Sunday, January 31, 2016

ఊపిరి వ్యద

ఊపిరి వ్యద
________________ క్రిష్ణ మణి

కనులతో చూసే లోకానికి
కులం మతం వర్ణం వర్గం అవసరమని
కులికే కల్మష రక్తమా ....
నీది ఏ కులమో చెప్పు ఏ మతమో చెప్పు

ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు
అప్పుడు మొదలుపెట్టి
ఇప్పటిదాక సాగదీస్తున్న
ఈ వివక్ష కోతలూ చేతలూ....ఎప్పటిదాక

ఖచ్చితంగా ఎక్కడో చెప్పు
అప్పటిదాక శ్వాసిస్తూనే ఉంటాను
నీలో మళినాన్ని వడగడుతూ.....

మారవని తెలిసిన నాడు ఆగిపోతాను
నిను చంప
నే చస్తూ....

క్రిష్ణ మణి

రంగుల మాయ

రంగుల మాయ
________________ క్రిష్ణ మణి

రంగురంగుల రెపరెపల జెండాలతో
నిండిపోయింది నగరం
ముస్తాబైన పెళ్ళిమడపంలా

రంగు రంగులో ఒక వాదం
రంగు రంగుకో అర్ధం

ఒక రంగును చూస్తే విసుగు
ఒక రంగును చూస్తే అభిమానం
రంగు మరో రంగుతో కలసి మెరిసిపోతుంటే
మరో రంగు కుళ్ళుకుంటుందనే భ్రమ
మొత్తానికి రంగుల మధ్య యుద్దమే జరుగుతుందేమో.......ఆశ్చర్యంగా !

మనిషి ఎంతటి మూర్ఖుడో కదా
తన స్వార్ధానికి రంగులను అద్ది ఆడుకుంటున్నాడు
ప్రక్రుతిలో అందాలను ఆస్వాదించే ప్రేమికుడు సైతం
కొన్ని రంగులను ద్వేషిస్తున్నాడు

మతపిచ్చి ఉన్నోడైతే
ఒక రంగును ఆళింగనం చేసుకొని
మరొ రంగుపై ఉమ్ముతాడు

ఇప్పుడు మనిషికి మనిషి ప్రధానం కాదు
కేవలం రంగే
రంగునోట్ల కట్టలే

ఏం కట్టుకుపోతాడో కడకు
ఒకే రంగుడబ్బలో మునిగి

క్రిష్ణ మణి

విందు

విందు
___________ క్రిష్ణ మణి

నన్నో తీపిరుచి వెంటాడుతుంది
చిలిపిగా సాగిన పసిప్రాయం
మళ్లీ అందని మధురం

అప్పుడు తెలియదు
గడుస్తున్న సమయం తిరిగిరాదని
కరిగిన పాలపళ్ళ నవ్వుల కర్పూర హారం

నా వెంట నడిచే ఙాపకాల బాణాలు
ఏకాంతంలో గిలిగింతలు పెడుతుంటాయి

వెన్నల్లో పాటలు
చెరువుగట్టుపై ఆటలు
స్కూలు గ్రౌండ్‌లో పరుగులు
చీకట్లో భయపడి నిద్రలో అరుపులు
ప్రేమనొంపే అమ్మ గోరుముద్దల గారాబాలు
ఒకరినొకరు గేలి చేసుకొన్న అల్లరి గోలల స్నేహాలు

తడి ఆరని తేనెపట్టు గదులు
అక్కడ ఎంతైనా దాచుకోవచ్చు
చివరి రోజుల్లో కాలక్షేపానికి పనికొచ్చే పసందైన విందు

క్రిష్ణ మణి

Saturday, January 16, 2016

వెలుగు జాతర

వెలుగు జాతర
________________ క్రిష్ణ మణి

మంచు పొగల్లో
తీపి చెరకుల్లో
భోగి మంటల్లో
రంగు ముగ్గుల్లో
విందుగా పసందుగా
హరిదాసు భజనల్లో
గంగిరెద్దు ఆటల్లో
పతంగుల అరుపుల్లో
పడుచుల సిగ్గుల్లో
పెద్దల దీవెనల్లో
కాలం తెలియక సాగే సంబరం
అంబరాన్మి అంటి
మనసులు దూదిపింజలై
పండుగ సూర్యుని వెలుగై మెరిసే....

బంధాలు గట్టిపడి
పచ్చని పల్లెలు
వెచ్చగా విచ్చుకొనే....

క్రిష్ణ మణి

Thursday, January 7, 2016

ఏమైనా అవుతా !

