Tuesday, December 31, 2013

పేగు బందం

ఏమయ్యా గురువయ్య ?
ఈ ఏడైన పిల్ల పెండ్లి చేత్తువా ?

చెయ్యాలనే ఉంది కనకయ్య
సదువుతున్నపిల్ల కదా  పూర్తి కానీ
సబందాలోస్తున్నై ఇప్పుడే వద్దంటుంది !

బాగుంది వరస అమ్మాయి వద్దంది
అయ్యానెమో ....సర్లే
అసలే రోజులు బాగాలేవు పైగా పట్నంలో ఉంది ,వస్తా  !

ఏమండీ.. అమ్మాయి ఫోన్ చేసింది
ఔనా  ఎందుకే గావు కేక ?
మన బిడ్డ, మీరెవరు అందండీ ?
నీకు పిచ్చెక్కిందా ఏంటి ?
సాగర్ అంట అమ్మాయి సీనియర్ పిల్లాడు .
అయితే ఏంటే ?
ఒప్పుకుంటారా లేక ఎల్లిపోనా  అంటుంది !
గుండె పట్టుకొని కూర్చున్న తండ్రి
మూలన కొంగు మూతికి పట్టి
కారే కన్నీటిని ఆపలేని అశక్తురాలు !

ఈ మాట ఎవరితో చెప్పుకోము ?
ఏమని నిన్దిన్చుకోము ?
ఆలోచన లేని చింతలో రాత్రి గడించింది !

పదవే పట్నం పోయి పిల్లతో కలిసి ఆరా తీద్దాం
ఎవరో  ఏమైంది అని అడిగే లోపే ,
మన పరువు మర్యాద గంగలో కలిసే లోపే !
ధైర్యం చెప్పి బయలు దేరిన చింత !

పట్నం వెళ్లి హాస్టల్లో చూడగా అమ్మాయి లేదు
అయ్యో భగవంతుడా ? అనే లోపే వచ్చారు పోలీసులు
మేజర్ అమ్మాయికి  మీరు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని
మీ అమ్మాయి కంప్లేంట్ ఇచ్చింది , పదండి స్టేషన్ కి
నోరు లేవని  స్తితిలో తల్లితండ్రులు !

మీరోప్పుకోరని ఇలా ముందడుగేసం నాన్న !
కూతురి మొహం ఎలా చూడాలో అర్థం కానీ తండ్రి
ఏమని తిట్టాలో అని ఆవేశంతో తల్లి !
ఏమని సమర్దిన్చుకోవాలో అని అబ్బాయి !

ఇంతలో అబ్బాయి తరుపు పెద్దలు
మా వాడికి మందుమాకు పెట్టి వలలో వేసుకుందని నింద!
వారించ అశక్తుడైన అబ్బాయి మౌనమ్ !
తల ఎత్తి కూతురిని చుసిన తండ్రి
మాట బట్టక అబ్బాయిని నిలతీసిన అమ్మాయి
ధైర్యంగా ఉండు మా వాళ్ళతో మాట్లాడుతా ?
ఇంతకాలం ఎం చేసినట్లు అనాలని ఉన్న నోరు రాని బేల  !

ముగిసిన మంతనాలు
రమ్య , మనం తప్పు చేసాం !
నువ్వు మీ వాళ్ళు చెప్పినట్లు విను
నేను మా వాళ్ళు చెప్పినట్లు వింట !
నన్ను అమెరిక పంపుతారంట !

వయసు పెరిగిన తెలివి పెరగని అమ్మాయిని చూస్తూ
తల్లి '' కని పెంచింది , నిన్ను కష్టపెట్టడానికా ?
నచ్చిన తిండి
నచ్చిన బట్ట
నచ్చిన నగ
వద్దన్నా మారం చేస్తే పట్నం చదువు
ఇదేనా మేం చేసిన పాపం ''
పదవయ్య పోదాం ఇంకా ఎం మిగిల్చింది !

భుజం తట్టిన తండ్రి
''గుండెలపైన ఆడావని గుండెల తంతే ఎట్లమ్మ ?
వేరేవాన్ని నచ్చుకొని చెప్పు ఆఫ్రికా ఆదిమానవుడైన సరే''
మేం వస్తాం !

ఏమయ్యా గురువయ్య ?
ఈ ఏడైన పిల్ల పెండ్లి చేత్తువా ?

చెయ్యాలనే ఉంది కనకయ్య
సదువుతున్నపిల్ల కదా  పూర్తి కానీ .......


గొల్ల కురుమలం

గొల్ల కురుమలం మేము గొల్ల కురుమలం
పల్లె పాటలా పురిటి  పూల తోటలం
ఆకలి బతుకులతో నిత్యం మండు గుండెలం !

గీతమూదిన గోపడు ఎల్లలోకములేలెను
మాలోను భేదాలు పనిని బట్టి వర్గాలు
ఎర్రగోల్ల నల్లగోల్ల పత్తి కురుమ ఉన్ని కురుమ

గోర్లు మేకలకాడ ఆవు బర్రెల తోడ
ఆటలాడుతాం మేమంతా పాట పాడుతాం !
ఎర్ర రుమాలు నెత్తి మీద
నల్ల గొంగడి ఒంటి మీద
సద్ది మూట కట్టే మీద
కట్టేనెమో భుజం మీద
టుర్ర టుర్ర అంటూ పశుల భాష నోటివెంట !

