Friday, December 19, 2014

భాయ్ సాబ్


________________కృష్ణ మణి

రంది చేసుడేంది భాయ్ సాబ్
నిజం కనిపిస్తుంది నీ మొఖంల
మురిగిన యాపిల్ పండోలె భాయ్ సాబ్ !

నువ్వు కావాలంటే తిమ్మిని బమ్మి జేస్తవు
నాకాడికి రాగానే లబ లబ మంటవు
నీకు GO లు చుట్టాలు 
నాకు మాత్రం ఎక్ష్పైరి GO పాలోనివి భాయ్ సాబ్ !

పురుగుల మందు తాగమంటవు
నీదీ కడుపే గదా నాలెక్క
నీకు రెండుపూటలు గడుస్తున్నప్పుడు
నా ఒక్క పూట తిండి మీద ఏడుపెందుకు భాయ్ సాబ్ ?

నిజమే అనిపిస్తుంది ఆనాడు లాడాయి సరిదని
ఒడువని లాడాయని ఇయ్యాల తెలుస్తుంది
నీ ఓర్వని గుణం ఒరిగిపోను
ఎలుగు లేనికాడ మొమ్బత్తిని కూడా ఊదుతున్నవు భాయ్ సాబ్ !

ఒక డళ్ళు పడంగనే పాణం సల్లవడ్డది
ఆకు పచ్చవడ్డది 
పోరుగోడు సల్లగుంటే నేను సల్లగుంట
కాని నువ్వు పోరుగోడు నెగుల్తే పొయిల నీళ్ళు పోస్తున్నవు భాయ్ సాబ్ !

కృష్ణ మణి I


 

   

గుడ్డీగలు

గుడ్డీగలు
______________కృష్ణ మణి

ఎదో నిశబ్దం మా చుట్టూ చేరి
మమ్మల్ని తరుముతున్నట్లు అరుస్తున్నది
స్కూల్ గేటు తీసుకొని మా నాన్నల్లగా కొందరు
ధైర్యానికి మారుపేరైన దుస్తుల్లో మీ పిరికి పిచ్చోళ్ళు అడుగుపెట్టారు !

మేము పిల్లలం మీ పిల్లలం
లోకం తెలియని పువ్వులం  
నవ పాకిస్తాన్ నిర్మాతలం
రేపటి రోజుకు వారసులం !

మేము మీ బాషనే మాట్లాడుతాం
వేసుకొనే యునిఫారాల్లో మతం రంగునే వాడుతాం
మతం మానవత్వాన్ని నేర్పుతుందంటారు మరి మీరేం నేర్చుకున్నారు
కన్నా బిడ్డల్ని మింగే త్రాచుల్ల వెర్రి ఆలోచనల్లో మమ్మల్ని సమాధి చేస్తున్నారు !

గుడ్డీగల్లాగా మీ అందత్వంతో
మా మెదల్లను గుచ్చి గుచ్చి చంపారు
మా అమ్మి అబ్బాల ఆశా జ్యోతులం మీలాగే  అల్లా నే పూజిస్తాం !

మేమేం తప్పు చేసాము
మీ అమ్మి ఆబ్బాల్లేరా మీకు బుద్ది చెప్పడానికి ?
మా చాతిలో దించిన తూటాలు ఎవరివి ?
మీ చేతిలో నెత్తుటి మరకలేవరివి ? 

మా స్నేహితులు కళ్ళముందు ఆహాకారాలతో శ్వాసవిడుస్తుంటే
మా శ్వాస ఆగిపోయింది
తేరుకొని చూస్తె శవాలగుట్టలే !


కృష్ణ మణి I 16-12-2014 

పూజారిని


____________కృష్ణ మణి

మొబైల్ లో బందించి నిత్యం నీకో అర్చన , అభిషేకం
నీవో మేనకవో అప్సరవో లేక వారికి అమ్మమ్మవో తెలియదు
నీ వాలు కనులు tv పై తెరుచుకోగా
నా యదలో ఎక్కోడో ఎదో గిలిగింత !

లోకంతో యుద్ధం చెయ్యాలని నీకోసం  
నీతో ఆడిపాడే ముసలి గద్దలే నా శత్రువులు
కోమలి నీవు ముళ్ళ మధ్య నలిగడం నేను భరించలేను !

