Saturday, October 31, 2015

సాలం కడియాలు

సాలం కడియాలు
_______________కృష్ణ మణి

చెరువు నీళ్ళల బుడుబుంగలాడెను
కట్టమీద కోయిలమ్మా పాడెను
గాలి ఊపుడుకి ఊరవిచ్చుకలు ఊగి ఊగి అరిసెను
అ కొంగ రెక్క
ఆ గొల్లబామ
ఆ మిడుత అరుపుని విని తిరిగరిసే కొండగుట్టలు సూడు !

కొంగునడుముకు సుట్టి సీరెత్తి కట్టి
బుజాన నారుకట్టలనెత్తి
గెంటీలు ఊగంగ
కడియాలు మెరువంగ
ఒరాల మీద నాట్యమాడేను సూడు ఆ పాటలమ్మలు !
  
కష్టమే నవ్వే
చెమట ఆరే సోట
కన్నులు మురుసే
పచ్చగ ఎదిగిన పంట
వెచ్చని గువ్వలు మచ్చిగయిన యాల
పడమటి దిక్కున  సూరిడొరిగిన మాపు
ఇల్లుజేరెను సూడు అలసిన ముచ్చట్లు !

ఎదురుసూపుల పిల్ల ఆకలి డొక్కలు
తల్లడిల్లిన తల్లి
పోయ్యిదించిన బువ్వ
మామిడితొక్కు
కమ్మటి పులుపు
నవ్వితూ కూన కునుకు తీసేను సూడు  
ఆలుమోగలను సూస్తే అల్లుకున్నా జడదండ
అల్లుకున్నా జడదండ
అల్లుకున్నా జడదండ ....!

కృష్ణ మణి

  


   

  

Thursday, October 29, 2015

వేట

వేట
______________కృష్ణ మణి

నిశబ్దంగా
ఒక కన్ను రాలిపోతుంది
ఈ లోకాన్ని చూడలేక
విసుగ్గా
ఒక కన్ను మూసుకుంది
ఎన్ని ఘోరాలకు సాక్షం అవ్వాలని !

మొగ్గలు
రాకముందే
చెట్లు ఏడుస్తున్నాయి
నా బిడ్డకు రక్షనేదని !

పువ్వులు
నడుస్తూ
మొహాన్ని కప్పుకుంటున్నాయి
ముల్లుల వనంలో !

చెట్టుకే
దిక్కులేక
ఆటవికుల గొడ్డల్లకు బలవుతున్నది
కదలలేని మానాన !

ఈ వేట
ఎప్పటికి ఆగునో
నరకానికి కేరాఫ్ అడ్రస్సు నరకంలో !


కృష్ణ మణి   

Tuesday, October 27, 2015

బతకడం

బతకడం

_____________కృష్ణ మణి

ఎదగడం ఎలానో తెలీదు గాని
బతకడానికి కడుపు నిండాలి
చెరువుగట్టుమీద పిట్టకైనా
నడిరోడ్డులో పిచ్చోడికైనా !

లేవమంటారు
పరుగెత్తమంటారు
అందుకోమంటారు
అక్కడెక్కడో గెలుపంటారు !

ఏమో నాకేమి అర్ధం కాని వింతమాటలు
వింత చేతలు
పొద్దునే లేసి చేల్లో నీళ్ళను మలపడం
కలుపుతియ్యడం
కొయ్యడం  
కొట్టడం
మొయ్యడం
హమ్మయ్య అంటూ సాయంత్రానికింత సుక్కేసి లోకాన్ని మరచి తనువుకు స్వేచ్చనివ్వడం !

నాకు మీసమెప్పుడొచ్చిందో తెలియదు కానీ
వానలేప్పుడు పడుతాయో
ఎండెప్పుడు మెండుగుంటుందో
చలెప్పుడు వణికిస్తుందో తెలుసు !

జీవించడమంటే ఏంటో తెలియదు
తెలిసిందల్లా బతకడమే
భూతల్లికి సేవ చేస్తూ
బతికున్నంత కాలం !

