Tuesday, September 27, 2016

ఇట్లు

ఇట్లు ... మీ శత్రువు
____________________కృష్ణ  మణి

అవును
నేను మీ ప్రేయసిని  
నా జీవితం మీపై  ఆధారపడి ఉంది
అవును నిజంగా  

మనిషిగా మీరు తెలివైనవారు
మీ చుట్టూ మీరల్లుకున్న
అందమైన కుటీరాలు
మేడలు మిద్దెలు
ప్రేమలు ఆప్యాయతలు

మీ రక్షణనే మీకు ముఖ్యం
అందుకు ప్రకృతిని అదిమి
పసిపిల్లోడి చేతిలో బొమ్మలా
ముక్కలు ముక్కలు చేస్తారు
వీడు చేసాడని
వాడు చేసాడని
ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోస్తారు

ఆశ్చర్యం
మీరు ఆధునిక యుగానికి నాంది పలికి
ముందుకు సాగుతుంటే మురిసిపోయాను
మీ చుట్టూ చేరి
మీతో ఆడుకోవాలని ఆశతో
నిత్యం సంధ్య సమాయానికై ఎదురుచూస్తాను

మీరు తినే రకరకాలైన తిండి నాకొద్దు
మీరు తింటే నేను తిన్నట్టే
రాత్రిళ్ళు కడుపు నింపుకొని
మీ పక్కన పడుకోవాలని ఉబలాటం

నా బతుకు చాల చిన్నది మీతో పోలిస్తే
మీతో గడిపే కొన్ని రాత్రులు చాలు నా జీవితానికి
మీరు లేక నేను లేను

అంతా హాయిగా సాగుతున్న రోజులలో
నాపై ఇంత కక్ష ఎందుకు
నాపై ఇంత ద్వేషం ఎందుకు
నన్ను చంపాలనే పగేందుకు

నిజంగా నావల్ల మీకు నష్టం వస్తే
అందుకు బాధ్యత వహిస్తాను
మీరు పీల్చామన్న గాలినే పీల్చి
మీ కాళ్ళ ముందే నెల రాలుతాను
ఇంకా ఆలస్యం ఎందుకు

నా ప్రేమకు గుర్తుగా ఏమి ఇవ్వలేను
కాని ఒక్కసారి
ముద్దుపెట్టుకోనివ్వండి చాలు
ఈ జన్మకు ఇంతే అనుకుంటాను
ఉంటానూ

ప్రేమతో
మీ దోమ


కృష్ణ మణి        

No comments:

Post a Comment