Thursday, August 27, 2015

విన్నాను

విన్నాను
______________కృష్ణ మణి

విన్నాను
లోకం పాటను
అగ్నిపర్వతాలు మీద కురుస్తున్నప్పుడు
ఆర్తనాదాల విలయగీతం !

విన్నాను
గర్భగుడిలో నిద్రిస్తూ
అమ్మ కూనిరాగాలను
ప్రసవ వేదనగీతాన్ని !

విన్నాను
నన్ను భుజంపై ఎత్తుకొన్న
అమ్మ ఆకలి ఆరాటాల పేగుల కేకలని
రేపటి రోజుకై ఊహల మలుపుల గుసగుసలను !

విన్నాను
అరిగిన అడివిలో
విలవిలలాడుతున్న పక్షుల బాధల కిలకిలలను
ఎనకబడుతున్న జంతువుల పాదాల అలికిడిని !
 
విన్నాను
ఎదిగే చోట అదిమే
నాగరిక అనాగరిక హూంకారాలని
తల వొంచిన గుండెలో రగులుతున్న శబ్దాన్ని !

విన్నాను
స్వేచ్చావాయువులు లేని
ఆడతనపు అవమానాల కంటనీరు ఆక్రోశాన్ని
బద్దలై పారుతున్న రక్తపువాగు ఉరుకులని !

విన్నాను
మతమనే మూడత్వంలో
మరుగుతున్న లోహాపు ఆయుధాల అల్లరిని
కునుకుపడని ఆవేశపు వికృత మనసు రణగొణ ద్వనులను !

విన్నాను
మార్గం దొరకని బడుగుల
గమ్యం తెలియని నడకల కిర్రు చెప్పుల అడుగులను
చేరేకొద్ది మారే జీవిత లక్ష్యాల విసుగులను !
 
ఇక ఎప్పుడు శాంతిగీతాన్ని వింటాను ?
ఇక ఎప్పుడు శాంతిగీతాన్ని వింటాను ?
ఇక ఎప్పుడు శాంతిగీతాన్ని వింటాను ?

కృష్ణ మణి

No comments:

Post a Comment