Thursday, June 19, 2014

తెలంగాణా



డోలు తాళం కాలి గజ్జే గంతులేస్తు ఉన్నయి
నడూర్ల డప్పులన్ని గుంపుగడుతున్నయి
తమలబాజ టక టకమని తాలమేస్తున్నది
బ్యాండుగోట్టే చేతికర్ర తీన్మారాడుతున్నది
ఊరువాడా నోరునోయ్యా తెలంగాణా అన్నది జై తెలంగాణా అన్నది

పల్లెనిండా పోరుగాలి సల్లవడ్డానన్నది
కండ్లనీరు ఆరవెట్టి దమ్ముదీయమన్నది
ఎడసుడు చేట్టుచేమ నీల్లందుకుంటమన్నయి
రేపోమాపో చిగురు పెట్టి చింతదీరుస్తమన్నయి
గుట్టాపుట్టా నోరునోయ్యా తెలంగాణా అన్నది జై తెలంగాణా అన్నది

పట్నం కోటల దుమ్ము జారి అడుగుబడతానన్నది
వెలుగు బుగ్గల పాత గుర్తులు కొత్తగ మెరుస్తున్నయి
కండ్లనిండా వెలుగు చూసి పువ్వులు నవ్వుతున్నయి    
అమరవీరుల కన్నకలలు నెరవేరి ఆడుతున్నయి
పట్నంకోటలు నోరునోయ్యా తెలంగాణా అన్నది జై తెలంగాణా అన్నది     



దాహం


_________________కృష్ణ మణి

కదలిపోరా చెదిరిపోరా మసలిపోరా
ఆ కంటినీరులో కొట్టుకుపోరా !

ఒంగిన నడుములు తిరిగిన చేతులు కాళ్ళు
మరగుజ్జుల ఆటలో మూటగట్టిన ఒళ్ళు
పసి ఆటలు మానిన అమాయక చూపులు
ముసలి వారైన పెళ్ళికాని కొడుకులు
తల్లికావలిసిన పడతి చంటి పిల్లోలె పాకుడు 
గుండె రాయిగా చావని తనాన బతుకులేని సాకుడు !

కడుపుతీపి మధురం అది చెరగని సత్యం
కన్నవారే ముసలితనాన ముడ్డికడికే దుఃఖము
ఎవడన్నం గుంజారో ఈ నరకంలో పడ్డారు 
ఏ పాపం చేసారో ఈ గడ్డపై పుట్టారు

మానవత్వం లేని రాజకీయ కొజ్జాల కోలాటంలో కృశించిన తనవులు
విషనాగుల ఎంగిలి నీళ్ళే గతని తెలిసినా తప్పని దాహపు కడుపులు !


కృష్ణ మణి I 29-05-2014 

నమో ఆంధ్ర మాత


_____________________కృష్ణ మణి

నమో ఆంధ్ర మాత
గత వైభవానికి చిరునామా
రాయల రాజసమా  వెంకన్న దర్శనమా  
అమరావతి స్తూపమా తెలుగు పలుకు స్వరమా   !

పొట్టి శ్రీరాములు త్యాగ నిరతికి తార్కాణం
భారతావనిలో పువ్వై విరిసిన నవ రాష్ట్రం
సాగరగతీరం బహుముఖ లాభం 
కాటను దొర ప్రసాదం నిండిన మాగానం !

శ్రీశైలం మల్లన్న బెజవాడ దుర్గమ్మ
అరసవెల్లి సూరన్న కాళహస్తి లింగన్న
ఏరికోరి వెలిసిరి ఎల్లరులకు ఎదురులేదు
పలు దిశల కీర్తిపరులు తలదించని నీ బిడ్డలు !

రాయలసీమ పౌరుషం కోనసీమ అందం
అరకు కొండ చలువ గుంటూరు కారం
కృష్ణ గోదవరి తుంగభద్రల పరువల్లతో పరుగుపెట్టు
తోబుట్టులలో అడుగు ముందు పెట్టు  !

కృష్ణ మణి    


దొర


________________________కృష్ణ మణి

పల్గర్ర తోని పల్లుతోమంగ
బంకమన్నుతీసి పెయ్యితోమంగా
నలుపుగాని తెలుపు పంచల మెరిశె మల్లిగాడు !

సుట్టం పెండ్లికి శెల్ల భుజానికేశి
సూడముచ్చటగా నడవవట్టే ఎన్నడులేని షోకుల
మెడలుతిప్పే రోషగాల్లు సూడ బావోచ్చిండని
పల్కరించి పరాష్కమాడిన పావురాలు !