సుద్దులోలుకు మల్లన్న
శివాలెత్తె బయ్యన్న
పటాలోశే సత్తన్న
డోలుకొట్టే బాలన్న
కష్టాలే రాగాలై బతుకంతా భారాలై
ఒగ్గు ధరువుల మీద పూట కూటి పాట్లాయే !

కాళ్ళ గజ్జెలే పసిడిమెరుపు కడియాలై
చర్లకోలలే మేడలో నవరత్న హారలై
గొంగడి ముల్లె నడుముకు వడ్డానాలై
మురిసి పోవు ఎల్లన్న వీరభద్రుడై !
సాగి పోవు భోనాల తొవ్వజూపుకై  !

ఒక్కటైంది ఊరంతా బీరప్ప జాతరంట
ఊరవతల గుళ్ళు అంటా
వన పండుగ మాదంతా !
సంబరాల సాయంత్రం సందడెంతో వైభోగం !
భండారి జల్లులో శివసత్తుల సంగమం !
ఒగ్గు కథలతో మురిసి రాత్రంతా జాగారం !

గొల్లకొండ మీద అక్కన్న మాదన్నలం
ఆనాటి ఈ కొండే ఈనాటికి మా జాతర !
సదరు పండగ వచ్చే దున్నపోతుల పోటే
గడ్డం మీసం తిప్పుడు పహిల్వాన్ పౌరుశాలు  !
అగసుడు తీనుమార్ ,ఇటుసుడా పోతులాట !
ధూం ధామ్ ధూం ధామ్ ధూం ధామ్  దిమ్కిటిక దిమ్కిటిక
ధూం ధామ్ ధూం ధామ్ ధూం ధామ్  దిమ్కిటిక దిమ్కిటిక
ధూం ధామ్ ధూం ధామ్ ధూం ధామ్  దిమ్కిటిక దిమ్కిటిక


                                                           

Monday, December 30, 2013

మదిలో మెరుపు



పిల్లల అల్లరి గెంతులు
చెరువుల చాపల పరుగులు !
నీటి మెరుపులా అందాలు
వెలిగిన తోర్రోల్ల మొహాలు !

తడిసిన చెడ్డి
ఆరని జుట్టు
చెవుల ముందు సాకలతో
కర్ర చేతబట్టిన గాలాలు
ఎదురు చూపుల కడుపులు !

దగ్గర ఒదిగిన మబ్బులు
పక్షుల అరుపుల బెదురులు
బెత్తర బోయిన కన్నులు !

అందిన కాడికి మూటలు
పిడుగుల కందని అడుగులు
చెట్లపందిరి చేరిన ధీరులు !
చినుకుల జల్లులో వణుకులు
తొనికిన పెదవులు కోతలు
ఇరగబడి పూసిన నవ్వులు !

రావని తెలిసిన రోజులు
మదిలో కురుసేను కాంతులు !

Saturday, December 28, 2013

కష్టాల కడలి


నీళ్ళు తిరిగే కళ్ళను చూసి
మాకొద్దు ఈ కష్టం మాకెందుకు ఈ నరకం అంటూ
పక్కోడిని అంటరాని వాడిగా చూస్తారు ఈ జనం !
జనంలో మనం
కనీసం మనస్పూర్తిగా ఒదార్చం
ఎందుకంటే వాడు కష్టంలో ఉన్నాడు !

ఎక్కడ వాడి పక్కనుంటే మన గొప్పలు తరుగుతాయని
ఎదురు పడినా పలకరించం
పలకరిస్తే వినపడలేదేమో అన్నట్లు అడుగులేస్తం
ఎందుకంటే వాడు కష్టంలో ఉన్నాడు !

ఫంక్షన్ లో కనిపించి భాగున్నవా అని కదిలిస్తే
బాగానే  అని మొహం తిప్పి అటు చూసి,
పోతున్న వాణ్ణి పిలిచి ఏంటోయని అడుగేస్తం !
ఎందుకంటే వీడు కష్టంలో ఉన్నాడు !

కష్టం మన మతం కాదు
మన కులం కాదు
మన భాష కాదు
అది మన చెంత ఒద్దని దేవుళ్ళకి మొక్కుతం
అయ్యో అంటే మనకు అంటు కుంటదని భయం !

కష్టాలకు అనేక రూపాలు !
అది డబ్బున్న వాడిని ,లేని వాడిని
ఒకే తాటికి కట్టేస్తుంది !
ఒకరికి ఆరోగ్య సమస్య
ఇంకొకరికి ఆర్ధిక నష్టం !
ఒకరికి అవమాన బాధ
ఇంకొకరికి చదువుల భయం !
ఒకరికి తిండే కరువు
ఇంకొకరికి తిన్నదే అరగదు , అదీ కష్టమే !

మనకుండే కష్టానికి
పక్కోడి బాధను పట్టము !
కాని , మనకున్న తిప్పలు
పగోడికి రావద్దంటూ బీరాలు పోతాము !

