Friday, December 19, 2014

అయిదేండ్లు


___________కృష్ణ మణి

మా బాద నీ గొంతు
మా బలం నీ సొత్తు
మా కల నీ అడుగు
ఉప్పనై ఊగిన ఊరు వాడకు దశా దిశను నిర్దేశించిన వీరుడా !

కన్నీళ్లను మింగినం కసాయిలను ఎన్నుకున్నందుకు
ఇంగలాలపై నడిషినం పాములకు పాలు పోషినందుకు !

ఆకలి మాని అరశినం
అడ్డంగా ఉన్న గోడలను బద్దలు కొట్టినం
అడవిపాలు అయ్యి ఆయుధాలను ఎత్తుకుందమనుకున్నం
గాంధీ మార్గమే మేలనే నీ మాటకు కట్టుబడినం !
 
నువ్వు దీక్షకు కూసుంటే అండకు అండగా నిలబడ్డం
మదమెక్కిన ఏనుగులను ఒంచినం నీ అడుగులో అడుగేషి !

ఎక్కిరింతల మాటలు పడ్డం  
ఎదురుతిరిగి పళ్ళు రాల్లగోట్టినం
మరిగిన గుండెలను కుమ్మరి కొలిమిలో బొగ్గులను జేశినవు
మాలో సత్తువను నిద్ర లేపి రోషానికి రోషం నేర్పినవు !

మా ఆవేషానికి కొత్త రూపునిచ్చిన నీ సాహసానికి అయిదేండ్లు 
ఓ ధన్యజీవి
బంగారు అక్షరాల చరిత్ర నీది
నీకు నూరేండ్లు !   
  

కృష్ణ మణి I 29-11-2014      

No comments:

Post a Comment