నాలో ప్రేమను ఎలా తెలపను 
నాలో అసూయను ఎలా మాడ్చను
నాలో కసిని ఎలా చంపను !

నీ మోము చూసిన క్షణం నింగిన కురిసెను స్వేదం
రాలే చుక్కలు బుగ్గను గిల్లగ మనసున విరిసిన పూలు
మకరందాలై నా చుట్టూ విహాంగాలై
నన్ను ఏటో లేపుకేల్తుంటాయి !

నీతో చేరే స్వార్ధం అందరిది కాని
అందరిలో కొందరు
కొందరిలో ఒకన్ని!

కృష్ణ మణి I 13-12-2014




ఆర్తనాదం

ఆర్తనాదం
________________కృష్ణ మణి

అయ్యో రామయ్య
ఈ ఘోరం వింటివా ?
ఈ ఘోరం కంటివా ?

ఆ మొగ్గల నవ్వుల హరివిల్లులు
మనసున రత్నాలై మెరిసేటివి
ఆ ఆమాయకత్వపు పసిడి చూపులు
లోకాన్ని తన పాదాల చెంత చేర్చేటివి !

అలసిన తనవున ఇల్లు చేరిన తండ్రికి
తమ అల్లరి మాటలతో ఆప్యాయతను కురిపించి
మొహాన నవ్వులు పూయించి హిమశిఖరం ఎక్కిస్తారు !

అలుపెరుగని అమ్మను కొంగుపట్టి ఆట పట్టిస్తూ
ఎవరమ్మ నీకన్నా మాకు అండ అనే భావనతో
పదే పదే అమ్మ స్పర్శకై పరితపిస్తారు ఆ బోసి నవ్వులు !

అమ్మ నాన్నే లోకం
అమ్మ ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు
నాన్న మందలించిన కాసేపటికే
నాన్న ఒళ్లో చేరే కపటంలేని కుసుమాలు
వారికి వీరే తోడూ నీడ !

అలాంటి పిల్లల తండ్రి మెదడున
ఒంటికి కరెంటు వైర్లు చుట్టే పాపం
పుట్టించావురా అసురుడా ......

ఆ క్షణాన ఆ పిల్లలు ఎలా విలవిలలాడారో పాపం ......
ఆ కసాయికి స్విచ్ వేసేప్పుడైన తెలియదా నా రక్తాన్ని కాలుస్తున్నానని ....!

ఆర్తనాదాలు మిన్నంటిన వినిపించుకొనే నాదుడు కరువాయే
ఒకరినొకరు చూసుకొంటూ ఏమవుతుందో అర్ధం కాకుండానే
ఒంటికి అంటిన వేడిలో ఆ మూడు పువ్వులు నల్లబడ్డాయి !

గుండెపగిలిన ఊరు
అయినా పశ్చాతాపం ఎరుగని చూపు ! 

కృష్ణ మణి


हिंदी



दिल में मेल पडा है
इसे निकालो मेरी जान ताकि
मै आकर जगह बसाहू वहा !

***********************

दूर से देखा महफ़िल मै तुजे
नजदीक आके लेलिया बाहोंमे
ताकि कोई नादेखे तुजे इस रात

क्योंकि तूम हो मेरी वाइन बोतिल !-------Krishna Mani

గాంధి నడిచిన నేల


________________________కృష్ణ మణి

‘’గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు ప్రతి రూపం ‘’ 
అని చిన్నప్పుడు పాడిన పాట !

గతం తియ్యగానే ఉంటుంది ఈనాటి చేదు ముందు
గాంధి కల నిజమయ్యేది ఎప్పుడు ?
ఆకాశంలో చుక్కలు
పూల రెక్కలుగా రాలి మన కళ్ళను మురిపించేదెన్నడు ?

పడతి పగలు నడువడమే ఒక పాపంలా
పొడచూపే కామ కత్తుల మెరుపుల వలలు
ఇక ఎన్నడు వచ్చును రామ రాజ్యం
ఎన్నడు మారును పశు అహంకారం ?

