దారి
_______________కృష్ణ మణి
మౌనం ప్రశాంతతకు నిదర్శనం
అని తెలుసు కాని
మెల్లిగా అర్ధమౌతుంది
ఆవేశాన్ని దిగమింగి సాగుతున్న ఆలోచనని
ఎగసే అలకు సూచనని
మరుగుతున్న నెత్తురు సెగని
జరిగే పోరుకు సిద్దమని
మౌనం పెకిలితే
ఉద్భవించే శబ్దాన్ని
కలియబడే ఉగ్రరూపాన్ని
తట్టుకొనే ధైర్యం ఎక్కడిది ?
నిట్టూర్పుల వలలోంచి జారి
సంద్రంలో దూకిన ఉద్వేగాన్ని ఆపే శక్తి ఎక్కడిది
మిత్రమా
చూడు నిదానంగా నీలోకి
ఎక్కడో ఆరిన కసిని
ఒక్కసారి కుదిపిచూడు
ఏమంటుందో
ఇంకెంతకాలం ఇలా అని
తడబడుతున్న నీ అడుగులను నిలదీస్తున్నది
అలా కాదు ఇలా అని
దారి కనిపించేలా
నీలో దిశా నిర్దేశం జరుగుతుంది
విన్నావా
కనిపించిందా
మరి పదా ఆ దారిలో
నీకు నువ్వే గురువై
గురివైపు పరుగుపెట్టు
నలుగురు నడిచే దారికి
నువ్వే దారివై
కృష్ణ మణి
No comments:
Post a Comment