సిద్ద రాములు
______________________కృష్ణ మణి
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు
ఊరెనక నాలుగెకరాల బటాకి శేను
ఉన్న రెండెకరాలను కలుపుకుంటూ
ఎండవానకు
రేయిపగలుకు
చుక్కనీటికి కాపుగాసినా
బోరుబావికి మోటరేసినా
చెమట గింజలు అడవిపాలే
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు
కాడికెడ్లు ఆలుమగలు
ఉన్న రక్తం భూమిపాలు
పంట పొట్టలు పురుగుపాలు
చేతికొస్తే నీటిపాలు
అగ్గివానల మన్నువడెనో
ఏ నరునికన్నును గద్దమింగెనో
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు
అప్పులోడు ఇంటికొస్తే
ఆలిపుస్తేలు అల్కగాయే
కండ్లనీరు బరువులాయే
పస్తు కడుపుతో బతకులాయే
గాలిమోటారు ఎక్కుతానని
ఎండమావుల సోకు నచ్చి
అందరినొదిలి ఆగమయితివ
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు
గంపెడాశతో మోటారు దిగి
నాలుగు రోజులు నవ్వినవో లేవో
అయిదో రోజుకే అలసితివ
అరబ్బు దొరగాని కండ్లల్ల నలిగితివ
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు
కన్ను తెరిస్తే కష్టమే
రేపటి పొద్దు అప్పుడే వొద్దని
వొళ్ళు మరిచి నిద్రపోతూ
ఆలుబిడ్డలు యాదిరాంగా
గుండె చెరువై మెత్త తడిశే
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు
కష్టమైనా నష్టమైనా
సొంత ఊరే ఇష్టమాయే
అవ్వబువ్వ గంజిగటక
చెట్టుకల్లు సారసీస
అక్కబావ అన్నవొదినె
అమ్మఅయ్య అత్తామామ
వాయివరుసల పలకరింపుతో
పొద్దూగడిశే పానంనిండా
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు
కండకరిగి మెదడునలిగి
గిర్రుమంటూ కిందబడితివ
దావకానల కండ్లు తెరిస్తే
సోయిలేని జీవమైతివ
కోమలదిగి చింతజేస్తివ
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు
పెండ్లమేడిశే
పిల్లా ఏడిశే
అమ్మ ఏడిశే
అందరేడిశే
సూపుకేమో దూరమయితివి
ఎనిమి నెలల కాలమాయే
దుబాయి దవకాన సల్లగుండా
పసిబిడ్దోలె సాకవట్టే
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు
నీవొల్లకు దగ్గరైతే
పెయ్యికదిలి నవ్వుతావని
పెద్దమనుషుల అండతోని
పువ్వువోలె లేపిరి
హైదరాబాదుల దించి
గాంధీల పానుపేస్తే
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు
నీ ఆలిబిడ్డల కండ్లవాగుల
సూడలేని బతుకునీది
నిన్నుసూడ అరుసకపోను
పెద్దపెద్దోల్లు అడుగుబెట్టి
పెద్దమాటలు చెప్పిపోయే
దవకాన పెద్దసారులు
లెక్కబెట్టిరి ఎంత గుంజ
వొట్టిబర్రెకు పాలేక్కడ
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు
బతికిలాభం లేదాని
సర్కారుకెందుకు ఇంత నొప్పని
కొనపానం చిదిమి నవ్విర
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు
నీవసొంటి కొడుకులెందరో
ఎడారి రోడ్డులో ములుగవడితిరి
లేపనీకే ఎవరూ లేరు
ఉన్న సర్కారు నిద్రలోనే
ఒక్క మనిషిని సూడమంటే
ఫండులేదని అలాటులేదని
సచ్చెటొల్ల తిరిగుఖర్చులు
ఎవడు బెడతడు ఏమి వస్తదని
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు
ఓటురాజ్యం
స్వర్దరాజ్యం
నీ ఉసురుతగిలి
కుప్పకూలును
ఓటురాజ్యం
స్వర్దరాజ్యం
నీ ఉసురుతగిలి
కుప్పకూలును
రాములు
సిద్దా రాములు
రాములు
తమ్మి రాములు
కృష్ణ మణి
No comments:
Post a Comment