బీదవాడు బీదోడే ఉన్నవాడు ఉన్నోడే
సమ సమాజం అంటే
భూమ్మీద ధనవంతుని ఇంటి పక్కన గుడిసెలో బ్రతకటమే !

పాలలో విషం నింపి పేషంట్లుగా మార్చగ
కార్పొరేట్ హాస్పిటల్ లో రోగాలకు ట్రీట్మెంట్ కి వెళ్తే
చచ్చినోడికి పరీక్షలు చేసి లక్షలు పోస్తేగాని శవాన్ని ఇవ్వరే !

వర్ణ వివక్షత వల్ల ఆనాడు స్వరాజ్యం కోసం బీజం పడితే
స్వరాజ్యంలో మతఘర్షణలకు బీజాలు వేశారు
వారసులమని చెప్పుకొనేవాళ్ళు
ఇంతకీ వీరు ఎవరి వారసులు తెల్లవాల్లకా లేక గాంధీ గారికా !

తెల్లచొక్క వేసేవాల్లందరూ ఒకప్పుడు నాయకులు
ఇప్పుడు మాత్రం రాజకీయ నాయకులు
ఇంకా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు !


కృష్ణ మణి I 02-10-2014  

పాలోడిని


_______________కృష్ణ మణి

పాలోడిని అంటే పాలు పంచుకుంటోన్ని కాను
పాలు పోశెటోన్ని బర్రేపెరుగు అమ్మెటోన్ని
సైకిల్ కు రెండు డబ్బలు అటు ఇటు
హండిల్ కు చిన్న డబ్బల అద్దలీటరు మాపు !

కొండకు పోతున్న పాలువొయ్య
కొండ అంటే ఉత్త కొండ కాదు గోల్కొండ
బంజర్ దర్వాద దాటి పక్క గల్లిలో అత్తరు మత్తు
తెల్లారక ముందే లేశి బర్లదొడ్డిల కంపు సుషే ఆదత్ ఉన్న నాకు
ఇక్కడికి రాంగానే మనసు గుంజుతది ఇంతసేపు ఉండనీకే !

పొద్దెక్కిన పొద్దు దిగని పరదా చాటు ఆడోళ్ళు
నా గొంతు ఇనంగనే ‘’ క్యా హువా భాయ్  ఆజ్ తుం ఆగయ్ , పానికే ట్యాంక్ లేకే ‘’ అని
నవ్వాల్నో ఎడువాల్నో అర్డంగాక ‘’ ఆజ్ ఆచ్చే లాయా అమ్మ ‘’ అనడం మామూలే నాకు
ఇల్లిచ్చే పైసలతో సోప్పకుట్టి తీస్కరమ్మని అన్న మాట !

లంగర్ హౌజ్ మీదికేని నానల్ నగర్ ఒచ్చి బెకిరీల బిస్కెట్ తిని టోలిచౌకి
బరువు మొయ్య చాతగాక కుట్టి సంచి మీదేసుకునే పహిల్వాను గాని
రోడ్డుమీద పోయేటొల్లను బతిన్లాడి ఇంటిదాకా నూక్కుంటా వస్తే మూడు గొడతది !

ఆకలి మీద నేనుంటే దుడ్డేలు దూపకు సూడవట్టే
నా పాణం అమాయక మూగపాణాల మీద గుంజవట్టె !    

కృష్ణ మణి I 27-11-2014


నేనో వింత



________________________కృష్ణ మణి
ఒకనాడు అడవి ప్రపంచంలో అందరిలా ఒకన్ని
ఆకలిపోరాటంలో విసిరిన రాయి ఇంకో రాయిని ముద్దాడి
అగ్గిని కన్న క్షణాన మెరిసిందేదో నా మెదడున
కాలిన కళేబరాల రుచి బాగుందని మల్లి మల్లి తినాలని ఆరాటం !

ఆ అగ్గి కోసమే కదా ఎన్నో యుద్దాలు చేశాను
చరిత్ర రాయని కాలాన దాగిన వీర గాధలెన్నో
యుగాలు గడిచేకొద్దీ ఎన్నో వింతలు సృష్టించి వింతగా మారిపోయా !

