Friday, August 14, 2015

నగ్నంగా ఒక పక్షి

నగ్నంగా ఒక  పక్షి
_________________కృష్ణ మణి

నిజం చెప్పనా
నాకెందుకో పుట్టినప్పటిలా
నగ్నంగా దోర్లాలని ఉంది
నింగికెగిసే పక్షిలా మారాలని ఉంది !

ఎవరో బట్టకట్టారు
ఎవరో కట్టుబాట్లు నేర్పారు
సమాజం అన్నారు
సమాజం మరో సమాజంతో యుద్ధం అన్నారు !

దేవుడన్నారు
దయ్యమన్నారు
మతమన్నారు
ఒకరిని మొక్కుతే
మరొకరిని అసహ్యించుకోమన్నారు !

దేశమన్నారు
దోపిడన్నారు
ఒకరి పై ఒకరు ఎప్పుడూ కత్తులు దూయమన్నారు !

కష్టమన్నారు
నష్టమన్నారు
ఇష్టమయితే ఉండమన్నారు
లేకుంటే సన్నాసన్నారు !

బుర్ఖా అన్నారు
ముసుగన్నారు
తల వంచమన్నారు
లేకుంటే కులతన్నారు !

భాషన్నారు
వేషమన్నారు
అలా అయితేనే మనిషన్నారు
కాదంటే పిచ్చోడన్నారు !

అందుకే వీరికి దూరంగా
నగ్నంగా దోర్లాలని ఉంది
నింగికెగిసే పక్షిలా మారాలని ఉంది !

కృష్ణ మణి   


No comments:

Post a Comment