Sunday, April 29, 2018

మృగకేళి

మృగకేళి
________________కృష్ణ మణి

చీకటిలో ఏమి కనిపించదని మొబైల్ టార్చ్ వెలిగించాడు
ఏంటి కొత్తగా ముందెన్నడు చూడనట్టు అంటూ కొంటెగా లాక్కుంది దగ్గరకు

వాడు వివస్త్రను చెయ్యడానికి
వెకిలి చేష్టలతో కవ్విస్తూ నవ్విస్తూ
దుశ్శాసన పర్వాన్ని దిగ్విజయంగా కానిచ్చాడు
కామంతో ఉన్న తనువు సిగ్గుతో ఓడి
ఆలస్యం చెయ్యమాకు ఎవరైనా వస్తారంది

సిగ్గరి అందాల అణువణువును తడిముతూ చూస్తున్నాడు
కామసూత్రలోని భంగిమలన్నీ ప్రయత్నించాడు
కామోద్రేకానికి సాక్షంగా వాడి వీపుకు గాట్లు పడి రక్తం కారింది
అలసిన దేహాలపై చమట నాట్యం చేస్తుంటే
వాడు టార్చ్ ని ఆఫ్ చేసాడు

విడియో అయిపోయింది
ఆ పడతి మానం మార్యాద అంగట్లో ఆట అయ్యింది
వాడెవ్వడో అని వెతికితే మోహం కవర్ చేసుకోలేడు తెలివిగా
ఆడవాళ్ళ పరువుతో ఆటలాడుతున్నానని తెలిసే చెస్తున్నాడు వాడు

ఇలా ఇంటర్నెట్లో వాట్సాప్లలో చక్కర్లు కొడుతున్న అవమానాల యన్నో
సమాజంలో పరువుకోసం  దూలానికి ఊగుతున్న మాన ప్రాణాలెన్నో

ఇక్కడ ఎవరిని హెచ్చరించాలి ?
ఏమని హెచ్చరించాలి ?

కృష్ణ మణి

Saturday, April 21, 2018

ముళ్ళ తోవ

ముళ్ళ తోవ
______________కృష్ణ మణి

క్షణాలు మెల్లగా జారుకున్నాయి
ఏ స్థితిలో కూడా స్తిరంగా ఉండమని
కాని మనసులో పడిన ఆ స్థితి తాలుకు ముద్ర
గుండె ఆగే వరకు పోనని ఫత్వా ఇచ్చింది

గోడలపై రాతలు చెరిగిపోతాయి కాని
మనః పుస్తకంపై కోతలు అంత త్వరగా మానవు కదా
మనసు వాటిని జయించనంత కాలం
అవి రోజుకో రూపంలో పడుతూనే ఉంటాయి

నీ గుండె చెరువై
బరువై
గడ్డకట్టుకపోయి
నిరుత్సాహం వెంటాడి ఎక్కిరిస్తుంది

కసిగా తలెత్తి సమస్యకు ఎదురు తిరిగినప్పడు
కొండలాంటి సమస్య
ఏనుగు ముందు చీమలా తలవంచితే
దారి విశాలంగా ప్రస్పుటంగా కానవస్తుంది

ఓర్పు ఎప్పుడూ పరీక్షిస్తుంది
అది సమస్య లోనైనా
సమాజంలోనైనా
ఇది ప్రమాదమైనది కూడా

ఓర్పు తగ్గినప్పుడల్లా
తోక నలిగిన పాములా
ఆవేశం కట్టలు తెంచుకొని
నిన్ను పూర్తిగా భస్మం చేస్తుంది
అంతేనా
నీ భస్మం తాలుకు సెగలు
నీ వాళ్ళనూ దహించివేస్తుంది

బొంతపురుగు స్థితిని దాటితేనే కదా
నీవు సీతాకోకచిలుకలా మెరిసేది

కృష్ణ మణి

నిర్జీవి

నిర్జీవి
__________కృష్ణ మణి

నగ్నంగా నడిరోడ్డులో శిలలా నిలబడ్డాను
మీ ఇష్టమైన రంగును పూయండి
మీకు నచ్చిన బట్టను కట్టండి
మీ జెండా
ఎజెండాలను రాయండి

కాని చిన్న మాట
వేషం వేసినంత మాత్రానా
మీ మతానికి ప్రతీకను కాను
మీ పార్టీకి ఆధారాన్ని కాను
కేవలం
ఒక తీగను మరో తీగతో కలిపి ఉంచి
మీ వెలుగు నింపడమే తెలిసిన నిర్జీవిని