కమ్మరి కొలిమి నుండి కర్మాగారం దాక
కాగడ దివిటి మొదలుకొని LED బుల్బు దాక
గుడ్డకట్టని గుడిసె ఎరుగని గుహల బతుకు నుండి
గుడ్డలిప్పుకొని తీరాన సేద తీరు దాక !

ఈ ఇంగలం కోసమే కదా ఇంధనం వేట  
భూమిని తోడాను సంద్రం తోడాను అతి తెలివితో ఓజోనును కూడ  
వేటకు అడ్డు అదుపు లేదు సకల జగత్తును చరబట్టిన మేధావిని !

నీరు బొగ్గు పెట్రోల్ గాలి సూర్యకాంతి వస్తువులై బతుకు ఇస్తరులై
నవ నాగరిక ప్రపంచాన్ని మూల శక్తులై నడిపే ఇంధనాలు
మస్తిష్కం ముదిరి మతిలేని ముచ్చు మనసు నాది
చంద్రునిపై ఉంటానని ఉరుకులాట గ్రహాలపై జీవశక్తికై వెతుకులాట  !

అమ్మ ఒడిలో పాలధారాలతో పైత్యం ఎక్కిన అమాయక శిశువును
పచ్చని వనాన్ని పసందుగా తిని ఎడారిగా పిప్పి చేసిన రక్కసుడను !

కృష్ణ మణి I 10-10-2014





     

దిగుడుతనం


_____________కృష్ణ మణి
ఎగుడుతనం
దిగుడుతనమై
కొండ అంచున నలిగిపోతుంది !

దిగుడుతనం
ఎగుడుతనమై
కొండగుట్టల అనచబట్టింది !

చిన్నతనం
పెద్దతనమై
లోకాన్ని మోయసాగింది !

పెద్దతనం
చిన్నతనమై
అవమానం సముద్రంయ్యింది !

మంచితనం
చెడ్డతనమై
మురుకి కాలువలో కొట్టుకపోతుంది !

చెడ్డతనం
మంచితనమై
సమాజానికేసి నవ్వుకుంటుంది !

వెచ్చదనం
చల్లదనమై
ఉడుకురక్తం నల్లబడుతుంది !

చల్లదనం
వెచ్చదనమై
అలసిన మెదడు మరుగుతుంది !

మెత్తదనం
గట్టిదనమై
వజ్రానికి సానబడుతుంది !

గట్టిదనం
మెత్తదనమై
పేదల ఆశల ఆకారమౌతుంది !

కృష్ణ మణి I 13-09-2014



చిన్నోడిని


_______________కృష్ణ మణి

ఆధారాల తడిలో నిత్యం స్నానం చెయ్య తలచితిని 
నీ చూపు వెన్నల్లో మురిసిపోవాలని వేచిన చెలికాడను !

వర్షంలో నుదుటిని ముద్దాడే చుక్కనై
శ్వాసలో స్వేచ్చగా  తిరిగే బందినై
కనులముందు నవ్వుపంచే మిత్రుడినై
పాదానికి అడ్డుపడే ముల్లుకు శత్రువునై
నీ రక్షణాదక్షుడనై నిలచిన సేవకుడిని !
 
అందం చూసుకోను అద్దమై నిను నువ్వు ఈర్షపడేలా ఉంచాలని
వాలు జడలో ఇరికిన ప్రాణం క్షణం కూడా దూరం ఉండక
నీ మనసు చేరాలని ఎదురుపడే దేవుడికి దండాలు పెడుతున్నాను !

నాలో నిన్ను బందించాలని ఆపసోపాలు పడుతున్న వెర్రివాడిని
నీ అలసట మాన్పే తల దిండునై సేవ చేయ్యగోరు చిన్నోడిని !

కృష్ణ మణి I 20-11-2014

    

బుడగ


________________కృష్ణ మణి

ఖన ఖనమని మరుగుతుంది మనసు
ఆవేశానికి రూపం ఇచ్చి
తుటాల్లాంటి మాటలతో తుఫాను సృష్టించాలని ఉంది !
ఎందుకు ఈ కోపం నాకు?
అని ఎంత ప్రశ్నిస్తూ అనుచుకున్న ఆగట్లేదు !

