Wednesday, September 10, 2014

భరింపు

________________కృష్ణ మణి

నేనొచ్చిన కాడినుండి చూస్తున్న
లోకం ఇట్లనే ఉన్నది
ఏదైనా మారిందంటే మనిషి ఒక్కడే !

నీళ్ళు రంగు మారుస్తలేదు 
చెట్టు నడుస్తలేదు
కోతి మాట్లడుతలేదు
సింహం రక్తం తాగెది మారకపాయే
బర్లు గడ్డిని మరువకపాయే!


మరి ఈ నక్కజిత్తుల దొంగ మనిషి
పూట పూటకు గుణం మారుస్తున్నడు ఊసరవెల్లోలె
ఆకలైతెనేమో అమ్మాంటడు
లేకుంటె ఇంకోటి !

ఏమిలేని కాడ
ఏ దేవుడు మాయ జేసిండో
వీనికి ఇంత తెలివి ఇచ్చిండు
వానంతల వాడుంటే మాకెందుకు ఈ లొల్లి
అందరి మీద పెద్దతనం జెయ్యవట్టే ?


నీటిని చెరవట్టిండు సిగ్గులేనోడు
గాలిని గబ్బుజేసిండు
భూమిని బష్టువట్టించిండు
అగ్గిని అదిమిపట్టి పైన కూసుండు
ఎప్పుడైనా తేడవస్తే కాలుతడు
లోకాన్ని కాలుస్తడు !

నేలమీద నిలువలేడు
ఆకాశాన్ని కూడా ఇడువలేడు
అక్కడ గిట మోతుబరి
ఓజోనుకు పొక్కలు గొట్టిండు
ఇప్పుడు ఏం దెల్వదని కండ్లు దించిండు !

నువ్వు పుట్టక ముందే పుడితిమి
కొండలం కొనలం
మా ముందే పుట్టి
మమ్మల్నే ఒంచుతున్నవురా పశువా !

ఓర్సుకుంటున్నం  ఓపికున్నదాక
తర్వాత ఏమైతదో చెప్పం కోడుకా..... !

కృష్ణ మణి I   

కాళోజి – జియో జి

____________________కృష్ణ మణి
ఇది నా గొడవ
మీ గొడవ ఏందీ
నా వాళ్ళ జోలికి మీరెందుకని గొంత్తెత్తి అరిచిన ధన్యజీవి !

కారుమబ్బుల నడుమ
మెరుపు కాంతుల నడక 
యుద్ధం నీదే
నువ్వే యుద్ధం
తిరగబడి నిలబడి
బెదురులేని బాకువు బరిసెవు !

నువ్వే మా ధైర్యం
నువ్వే మా అస్తిత్వం
నువ్వే నవ తెలంగాణా ప్రజల పౌరుషానివి
నువ్వే కదా కలానికి కత్తిగట్టిన యోధునువి !

నీ శత వసంత జన్మదినాల పండుగ
నీ కలల సుందర రాష్రం ఉద్భవించిన కాడ
పరిపూర్ణం నీ జన్మ
ఇదే మా అభినందన పద మాలిక !


కృష్ణ మణి I 09-09-2014 

Saturday, September 6, 2014

ప్రేమ పరిమళం


1 వ . అబ్బాయి గత ప్రేమ విఫలం

నను నేనే పొగడితి నీ చూపు వాలినప్పుడు
నాలో నేనే మురిసితి నీ మదిని కోరినప్పుడు  
నను నేనే మరచితి నీ ప్రేమలో మునిగినప్పుడు  
నను నేనే చంపితి నీ తోడును వీడినప్పుడు

2 వ . అమ్మాయి ప్రేమ పై భావన

మనసు తెరిచి చెలికాడే చేరువైతే మధురం ... ప్రేమ   
మెరిసే కన్నుల తుంటరి చూపుల బాణం ... ప్రేమ
విచ్చిన మల్లెల గిలిగింతల సుమగంధం  ... ప్రేమ
మదిలో చేసిన చెరగని తరగని సంతకం ... ప్రేమ 