నన్ను
నాలాగే ఉండనివ్వండి

కృష్ణ మణి

మనిషితనం

మనిషితనం
_____________కృష్ణ మణి

మతం గొప్పని
లోకానికి మన మతం దిక్కని చెప్పే ఓ పెద్దలారా
చెప్పున్ని
ఒక్క మాటడుగుతా
చెప్పున్రి

చెప్పు బాపణయ్య
మన మతమెంత గొప్పదో
గుడిల పూజలు నువ్వు జేస్తెనే పలుకుతడంటగదా
స్పర్శ లేని రాయి దేవుడు
మా కన్నప్ప బీరప్పలకు పిలవరాదు గదా నీలెక్క
మమ్ముల జూసి ఇషీషి అంటవు గానీ
మా పోషమ్మ కాడ పైసలొస్తయంటే
పిర్రలుగొడతవు కదా సామీ

అందరమొక్కటే అయితే
మా పోరడు నీఇంటి అల్లుడెందుకుగాడో చెప్పు సామీ

చెప్పు పటేలా
మా రెడ్డి సాబు.... ఓ రాజవర్మ
ఓ నాయుడప్పా చెప్పు
ఇప్పటికీ
ఊర్ల నీ పెత్తనమేనా ?

చెప్పు
కుమ్మరి కమ్మరి మంగలి చాకలి
డక్కలి బ్యాగరి మాల మాదిగలందరూ
నీ బాంచనలేనా ?

చెప్పు
మీ పిల్లతరానికి గూడా ఇషం నింపి
కులం గుంపులు కట్టిపిస్తున్నవుగా బాంచన్

మీ తాతకు
మీ అయ్యకు
నీకు‌ పనిబాటలొల్లమేగా
మీ ఉపాది ఓటర్లమే్గా ?

మా సౌకబాసం వడ్డీలకేనా 
అసలు కోసం
రేపు నీ కొడుకుకు గూడా ఊడిగం చెయ్యాలెనా ?

అందరమొక్కటే అయితే
మా పిల్ల మీ కోడలెందుకు గాదో చెప్పు దొర

మీమేది తినాలెనో మీరే చెప్తరా
మీమేది గట్టాలెనో మీరే గీస్తరా

చెప్పున్రి
ఒక్కటవుదమంటే అవ్వనీకే
ఏండ్లకేండ్లు ఎదురుసూస్తున్నం
ఇంకెంతకాలం సూడాలెనో చెప్పున్రి ?
ఎంతగనం భరించాలెనో చెప్పున్రి ?

కులం గోడలు కూలితేనే
మతం గోడలు గట్టిగుంటయి
మతం గోడలు కూలుతేనే
మనిషి బతుకు సక్కగుంటది

చెప్పున్రి
ఏమన్నా తప్పు జెప్పి
గుండెల తన్నిన్నా
చెప్పున్రి

కృష్ణ మణి

ఆకలి రక్తం

ఆకలి రక్తం
_______________కృష్ణ మణి

మిత్రులారా
పదండి ముందుకు
కాని ఒక్కసారిగా వెళ్ళి
కుప్పకూలకండి
కొందరు కొందరుగా వెళ్ళండి

మన యుద్ధం కడుపునింపుటకు మాత్రమే కాని
కడుపు శోకానికి కాదు
మన జీవనాధారం వాళ్ళు
కావునా
కాసింత సున్నితంగా పొడవండి

ప్రత్యర్ధికి తెలిసినన్ని విద్యలు మనకు తెలియవు
చాలా తెలివైన వారు
వారి శరీరాలను తూట్లు పొడిచి
ఎంత రక్తాన్ని తాగినా
వారి తెలివిలో కొంతనైనా పొందలేకపోతున్నందుకు
చింతించాల్సిన విషయం

కాలకేయుని సైన్యలా
మన వికృతరూపం
వారిని భయపెడుతుందంటే
మనలను ఎదుర్కునే క్రమంలో
అడ్డుతెరలను కట్టి కులుకుతూ
మనలను పిచ్చి వాళ్ళను చేస్తున్నారు
అవమానంతో కూడిన అసహనం మనది

వారి ఆయుధ సంపత్తి
మాములుగా లేదు సుమా !
రసాయనిక ఆయుధాలను కొన్ని
జెట్ వేగంతో ప్రయోగిస్తారు కొందరు
మరికొందరు
విద్యుత్ ఘాత ఆయుధాలను సమకూర్చుకొని
ఎదురుదాడి చేస్తూ
మనవారిని భస్మం చేస్తున్నారు

మిత్రులారా
ఆకలి పస్తులతో
మన జీవణ పోరాటంలో
మనకున్న మేధస్సు
తెలివికే తెలివితేటలు నేర్పే మనషుల మెదడుతో సరితూగదు