ఏమైనా అవుతా !
__________________క్రిష్ణ మణి

ఊడిపోతాను
రాలిపోతాను
గోడమీద రంగునై పాలిపొతాను

కరిగిపోతాను
ఆవిరవుతాను
పసిపాపల పెదాలపై మెరిసిపోతాను

పులుముకుంటాను
అంటుకుంటాను
మరపురాని ఙాపకమై నిలిచిపోతాను

సిగ్గుపోతాను
అలసిపోతాను
కురుల కుదుపులో నలిగిపోతాను

వాలిపోతాను
నీడనౌతాను
పచ్చని పైరునై పొట్టలో నిండిపోతాను

అణువునవుతాను
కదలిపోతాను
రాజ్యహింసకు మంచు మనసులో బాంబునవుతాను
అడవిచుక్కలు నేలరాలితే భగ్గుమంటాను
కాంతినవుతాను.....కడకు శాంతినవుతాను

క్రిష్ణ మణి

Tuesday, January 5, 2016

జారిన పాదం

జారిన పాదం
_______________క్రిష్ణ మణి

చిత్తడి మెత్తని అడుగుల్లో
పచ్చని వెచ్చని కాంతుల్లో
కమ్మని ఆమని గొంతుల్లో
అల్లరి ఆటల అరుపుల్లో
ప్రతిద్వనించే ప్రకృతి
కళ్ళముందర కరిగిపోతుంటే

మోటారు పరగుల గజిబిజిలో
అప్యాయతలరిగిన దర్పంతో
మురికిపారే కాలువలతో
అసూయల సాలెగూళ్ళలో
నిత్యం
నరకం చూస్తూ
నిత్యం
నరకంలోనే బతికే
పరాన్నబక్కులం

మనకు ప్రకృతంటే ప్రేమని అనటం సిగ్గు సిగ్గు
తుంచడమెరిగిన కసాయులం
పెంచడమా  ?

వంచడమెరిగి
చివర
మనలని మనమే కోసుకుతినే రోజులొస్తాయని అందోలన

రాజ్యమంటే మనుషులైతే
రాజ్యమేలే దొంగ పురుగులు
రాగమత్తి తాళమేసే స్వార్ద భ్రష్టులు
మీరు కారా తేనెపూతలు ?
మీవి కావా నత్తినడకలు ?

కళ్ళు తెరువని బావిబతుకుకు దారి ఇవ్వండి
దమ్ముతియ్యని అడవిబతుకుకు బాటవెయ్యండి
పచ్చని అడగులెయ్యండి

అప్పుడుకదా... ఆ తల్లి
నిండుగా
పసందుగా విరబూసి నవ్వుతుంది
వెచ్చని లోకం
నడుస్తుంది .... నడిపిస్తుంది

క్రిష్ణ మణి

Monday, January 4, 2016

నడక

నడక
____________క్రుష్ణ మణి

నడక
ఆ నడక కన్నా వేరుగుందనీ
నడక నడకకి ఒక గమ్యం ఉందనీ భ్రమ

గమ్యం అంతా ఒక్కటే
గతుకులు పడినా
అతుకులు పడినా
ఒంపులు దాటినా
మిట్టలు ఎక్కినా
అంతా మెతుకుల కోసమే

మెతుకు మెతుకుపైన రాసుంది ఏ నోటికి దక్కలోనని
దక్కడానికి దక్కించుకోవడానికి
ఉరుకులు పరుగులు
అరుపులు
మెరుగులు !

కత్తులు
సుత్తెలు
గన్నులు
పెన్నులు
పన్నులు
వెన్నులు
దన్నులు
జెండాలూ ఎజెండాలు
దాడులు దౌర్జన్యాలు
యుద్ధాలూ ఒప్పందాలు

అంగబలం మందబలం ఉండీ
లోకాన్ని అణిచి
ముక్కలుగా తుంచి
కుప్పలుగా పెంచి
పాచికలు విసిరి పరిహాసమాడుతూ
గుంపుకూ గుంపుకు దోచిన మెతుకుల కొసరును పంచీ
రక్తంతో స్నానం చేస్తుంది బలసిన నడక

ఎప్పటిదో ఈ నడక
బట్టకట్టడమెరిగిన కాలంనుంచి ఆగని నడక
మనిషి పూర్తిగా కనుమరుగయ్యేదాక

క్రిష్ణ మణి

మూగ కొలను

మూగ కొలను
_________________క్రిష్ణ మణి

సాయం సంధ్యలో
చెరువుగట్టుపైన చింతచెట్టు కొమ్మ చివరన
పిట్టగూడులోంచి ఏకాంతంగా చూస్తూ
నన్ను నేను మరచిన కాలం

ఒరాల క్రింద
బురదలోన
అఙాతంగా కనుమూయని చూపుతో
నా ఆకలిపోరాటం

నిశీదిపంచన
క్రిముల వేటలో
వెలుగునిండిన ఒళ్లుతో
నా ఆరాటం ఒక వింత

కప్పలకై
నీటిలో అలలను తోస్తూ
నా పరుగు ఒక విన్యాసం
మరో నోటికి ఉబలాటం

పిల్లి ఆటకు వస్తువునై
బతకనని తెలిసి పరుగు
కోర పళ్ళు కసిగా నొక్కితే అర్థం అయ్యింది
గుండె ఆగి క్షణాలు గడిచాయని

ఎన్నని చూడను
వింతలు విషాదాలు
నవ్వులు పువ్వులు
అరాటాలు పొరాటాలు

చుట్టూ నేనే
నా చుట్టే లోకం
లోకం చుట్టూ నేను !

క్రిష్ణ మణి