గుండెల బరువుదించి అల్కగైన పానాన
పెండ్లిగాంగానే ఎర్రచద్దర్ల బగారన్నం కూరనీళ్ళ డాల్చ
కడుపునిండ కానిచ్చి కల్లుదుక్నం దేవులాడి
ముంతకల్లుకి మురిశిన మొటుకశ్టాలు !

చెట్లనీడల కునుకు తీసి
పోద్దుదిగంగనే పోయోస్త బామర్దని
మొకమింత జేసుకొని పలానోని కార్యంల కలుస్తనని
తిరుగు బండెక్కిన మనసున్న దొర !  
  

కృష్ణ మణి I 28-05-2014

ప్రోత్సాహం


ప్రతి మనిషిలో ఒక కళ ఉంటుంది. తను ఏ  విషయంలో ప్రావీణ్యత సాదించగలడో తను నిర్ణయం తీసుకోన గలడు. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి . వాటిని తట్టుకొని అదిగమించడమే అసలు విజయం .
పిల్లల్లో మనోవికాసం పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ కథను రాసాను .

రాకేశ్ 8 క్లాసు విద్యార్థి , అతను తన చుట్టూ ఉండే మిత్రుల వద్ద స్కూల్ టీచర్స్ వాళ్ళ ముందు దేనికి పనికి రాని వాడిగా ఉంటాడు .
scine 1 : హోంవర్క్ చెయ్యలేదని టీచర్ చీవాట్లు
scine 2 : క్రికెట్ ఆటలో బాల్ ఫీల్దింగ్ చెయ్యలేదని మిత్రుడి అసహనపు చూపు
scine ౩ : ఇంట్లో అన్న / తమ్ముడి హేళన
scine 4 : స్కూల్ వద్ద అమ్మాయిల వెటకారపు నవ్వులు
scine 5 : వీటిని గుర్తు చేసుకొంటూ తనలో తాను రాత్రిల్లో మధన పడటం
scine 6 : తల్లిదండ్రులు పిల్లోడి భవిష్యత్తుకై అతనికేసి ఓదార్పుతో చూడటం
scine 7 : చివర తను వయోలిన్ వాయిస్తూ ఉంటాడు . తనని అవహేళన చేసిన వాళ్ళంతా తనకేసి గొప్పగా చూస్తుంటారు .
అన్నీ scines పై వయోలిన్ మ్యూజిక్ వస్తుంది .చివరి scine లో తను లైవ్ గా వాయిస్తున్నట్టు చూపిస్తాము .

కృష్ణ మణి

# 9866767875   

ఒడువని ముచ్చట


__________________కృష్ణ మణి

ఎవలుల్లా ….!
కొమరయ్యింటికాడ కయ్యమైతునట్లుంది
కోడలు నోరు జోరుమీదున్నదీ !

ఎందుకు జెయ్యదు మల్లక్క
చేతికందిన పంట పురుగు పాలు
పెయ్యి మీది బంగారం బ్యాంకు పాలు !

అమ్మగారింటికి పెండ్లికి పోవల్నంట
ఏం జేస్తది పాపం
పెండ్లైనుండి పోరు వడుతుంది ఏరువడుతనని
మర్దలి పెండ్లికి సగం భూమినమ్మే
మర్ది సదువుకు మామ ఇంకింత అమ్మే !

పిల్లల ఆకలి సూడలేక  
అడుగు బయటబెడుతనంటే మొగుడొద్దంటడు
ఓపలేని కోపాన ఎదురంటే ఏమైతది
ఈబ్బలిగె
అమ్మగారొచ్చే
ఏముంటది ఒడువని ముచ్చట !

అందరిల్లుల్ల ఉన్న గతే కదక్క !
 
కృష్ణ మణి I 12-06-2014

  

పోరాటం


____________________కృష్ణ మణి

పొట్ట విచ్చుకొన ఆకలాకలంటూ
అలసిన విత్తుల బిత్తర చూపు
తడసిన తనవున పొట్టపగిలి
నార తేలి మురుగుతున్న సమయం !

దాహం ఎరుగని పచ్చ రంగు పిచ్చి రంగుగా మారే తరుణం
తనలోనే తాను కుమిలి కమిలే ఆకు అలముల మూగ రాగం
మొదలు తడువా అడ్రస్సు తెలువక
ఉన్న చోటే ఎండుతున్న మొద్దులు !

కంటిచూపుకు కనబడు మడుగుల బురదలో ఆడ
కాళ్ళు లేని చిటారు కొమ్మల చిట్టి చేతుల ఆరాటం
నింగిలో దిక్కులు ఉంచి అడుగున అలుపెరగని పోరాటం

చినుకు రాల్చి చూడు చిందులేస్తానంటున్న ఆకలి తిప్పలు
వరద ఒంపి చూడు ఉరుముతో రంకెలేస్తామంటున్న కప్పలు  !


కృష్ణ మణి I 20-06-2014