Saturday, March 14, 2015

మనసు మెరిసిన వేళ


____________________కృష్ణ మణి

గోడకు ఉరేసుకోన్న జ్ఞాపకాలు
దుమ్ముతో నిండి ఇప్పటి స్తితిని ఎక్కిరిస్తుంటే
చిట్టి అలను తన్నే పెద్ద అల బరువుతో ఒడ్డును అద్దుకొన్నట్లు
నవ్వుకొంది మనసు !

జ్ఞాపకం చేసుకున్న ఒడ్డు మీద పరకలను  
చెప్పు తెగిన బడి అడుగులు
చెప్పలేని ఆకలికి దాహంతో సర్దుకొని
దోస్తుల ముందు బడాయి మాటల బీరాలు !

వొరం బురదై అడుగు పడవలా జారితే
వేసుకొన్న తెల్ల చొక్కా భూమిని ముద్దాడగ  
అమ్మ గుర్తొచ్చి కళ్ళలో వాగు జారిన క్షణం !

ఇసుక తిన్నలు నింపుకొన్న పక్క విధి వాకిలి 
వెన్నల చలువలో ముగియని ముచ్చట్లు
తినే సమయాన అమ్మ పిలుపులు నాన్న అరుపులు !

ఎంతకీ వోడువని నాయనమ్మ సుద్దులు 
నడూర్ల ముసలి యువకుల సరసపు విసుర్లు
తెలుపు అంటిన మెరిసే కన్నుల  పచ్చని మనసుల నవ్వుల తోటలు !

దులిపే కొద్ది మదిలో మెదిలే జ్ఞాపకాల పువ్వులు
మెరుపుల్లాంటి స్మృతులు నింగి నుండి నీటి చుక్కలవలె
పారెను కన్నుల లోతులో ఉద్వేగపు సెలయేరులు !

కృష్ణ మణి I 22-01-2015 

  
      



No comments:

Post a Comment