Thursday, September 24, 2015

వొరాల పస్క

వొరాల పస్క
_____________________కృష్ణ మణి

బర్రెమందల నడిమిట్ల ఆయిలాకుల కట్టే
పోతున్న తొవ్వ పోతనే ఉంది
పోయ్యేదెక్కడో తెల్వకుండనే !

చెర్వుకట్ట మీద చింతచెట్టు
అక్కడక్కడ కల్లులొట్లు నిండుతున్నయి
నీల్లబడే ఊరి బర్లు నెమరు వెయ్య
నేను తోమితి ఈపును పెండవోంగ !

వొరికోశిన వొరాల పచ్చగీతల పలకరింపుల
నా బర్లు మురిశిపోంగా
నేబోతిని నోట్ల నీరూర
శేనవతల నేరుడు పండ్లను రాల్లగోట్ట !

నాకిన వొరాల పస్క కరిగి మట్టివాసన నింగికేగరే
కడుపు నిండిన పశువులన్నీ దూపతోడ చెర్వు చేరే
నాల్క వగిలి నా నోరు మండుతుండే !

పిల్లజల్లలు యాదిరాంగ దొడ్డిజేరే
పొదువు నిండి డబ్బ నింపి దుడ్దెల నవ్వుజూసే !

నిండిన డబ్బలు పట్నంల రాతాలు పోశే
పైస బుట్టి అందరిల్లు మురువవట్టే
బర్రేతోడు మా అయ్యా తాగవట్టే
చెల్లెతోడు మా అమ్మ ఎడువవట్టే !

కృష్ణ మణి

Wednesday, September 23, 2015

నానోలు 2

తనువు
విచ్చిన్నం
అణువు
విస్పోటనం
***

ఊహలు
ఊసులు
కట్నం
దహనం
***

పవనం
మృత్యు గానం
మలినం
కళేబర నృత్యం
***


Sunday, September 20, 2015

నేను

నేను
_________కృష్ణ మణి


1
గానాన్ని
హారాన్ని
వెలిగే కర్పూరాన్ని

2
చెట్టును
పువ్వును
ఆకలి ముద్దను

3
బొమ్మను
అమ్మను
కన్నీటి చెమ్మను

4
కాలును
గజ్జెను
భండారి పసుపును

5
బొట్టును
బోనాన్ని
వీరతాడును

6
కవితను
భవితను
బరిసెల బాకును

కృష్ణ మణి

రక్తపు చుక్కలు

రక్తపు చుక్కలు
________________కృష్ణ మణి

ఇలా ఎవరనుకున్నారు
గడ్డిపరకలపైన ఆ నెత్తుటి చుక్కలు
కసాయి కత్తుల అహంకారానికి రాలుతాయని !

ఇలా ఎవరనుకున్నారు
ఆ మరకలు గుండెలపై శాశ్వత ద్వేషం చిత్రిస్తుందని
రేపటి రక్త తర్పనానికి నాందవుతాయని !

ఇలా ఎవరనుకున్నారు
నమ్మిన బతుకుల నవ్వులను ఎక్కిరిస్తారని
నాటుకు ముందు కంచెనే మేస్తుందని నారుతడిని !

చేసేదాని వెనుక ఏముందో చేసేవాడికే తెలుస్తుంది
చేసాక చూస్తాడు చేసేదిక ఏమి లేదని
తన కన్నును తానే పోడుచుని చింతిస్తాడు ఎలా నవ్వాలోనని !


కృష్ణ మణి  

Tuesday, September 15, 2015

కరిగిన బందం

కరిగిన బందం
________________కృష్ణ మణి

చెప్తానొక కన్నీటి గాధ
నిన్నటిది మొన్నటిది ఇప్పటిది ఎప్పటిది
విన్నది కన్నది
చెప్తానొక గాధ
నిన్నటిది మొన్నటిది ఇప్పటిది ఎప్పటిది !

