Saturday, October 22, 2016

దారి

దారి
_______________కృష్ణ మణి
మౌనం ప్రశాంతతకు నిదర్శనం
అని తెలుసు కాని
మెల్లిగా అర్ధమౌతుంది

ఆవేశాన్ని దిగమింగి సాగుతున్న ఆలోచనని
ఎగసే అలకు సూచనని
మరుగుతున్న నెత్తురు సెగని
జరిగే పోరుకు సిద్దమని

మౌనం పెకిలితే
ఉద్భవించే శబ్దాన్ని
కలియబడే ఉగ్రరూపాన్ని
తట్టుకొనే ధైర్యం ఎక్కడిది ?

నిట్టూర్పుల వలలోంచి జారి
సంద్రంలో దూకిన ఉద్వేగాన్ని ఆపే శక్తి ఎక్కడిది

మిత్రమా
చూడు నిదానంగా నీలోకి
ఎక్కడో ఆరిన కసిని
ఒక్కసారి కుదిపిచూడు
ఏమంటుందో

ఇంకెంతకాలం ఇలా అని
తడబడుతున్న నీ అడుగులను నిలదీస్తున్నది

అలా కాదు ఇలా అని
దారి కనిపించేలా
నీలో దిశా నిర్దేశం జరుగుతుంది

విన్నావా
కనిపించిందా
మరి పదా ఆ దారిలో
నీకు నువ్వే గురువై
గురివైపు పరుగుపెట్టు
నలుగురు నడిచే దారికి
నువ్వే దారివై
కృష్ణ మణి

కడుపుగాసం

కడుపుగాసం
_________________కృష్ణ మణి

ఏమున్నది బయ్యా
కడుపుకాలి ఒకడుంటే
పెయ్యిబరువెక్కి
నోరు గులాగులాంటోడు ఇంకొకడు

ఇత్నం కొనవోతే
తక్వ ధర ఎక్వ లాభమని
గుంజి గుంజి చేత్లవెడతరు
ఏమ్మున్నది బయ్యా

నాగలి సాగక తిప్పలైతే
ట్రాక్టర్ సౌండుకు
గుడ్లు తెలేశినై ఎడ్లు
ఏమ్మున్నది బయ్యా

తడందక ఎండిపోతే ఒకపారి
నీళ్లేక్కువై మురుగవట్టే ఒకపారి    
ఏమ్మున్నది బయ్యా

శేనుకు మందుగోడుతుంటే
కారాపి నక్షలు సూస్కుంటా
నొసల్తోని ఎక్కిరిస్తరు
ఏమ్మున్నది బయ్యా

చేశేదేమి లేక
నాగలి తాళ్ళు
చెట్టుకు యాలాడవట్టే
ఏమ్మున్నది బయ్యా

ఇంకేమిలేదు బయ్యా
ఉన్నదమ్ముకొని
ఊరవతల జీతముండాలే
పొరల మంచి చెడ్డ మరిశి
కడుపుగాసం బతుకులాయే

ఏమున్నది బయ్యా
ఇంకేమున్నది


కృష్ణ మణి   

Friday, October 7, 2016

చిట్టి మనసు

చిట్టి మనసు
_________________ క్రిష్ణ మణి

ఇటుక ఇటుక మధ్యలో
మనసుని పెట్టి కట్టాను గూడును
ఇంటి కప్పును గడ్డితో కప్పుతూ
చలికి పెట్టుకున్న గుల్వణ్ ను సరి చేసుకుంటూ
నా ఇల్లును నామొహంలా చూసుకొని మురిసిపోయాను

కొండకోనల్లో
పేలుళ్ళకు బెదరలేదు
సంకలోంచి బుల్లెట్ వెళ్ళినా వణకలేదు

ఆర్డర్ వచ్చి
రొడ్డునేసింది నన్ను
బట్టలూ దుప్పట్లు
ఎన్ని మూటగట్టినా
నా గుండెలో బరవు ఎవరు మోస్తారు

