Thursday, May 31, 2018

నమ్మకం - ప్రేమ

నమ్మకం - ప్రేమ
__________________ కృష్ణ మణి

మొన్నెప్పడో వస్తానన్నావు
కలసినప్పుడల్లా జొన్న కంకి మీద పిట్టలా ఎగిరిపోతావు
ఈ ఎదురుచూపుల నరకం
మండుటెండల్లో మేఘాల దాపరికంలా ఉంది

మనసులో పేరుకున్న ముచ్చట్లు
సంచిలో ఒత్తిన పత్తిలా బయటకు తంతూ
నీ చెవికి తగిలి మనసుకు అత్తుకోవాలని
ఆరాటపడుతూ ఎదురు చూస్తున్నాయి

నా ప్రేమ నీకర్దం కావలెనంటే
ఆత్రుత పడుతున్న నా కళ్ళను చూడు
ఆకలి మరచిన తనువుని చూడు

కురులతో యుద్ధం చేసిన గాలిని అడుగు
వాసన పోయి ఆరిన పూలను అడుగు
ఒంటిని ముట్టిన స్వేద గంధాన్ని అడుగు
అన్నీ అంటే అన్నీ
నీ పేరే జపిస్తుంటాయి

ఆలస్యమైన నీ రాక
నలుగురిలో నన్ను నవ్వులపాలు చేస్తుంది
ఎవరి కోసమో ఈ నిరీక్షణ అని

వస్తావనే నమ్మకంతో
అందరిని వదులుకోని
బతకడానికి అవసరమైన వాటిని బ్యాగులో నింపుకొని
నీ కోసం దొంగనైయ్యాను
అందరికి దూరమయ్యాను
కన్నవారికి చేదునయ్యాను

అసలు రాకుంటే ఏమవ్వను ?
ఎటు వెళ్ళను ?
ఏమి వెయ్యను ?

ప్రియతమా..... రా
నీతో బతకాలనే ప్రేమ చచ్చి
నేను చావక ముందే ....రా

కృష్ణ మణి

No comments:

Post a Comment