నిర్జీవంగా ఉన్న సజీవ బతుకుల కథ
కన్నీటి వాగులో కొట్టుకుపోతున్న కష్టాల దృశ్యమాలిక
గడచిన కాలం పువ్వులన్నీ ముల్లులుగ పొడచూపిన వ్యద
చెప్తానొక గాధ
నిన్నటిది మొన్నటిది ఇప్పటిది ఎప్పటిది !

నీకై నాకై పరచిన గుండెలు
సుకుమారంగా తన్నినాము
మురిపెమని నవ్వారు !

కసిగానే తన్నినాము
పసితనమని గునిగారు !

బాహ్యపు కొమ్ములు వాడిగ పెరగగ
మాకేవరడ్డని చూసాము
ఉడుకురక్తమని ఆగారు !

సంపద నిండగ మురిసాము
అవసరమేముందని చూసాము
కడుపులో పేగులు కదిలాయి
కన్నపేగని ఒర్చారు !

ముసలి మూలుగులని కసిరాము
ఏహ్యంగా తలతిప్పాము   
బతుకుట దండగని మొక్కారు
చితిలో తోడుగ కదిలారు !

చెప్తానొక కన్నీటి గాధ
విన్నది కన్నది
నిన్నటిది మొన్నటిది ఇప్పటిది ఎప్పటిది !

కృష్ణ మణి


 


Monday, September 14, 2015

టైం వేస్ట్ బాస్ ... మీతో

టైం వేస్ట్ బాస్ ... మీతో
_______________కృష్ణ మణి

ఊహల పల్లకిలో ఊరేగుతున్న క్షణం  
లోకం ఎలా పొతే నాకెందుకు
ఎందుకంటే అప్పుడు నాగురించే ఆలోచించను !

నేను నిద్రిస్తేనే కదా ఉదయం నాకు  
రేపటికి పరుగు పెట్టడానికి
ఎల్లుండి పూట గడవడానికి !

ఎండమావుల వేటలో డైలీ
అందని ద్రాక్షని అందుకునే ప్రయత్నం
అందనిదేదని పొగరు లుక్ !

ఇది అవునా అది అవునా అంటూ
తీరిక మాటలు లేవు
ఇటు అటు చూపులకు మెడ నొప్పులు పుడతాయి
గొంతునొప్పులొస్తాయి
టైం వేస్ట్ అవుతుంది
అసలే ‘’కోలన్’’ కు ‘’సెమి కోలన్’’ కు తేడా తెలియక తికమక పడుతుంటే
డు యు నో దిస్ అండ్ దట్ అంటూ  
గజిబిజిగా గందరగోళం చేస్తున్నారు
బతుకుట తెలియని వెర్రిబాగులు !
  
అయినా
నేనెన్నడు పట్టించుకున్నానని హాహా హాహా ...
అన్న పెళ్ళికి రెండు రోజులే లీవ్ పెట్టా తెలుసా
అక్క పెళ్ళికి వర్క్ లోడ్ ఉందని ఇంటి పనులు తప్పించుకున్నా
కజిన్ ల వ్యవహారలకైతే ఇంకా చెప్పాలా
అసలు పొతే కదా
చావు దినకార్యాలకు ఇంకా దూరం
ఆ ఏడుపులు భరించలేను బాబోయ్
ఎక్కడలేని వింతలను చూడాలి
ఇంకా వంశం వారిదైతే గుండు కొట్టించుకోవాలి
అమ్మో నా పరువెమవుతుంది !

ఫుట్ స్కిన్ నలుగుతుందని లూఫర్స్ వాడుతాను
చేతిలో ఐప్యాడ్ చెవిలో హియర్ ఫోన్స్ కళ్ళకు ఎవిఎటర్స్  
షార్ట్ జీన్స్ స్లీవ్లెస్ టీ షర్ట్    
ఫ్రెండ్స్ ని కలవాడానికి వెళుతున్న
నా లెవెల్ చూపాలి గదా !

ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ చాల సెలెక్టివ్ గా అక్సేప్ట్ చేస్తా
నా పైత్యాన్ని భరించడానికి ఉండాలిగా కొందరైనా
లైక్స్ కామెంట్స్ రెగ్యులర్గా పెట్టేవారినే సుమా
లేకుంటే అన్ఫ్రెండ్ బట్టన్ ఉందిగా !

మీతో టైం వేస్ట్ చేస్తున్నాను   
అసలే నిద్దుర కరువు కాలం
ఊహల్లో సన్నిని వెతకాలి  
ఉంటానూ ..
లైక్స్ కామెంట్స్ మర్చిపోకండి
లేకుంటే తెలుసుగా .... హాహా హాహా ...

కృష్ణ మణి
  



Wednesday, September 9, 2015

ఆగిన లోకం

ఆగిన లోకం
_____________కృష్ణ మణి

వెలుగు రాకముందే గది నిండా చీకటి కమ్ముకుంది  
బద్దకించిన ఒళ్ళును లేపి కళ్ళు తెరిపిస్తే తెలిసింది
మొబైల్ చార్జింగ్ లేదని !

ఇదిగో అదిగో అంటూ
క్షణానికి ఒకపరి దిక్కులు
ఆ లైట్ వంక ఈ ఫ్యాను వంక
విసుగుతో అలసిన మనసు !

ఎవరో పలకరిస్తారని
ఎవరినో పలకరించాలని ఆరాటం
వస్తుందనీ
బ్యాటరి నింపుతుందని ఎదురుచూపు !

హడావిడిగా లోకం పరుగు పెడుతుంటే
ఖాళి అయిన నీటి కడవలా బిక్క చూపు నాది
ఇప్పుడు స్వాతి పిట్టను నేను
దాహం తీరితేగాని అడుగు ఇంటి బయట పెట్టను !


ఉదయం పది అవ్వగా
సూర్యుడు మొహాన్ని మాడ్చగా
చీకట్లో నిలుచున్నట్లు అనిపిస్తుంది
ఫోన్ మొగితేగాని
రేడియో అరిస్తే గాని
టీవీ చూస్తేగాని
 తెల్లవారని లోకం !

ఇల్లు ఒక్కసారి అడవికి షిఫ్ట్ అయినట్లు తోస్తుంది
మల్లి అనాగరిక ప్రపంచానికి చేరినట్లు
భరించరాని నిస్తేజం ఆవరించింది !

ఓహ్...  మొత్తానికి వచ్చింది
హమ్మయ్యా ... చార్జర్ ఎక్కడా !
 

కృష్ణ మణి 

ఉసురు

ఉసురు
_______________కృష్ణ మణి

నేనూ  
ఒక కోడి ఒక మేక
కలియ తిరుగుతున్నాము ఎవరికీ దక్కక !

మేక వెంట ముగ్గురు
అటు ఇటుగా చేతులు చాచి దగ్గరొచ్చారు
గోడ దూకింది కిటికీని ఆసరా చేసుకొని !

నా వెంట పది మంది
పరుగు పరుగున పొదలను దాటి
బురదలో దిగి నిల్చున్న
నన్ను చేర వశం కాక వెనుదిరిగారు !

కోడి వెంట ఇద్దరే
అలసిన కోడి చెట్టెక్కబోయి జారింది
మనిషి చేతిలో పడింది పాపం  !

ఒరేయ్ ....
ఒసేయ్ ....
దొంగ .............................కోడకల్లారా
దొంగ ............................కూతుల్లారా
పోతారు
మా ఉసురు తగిలి మట్టి కొట్టుకపోతారు !
  

కృష్ణ మణి 

Sunday, September 6, 2015

తెలుసా ...