కష్టాల కడలిలో అందరం చిక్కుతాం
ఓర్పు వహించి
నిండా మునిగినం సలి లేదు
అనే భావనలో తడవాలి
లేకుంటే భూగోళాన్ని మనమే మోస్తున్నట్లు
చేపకు నీళ్ళను మనమే తాగిస్తునట్లు
ఓదార్పు కోసం దేవుణ్ణి నిందిస్తాం
ఒడ్డు చేరక గంగలో మునిగిపోతాం  !

చిరునవ్వుతో మున్దుకెల్లు తీరం దగ్గరౌతున్ది !

                                      ---కృష్ణ మణి

జీవితం

నిన్న నేడు రేపు ఇదే కదా జీవితం
ఎప్పటికి అంతం కానిది కాలం !
కాని నీ జీవితం
అది కేవలం నీ చావుతోనే అంతం ఆవుతుంది !

కాలంతో పరుగెత్తు
అందిన కాడికి ఇబ్బడి ముబ్బడిగా
మంచి అనే కనిపించని సంపదని
నింపై సంచులు సంచులుగా !
చెడు అనే కనిపించే యదార్దాన్ని
ఒంచై ఒక చుక్కైనా ఉంచక !

వయసుతో పనేముంది ?
ఏ వయసులో నీ అంతం నీకేం తెలుసు ?
పసితనమా ? కౌమరమా ?
యవ్వనమా ? నడీడా ? ముసలితనమా ?
దంచు నలుగురు మెచ్చనిది
పెంచు నలుగురు మెచ్చినది !

నువ్వు నడిచే దారిలో పువ్వులే పరవశించని
అడుగు పెడితే కావలి లోకమే పచ్చగా
నువ్వెదిరిస్తె కావలి అధికారమే పలుచగా
అందుకు కదులు ముందుకు
వెనుదిరిగి చూడకు సందుకు !

దుఖాన్ని అదిమి పట్టు సౌఖ్యాన్ని అరగదియ్యు
లోకానికి వెలుగు నింప !
ఆ వెలుగుల జాతరలో దీనులను ఆడనివ్వు
ఆ ఆనందం వెంట ఉంటె
జీవితమే సంతోషం , సంతోషమే జీవితం !
నీవున్న లేకున్నా
ఈనాటికి ఏనాటికి వెలుగునిచ్చే కాంతివై
విరాజిల్లు మరణాంతరం !

                              -----Krishna Mani

నా రాతలు

స్పందించే హృదయం ఉంటె నా రాతలు
బాదలుగా అగుపిస్తయి !
లేకుంటే నా రాతలు,
పిచ్చికాకుల కొట్టే రాయి రప్పలౌతయి !

మనసుకు భాషుంటే నా రాతలు
తెల్లని మల్లెలుగా అగుపిస్తయి !
లేకుంటే నా రాతలు,
పచ్చని చెట్ల నడుమ ఎండిన మొద్దులౌతయి !

ఒంటికి స్పర్శుంటే నా రాతలు
ఆలాద్రి పురుగంత మెత్తగా అగుపిస్తయి !
లేకుంటే నా రాతలు ,
మొరం రాయి దెబ్బలౌతయి !

కండ్లకు వేలుగుంటే నా రాతలు
వెన్నెల్లో చంద్రుడిలా అగుపిస్తయి !
లేకుంటే నా రాతలు ,
చిమ్మ చీకట్లో సైగలౌతయి !

ఊహిస్తే నా రాతలు
దండలో గులాబీ మొగ్గలా అగుపిస్తయి !
లేకుంటే నా రాతలు,
సర్కారు తుమ్మ ముల్లులౌతయి !
                           
                                                         ---Krishna Mani

ఏమయ్యింది నాకు ?

ఏమయ్యింది నాకు ?

ఇందాకనే చాయి తాగి పేపర్ చూస్తున్న
నా శరీరం నేన్జెప్పినట్లు ఇనుటలేదు
ఏమయ్యింది నాకు ?

ఏమే ! ఎకడున్నావు ఒక్కసారి ఇలా రా ..
అని అందామంటే నోరుకుడా లేవట్లేదు
ఏమయ్యింది నాకు ?

నా చుట్టూ నా వాళ్ళు చేరారు
హాస్పిటల్ కి తీసుకెళ్ళండి నన్ను
అని చెప్పాలని ఉంది ,కాని  ఎలా ?

కళ్ళలో కన్నీరయిన రావట్లేదు
నోరు తెరుచుకుంది ,పెదవి ముయలేక పోతున్న
ఏమయ్యింది నాకు ?

వాకిట్లో పడుకోపెట్టారు  అయ్యో
హాల్లో నైన ఉంటె బాగుండు కనీసం ఫ్యాన్ ఉండేది
నన్ను చూసి ఏడుస్తున్న వాళ్ళతో
ఏడవకండి అని అనలేక పోతున్న
నా భార్య నాపై పడి పడి ఏడ్చి సోమ్మసిల్లింది
ఆ ప్రేమను తట్టుకోలేక పోతున్న
తనకెవరయిన కాస్త చాయి తాపండి అని ఆనాలనుకుంటున్న
నన్ను అర్థం చేసుకున్నట్టున్నారు ,నా ఆలికిచ్చారు !

నా పిల్లలు నా కాళ్ళ దగ్గర కూర్చున్నారు
ఇంతకు ముందెప్పుడూ ఇలా జరుగలేదు
ఒక్కసారి రండిరా అంటే తీరిక లేదు అనే వాళ్ళు
పాపం ఇబ్బంది పెట్టనేమో !

