక్కిరిస్తున్నరు
కాముని కాల్చేకాడ కరువైన జనాలు
గణేశులకాడ భజనలు చేసి శానోద్దులైతుంది
పాడుదమంటే పక్క పాడేటోడు గతిలేడు !

గతిలేని గావరాలా మరి బలిషిన బలుపా
ఊర్ల మనషుల్ని కల్వాలంటే బోనాలకో లేక బతుకమ్మకో
అదిగూడ ఇంకెన్ని రోజులో సూడాలే !
 

కృష్ణ మణి I     06-06-2014