తెలుసా ...
_____________కృష్ణ మణి

మనసులో  ఏముందో తెలియదు
నీ చుట్టూ చేరే తేనెటీగలూ
దూరానా గుడ్ల గూబలూ
అంగాంగాన్ని తడిమి చూడ్డానికి
అర్రులు చాచుకుచ్చున్నాయి !

నీవు ముడుచుకొని నిలుచున్న ప్రతిసారి
కర్కశమైన ముల్లెన్నో పొడుస్తూనే ఉంటాయి
దారిలో కొన్ని మృగాలు అదును చూసి కత్తులు దింపుతాయి !

అన్నింటికీ నీవే మూలం అంటాయి 
మూల తిరిగేసరికి కొంగుకు ఉరేస్తాయి  
నీవు ఎదిరించకపొతే
వంచడమే సంప్రదాయమైన విషజంతువులు
నిన్ను బుర్ఖాలోనే భూస్తాపితం చేస్తాయి 
అందరు సమానమేనని మైకులో అరుస్తాయి 
ఇంటిదాకా వచ్చాక ఆలిని ఆదరిస్తాయి  !

లోకం చలికి వణుకుతుంది
నీవు మాత్రం పగలు రేయి ఇంటాబయటా తేడాలేదు
తరతరాలుగా ఇదేగా ఘనమైన చరిత్ర
జరుగుతున్న వాస్తవం !

ఆదిమ సంస్కృతి నుండి విలాస వస్తువువి
పరువు మర్యాదలకు కేరాఫ్ అడ్రస్సువి
జరిగిన కాలాన్ని మార్చలేము కాని
జరుగుతున్న కాలాన్ని మరలుస్తామేమో చూద్దాం !


కృష్ణ మణి  

చేగో

చేగో
______________కృష్ణ మణి

చేగో
తెగింపుకు మారు పేరు
ఎదురించడమే తెలుసు అన్యాయం ఎక్కడున్న !

చేగో
గట్టిగా బాగో అన్నాడొకనాడు
దశాబ్దాల సంకెళ్ళను తుంచడానికో అడుగు అందరి కంటే ధైర్యంగా    
కనికరం లేని కసాయిల కుతంత్రాల వల చేదనకై
నడిమధ్యన గొంతెత్తి అరిచాడు జై తెలంగాణా అంటూ !

చేగో
ఎలా భరించాడో ఆ బూతు మాటలను బూటు తన్నులను  
కుర్చీలు ఎగిరుతున్నాయి గుండెపై పడటానికి
ఈడ్చుకుంటూ సాగిన యుద్ధంలో
సమైఖ్యమనే జండాలకు తూట్లు పొడిచిన శూరుడు !

చేగో
నాకెందుకో నవ్వొస్తుంది
కుంగ్ఫూ హజిల్ సినిమాలో
భూమిలోకి దిగిన తలతో హీరో
చిన్నపాటి కర్రముక్క చేతబూని
విలన్ తలపై మోదినట్లు !

చేగో
ఇప్పుడు అచ్చంగా అలాంటి వాడే
ఉద్వేగంతో ఉన్న  యోధుడు
తలపై కారుతున్న రక్తం ఆగినా   
గుండెలో రగులుతున్న ఉప్పెన
జై తెలంగాణా .. జై జై తెలంగాణ  అంటుంటే 
టీవీల ముందు రోషానికి కారిన కన్నీటి వాగులే సాక్షం !

చేగో
మనం గెలిచాము
అమావాస్య చీకట్లను బద్దలుకోట్టాము
కొనప్రాణం వరకు సాగాలి ఉద్వేగం
ఎందుకంటే మనం
బంగారు తెలంగాణ యాత్రలో చీకటి దివిటీలం !

చేగో
నీవు మరుపురాని నవ్వువి
తప్పున్నచోట పసిపిల్లోడి అల్లరివి
నిరంతరం ఈ లోకమే సర్వం
జగమంతా కుటుంబం ఉన్నా ఏకాకి జీవితం నీది
సలాం ఆత్మ బందమా !


కృష్ణ మణి