అయ్యో నా బందు జనం ,ఊరు వాడ వచ్చారు
అందరు కుశలమేనా ? ఎందుకు అందరు జాలిగా చూస్తున్నారు
నేను చలించట్లేదు అనా ,నన్ను హాస్పిటల్ కి పంపట్లేదు
నేనెప్పుడు భాగు పడతాను ?

అదేంటి బాజాలు , కట్టెలు , తెల్ల బట్ట , పూలు
ఇదేమి విడ్డూరం నాకు స్పర్శ లేదని వేల్లగోడతారా ?
వద్దు వద్దు నన్నెత్తొద్దు
నాకోసం ఇంతమంది జనాలా ? ఒక పక్క గర్వంగా ఉంది
కాష్టలగడ్డ వచ్చింది ,
దేవుడా ఒకసారి కదిలే శక్తినివ్వు
నేను బతికే ఉన్నానని చెప్పడానికి
ప్చ్ ! దయలేని వాడు నన్ను ఎగతాళి చేస్తున్నాడు !
కట్టెల నడుమ పిడకలు
పిడకల నడుమ నేను

మంటల్లో కాలుతూ మసిబారిన చర్మం
నా కాయం మాయం అయ్యింది
నా అనే ఆనవాలు కనుమరుగయ్యింది
ఇప్పుడేమి చెయ్యను ?
ఇప్పుడేమి చెయ్యను ?
ఇప్పుడేమి చెయ్యను ?
'''
'''
'''
ఏమయ్యింది నాకు ?
 

                              ----------krishna mani 

Friday, December 27, 2013

నా కసి


మనసు అలసింది
తనువూ సోలసింది
పిడికిలి బిగిసింది

నా జాగా మీద దండయాత్ర చెసిన్దెవ్వరని
కుత కుత ఉడుకుతూ నా రక్తం అడిగింది !
ఆవేశం అంచున గుండె దడగ్దగ్డమని
వెకిలి మాటల సంతను నిలదీసింది !

నేనడగ దలుచుకున్న
ఈ కుటిల మతుల నీచుల్ని
ఎవడు రమ్మన్నాడు నా ఇంటి పాలికి ?
ఎవడు వదలమన్నాడు ఆ డెర కోయ్యలని ?

మా మూతులగట్టి ఆనాడు నైజము
నా తల్లి కన్నీళ్ళ మూటగట్టి
తుపాకి గుండ్లను ఎదురుపెట్టి
ఉన్నోడిని లేనోడిని వేరుపెట్టి
పడతుల ఒలువల ఆరబెట్టి
భానిసవు నీవని బెదురుపెట్టి
నా ఆటపాటల్ని అదిమిబెట్టి
ఒర్చితిమి మా పండ్లు బిగిసిపట్టి
ఎదురుతిరిగి ఎవడు నీవని ఎండగట్టి
రక్తం ఒడ్డి ఉరవతలకి సాగానంపినం !

హమ్మా ! అని దమ్ము తీసి
కండ్ల తుడచి నాగాలెత్తి సాలల్ల గిన్జబెడితే
మనమంతా ఒకటని పెద్దలను ఒప్పించి
మమ్ములను ఒత్తిపట్టి
మా ఇంట్లజోర్రి
బాసలను ఎడమరచి రాతలను కప్పిపెట్టి
దొడ్డిదారిన మీరంతా ఇల్లునిండి
మా పైన మీ చెత్తను రుద్ది రుద్ది
హీనంగా జూస్తిరి
మా జగాల జబర్దస్తి చేస్తిరి
మా కొలువుల కూసుంటిరి
కట్టలని తెమ్పితిరి
మా నీళ్ళను ఒమ్పితిరి
మా ఊర్లు ఎండబెడితిరి
మా భాషను ఎక్కిరిచ్చి
మీ యాసను దాచిపెట్టి
పరదాల మీద పగలవడితిరి

మనదే అని మాదంతా మీకాడికి పంపితిరి
ఇంతజేసి ఇప్పుడు మీదేముందని
అంతా మాదేనని కారుకూత పెట్టి
మమ్మల్నే మా ఇంట్ల పారయోల్ల చేస్తున్నరు !
పాలకుడే పరాయోడయ్యిండు.. ఏ
పట్టెనా మా తిప్పలు మా గోసలు
అంత చూసి ఒళ్ళు మండి
అగ్గిరవ్వలై
మీ మీద కుండ పోతలమైతే
ఎ గొడుగులు ఆపేవు
ఎ మడతలు దాచేను !

అందుకే అంటాం
పోరా పోరా  పోరా ....
పోకుంటే చెడ్డి గుంజి పెడతాం
ఎవరికీ సూపలేని తావులల్ల
పోరా పోరా పోరా .....
ఉన్డున్రి మాతోని మా మాటకు కట్టుబడి
లేకుంటే ముతిబొక్కల  రాలగోదతాం
మీ వేషం మాకొద్దు మీ సోకులు మాకు పోట్లు

అందుకే అంటాం
పోరా పోరా  పోరా ....
పోకుంటే చెడ్డి గుంజి పెడతాం
ఎవరికీ సూపలేని తావులల్ల
పోరా పోరా పోరా .....

Sunday, December 22, 2013

చిత్రంగా ఉంది ...


