తెలుసా ...
_____________కృష్ణ మణి
మనసులో ఏముందో తెలియదు
నీ చుట్టూ చేరే తేనెటీగలూ
దూరానా గుడ్ల గూబలూ
అంగాంగాన్ని తడిమి చూడ్డానికి
అర్రులు చాచుకుచ్చున్నాయి !
నీవు ముడుచుకొని నిలుచున్న ప్రతిసారి
కర్కశమైన ముల్లెన్నో పొడుస్తూనే ఉంటాయి
దారిలో కొన్ని మృగాలు అదును చూసి కత్తులు దింపుతాయి !
అన్నింటికీ నీవే మూలం అంటాయి
మూల తిరిగేసరికి కొంగుకు ఉరేస్తాయి
నీవు ఎదిరించకపొతే
వంచడమే సంప్రదాయమైన విషజంతువులు
నిన్ను బుర్ఖాలోనే భూస్తాపితం చేస్తాయి
అందరు సమానమేనని మైకులో అరుస్తాయి
ఇంటిదాకా వచ్చాక ఆలిని ఆదరిస్తాయి !
లోకం చలికి వణుకుతుంది
నీవు మాత్రం పగలు రేయి ఇంటాబయటా తేడాలేదు
తరతరాలుగా ఇదేగా ఘనమైన చరిత్ర
జరుగుతున్న వాస్తవం !
ఆదిమ సంస్కృతి నుండి విలాస వస్తువువి
పరువు మర్యాదలకు కేరాఫ్ అడ్రస్సువి
జరిగిన కాలాన్ని మార్చలేము కాని
జరుగుతున్న కాలాన్ని మరలుస్తామేమో చూద్దాం !
కృష్ణ మణి
No comments:
Post a Comment