పదండి వారికి దూరంగా
అక్కడెక్కడో
భారీ జంతు సమూహాల రక్తం వాసన ఊరిస్తుంది

కృష్ణ మణి

హంటింగ్ ఫర్ లస్ట్

హంటింగ్ ఫర్ లస్ట్
_____________________కృష్ణ మణి

ఏయ్ ....గుడ్లగూబ
నన్నలా చూడకు కామంగా
బట్టలు మార్చుకుంటుంన్నాను
తప్పని స్థితిలో నలుగురిలో ఇబ్వంది పడుతూ

పవిత్ర పుణ్య క్షేత్ర సమూహిక స్నానాల చోట
నిత్యం ఎన్నో మానసిక విశృంఖల మానభంగాలు
లెక్కకు అందనంతగా జరుగుతూ
మహిళల మర్యాదను అడగడున భూ స్థాపితం చేసే మానవ మృగాల కోలాహలం ఎటుచూసిన

చూడటానికి మహా భక్తునివే సుమా
ఆ విషయం కనిపించని భగవంతునికే ఎరుక

జనారణ్యంలో ఉన్నా
నీ మస్తిష్కంలో అడవిలో వివస్త్రగా
నీ నుండి తప్పించుకుని పరిగెడుతుంటాను
దొరకబుచ్చుకొని చేసే బలాత్కార శబ్దాలు
నింగిని చీలుస్తుంటుంది ఆర్ధతగా

నీతో పాటుగా నీ భార్య పిల్లలు వచ్చి వుంటారగా
లేకపోతే ని ఇంట్లో అక్కో చెల్లో ఉండే ఉంటారుగా
చీర కొంగే నా మర్యాదను కాపాడే రక్షణ
నా చనుమొనలపై నీ దృష్టి పడకుండా కాపడుకున్నా
చంకలో వంకరచూపులు ఈటళ్ళ గుచ్చుకుంటున్నాయి

ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో
అక్కడ దేవతలు ఉంటారా ?
కానీ దైచద్శనానికి వచ్చిన దేవుని ఆలయం వద్దనే గౌరవం లేకుంటే
అక్కడ దేచుడు లేనట్టే కదా ?

కృష్ణ మణి

నా శ్రీ దేవి

నా శ్రీ దేవి
________________కృష్ణ మణి

నా తండ్రి వయసువారందరి మతులు పోగొట్టి
నిద్ర చెడగొట్టి
కమ్మని కలలను అందించావు

అప్పటి బ్లాక్ అండ్ వైట్ టివిలో
నీ అందం అమోఘంగా కనువిందు చేసేదంట
కౌమరంలో కలర్ బొమ్మ చూసాకే తెలిసింది
నీవెంత అందాల భరణివో

ఆరో క్లాసులో ఉండగా
స్కూలెగ్గొట్టి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను
థియేటర్ లో పెద్ద స్క్రీన్ పై నీ అందాన్ని కళ్ళార్పకుండా చూసా
అప్పటి నుండి ఇప్పటికీ
ఈ సినిమా ప్రపంచంలోనే నీకు పోటీలేదని
సాటిరారని నా విశ్వాసం

నీ అందాన్ని వర్ణింప
నే తగినవాడను కాను

ఇక లేవని మాటే కటువుగా
ఎదో కోల్పోయానన్న అలోచన

నా స్నేహితురాలిగా
ప్రియురాలిగా
నా అంతరాళంలో నీ పలకరింపులిక ఉండవేమో
నీ చెక్కిలిగిలి పొందనేమో

బైబై నేస్తం
బైబై దేవి
బైబై నా శ్రీ దేవి

మదార్ జాన్ మామ

మదార్ జాన్ మామ
________________కృష్ణ మణి

సైకిలు క్యారీల్ మీద కూర గంపను చూసి
ఇంటికి పరిగెత్తి అమ్మతో అనేది
అమ్మ అమ్మ మదార్ జాన్ మామ వచ్చిండని

వెలుగుతున్న మొహాలను ఆర్పలేక
నాయిన వొచ్చినంక
పొద్దుమీకంగ గుడ్లు తెప్పించుకుందామని
సముదాయించింది

ఎదో ఒకటిలే అనుకొని సర్దుకొని
ఆటలో అడుగుపెట్టాము
అంతలోనే మా వీధిలోకి వచ్చాడు మదార్ జాన్ మామ
ఏ ... కూరే....య్  అంటూ
మళ్ళీ విచ్చుకున్న మొహాలు మావి
గంపకు ముసిరిన ఈగలకు తోడై
వాలుతున్న ఈగలకు పోటిగా మా కన్నులు