3 వ . ఇద్దరు ఒకరైన భావన

గడచిన చిన్నిపాటి కాల గమనం
చేరువైన మనసున ప్రేమ జననం
భావాల కలయికలో పొంగిన వినయం
ఇరువురి మమతల మెరిసే పుష్పం
రెండు దారులు ఒక్కటై పయణం
మనసులు ఏకం తమలో తామే లోకం
ఇదే కదా అద్వైత స్తితి సారం


చిట్టి నడక


____________________కృష్ణ మణి

రైలు పట్టాలెక్కిన చిట్టి నడక
చివరి గడియలు రోడ్డు పైనే
అదిరిన మనసులు క్షణకాలం కూడా నిలివలేదు !

ఇనుప రేకుల డబ్బాలో నలిగిన మొగ్గలు
ఎగిరే పావురాలను పంజరంలో పెట్టి తొక్కి పట్టిన బండరాయి
ఈ పాపపు కర్మ ఎవరిదీ ?
ఆ కర్మకు బలి ఎవరు ?

లోకం ఎరుగని పాదాలు
నోటు బుక్కుల్లో చెదిరిన అక్షరాలు
అమ్మ పెట్టిన ముద్దలు ఇంకా అరగలేదు
టిఫిను బాక్సులో అన్నం చల్లి కడుపు నింపిన పసి ప్రేమలు !

ఎందరి తల్లుల కడుపులు కాలెను ?
ఎందరి తండ్రుల గుండెలు ఆగెను ?

కృష్ణ మణి  I 24-07-2014


గురువులకు దండాలు


___________________కృష్ణ మణి

ముర్రుపాలు తాపి
లాలిపాటతో భాషను నేర్పిన అమ్మకు దండాలు
నా చెయ్యినొదిలేషి
దూరన నిలబడి నడక నేర్పిన అయ్యకు దండాలు !

నడుమొంగిన అవ్వకి
కట్టందించడంలో మానవత్వం నేర్పిన నాయినమ్మకు దండాలు
మందమీద గురి ఉంచి
ఈలతోనే గొర్లు మలిపే విద్య నేర్పిన తాతకు దండాలు !

ఆ చెరువుల చాపలకు
ఒరాలకింది ఎండ్రికిచ్చలకు
ఆవసారానికి అంది భయము బాపే ముల్లుకర్రకు
లోకం తీరుని నేర్పిన ఆ మోడువారిన చెట్లకు దండాలు !

పాములున్నయని బెదరగొట్టే గోర్రెంకలకు
అడుగులో అడుగేసే తోడు కుక్కకు
నా పాటకు ప్రతిధ్వనై ఒంటరిని కానని ధైర్యం చెప్పిన కొండగుట్టలకు !

ప్రకృతి గురువై
అడగడుగున కొత్త పాఠం నేర్పి
బాటన పూలుజల్లుతున్న కార్యానికి శతకోటి దండాలు !

కృష్ణ మణి I 05-09-2014






?


నిజమా
కాదా
క్రూరమా
కుతంత్రమా
మృగమా !

శాంతా
అశాంతా
జననమా
మరణమా
ఆమరణమా!

జగడమా
నేరమా
న్యాయమా
అన్యాయమా
చట్టమా !

పాపమా
పుణ్యమా
నరకమా
స్వర్గమా
జన్మమా !

