___________________కృష్ణ మణి
నిలుచున్నాను
నడి జన సముద్రమున ఏకాకినై
గుర్తు పడతారనుకొని అదో పిచ్చి చూపుతో !
అటు నుండి ఇటుగా
ఇటు నుండి అటుగా
వస్తున్నారు పోతున్నారు !
నన్నెవరు పలకరించే స్తితిలో లేరు
అందరు స్వార్ధపు కుండను నెత్తిన పెట్టుకొని
ఉరుకుల పరుగుల హొయలు
నేనేమన్న తక్కువ వాడినా అందులో ఒకడినేగా !
ఇంతకీ
నేను చేసిందేమిటి ఈ లోకానికి
అందుకు ప్రతిఫలం ఏమని అడుగను
ఒక్క మనిషినైన పూర్తిగా నమ్మానా
కనీసం ప్రేమించానా !
ఆకలికి
అమ్మ తన రక్తాన్ని తెల్లటి అమృతంగా మార్చి
పస్తులుంటూ నా కడుపు నింపి ప్రేమను పంచింది
పక్షి తన పిల్లల నోటికి ఆహారం పెట్టినట్లు !
తండ్రి
కష్టాన్ని నా చదువులకు వడ్డించి
మాసిన బట్టల్లో మహారాజులా
బాద్యతల వర్షంలో తడుస్తూ
ప్రయోజకుడిని అయ్యాక గొడుగు పడతానని ఆశ పడ్డాడు !
కనీసం కన్న వాళ్ళనైన
చివరి రోజుల్లో ప్రేమగా చూసుంటే
నేడు నేను అందరి వాడిని అయ్యేవాడినేమో !
కృష్ణ మణి
No comments:
Post a Comment