Tuesday, January 27, 2015

పిచ్చోడి చేతిలో కత్తి


_______________________కృష్ణ మణి

పచ్చటి వనంలో వెచ్చని గువ్వలు ముద్దుగ ఒదిగి
నిండైన చెట్టుకు అలంకారమై అలరిస్తుండగా
అలసిన మనసులు చేరువై తేలికై
ఈ క్షణం మరో క్షణం ఇలా కలకాలం నిలవాలని పరితపిస్తున్నాయి !

డేగలు నెమళ్ళు డ్రాగన్లు పాములు పులులు  
అడవిన ఆడుతూ ప్రక్రుతి పండుగ చెయ్యగా
నిర్జీవాలు సైతం గాలిని ఆసరా చేసుకొని పాట పాడుతూ
మనమంతా ఒక తల్లి పిల్లలమని గుర్తు చేస్తున్నవి !

సముద్రాన చేపలు రొయ్యలు పీతలు ఆక్టోపస్లు
తమ ఆనందాన్ని అలల ద్వారా కేరింతలు కొడుతున్నాయి
ఎడారిన ముళ్ళపొదలు ఓడలు ఇసుక రాళ్ళు
మూగ సైగలతో మురిసిపోతున్నాయి !

మంచు దుప్పటి అంటిన లోకం
స్వచ్చమైన మనసుని వెతకనక్కరలేదని
కుప్పలుగా చేరి కివీలు గానం చెయ్యగా
సీళ్లు దుప్పిలు ఎలుగుబంట్లు నాట్యమాడి నవ్విస్తున్నాయి !

ప్రకృతిలో సమస్తం మనషిని ఎంతని ఆనందపరచని
అహంకారమే అలంకరణ చేసుకొని అందరికి పెద్దన్ననని
పాయసం లాగి విషాన్ని చల్లుతూ లోకాన్ని ఉద్దరిస్తానని
రాజ్యం మత్తులో కత్తులు తీసి తనను తానె పోడుచుకొంటున్నాడు .... పిచ్చివాడు !


కృష్ణ మణి I 24-01-2015       

No comments:

Post a Comment