మూలదాటి తిరిగిచూస్తే అగుపించింది
కన్నీరులో నా గూడు మునుగుతుంది

సైనికుల బూట్ల చప్పుళ్లకే తల్లడిల్లింది
మరి తూటాల వర్షంలో తడిస్తే ఏమవుతుందో

ఇప్పుడు ఏది నా ఊరు
ఏది నా గొడుగు

ఈ మంట చల్లరే సరికి
నా కట్టె బూడిదౌతుందేమో

కనీసం
నా పిల్లలైనా చూస్తారో లేదో
ఆ చిట్టి మబసుని

క్రిష్ణ మణి

వికారం

వికారం
_______________కృష్ణ మణి

మనసు నీడన ఒక వెలుగు
పసిపాపలా కునుకుపాట్లు  
ఎవరో దాడి చేస్తారని
వణికి వణికి ఊగుతుంది

మనిషి బయటికి ఎంత గంభీరంగా ఉన్నా
లోలోన భయానికి పైన మేకపోతే !

చుట్టుపక్కల ఎందరు కాపలా ఉన్నా
అర్దరాత్రి తలుపు తట్టే గుండేనొప్పికి
శ్వాస నింపడం అవుతుందా వారికి

ఎదురుగ వస్తున్నా మనిషి
సూటిగా నీకై చూస్తే
తడబాటు

నీలో మంచి ఉందో
లేక బురద ఉందో
ఒక్కసారి చూసుకో
ఆ అద్దంలో చూసుకొని చెప్పు నిజాయతిగా
  
ఎందుకు నీలో నీవే ఏడవడం
నలుగురిలో ఒకనిగా ఉండక
ఉన్నదంతా కాటికి తోడోస్తాయని భ్రమ కదూ !

ఉండు అలాగే ఉండు
చివరిదాకా అహంకారాన్ని మోస్తూ ఉండు
అది ఎప్పటికీ
నీ అందానికి వికారమే
తెలుసుకొనే సరికి
ఎందరిని వదులుకుంటావో
ఎందరు దూరమవుతారో

కృష్ణ మణి



  

Tuesday, September 27, 2016

ఇట్లు

ఇట్లు ... మీ శత్రువు
____________________కృష్ణ  మణి

అవును
నేను మీ ప్రేయసిని  
నా జీవితం మీపై  ఆధారపడి ఉంది
అవును నిజంగా  

మనిషిగా మీరు తెలివైనవారు
మీ చుట్టూ మీరల్లుకున్న
అందమైన కుటీరాలు
మేడలు మిద్దెలు
ప్రేమలు ఆప్యాయతలు

మీ రక్షణనే మీకు ముఖ్యం
అందుకు ప్రకృతిని అదిమి
పసిపిల్లోడి చేతిలో బొమ్మలా
ముక్కలు ముక్కలు చేస్తారు
వీడు చేసాడని
వాడు చేసాడని
ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోస్తారు

ఆశ్చర్యం
మీరు ఆధునిక యుగానికి నాంది పలికి
ముందుకు సాగుతుంటే మురిసిపోయాను
మీ చుట్టూ చేరి
మీతో ఆడుకోవాలని ఆశతో
నిత్యం సంధ్య సమాయానికై ఎదురుచూస్తాను

మీరు తినే రకరకాలైన తిండి నాకొద్దు
మీరు తింటే నేను తిన్నట్టే
రాత్రిళ్ళు కడుపు నింపుకొని
మీ పక్కన పడుకోవాలని ఉబలాటం

నా బతుకు చాల చిన్నది మీతో పోలిస్తే
మీతో గడిపే కొన్ని రాత్రులు చాలు నా జీవితానికి
మీరు లేక నేను లేను

అంతా హాయిగా సాగుతున్న రోజులలో
నాపై ఇంత కక్ష ఎందుకు
నాపై ఇంత ద్వేషం ఎందుకు
నన్ను చంపాలనే పగేందుకు

