Thursday, August 13, 2015

కౌగిలి

కౌగిలి
____________కృష్ణ మణి

ఒకప్పుడు నిన్ను చేరుటకు
ఇంతలా కష్టపడలేదు
నీ కౌగిలి ఎంత మధురమో వివరించజాలను !

సాయంకాలం
కొండపైన ఎవరూ చూడకుండ
జీవం గూడుకు చేరే అల్లరిని ఆస్వాదిస్తూ
నీతో గడిపిన కాలం మరువలేను !

నీకై ఎదురుచూసే పని ఉండేది కాదు అప్పట్లో
నీవు నా వెంట పడినట్లనిపించేది తెలుసా
నిన్ను వదిలించుకోవాలని పరుగులు పెట్టేవాన్ని
ఇప్పుడు నా మీద అలకబూని అంతలా ఎడిపిస్తావెందుకు  ...కోపమా !

నిజమే
నీతోనే కదా నా ఊహలు ఊసులు చెప్పుకొనేది
నా బాదలూ....నవ్వులు
మూడో మనిషికి చెప్పలేని
గిలిగింతలూ..... కోపతాపాలు అన్ని నీతోనే
నీ ఒడిలోనే కదా !

నా ఆలోచనలకి సాక్షివి
నీ విలువ తెలిసి
నీకై ప్రతి క్షణం ప్రతి రోజు
కొంత సేపైనా నీ కౌగిలిలో సేద తీరాలని ఆరాటం
దొంగచాటుగానైన !

కాని నా చుట్టూ ఉన్న ప్రపంచం
నీ దరికి రానివ్వడం లేదు
అయినా బాత్రూంలో నీతో నేను కులికినప్పుడు
ఇంకెంత సేపని డోర్ మోది
మనల్ని సిగ్గుపడేలా చేస్తారు
గుర్తొచ్చి నవ్వొస్తుంది !

సరే ఉంటాను
ఎవరో మన కలయికని భంగపరుస్తున్నారు
మళ్ళీ నీకోసం ఎదురుచుస్తా .....
బై బై….‘’ ఏకాంతం ‘’ !

కృష్ణ మణి







No comments:

Post a Comment