కృష్ణ మణి  





ఆకాంక్ష

ఆకాంక్ష
_______________కృష్ణ మణి

అలల్లా పేరుకున్న తెప్పలు మెరవగా
కాలం కలిసివచ్చింది నీతో జతగట్టడానికి
నవ్వుల జాజులు విరియడానికి
నీకై ఎంతలా వేచానో తోటమూలల్లో అడవి అంచుల్లో  
ఊరిచివర కొండ వంపుల్లో !

దొండపండులాంటి పెదాలపై మోజుపడితిని
పచ్చని ఆకుల్లో ఊసరవెల్లివై దాగినప్పుడు ఎంతలా వెతికానో
అగుపడినప్పుడు ఎంతలా అలిగానో కదా !

ప్రేమను తెలుపుటకు నాకు మౌన భాషనే తెలుసు
అది నీకర్దామవ్వడానికి ఎంతలా ఆలోచించావో
ఇద్దరమూ అలా అలా హాయిగా ఆకాశవీదిలో
రోజులు క్షణాలల గడిచాయి !

లోకం కుళ్ళుకుంది కాబోలు
మూన్నాల్లకే విడిపోయాము !

నా జ్ఞాపకలేవి గూర్తులేవనుకుంటాను
నా ఊహల్లో నిత్య యవ్వనంగా నవ్వుతూనే ఉంటావు తెలుసా
ముసలిదానివైనా నాకిప్పటికీ పడచుదానివే సుమా
నీ తోడుకై తిరిగి ప్రయత్నిస్తున్నాను
చివరి క్షణాలు నీతో గడపాలని ఆకాంక్షతో ....నీ


కృష్ణ మణి 

Friday, October 23, 2015

పీర్ల పండుగ

పీర్ల పండుగ
____________కృష్ణ మణి

నాకు హసన్ హుస్సేన్లు తెల్వరు
మెరుపు రంగుల పీర్ల పండుగ తెల్సు  
మలీజ ముద్దల మాధుర్యం
చెక్కరి ఫతేహ లో గులాబ్ రెక్కల ఖుష్బూ తెల్సు

పీర్ల కొట్టం ల పడుకున్న పీర్లను లేపడం
దాల్చా బాగహార వంటలో ఉన్న కమ్మదనం
ఊదివత్తులతోడ నివేదనం
గల్లి గల్లి తిరిగే పీర్సాబు శిగం తెల్సు

డప్పు దరువులో ఊగే జనాల బాదలు తెల్సు
గూడునొదిలిన పల్లె బతుకుల ఆకలి తెల్సు
ఇంగలాల మీద కష్టాల పరుగులు తెల్సు

ఏ దేవుడైతే నాకెందుకనే పసిమనసుల ఆక్రందన తెల్సు
ఆక్రందన తెల్సు
ఆక్రందన తెల్సు !


కృష్ణ మణి  

వెలుగు బంటు

వెలుగు బంటు
__________________కృష్ణ మణి

మసక చీకటి రాగానే  జత చేరి
దొంగచూపులకు కళ్ళెం వేస్తూ
నలుపును చూసి దడుసుకునే వారందరిని అక్కునచేర్చుకుంటాను !

అర్దరాత్రి రోడ్డుపై నిలువునా వెలుగిస్తూ
మోటరు వాహనానికి కన్నునౌతాను
చీకటి దారికి అభయహస్తాన్నౌతాను !

వ్యాపార ప్రకటన బోర్డుపై రాతలను అగుపిస్తూ
షాపు షాపుకు ఒక వెలుగు ముక్కనై
బతుకుకు పెద్ద దిక్కునౌతాను !

నగర అందానికి మెరుపునై  
రంగుల మిణుగురౌతాను !

వీది వీదికి మూల మూలకు గుర్ఖానౌతను
గుబులు నిండిన పిల్లల ఆటల కొమ్మనౌతాను
కుక్కల తోడునై
నిర్మానుష రోడ్డుకు సాక్షినౌతాను !

చివరాకురున మున్సిపాలిటీ నౌకరు బంటునౌతాను
ఆర్పితే ఆగిపోయే జిలుగునై
పట్నం పల్లెకు రేపటి ఆశల పల్లకినౌతను
సాయంత్రానికి మరల వెలిగిస్తే
చీకటిని తరిమే వేలుగునై బతుకు బాటనౌతాను !  