చిత్రంగా ఉంది ...
తెల్లారంగనే మంచుతో దుప్పటి కప్పడం !

చిత్రంగా ఉంది ...
తెల్లారిందని కోడికి తెలిసిపోవడం !

చిత్రంగా ఉంది ...
పక్షుల కిల కిల రావాల నడుమ అరుణోదయం !

చిత్రంగా ఉంది ...
చీకటికి విశ్రాంతి అంటూ వెలుగు చూపిన ప్రేమ !

చిత్రంగా ఉంది ...
వరినాల్ల నడుమ పాముల జాతర గుర్తులు !

చిత్రంగా ఉంది ...
తల్లి చుట్టూ పశుల పిల్లల  గెంతులు !

చిత్రంగా ఉంది ...
భానుడి ముందు గుంపులుగా ఎగురుతున్న పక్షులు !

చిత్రంగా ఉంది ...
ఎందుకు తెల్లారిందాని పసి పిల్లల విసుగులు !

చిత్రంగా ఉంది ...
తెల్ల తెప్పలు కాస్త ఎరుపుగ మెరవడం !

చిత్రంగా ఉంది ...
జీవన సంగ్రానికి ఇంకో దినం మొదలైందని !

                                     --------కృష్ణ మణి

Wednesday, December 18, 2013

పసి మొగ్గలు




రోజు సందడిగా ఉండే చౌరస్థ. అక్కడే పక్కన కూరగాయలు అమ్ముకొనే స్త్రీ , ఆమెకు చేదోడు వాదోడుగా
ఉండే 6 లేక 7 సంవత్సరాల పాప.కూరగాయల  బెరసారల్తో తల్లి,  చుట్టూ జనాలను చూస్తూ సరదాగా ఉండే పాప. సాయంత్రానికి పని ముగిందు కొని ఇంటికి చేరితే తాగుడుకు భానిస ఐన భర్త చేతిలో దెబ్బలు , చేసిన కష్టం మొగుడి తాగుడికి పోతే మిగిలేది తల్లి పిల్ల కడుపుకే . ఏదో ఒక రోజు భర్త మారతాడని, దేవుని మీద భారం వేసి మంచి రోజుల కోసం ఎదురు చూపులు . కనీసం పాపకు మంచి డ్రెస్ కొనాలని ,మంచి భోజనము పెట్టాలని ఆశ .

రోజు కూరగాయల కొట్టు దగ్గర తల్లితో కూర్చొని వచ్చే పోయే పిల్లలను గమనిస్తూ , తను స్కూల్ కి వెళ్ళాలని , స్కూల్  యునిఫోరం లో తనను తాను ఉహించుకొంటు లోలోన బాధ పడే పాప .

పండగ రేపనగా భారి లాభాలను చూసుకొని పాపకు డ్రెస్ కొందామని ఎంతో సంతోషం తో ఇల్లు చేరిన భార్య. డబ్బు భర్తకు కనపడకుండా దాచగా , భర్త వచ్చి డబ్బు వెతకగా దొరకదు. అసలే తాగుడికి భానిస , భార్య డబ్బు జాడ చెప్పక పోవడంతో తీవ్రంగా ఆవేశానికి లోనై ఒళ్ళు హునమైయ్యెటట్లు కొట్టగా భయపడిన పాప డబ్బుజాడ చూపి తల్లిని రక్షిస్తుంది .దెబ్బలతో తల్లి స్పృహ తప్పగా ఆకలిని ఓర్చి తల్లిని  ఓదార్చుతూ పడుకుంటుంది .

తెల్లారింది తల్లి లేవలేదు ,తగిలిన గాయాలను చూసి తల్లిని లేపడం ఇష్టం లేక పాప ఒక్కతే గుడిసె బయటకు వెళ్ళిపోయింది . కొన్ని గంటల తరువాత మెలుకువ వచ్చిన తల్లి పాప గుర్తుకు వచ్చి వెతకడం మొదలు పెట్టింది , చుట్టూ ఉండే జనాలను పాప జాడ అడిగింది అందరు మాకు తెలవదు అంటున్డటంతో  లోలోపల ఉత్ఖంట , పాపకు ఏమి కావోద్దంటూ కనిపించిన దేవుడికి మొక్కుకొంటు వెతుకుతుండగా భర్త తారస పాడగా పాప విషయం చెబుతుంది , తాగుడు భానిసత్వం వాళ్ళ తానూ ఎలాంటి పొరపాటు చేసానని , పాపను పోగొట్టుకున్నానని పశ్చాతాపంతో తాను కూడా పాపను వెతుక సాగగా , ఎటు కనబడక భార్య భర్తలిద్దరూ ఆవేదనతో రోడెంట వెతుకుతుంటారు .

