***********
మొగులు మీద మన్నువడ
ఒక బొట్టునన్న ఇడువదాయే !
పగిలిన నెర్రలమీద పొక్కిలి పెంకలాయే
ఎదురుసూపుల కండ్లళ్ళ నెత్తురు జీరలాయే
చెట్లకొమ్మల ఆకలికి ఆకుల అరుపులాయే
పసి నవ్వులు మానిన లోకం ముసలిదాయే
మొగులు మీద మన్నువడ
ఒక బొట్టునన్న ఇడువదాయే !
అడవి జాతర మాని బొందలల్ల నీటిపోరులాయే
వలసజీవులకు దిక్కుతోయక పీనుగుల పీకుడాయే
సుక్క నీళ్ళకు గద్ద సూపుకు ఎండమావుల నవ్వులాయే
బలిసిన దున్నల డొక్కల బొక్కలు బయటికాయే
మొగులు మీద మన్నువడ
ఒక బొట్టునన్న ఇడువదాయే !
అడవిరాజుల బలముడిగి జింకపిల్లల చెలిమిలాయే
నల్లతాసుకు తోవ్వదక్కక కన్నపిల్లలె ఆకలాయే
అడుగుజరగని మొసలి కాళ్ళకు గట్టిబురద అడ్డమాయే
ఎండగొడుగున గడ్డి ఏర్లకు దూపదీరక తిప్పలాయే
మొగులు మీద మన్నువడ
ఒక బొట్టునన్న ఇడువదాయే !
కృష్ణ మణి I 15-04-2014
No comments:
Post a Comment