Thursday, June 19, 2014

చిన్న మనసు


*************

అగసూడు అగసూడు అందమైన అంగడి
అమ్మకొంగు వట్టుకొని అడుగు మీద అడుగేస్తి
సంచివట్టి అమ్మ నింపె వారందాక కడుపులు !

దిక్కులు వట్టి నా మొకం మెరిసిపోతి మనసున
నెత్తిమీద టోంగ గొట్టి అమ్మగుంజె ముందుకు !

శనగ పల్లీలు తెల్లమురుకు పెద్ద పాపడ
కడుపుగోకి అడిగిన ఓపలేక పానము
చిల్లర సదిరి ఇప్పిచ్చే కారం బఠానీలు
దవడలు గుంజె ,కడుపు నిండె
అయినా మనసు నిండలేదు !

పక్కపోరడు నాకవట్టె పాల ఐస్క్రీం
కారే చుక్కల వట్టి సప్పరిద్దమంటె
ఉరిమురిమి సూడవట్టె పిల్లిమొకపోడు !

నెత్తిమీద సంచెత్తి ఎడమచేతిల నన్నుపట్టి
నడసవట్టే మాయమ్మ
జాతర దాటి ఇంటికి తోవ్వవడితే నడవనంది పానము !
అంగట్ల నడవనంటె మల్ల వారం తోల్కరాదని
బిగవట్టిన చెమ్మ తుడిషి
అమ్మ చేతినదింపట్టి ప్రేమతోడ అడుగులు !

కాళ్ళు గుంజంగ ఇల్లు జేరితి
దూపకు చెంబెత్తి దించితి
సాప మీద కాళ్ళు సాపుకుంటే  
ఒళ్ళు మరిశిన నిద్దురాయే !

కృష్ణ మణి I 23-04-2014



No comments:

Post a Comment