మిట్టమధ్యానం చౌరస్థ దగ్గరలో జనాలందరూ గుమ్మిగుడటం చూసిన భార్యాభర్తలు కంగారుగా అటువెల్లి జనాలను తోసుకొంటూ దగ్గరగా వెళ్ళగా ఒక్కసారిగా ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం . అక్కడ ఉన్నది తమ పాపే . భోరున విలపిస్తూ పాపకు ఏమైనదని , పాపను తడుముతూ ఉంటారు , స్పృహ కోల్పోయిన పాప పై నీళ్ళు జల్లగ , మెల్లగా మెలుకువ రాగ పాప కళ్ళు తెరిచి చూడగా ,తాను ఉన్నది తన తల్లి ఒడిలో అని గమనించి ఆనందంతో కన్నీళ్ళు పెట్టగ . చుట్టూ ఉన్న జనం తల్లి తండ్రులను పాపను ఈ రకంగా రోడ్డుపైన   వదిలేస్తారా అని విసుక్కొంటు వెళ్తారు.తల్లి పాపను ఇక్కడకెందుకు వచ్చావు అని అడగగా ,పాప '' కురగాయలమ్మి నీ దెబ్బలకు మందు తెద్దామని కొట్టు తెరిచిపెట్టాను , రాత్రి నుంచి ఏమి తినలేదు అమ్మ ఆకలేస్తుంది ''  అనగా భార్య భర్త వైపు చూస్తూ ఏడుస్తూ మనకేంటి ఇలాంటి పరిస్తితి అనట్టు చూస్తుంది . తండ్రి తానూ చేసిన తప్పుడు పని వల్ల ఈ పరిస్తితి వచ్చిందని తానూ మద్యం మానేస్తానని పాప మీద ప్రమాణం చేస్తాడు .

మన దేశంలో సగటు మనిషి ఆర్థిక పురోగతి సాదించే వరకు , చెడు అలవాట్లను వదిలే వరకు ఇలాంటి  పసి పాపలేందరో వారి భవిష్యత్తును నాశనం చేసుకోక తప్పదు .మనం ముందు తరాలకు ఇచ్చే బహుమానం ఇదేనా ?

Tuesday, December 17, 2013

మా ప్రయాణం

మా ప్రయాణం
____________కృష్ణ మణి

నేనెగిరితి ఆకాశానికి ఆవిరినై
సుందరమైన భూమిని చూసి
ముద్దాడాలనికొంటిని
నాతోటి వారలతో కూడి !

ఏమి చేతుమూ  
ఎలా వత్తుము
తిరిగి భూమిని చేరుటకు !

ఎప్పుడా
ఇంకెప్పుడాని ఎదురు చూపులు !

అదిగో అక్కడెక్కడో
గాలి మమ్ములను
సంఘటితం అవమని ఆదేశాలు ఇచ్చినది
నేను ముందుగ
నేను ముందుగ అంటూ పోటి పరుగున పోగైతిమి !

మా ఆవేశానికి
తెల్ల తెప్పలం కాస్త
నల్లగా మారి గర్జించితిమి
తలుపు తెరిచి పరుగెత్తుటకు నిశ్చయించితిమి !

ఒక క్షణం మరో క్షణం
ఇలా భుప్రాణులకు హెచ్చరికలు పంపితిమి
మీతో యుద్ధం చేస్తామని
ఓడితే మీకు సహకరిస్తామని ,
గెలిస్తే మేమ్ములని నాశనం చేస్తామని
మాకు గెలుపుకన్నా
ఓటమే ముఖ్యం

యుద్ధం మొదలయ్యింది
ఆవేశంగా దూకితిమి
ప్రేమగా భూమిని చేరేకొద్ది
మా తన్మయత్వం చెప్పజాలనిది
ఒక్కొక్కరం విడి పడి
భూమిని కౌగిలించుకొని ముద్దాడి
కొందరం భూమిలోకి చేరాము
మరికొందరం
కొండలను చెట్లను తాకుతూ
జలపాతాలుగా సాగితిమి
కొన్ని జీవాలను మాతో రమ్మని లాగితిమి !

అలా అలా ఒంకలు తిరిగి
కాలువగా పారి
భూఓంపుసోమ్పులను
మెత్తగా రుద్దుతూ
చెరువులో దున్కితిమి
పొట్టనింపి అలుగు దాటి
పొలాలను ముంచి
పాయగా మారి చేరితిమి ఒక వాగులోకి !

అదికాస్తా ముందుకు వెళ్లి నదిగా సాగింది ,
ఒంపు మిట్టలను సరి చేస్తూ
పడుతూ లేస్తూ
సాగర సంగమానికి స్వాగతం పలుకుతూ
లే లేత భానుడి కిరణాల వేడిని తగుల్తూ
అనంతకోటి బిందువులలో
నేనొక బిందువుగా ఉండి పోతిని !

మల్లి సమరానికి సిద్దమని
ఎదురుచూస్తూ
సూర్యనరాయనుడికి మొక్కుతూ
మళ్ళీ భూసౌందర్యాన్ని చూసి తాకే అదృష్టాన్ని ప్రసాదించమని వేడుకొంటున్నాను

కృష్ణ మణి

Monday, December 16, 2013

ఓ ప్రియసఖియా



ఇన్నళ్లూచూడంది  ఇవ్వాల్నే చూసిన                                                                                             అందుకే నవ్వంటే  పడిజస్తనే  ఓ ప్రియసఖియా...!
రాత్రిల్లో నీ  అందం జగమంతా వెన్నెలనే                                                                                   నరదిష్టి పడకుండా బుగ్గమీద కాటుకెట్టుకోవే...!