నా చుట్టూ ఒక అహంకారమనే నీటి బుడగ
నా వారందరికీ కూడ 
గాలివాటంలో కొన్ని గుంపులుగా మరికొన్ని విడిగా
ఈ బుడగలు పగిలేదన్నడు
ఈ మనసులు కలిసేదేన్నడు !

కొందరు ఉండి లేనట్టు దూరంగా
లోన మసిలే మైల
పాలమీది మీగడలా పై పై పిలుపులు
ఆ ప్రేమ వర్షం ఎప్పుడు పడుతుందో
ఈ కంపు ఎప్పుడు కొట్టుకపోతుందో !

అమావాస్య చీకటిలో నడక
తోడు లేని చంద్రుని అవసరం తెలిసొచ్చింది
పరస్పరం నవ్వులు ఇచ్చి పుచ్చుకుంటే ఏమైంది
నా నవ్వు కరుగుతుందా లేక నీ కిరీటం జారుతుందా ?

కృష్ణ మణి I 23-11-2014


చిత్రమే


___________కృష్ణ మణి

సముద్రపు కెరటాలపై చినుకుల నాట్యం చిత్రమే
చుక్క చుక్క దిగుతూ చిటపట పాటలు చిత్రమే
లవణమింకిన నీళ్ళను ముద్దాడి మునిగే చిత్రం నిజంగా చిత్రమే !

ఆకు అంటి జారే వయ్యారపు తళుకులు చిత్రమే
ఎండిన కన్నుల కారిన మరకల తుడిచే వైనం చిత్రమే
తారల మెరుపుల రంగులనద్దుకొన్న హరివిల్లు కూడ చిత్రమే !

తెప్పల అందం అద్దుకొని మురిసే బిందువు చిత్రమే
నాగలి సాలల్లో తడిసిన పెల్లల గంధపు వాసన చిత్రమే
బురద వాగులో అల్లరి కప్పల చల్లని బెకలు చిత్రమే !

అలసిన జింకల తడిసిన వణుకులు చిత్రమే
తడసిన మరక మాయమౌతానని అలిగిన దృశ్యం చిత్రమే
మేఘాల సందులోంచి తొంగి చూసే భానుడి ఆరాటం చిత్రమే !

కృష్ణ మణి I 16-09-2014
 
  




ఉయ్యాలో


_________________కృష్ణ మణి

ఊరూరు కదిలింది ఉయ్యాలో ఉప్పెనై లేశింది ఉయ్యాలో
ఊర్లల్ల దొంగలు ఉయ్యాలో పట్నంల జెరీన్న్రు ఉయ్యాలో
పట్నంల దొంగలు ఉయ్యాలో గజ్జి దొంగని కలిశె ఉయ్యాలో

దొంగకు దొంగలు ఉయ్యాలో తోడై కదిలిండ్రు ఉయ్యాలో
దొంగలందరూ ఉయ్యాలో దోపిడీకి కదిలిరి ఉయ్యాలో
ఊరిని ఊడ్చిండ్రు ఉయ్యాలో రక్తం ఏరాయే ఉయ్యాలో

పడతి వలువలు ఉయ్యాలో చెట్టుకు యాలాడే ఉయ్యాలో
బరిబత్త బతుకులు ఉయ్యాలో బతుకమ్మ ఆడెను ఉయ్యాలో
ఆనాడు నరకము ఉయ్యాలో లోకమే సూడంగ ఉయ్యాలో

పైనుంచి సైన్యము ఉయ్యాలో దిగివచ్చి ఒంచిరి ఉయ్యాలో
ఒంచిన తలకాయలు ఉయ్యాలో గాంధి టోపీలాయే ఉయ్యాలో
దొంగకు తాళాలు ఉయ్యాలో దొరనే ఇచ్చిపాయే ఉయ్యాలో
...............................

కృష్ణ మణి I 28-09-2014 . 

ఇది నిజం


____________కృష్ణ మణి

రక్తంతో తడిసిన భూమి  
ఒడువని యుద్ధం
కత్తుల కోలాటం
బందూకులెత్తిన బడుగులు !

