అతుకుల బొంతలు
____________________కృష్ణ మణి
చిగురు తొడిగిన ఆకుల వింత పరిమళం
ఎదో మరచిన జ్ఞాపకాలను నిదురలేపుతుంది
చిటపట నిప్పుల సెగలో వేగిన మక్కబుట్టలు
బాటసారికి ఆకలి మంటను పుట్టిస్తున్నాయి !
మురుగు పారి స్నానమాడిన డాంబరు నేల
నడకకు కొత్త ఊపు తెచ్చింది !
ప్లాస్టీకు కవరు తొడిగిన అద్దె గుడిసెలో బిక్క బతుకులు
చుక్క రాలితే బాగుండని ఒక పక్క
చుక్క రాలితే సందులోంచి నింగి ఎక్కిరింతల నవ్వులు మరో పక్క !
ఈ రాత్రి గడవనని కునుకు పట్టని ఆకలి గుండెల తొక్కిసలాటల !
నడి బాజారున తడిసిన కూరల కుప్పలు
పొద్దు దిగినా పొద్దు దిగని దిగులు దిక్కులు
పారే పాయలో తేలె కాగితపు నౌక
అడ్డుతగిలిన కర్రముక్కను ముద్దాడింది
వరద పెరిగి విడి పడిన క్షణకాలపు ప్రేమలు !
వలచిన నగరం మరచిన తరుణం
పొట్ట కూటి కోలాటాలకు వేదికై
చినుకుతో చింతలు తీర్చి
వరదతో నరక ద్వారాలను తెరిచింది !
కృష్ణ మణి I 16-08-2014
No comments:
Post a Comment