Wednesday, June 24, 2015

ఆహ్వానం


_______________కృష్ణ మణి

చలికి వణుకుతూ కుంపటిని ఎతికినట్లు
చలిని వెతుకుతూ మండే కన్నుల ఆరాటం !

రోడ్డెక్కిన సల్ల కడవ
పూదీనాకులను పులుముకొని
ఎర్రని చీరను సింగారించుకొని
దాహపు చూపులను సైగ చేస్తుంది !

ఎటు చూడు అగ్నిగుండాల సెగల పరుగు
చెట్టుదాపును ఎక్కిరిస్తుంది  
పడుతూ లేస్తున్న ఆ చిట్టి దూడ
ఏమి అవుతుందో అర్ధం కాక నాలుకను బయటికేసింది !

ఆ టీ కాఫీల మిషను
పక్కన ఇసుక్రీం షాప్ పై అలకబూనింది 
కొబ్బరి కొట్టు కాలరేగుస్తూ 
ఎప్పటికీ రారాజునంటుంది !

తుస్సి గ్రేట్ హో....  లస్సి
ఫాలుదాలో సబ్జా గింజలు
పళ్ళ సందుల్లో జారిపోతూ నవ్వుతున్నాయి !

మజ్జిగ చెరుకుపాలు
ఆగమని ఆజ్ఞాపిస్తున్నాయి
గుక్కదిగితే చాలు
ఒక్కసారిగా ప్రాణం లేచోచ్చినట్లనిపిస్తుంది !

ఇంకెన్నాల్లో ఈ ప్రచండభానుడి కోపం ! 


కృష్ణ మణి 

లోతు మాట


_____________________కృష్ణ మణి

నా ఊరి మీద
కొత్తగా పక్షుల గుంపులు పొద్దు దిగిన వేళ
కడుపులు నింపుకొని
కడుపులు నింప ఇళ్ళు జేరుతున్నవి !

వొరిగిన మోద్దుకు ముద్దుగ
చిగురుల నవ్వులు
బీళ్ళు తెరిచిన నేలపై చెట్టుకొమ్మల ఛాయ
కొమ్మ కొమ్మకు పూసిన గూళ్ళు !

కిల కిల రావాల హోరు
చెట్టునీడన కునుకుకు జోల పాటల తోడు
తనువు మరిచే నిద్దురపట్టి ఎన్నాలాయేనో !

చెట్టుకు
కొమ్మలు పొదిగినట్లు
చెట్టుకు చెట్టు హత్తుకొని
పరిచిన పచ్చని గొడుగు
జీవకోటికి ఎంత మురుసుడో కదా !

చెదిరిన లోకం
చేరువై సాగే జీవన పయణం
సకలం సంకటం దాటి
శాంతి పొందునని నా ఉప్పునీటి వాగు లోతు మాట  !


కృష్ణ మణి 

శూన్యం


________________కృష్ణ మణి

ఏవో పిచ్చి గీతలు
బహుశా నా ఆలోచన గ్రాఫ్ అనుకుంటా 
నా తెల్లటి మనః పలకంపై
ఒక్కొక్కటి ఎంత వికారంగా ఉన్నాయో
చెప్పలేను చూపలేను !

సగటు మనిషి ఆలోచనలతో
నన్ను నేను పోల్చుకున్నప్పుడు తెలుస్తున్నది
నేనెంత వింత ప్రపంచంలో బతుకుతున్నానోనని !

కాలమహిమో  లేక
మనిషి పరుగో తెలియదు
లోకం పరుగుకు ఎదురుగ నడుస్తున్నాను !

ఎంత చిత్రంగా ఉందొ ఈ పయణం
అంతే చిత్రంగా ఉంది మనిషుల ఆలోచనల పిచ్చి గీతలు
ఒకదానికి  ఇంకో ఒక్కదానికి పోలిక లేదు !

ఈ గీతలన్నింటిని
ఒకచోట చేర్చితే తెలిసింది
అంతా శూన్యంలో పుట్టి శూన్యంలో చూస్తూ
శూన్యంలోకి నడుస్తున్నామని !


కృష్ణ మణి  

మాయన్న


_________________కృష్ణ మణి

ఏలే దొర దొంగని తెలిసి
దొంగను కాపాడ తోడు దొంగలై
మసలుతున్నరే అన్నల్లారా !!!

సిగ్గనిపిస్తలేదా సికాకులం అన్న
పరువనిపిస్తలేదా బ్రహ్మన్న
రోషం లేదా కడపన్న !

చూడు కండ్లు తెరిచి
ఇచట నా/నీ అన్నదమ్ములకు
ఎమోచ్చనని అంత కష్టము !

కష్టాలకొర్చినోల్లం
కసాయి గొంతులను తోక్కినోల్లం
మరిచితివా మాయన్న !