రాళ్ల లో మెరిసేటి రత్నము నీవే...               
       సంద్రంలో ఒదిగిన ముత్యము నీవే.....                                                                              చంద్రవంకవు నీవే ,  రాతి బొమ్మవు నీవే                                                                                          పాపనవ్వులు నీవే , ఎండి పుత్తడి నీవే                                                                              అందుకే నవ్వంటే  పడిజస్తనే  ఓ ప్రియసఖియా...!

నువ్వాడితే నెమలి  ఆగిపోదా...                                                                                                     నువ్వు పాడితే కోయిలా మూగబోదా....          
ఊదె వేణువు నీవే , మీటె వీణవు నీవే                                                                                            నీటి పరుగువి నీవే , కాళి గజ్జెవి నీవే                                                                                   అందుకే నవ్వంటే  పడిజస్తనే  ఓ ప్రియసఖియా...!

ఎడారిలొ నీటి ఊటవు నీవే                                                                                                        నేలమీద పెరిగే పైరువు నీవే                                                                                           పూచె పువ్వువి నీవే , కాచె కాయవు నీవే                                                                                      అడవి ఆకువి నీవే , లేత మొగ్గవు నీవే                                                                              అందుకే నవ్వంటే  పడిజస్తనే  ఓ ప్రియసఖియా...!

  


Sunday, December 15, 2013

నీటి ఊటలు



గగనంలో తారలు మురిసి మెరిసె
సంద్రంలో నీళ్ళు గల గలమని గెంతే !
మబ్బులతో కొండలు తేలియాడే
మనసులో తామరలు వికసించే
తనువులో లతలు అలలాడే !

ప్రకృతిలో ఏదో ఆతుందని రెప్పల మాదిరి
తెరిచిన పర్రెల తొంగి చూపులు ఇక లేవని !
ఎండిన మొద్దులు చిగురిస్తయని
ఆరిన కడుపులు నిండు కుంటాయని
గడిచిన వ్యధలు తిరిగి పొడసూపవని
పోయిన సర్వం రాబోతుందని !

అలాకూడా ఉంది

అలాకూడా ఉంది ,

నిశీది నింగిలోని గాలి అలల నడుమ
భులోకాన్ని చూస్తూ చందమామతో మాటలాడాలని ఉంది !

అలాకూడా ఉంది ,
సముద్రంలో తిమింగాలలతో దాగుడుమూతలు ఆడాలని ఉంది !

అలాకూడా ఉంది ,
అడవి చెట్ల నడుమ పిచ్ఛి అరుపులతో జీవాలని ఆటపట్టించాలని ఉంది !

అలాకూడా ఉంది ,
కళ్ళు మూసుకొని చరిత్రలో జరిగిన విషాదాలను ఆపాలని ఉంది !

అలాకూడా ఉంది ,
కట్టేలనడుమ బొగ్గవుతున్న మనిషి వ్యధలను వినాలని ఉంది !

అలాకూడా ఉంది ,
చిట్టి చాక్లెట్తో చిన్ని పాపల ఆనందం ఒక చిన్నారిగా పొందాలని ఉంది !

అలాకూడా ఉంది ,
తొలకరి చినులకోసం స్వాతి పిట్టల ఆరాటం అనుభవించాలని ఉంది !

Saturday, December 14, 2013

ఆ నిండు కుండలు



పాడితినో మాయన్న మా గుల్ల్య పాటలన్నీ
ఆడితినో మాయన్న మా ఉల్ల్య  ఆటలన్నీ

రంగన్న తీసే రాములోరి పాటరో
మేమంతా అందుకొని చప్పట్లతో పాడేనో
దుర్గమ్మ ఎల్లమ్మ శంకరుని పాటేలే
మొదలెట్టే సుద్దుల్ని పెద్దమనిషి లేశిరో
రాగామందక మా నవ్వుకు గుప్పించి గులుగురో
డోలక్ దరువుల నడుమ గణేశుడెల్లెరో
కన్జర్ల మోతలో మేమాడి పాడేరో
మల్లోచ్చే యాలకు ముందుగానే ముచ్చట్లురో


నా దాండు దెబ్బకు గిల్లి మాయమాయేనో
రాయి రంగన్న ఆటలో సీనుగాడు కుంటేరో
టైర్ల పరుగులో అలసిన ఆగని హుషారులో
గుంతలాటలో  చిత్తగిన్జల డబ్బలె నింపేరో
విరి విరి గుమ్మడని నాకన్లను మూసేరో
లోలో తుమ్మప్పలో సూడలే ఎంకవడ్డ చల్లరో
సీకాటలో మల్లన్న లెక్క వెయ్యి మీద సాగేరో
చెట్ల పందిరిలో చిట్టునిండా కోతులే
గోటిలాటలో మా జేబుల్సూడ మేక పాలతిత్తులే
లోన్ బుర్రు ప్రతి గడి ఒక పంజరమే
పెంకలాటలో పగిలే మా ఎదిటోడి వీపులే
హరి భురి సీమల ధరి, రాజు కోటకే లంకల గురి
హరి భురి సీమల ధరి, రాజు కోటకే లంకల గురి
హరి భురి సీమల ధరి, రాజు కోటకే లంకల గురి

యాడికెల్నయొ ఆ రోజులు యాడికెల్నయొ
యాదికొచ్చి నా గుండెను తోడుతున్నయో
ఆ రోజులు గావాలంటే నేను మల్ల పుట్టాలే
పుట్టినా, ఆ ఆటలుపాటలు, మనషుల ఆత్మలు
ఉండున ఈ రోజుల్ల ఆ నిండు కుండలు 