గుర్రాల పై తల దండాలను కట్టిన  
వికృత వికటాట్టహాసం
నర మాన ప్రాణ దోపిడీ రాజ్యం
కూలాలని చేసిన యజ్ఞం
రాక్షసుడు తలవంచక తప్పని వైనం !

స్వేచ్చ నిజమని మురిసిన కన్నులు
జమీను జాగిర్దారి అహం గంగపాలు  
కలసిన దేశం కలకాలం గర్వంగా ఉండనియ్యని
గతిలేని గావరాల కన్ను చెదిరిన కయ్యం
ఉండనిచ్చున నిను నిలువెల్ల గాయం చెయ్యక !

విడిపడిన విడువని అహం
ఈ రోజు అది ఈ రోజు ఇది
మరి ఇన్ని రోజులేమి చెయ్యలేదెందుకు
ఇప్పుడే నిద్రలేచిన చేవలేని చేతనం అచేతనం !


కృష్ణ మణి I 17-09-2014 

అయిదేండ్లు


___________కృష్ణ మణి

మా బాద నీ గొంతు
మా బలం నీ సొత్తు
మా కల నీ అడుగు
ఉప్పనై ఊగిన ఊరు వాడకు దశా దిశను నిర్దేశించిన వీరుడా !

కన్నీళ్లను మింగినం కసాయిలను ఎన్నుకున్నందుకు
ఇంగలాలపై నడిషినం పాములకు పాలు పోషినందుకు !

ఆకలి మాని అరశినం
అడ్డంగా ఉన్న గోడలను బద్దలు కొట్టినం
అడవిపాలు అయ్యి ఆయుధాలను ఎత్తుకుందమనుకున్నం
గాంధీ మార్గమే మేలనే నీ మాటకు కట్టుబడినం !
 
నువ్వు దీక్షకు కూసుంటే అండకు అండగా నిలబడ్డం
మదమెక్కిన ఏనుగులను ఒంచినం నీ అడుగులో అడుగేషి !

ఎక్కిరింతల మాటలు పడ్డం  
ఎదురుతిరిగి పళ్ళు రాల్లగోట్టినం
మరిగిన గుండెలను కుమ్మరి కొలిమిలో బొగ్గులను జేశినవు
మాలో సత్తువను నిద్ర లేపి రోషానికి రోషం నేర్పినవు !

మా ఆవేషానికి కొత్త రూపునిచ్చిన నీ సాహసానికి అయిదేండ్లు 
ఓ ధన్యజీవి
బంగారు అక్షరాల చరిత్ర నీది
నీకు నూరేండ్లు !   
  

కృష్ణ మణి I 29-11-2014      

అడవిగోస


___________కృష్ణ మణి
దుఃఖం నీది
మల మల మసిలే లావాలో బతక నేర్చిన కలువల పై మచ్చలు
తప్పని తిప్పల ఆకలి అరుపులు  !

నువ్వు నిలిచే ప్రతి చోట నీ ఎత్తులను
నడక అందాలను కత్తుల చూపులతో
నీ యదకు కుచ్చుకొనే శూలాలు ఎన్నో !

నీ అందం కరిగే క్షణం నుండి నిన్ను వదిలిన ప్రేమ
అది ప్రేమ కాదు కేవలం భౌతికాకర్షణ
నీవు వోని కట్టిన క్షణం నుండి బోని చెయ్యాలనే పిచ్చి కుక్కలెన్నో !

కట్టుకున్న వాడు కూడా నీ మనసుపై కాక నీ సంపద(సంపాదన)పై కన్ను
సర్వం తానని స్వర్గం అనుకుంటే నరకమని మున్నాలకే తెలిసింది
పచ్చిగా తిట్టినా గాని సిగ్గు పడని బురద జల్లలు !

లే ఇక లే
ఆగని గుండె మంటలారక ముందే
ఎత్తు కాళికాంబ వీర ఖడ్గం
నరుకు కసి తీర
ఆశల పల్లకిని విరిచిన ఆ దున్నపోతు అహాన్ని !

కన్నతల్లులు తల దించుకొనిరి కసాయిలను కన్నందుకు
అది కూడ ఆడగోసనే కదా పాపం !

కృష్ణ మణి