దొంగలమని
లంగలమని
ఎందుకు ఆ ఒప్పుగోలు !

నిజమే నీయంత తెలివిలేనోల్లమే కాని
తెలివిమాలినోల్లం కాము
అయితే అయితది ఇంకో యుద్ధమే
మిమ్ములను సాగనంప !

నువ్వు నొచ్చుకున్నంత మాత్రాన నొప్పేమి కాదు నాకు !

కృష్ణ మణి

Friday, June 5, 2015

నిజరూపం

నిజరూపం
________________కృష్ణ మణి

నన్ను నేను వెతుకుతూ
ఎండమావుల వెంట
కనీ కనిపించని ఊహల చిత్రం
అర్ధం అయ్యి అవ్వక ఆరాటం !

తెప్పలాచాటు అందాలను ఆరతీస్తూ
నింగి చుక్కలలో జల్లడ పడుతూ
నిశీది పయణం !

రక్తపు ఊబిలో
ప్రతి కణంతో కలియబడి పోరాటం
మంచిదేదో చెడ్డదేదో తెలియక జగడం !

నీటి అడుగున
ఊగే లోకంతో జతకట్టి
కొత్త అందాల జాతరలో అయోమయం !

గమ్యం తెలియని
అంతః కలహం
మస్తిష్కాన్ని మదించి తోడినా  
దొరకని నా నిజరూపం !


కృష్ణ మణి  

సెగల కుంపటి

సెగల కుంపటి
______________కృష్ణ మణి

పొద్దు కదలని కాల విషం
నడి నెత్తిన సూర్య బాణం
నీడ నాతొ ఆటలాడుతుంది !

ఒంటి నీరు నింగికంటి
నోరు తెరిచిన జీవజాలం
ఎటు చూడ ఉప్పు సముద్రపు ఊటలు !

పడమటింట పొద్దు దిగిన
సెగల కుంపటి ఆరదింక !

ఆకాశం నిర్మలంగా ఉంది
అట్లాగే రోడ్డు పెనంలా కాగగ
అడుగేయ్యని లోకంతో
నిర్మానుషంగా ఉంది !

డ్రైనేజి పైపులు ఎండి
ముక్కులు పగిలే స్తితి
నీటి టాంకర్లన్ని బిజీ బిజీ
బిందెల గొడవలో అంతా గిజి గిజి !


కృష్ణ మణి   

అడ్డదారి

అడ్డదారి
________________కృష్ణ మణి

అమ్మ ఒడిలో
చను పాలతో ఆటలాడితివి కదరా !

రథసారథి నువ్వైతివి
గుర్రాలు మీరేనైతిరి
ఎనుక గుడ్డి జీవులజేసి
సాగితివి కదరా బుద్దిజీవుడా !

నేనులేక నువ్వెక్కడని
ఎక్కిరించితివి కదరా
మరి ఇప్పుడు నువ్వేక్కడరా !

అవమానాలను ఆలింగనం చేసుకొంటిని
నీ చతుర అహంకారాల వలయంలో
కుప్పలు పోసి నలిచితివి కదరా మూర్ఖుడా !

అరికాలికి చెప్పులేని రోజెక్కడా
పాదాలతో పాలరాతిని ముద్దాడితివి నిన్నటి వరకు
సోకును మరచితివిరా !

అడ్డదారిని అదిమి
అందుకున్న అడుగును చూసి
ఏడుపెందుకురా ఇంకా !


కృష్ణ మణి 

నిరంతరం

నిరంతరం
______________కృష్ణ మణి

నిర్మలం నిరంతరం
గగనం నిత్య నూతనం
హరితం సువిశాలం
పవిత్రం ప్రాణ త్యాగం
సాహసం కర్మభూమి ఋణం !

ఉప్పొంగే రక్త వాగు నరనరాన
గర్వించే గుండె గంట ప్రతి రోశపు జీవిలోన !

పదం పదం ప్రతి పదం
కదం కదం జనం మనం !

ఎండ కాంతిని గొడుగు పట్టి
అడుగు నీటిని తోడి పోయగ
నింగి బొట్టును అదిమి పట్టి
భూతల్లికి పురుడు పోయగ
అందివచ్చును అమ్మవొడిలో
ప్రేమవోమ్పిన  నేతి ముద్ద !

కన్నుమూసిన కలలను
కన్నుగారిన ఓర్పు

నెరవేర్చును ఇంతకు అంతై !

సంకెళ్ళను తెంచిన
యాడాదికి యాడాది 
అమ్మా ... నీ పిల్లలమని
ఆనందపు శ్వాస నిండగ
చేతులెత్తి మా తనువు 
తలను వంచి మొక్కుతుంది !

జై తెలంగాణ ..... జై జై తెలంగాణ
జై తెలంగాణ ..... జై జై తెలంగాణ


కృష్ణ మణి