Sunday, December 8, 2013

పశుల కాసే పోరగాడు



లేసితి పోద్దుగళ్ళ పోయితి ఉరెనకకి
పని గాన్గానే యాప పుల్ల నోటిగొంటి
బర బర తోమితి రెడ్డి భావ చూసి
ఏమోయి పిల్లగా పాసువొంగ కాననె !
సద్దితిండి మామిడికాయ తొక్కుతోని
దొడ్డి తోవ వడితి గొంగడి భుజాని కెత్తి
తోకలాడించే  నా బర్లు నన్ను జూసి
దూడలగట్టి పోతి పశులతోని మేత కోసం !
ఒరాల మీద కాలువల కింద ఎన్ద్రికిచ్చల వట్ట
చిత్తలకొమ్మ కోసి పడితి పోద్దుమీకి కూర కోసం
అంతలనే ఆకలాయే అటుఓయి  ఇటుఓయి
ఎల్లితాత బీడిఅగ్గి తెస్తి కాల్చితి యాటిని నా ఆకలిజంప
చెట్లకింద బర్లువండే వాటిపక్క నేనువంతి !
బాలయ్య ఒచ్చే బరిగెతోడ చేన్లవడ్డ పశులు నాఎనని
పడ్డ వాతలు చూస్కుంట చేర్లగోడితి నిల్లుతాపి ఒల్లుతోమి
దొడ్డిగోడితి ముందుగ దూడల మూతులు కట్టి !
అమ్మ నాయిన నన్నుజూసి మురువవట్టే
ఏమి చెప్పుదు నా ఒళ్ళు హూనమైనదని
చికట్ల ఇంత కూర బువ్వతింటి కన్లు ముసుకొంగ గొంగడి మీదికేస్తి !

Friday, December 6, 2013

అమర పువ్వులు





అమర పువ్వుల ముసి ముసి నవ్వుల సొగసులు
ఆదమరచి నిదుర పొమ్మని చేసెను సైగలు !
మనోడే అంటే మంద బలం చూపెను
పాలోడే అంటే పంగనామాలు పెట్టెను!
అనుక్షణం రగిలిన యదలు,మండిన కాయం
ఎగిరిన గోలాలపై మెరిసిన ధైర్యం !
తెగ తెంపుల సమయాన తెగిడిసిన ప్రాణాలు !
మొత్తానికి తెల్లారింది మన బాదలు ఇక లేవంటూ ....
కరుణ చూపిన కోటకు వేల వేల వందనాలు !
తోడు నిలిచిన కమలానికి ముక్కోటి దండాలు !

వనిత


చిన్నతనంలో పెళ్లి !
కాకూడదు తల్లి !
జరగరాదు మల్లి !

ఈ సమాజం గుడ్డిది
అహంకారం మెండుది !
అన్ని కావలి
ఆ తల్లే దిక్కంటది
కాని ఆడగుడ్డంటే విసుగంటది !

చదువులూ తల్లే !
ధైర్యమూ అమ్మే !
ధనమూ కాంతే !
అన్ని పడతే !
మరి ఎందుకు కంటే !

కూతురంటే భారమా?
చదివిస్తే పాపమా ?
సమరంలో ఝాన్సిని
మరిచావా రుద్రమ్మని ?
ఎ దేవుడు చెప్పాడు ఆడపిల్లంటే చేదు అని ?
ఎ తీర్పు చెప్పింది మగపిల్లాడే ముందుండాలని ?

చిన్న చూపుతో చెల్లి తల్లడిల్ల సాగెర,
ఓదార్పు దిక్కు ఎక్కడ , కన్నీటి నావ సాగేరా !

ఇదేమి లోకం ఇదేమి కాలం
ఎంత చెప్పిన పట్టని వింత మేళం !

ఆడి పాడేటి వయసులో అలసిపోతుంది వనిత !
తల్లిగా మారి కూలి కుప్పవుతుంది వనిత !

''యత్ర నార్యస్తు పుజ్యంతే, రమంతే తత్ర దేవత''
           
                                                                                  ----కృష్ణ మణి

Monday, December 2, 2013

తెలుగు మాట్రిమొని










ఆరడుగుల అందగాడు  కాని, చెవులు వినపడవు !
సుందర ముఖ విందము కాని , చూపు మెల్ల !
కండలు తిరిగిన ఒళ్ళు  కాని , మొండేలు !
నల్లని కురులు కాని , ఉండల జుట్టు !
బంగారు వన్నె తోలు కాని , తెల్ల మచ్చలు !
గల అబ్బాయికి పిల్ల కావలెను

జాతి మత కుల భాషాభేదం లేదు !
ఐదున్నర ఎత్తు , కలువ కనులు ,బంగారు వన్నె కాంతి ఒళ్ళు !
సహనంలో భూదేవి , ధైర్యంలో రుద్రమ్మ , చిరు నవ్వులో లక్ష్మి ని పోలి ఉండాలి !
రంభ ఉర్వశి మేనక ఐన పర్వాలేదు !
కట్నం మీ స్తోమతను బట్టి , ఎంత లేదన్న పది లక్షలు ఉంటె చాలు !


                                                       -Krishna Mani