నిజంగా నావల్ల మీకు నష్టం వస్తే
అందుకు బాధ్యత వహిస్తాను
మీరు పీల్చామన్న గాలినే పీల్చి
మీ కాళ్ళ ముందే నెల రాలుతాను
ఇంకా ఆలస్యం ఎందుకు

నా ప్రేమకు గుర్తుగా ఏమి ఇవ్వలేను
కాని ఒక్కసారి
ముద్దుపెట్టుకోనివ్వండి చాలు
ఈ జన్మకు ఇంతే అనుకుంటాను
ఉంటానూ

ప్రేమతో
మీ దోమ


కృష్ణ మణి        

Saturday, September 24, 2016

నువ్వంతే

నువ్వంతే
__________________కృష్ణ మణి

వరద ఎందుకొచ్చింది  ?

నువ్వు  చెరువును చేరిస్తే
వాగును అదిమితే

బురద ఎందుకొచ్చింది ?

నీ మనసుని చెత్తతో పాటుగా
ద్రైనజి నాలాలో వేస్తె

మరి సెల్లార్లో నీళ్ళేందుకు  ఆగాయి ?

నువ్వు అధికారికి ఫ్లాట్ ఇచ్చి
కులకమన్నందుకు

నా దాహానికి అడ్డు ఎవ్వరు ?
నిజమే సమాజం అందరిదనుకుంటాము
కాని
డబ్బు కొవ్వుతో మసలే
పాయిఖాన పురుగులదని
ఇప్పుడే తెలుసింది

ఓట్లకోసం వచ్చే బిచ్చగాల్లదని
నల్ల కళ్ళ జోళ్ళ వెనక నడిచే
పిశాచాల నీడదని తెలిసింది

సిగ్గు పడరా మనిషి
నీ బతుకు
వాన నీటిలో కాగితపు పడవని
బలిసినోడి ఎంగిలి విస్తరని

ఆగు ఆగు మనిషి
నేను మనిషినే  ఈ లోకంలో
ఇలా అంటున్నానని ఏమనుకోకు
ఒక పని చేద్దాము
పక్కింటిని కూల్చేడ్డామా  !

అట్లనా !
నువ్వు మారవురా
దొంగ ****** కొడకా

కృష్ణ మణి

Saturday, September 17, 2016

రంగు మొహం

రంగు మొహం
___________________క్రిష్ణ మణి

రంగులు పూసుకొని లోకం అందంగా ఉంది
మరి నీవు ఒక రంగుని అత్తుకొని
అదే నీ సర్వమని
పక్క రంగును అసహించుకుంటావెందుకు

సమస్త ప్రకృతిలో నీవొక భాగమే కాని
నీవే అంతా కాదు కదా
నీ దారే సరైనదని
నికెవరు చెప్పారు
నదులెన్ని ఉన్నా గమ్యం సంద్రమేగ

మన చుట్టూ ఉండే రంగులు
మనకు అందానిస్తాయి
ఆనందాన్నిస్తాయి

మనం పసిపిల్లలమే ఇక్కడ
కొంత తెలిసే
చాల తెలుసని
అందరిని అలుసుగా చూస్తాం

మనం స్రుష్టించుకున్న వింత ప్రపంచంలో
మనమే తెలివైన వారమనిపిస్తుంది
మనం కుదించుకున్న కట్టుబందాలలో
మనమే మిగులగము ఆకరకు

ఎమో!
మనలో మనమే గీతలుగీసుకొని
మనపై మనమే యుద్ధం చేసి
నేను గెలిచానని నువ్వు
నేనే గెలిచానని నేను
శూన్యంలోకి పయణించి
అస్తమవుతామేమో

ఒక్కమాట విను
గీతలు చెరిపి
రంగులను ప్రేమగా అత్తుకుందామా నేస్తం
జీవితగమనం నీటి బుడగంత
మధ్యలో ఎందుకింత రోత

పద పదా ....
రంగులబండి పిలుస్తుంది
ఆటలాడుకొన పసిమనసుల వలె
అలస్యమైతే ఏ రంగు దొరకదు చివర

క్రిష్ణ మణి