కృష్ణ మణి
  


Monday, October 19, 2015

మనసు దూరం

మనసు దూరం
______________కృష్ణ మణి

జనారణ్యంలో ఒక మనసు
మసకచీకట్లో నన్ను గుర్తుపట్టలేకపోయింది
గొప్ప మనసును హత్తుకొనే అర్హత లేదని చిన్నబుచ్చుకున్నాను !

ఆ మనసుకు అర్దమయ్యే సరికి దూరంగా సాగింది పయనం  
మనిషిని గుర్తుపట్టడం కష్టమైనదని
కలిసిన క్షణం క్షమాపణ అంటుంటే
ఈ చిన్నిమనసు కాస్త పెద్దమనసై
ఆ పెద్దమనసు ముందు చిన్నబోయింది !

అప్పుడర్దమయ్యింది
మనసులన్ని ఒక్కటని
మనషులు విడిపడినప్పుడల్లా
మనసులు దగ్గరౌతాయని !  


కృష్ణ మణి   

నానిన తడులు

నానిన తడులు
______________కృష్ణ మణి

అలలు
హలాలు
కవితలు
కోలాటాలు
****
కవితలు
సరిగమలు
భోజనం
అమృతం
***
పట్టాలు
పరుగులు
అంత్యాక్షరి
నవ్వులు
***
కవ్వింపు
మొహమాటం
సహజత్వం
తలబిరుసు

కృష్ణ మణి 

Monday, October 12, 2015

నింగి కూతురు

నింగి కూతురు
_________________కృష్ణ మణి

నింగి
తొమ్మిదిమాసాల గర్భాన్ని భరించలేక
ఇప్పుడో అప్పుడో అంటూ ప్రసవ వేదనను పిడుగుల రూపంలో మెరుస్తుంది 
ప్రసవిస్తున్న మూడు మాసాల సమయం ఎంత గుమ్ముగా ఉంటుందో
గంప దించుకొన్న తల్లిలా !

స్రవించిన చినుకు
భూ వొడిని చేరి
హత్తుకొని ప్రేమను కలుపుకొని
కమ్మగా సాగుతుంది
ఎటుసాగిన ఆప్యాయత తగ్గని నడక !

వేరునంటి
చెట్టు పచ్చని నవ్వులో భాగం
జీవి కడుపు నింపి తీర్చును  దాహం !

అడుగంటిన చెరువులో చేపల అలసటను తీర్చి
చుట్టూ ఉన్న జీవకోటి పంచభక్ష పరమన్నాల నివేదనం !

నిజమే నీరు నింగికి కూతురే !

కృష్ణ మణి   


క్షణాల బరువు

క్షణాల బరువు
__________________కృష్ణ మణి

బరువైన క్షణాలను
గుండెలోంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని
కనురెప్పల క్రింద ఊరుతున్న ఉప్పునీటి వాగు సాక్షిగా దాటాలి
లేకుంటే ఆ క్షణాలు ఇంకా బరువుగా మారుతాయి !

అవమాన బరువు
సంసార బరువు
కరువు బరువు
ఇలా ఎన్నో
భూమి బరువు
నింగి బరువు
నీకు నువ్వే బరువై
చివర చెట్టు కొమ్మకు బరువవుతావు !

బతుకు బరువుతో అలిబిడ్డలు
నీకై ఏడవక పోగ ఈ గతికి నువ్వే కారణమంటూ తిట్టేస్తారు !

నీ బరువేంటో నీకే తెలుస్తుంది
‘’ మోసేవాడికి తెలుసు కావడి బరువు ‘’ అన్నట్టు
నిజమే కాని
క్షణకాలపు బరువులు ఎల్లకాలం ఉండవు కదా !

ఒక్కసారి దించు అన్నిటిని
ప్రేమను తట్టి చూడు ఎవరు నీకై కలవరిస్తారోనని
నిద్రిస్తున్న పిల్లల తలను నిమిరి చూడు వాళ్ళేమి కోల్పోబోతున్నారోనని
అప్పుడు కలుగును ధైర్యం నిండుగా
అప్పుడు పుట్టును పట్టుదల కసిగా
ఆలోచనేగా మంచికి  మూలం
అవేశామేగా చెడుకి మూలం !

ఇంకోమాట
ఆ బరువు లేకుంటే నీవు తెగిన పటానివే సుమా !

కృష్ణ మణి