Saturday, March 14, 2015

అచ్చంగా తెలుగు


____________________కృష్ణ మణి

తెలుగు పలుకుల కోలాటం
అచ్చమైన తెలుగుంటి మమకారం
చెట్టునీడన పసినవ్వుల మణిహారం
ఇదేగా మా ఇంటి ముందు మామిడి పూత సింగారం !

కన్నులముందు చిలకమ్మల రెపరెపల దృశ్యం
చెవులకింపైన కోయిలమ్మల నాదస్వర గానం
రంగుబట్టల్లో ఒదిగిన గంగిరెద్దుల నాట్యం
ఇదేగా సంప్రదాయాల హరిదాసు రామకీర్తనం !

నోరూరించే తీరొక్క వంటల అభివాదం
పంచకట్టులో ఉట్టిపడే మాఇంటి గౌరవం
చీరకట్టులో గర్వపడే  భారతీయ సౌభాగ్యం
ఇదేగా కవికోవిద సమూహాల వందనం !

కోడికూతతో పల్లెలేచి పాడి పరుగుల ఆరోగ్యం
కట్ట దాటి వరదై పారే నిత్య యవ్వన నురగల రాగం
కడుపు నిండి కడుపు నింపే అక్షయ ధాన్యాగారం
ఇదేగా పైరుపచ్చల నడుమ కొబ్బరాకుల ప్రకృతి చిత్రం !

ఇదే ఇదే మా ఇల్లు
ఇదే కదా పూదోట
నిత్యమై సత్యమై సుందరమై వర్దిల్లు !

కృష్ణ మణి I
                                       


No comments:

Post a Comment