Tuesday, July 12, 2016

వొర్లుతున్న పిట్టే

వొర్లుతున్న  పిట్టే
_______________________ కృష్ణ మణి

అద్దుమ్మరాతిరి
కట్టకింది తాటిముంజల కొయ్యా
 పటేల్ శేనుకాడ దొంగలమే   
ఎర్రటెండకు తోడబుట్టినొల్లకు
ఆ ముంజనీళ్ళను తాపే మనసున్న దొరలమే !

కొబ్బరిమట్ట మీద సవారి ఎక్కితే
గుర్రాలై గుంజే దోస్తులం
అలుగుమీదెగిరే
పర్కపిల్లలబట్టే యాటగాళ్ళం

ఈతపల్లకోసం
ఈదులళ్ళ తిరిగే పెద్దీగలం
బరఫ్ పుల్లను నాక్కుంట ఊరిలిచ్చే అమాయకులం 
మొటబాయిల పల్టీలు కొట్టే చేప పిల్లలం

మల్లెతోట్ల పూలేరే లేతమొగ్గలం   
పిల్లలకు పాలుదాపే తల్లిమ్యాకలం
చెరువు నీళ్ళను శేనుమలిపే పలుగుపారలం 
అమ్మయ్యకు ఎదిగొచ్చిన లేత రెట్టలం

అవును తాత చేతి కట్టెలం
నాయనమ్మ ఆకులో పోకలం
ఆకలెరుగని అలుపెరగని ఆటల పాటలం
అల్లరిమాటల మూటల గురుగులం

మేం దొరలం
పావులం
పాపమెరుగని పక్షులం
ఆ దేవుని రూపాలం

కప్పలం డొప్పలం 
తిప్పలమోసే ఎద్దులం బుద్దులం
అమ్మ చేతి ముద్దలం
నాయిన చూపుకు వాన కురుసే తెప్పలం 
పండుగపూట ఊరినొకటి చేసే రంగులం
గొర్లకాడ టుర్రు టుర్రు అరుపులం

కాలమయిన సొట ఆరుద్రలం
గడచిన దినాలు యాదికొచ్చి
కండ్లనీళ్ళు తోడుకొచ్చి
ఇప్పటికీ మేం పసి పిట్టలం
నవ్వుల గంటలం

కృష్ణ మణి 



No comments:

Post a Comment