కులమా
మతమా
నలుపా
తెలుపా
మానవత్వమా !
కృష్ణ మణి I 05-09-2014



Thursday, September 4, 2014

అలకలు


____________________
కృష్ణ మణి
చిలకల కిలకిల అలకల ధ్వనులు 
అందరికి ఆనందంగా ఉన్నాయట !
పిచ్చి పక్షులు 
మా మోర వినండిరా బాబని 
చెవిలో జోర్రీగల్లాగా అరవలానే ఆరాటం 
వినరని తెలువదు పాపం !
ఎందుకు ఆ అలక ?
ఓహో అరుపులకు నవ్వుతున్నారని తెలిసిందా 
మనిషి వృద్ది చెందిన రోజుల నుండి మీకీ గతని తెలువదు పాపం !
అహంకారమే ఊపిరి చేసుకొన్న పిచ్చికుక్కల ఆధిపత్యం నడుస్తుందని తెలువదు పాపం 
పూట గడుస్తే చాలు 
ఆవతల ఎన్ని తలలు తెగితే మాకేంటనే గజ్జికుక్కల వికృత చూపులు తెలువదు పాపం !
పచ్చని లోకాన్ని 
అరిగిన రాగి చెంబోలె నలిపిన గాడిదల గావరాలు తెలువదు పాపం 
అడవిరాజులని అనచి 
అవసరానికి వండుకు తింటారని తెలువదు పాపం !
ఇక అలకలు వద్దు 
దండు కట్టండి 
జీవ జాతులన్నీ కలిసి 
యుద్ధం చెయ్యండి 
కుళ్ళిన కుసంస్కారుల పైన !
మీరు చేయ్యనక్కరలేదులే 
వారి గొయ్యి వారే తీసుకున్నారు 
త్వరలో మీ కసి తీరుతుంది !
కృష్ణ మణి I 04-09-2014


ప్రేమ జ్యోతి


_____________కృష్ణ మణి

మొన్న కలిసి
నిన్న పలకరించి
నేడు వరించిన
వలపు తోటలు నిండుగా పూయని పువ్వుల గుత్తులు !

ఆకాశాన పువ్వుల వానలు
వాగులో నవ్వులు కలువలు
ఎటుచూడు మెరుపుల కన్నులు
ఈ క్షణం యుగమవ్వలాని కోరే ప్రతి మది !

ప్రతి మనిషి ఆనందాల వెతుకులాటలో జారే
వెను దియ్యలేని అడుగుల తడబాటు
అలిగిన
నలిగిన
మూలిగిన ఆలోచనల ప్రవాహం
సాగనీ సరైన దిశలో
పొందనీ ఆకాశం అంచున రంగుల జిలుగులు !

మసి బారిన మనసుల ముసుగులు తెరిచి చూసి
కనుగొని మెసలు గుండె గాయమవక ముందే
వెలిగించు జ్యోతిని కడవరకు మాయని వెలుగుని !


కృష్ణ మణి  ! 02-09-2014 

వెన్నెల-వెలుగు


________________కృష్ణ మణి
పెదవంచున మెరిసిన వెలుగు
రవికాంచని మనసున కురిసిన వెన్నెల
ఆ వెలుగు వెన్నెల జాతర ఉండునా కలకాలం అని అడిగిన కన్నులు

అవునని కొందరి ఆలోచన
కాదని ఇంకొందరి వాదన
ఇంతకీ ఎవరి దారి ఏది ఆగని గోదారి నడకన ?

మోహంతో శాంతిని వెతికే సంసారులకు ఒక దారి
ఏకాంతంలో మోక్షం పొందే సన్యాసులకు మరో దారి
వింత దారుల్లో వెనక ముందు పరుగుల గమ్యం !

నయనానంద దృశ్యం మనసున మల్లెలు కురిపిస్తే
కళ్ళు మూసుకొని ఆనందం అంచున ఆడే ఆరాటం ఒక వింత అనుభవం
తడబడు అడుగుల గమనంలో అందక పొందక అహంకారమే అలంకరణ !

వీధి వీధి భాగోతాల అంతర్మధనంలో విహరించే వెర్రి నవ్వుల కన్నా
తల్లిని గుర్తెరిగి చిదానంద చిద్విలాస జాతర చిరుకాలమైన మిన్నేగా !