వ్యాపారం జరగక దిగాలుగా మామ
ఇంటి బయటకు వచ్చిన అమ్మతో
కొన్ని నీళ్ళియ్యి షెల్లే సరం ఎండుకపోతుందనే పలకరింపు
తోబుట్టు తనాన్ని జ్ఞాపకం చేసింది అమ్మకి
నీళ్ళు తాగిన మామ
సల్లగుండు షెల్లే
ఏడికివాయే మా బావ కానొస్తలేడు
కొలువుకు పోయిండన్నా
మా కడుపు నిండాలంటే
ఆయన భుజం తడవాలే కదా
అవును షెల్లే అంతే కదా అంటూ
తన వ్యాపారం వంక విస్సహాయ చూపులు వేళ్ళాడాయి

పలకరింపులు బాగానే ఉన్నా
మేక మాంసం ఎప్పుడు కొంటదో మా అమ్మ అన్నట్లు
మా మొహం గంపలో మునుగి
ఆవురు ఆవురు మంటు నాలుక పెదవులను తడుపుతుంది

అర్దం చేసుకున్న అమ్మ
ఎట్లిస్తున్నవన్నా కూర
ఇయ్యాల్లదే కదా అనే మాట
కొనుగోలు దారుని సహజ సందేహంలా ప్రశ్నిస్తుంది

అవును షెల్లే
కిల యాబై రుపాల్
మ్యాకపోతు కూర మంచిగుంది

పైసల్ లేవన్నా అయిదు రుపాలే ఉన్నయి
వెంటనే తడుముకోకుండా
పైసల్ ఎక్కడ వోతయి షెల్లే మీతాన
తీసుకో ఎంత గావలెనో
అనగానే మా సంతోషం
మా అమ్మ చిన్న నవ్వులో మెరిసింది

అద్దకిల ఇయ్యన్నా
అగరో సరిపోతాది కిల తీసుకో షెల్లే
సాలన్న అల నాయిన లేడు ధైర్యం జెయ్యనీకే
మల్లొచ్చినప్పుడు తీసుకుంటా అని సంచి తీసి
పైసల్ లెక్కబెట్టి ఇచ్చింది

మామ కండ్లకి ఆనందం
మొదటి బోని జరిగిందని

కూర తూకం వేసి
అర్ద కిలోకి పావు కిలో సంతోషంగా
ముక్కలు చేసి
గిన్నెల వేసి
మా చెంపలు గిల్లి
వస్తా షెల్లే అంటూ కదిలాడు మదార్ జాన్ మామ
రాత్రి అమ్మ వంట అద్భుతమని
నాన్నతో పాటు లొట్టలేసుకుంటూ తిన్నాము కడుపార

మామ ఇక లేడని తెలిసి
కంట నీరు జారకున్నా
మనసు చెరువై
జ్ఙాపకాల తుట్టెను కుదిపింది విచారంగా

కృష్ణ మణి

మృగతనం

మృగతనం
_________________ కృష్ణ మణి

మొగతానాన్ని చూపించుకోవడానికి
కులం మతం
రంగు రూపు
ఎత్తు పొడుగు
అక్కరలేదు
బలిసిన మదమనే ఈటెకు
బలవ్వడానికి ఒక మెత్తని మాందపు ముద్ద ఉంటే చాలు
అది స్త్రీ కాకపోయిన సరే
మాడ అయితే ఏంది
మగపిచ్చుకైతే ఏంది

వయసు తారతమ్యాలు లేవు
వాయివరసలు మాని చాలా రోజులవుతుంది

పుట్టిన పసిగుడ్డైనా సరే
వాడి అహాన్ని దూర్చడానికి
చనిపోయిన శవమైనా సరే
మొత్తానికి వాడు మొగాడురా బుజ్జి అనాలి

ఈ మగతనం నిరూపణ వెనుక
ఒక మతం అండ
ఒక కులం నీడ
ఒక రాజకీయ క్రీడ
ఇదేనా భారత జాతీయ విధానమా ?

ఎక్కడికి ఈ పయణం ?
ఏం సాధిద్దామాని ఈ నడక ?
ఎటు పోతున్నాము ?

మనుషులుగా ఎదిగి
తిరోగమన దారిలో
ఆదిమ మానవుడి దశకు చేరామా ఓ కావరమా?

అలా అయితే
మీ మగతనాన్ని
మీ నిస్సహాయ తండ్రులపై కూడా
ప్రదర్శించడానికి వెనుకాడని గుడ్డి జీవితాలు మీవి
చావండిరా పురుల్లాగా
శవం ఒంట్లో మసలే పాముల్లారా

కృష్ణ మణి